Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

ఆచార్యుడు చూపే మార్గం Acaryudu Cupe Margam The Way The professor Shows Up

శరీరానికి జన్మ ఇచ్చే వారిని తల్లి తండ్రులు అని కీర్థిస్తాం. అట్లానే మనకు జ్ఞాన జన్మని ఇచ్చే మహనీయులు కూడా కొందరు ఉంటారు. వారినీ తల్లి తండ్రులు అని అంటాం. జ్ఞానం అని మనం దేన్ని అంటున్నాం, అంటే జ్ఞానం శరీరాని లక్షణం కాదు. పైకి కనపడే శరీరం అన్ని భాగాలతో కనిపించినా ఒక నాడు దాన్ని శవం అని పేరు పెడతారు. కానీ అందులో జ్ఞానం ఉండదు. జ్ఞానం అనేది ఆత్మకు చెందినటువంటి ఒక లక్షణం. ఆత్మ ఎంతవరకు శరీరంలో ఉంటే అన్ని భాగాలు పనిచేస్తాయి, లేకుంటే పని చెయ్యవు. జ్ఞానం సహజంగానే ఉంటుంది, కానీ మూసివేయబడి ఉంటుంది. ఆ మూసి వేసిన జ్ఞానాన్ని సరిగ్గా పనిచేసేట్టు చేయగల్గిన మహనీయులనే ఆత్మకి జన్మ ఇచ్చిన వ్యక్తులు అంటాం. మనం ఒకనాడు నామ రూపాలు లేకుండా ఒకనాడు ఒక మూలన పడి ఉంటే ఒక రూపం వచ్చేట్టు చేస్తారు తల్లి తండ్రి కూడా. మనమేమిటో, జ్ఞానం ఏమిటో తెలియని స్థితిలోంచి మన స్వరూపాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనకు ఉన్న సంభందాన్ని తెలియజేసి మన జ్ఞానాన్ని వికసింపజేసే వ్యక్తులని కూడా మనం తల్లి తండ్రి అని అంటాం. అయితే శరీరానికి జన్మనిచ్చిన వారిని శరీరానికి తల్లితండ్రులు అని అంటాం, మన జ్ఞానాన్ని వికసింపజేసిన వారిని మన తల్లి తండ్రులు అని అంటాం. మనం అంటే ఆత్మ అనే అర్థం. మనం అంటే శరీరం అని అర్థం కాదు. ఈ జ్ఞానాన్ని ఆచార్యుడు తన ఉపదేశం ద్వారా చేస్తాడు. ఉపదేశం అనేది మంత్రరూపంలోనో, గ్రంథరూపంలోనో చేస్తారు. లోకంలో తల్లి మనల్ని పోషించి పెద్దచేసినట్లే, ఉపదేశం అనేది మన జ్ఞానాన్ని పెంచి పెద్ద చేస్తుంది. అందుకే 'మంత్రో మాతాః గురుః పితాః' అని అంటారు. గురువు తండ్రి, గురువు ఉపదేశం మన తల్లి అని అంటారు. జ్ఞానం అనేది లౌకికం గానూ మరియూ అలౌకికం గానూ ఉంటుంది. భౌతిక మైన వాటిని తెలిపేవారూ గురువులే కానీ ఆత్మ స్వరూప జ్ఞానాన్ని ఇచ్చేవారినే మనం వాస్తవిక గురువు అని అంటాం. ఎందుకంటే ఆత్మ జ్ఞానం కలగటమే నిజమైన జన్మ అని ఉపనిషత్తులు అంటాయి. ఆత్మ జ్ఞాన ప్రదాతలనే మనం ఆచార్య అని కీర్థిస్తాం.

మానవజాతికి వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, పురాణాల్లోనూ నిక్షిప్తమై ఉండే ఆత్మ స్వరూపాన్ని తెలిపే నిఘూడమైన విషయాలను వెలికితీసి అందించిన మన ఋషులంతా మన ఆచార్య స్థానులు. వారు చేసిన ఉపకారం ఒకటైతే వాటిని మనలాంటి సామాన్యుల దాకా అందించిన మహనీయులు కూడా మనకు ఆరాధ్యులే. వారు ఎన్నో రహస్యాలను సూత్రబద్దం చేసి మనంకూడా చదివే అధికారాన్ని ఇచ్చారు. కొంత కాలం మూందు గ్రంథాలను ముట్టుకోవడమే దోశంగా ఉండే స్థితి నుండి మనం వాటిని అనుసంధానం చేసే స్థితి వరకు తీసుకు వచ్చారు. అట్లాంటి మన పూర్వాచార్యులు పరమ కారుణికులు. అలాంటి వారిలో గొప్ప మహనీయులు పిళ్ళై లోకాచార్య స్వామి. వారు చేసిన ఉపకారానికి వారిని కృతజ్ఞతతో స్మరించుకోవడం మన స్వరూపం.

పిళ్ళై లోకాచార్య స్వామి శ్రీకృష్ణ పాదులు అనే వారి కుమారుడు. వారు ఎంచేసారు అంటే, మన లాంటి సామాన్యులు తెలియక ఒక పాము నోట్లో పడ్డాం. ఎట్లాంటి పాము అది అంటే అది కనిపించక మనల్ని మింగేస్తుంది. మన జన్మలని ఘోరంగా హింసించే సర్పం ఒకటి ఉంది, ఆ సర్పానికి పేరు సంసారం అని పేరు. సంసారం అంటే కుటుంబం అని అనుకుంటాం, కానీ అది కాదు అర్థం. మన చుట్టూ ఉండే వాటియందు ఉండే పట్టును సంసారం అని అంటారు. మనలో ఉండే అహంకారమే దీనికి కారణం. అహంకారం అంటే మనది కానిదాన్ని మనది అనిపించే తెలివి తక్కువతనం. శరీరమే నేను అనిపిస్తుంది, కానీ శరీరం లోన ఉన్న ఆత్మను గుర్తించకపోవడమే అహంకారం లేక సంసారం అని అంటారు. కొన్ని యజ్ఞాలలో యజ్ఞం పూర్తి అయ్యాక పూర్ణాహుతితో పాటు యజ్ఞశాలనే ఆహుతిచేస్తారు. అట్లా శరీరం అనే వ్యవస్థ భగవంతుడు ఏర్పరిచిన యజ్ఞం. అట్లా అత్మలేని శరీరాన్నీ మనం అట్టే పెట్టుకోం. మనం ఈ శరీరాన్నే సర్వం అని దానిపైనే మమత పెంచుకుంటున్నాం. శరీరాన్ని కేవలం తినడం, పెరగడంలాంటి వాటికే ఉపయోగించుకుంటున్నాం. కానీ దాన్ని వాటికే పరిమితం చేయక మరొక మంచి ఉద్దేశ్యానికి వాడాలి అనేదిమరచిపోతున్నాం. కేవలం శరీర పోషణ మాత్రమే ప్రధానం కాదు. ఇట్లా శరీరానికి సంభందించిన వారిపైనే మనం మమత పెంచుకోవడం అనేది పెరిగిపోతుంది. దీనికే సంసారం అని పేరు. ఈ అహం కాని దాన్ని అహం అని అనుకోవడమే అహంకారం. జ్ఞానం లేని ప్రాపంచిక విషయాలని పట్టుకొని జ్ఞానం కల జీవులని, పరమాత్మని వదిలి ఉన్నాం. సంస్కృతంలో కొన్ని శబ్దాల నుండి పదాలు ఏర్పడుతాయి. జారడాన్ని 'సర్' అనే శబ్ద అనుకరణ చేస్తారు. మనకు తెలియక జారడాన్ని 'సర్' అని అంటారు కనక సంసారం అని పేరు వచ్చింది. సంసారం నుండి బయట పడడం అంటే మన బందువులని, భాధ్యతలని వదలడం అని అర్థం కాదు. మన చుట్టూ ఉండేవి ఏవీ చెడ్డవి కాదు. వాటి యందు ఏర్పరుచుకున్న పట్టుని సంసారం అని అంటారు.

ఈ సంసారం అనే వ్యాధి పై నుండి వచ్చినది కాదు, లోపలి ఉండి వచ్చినది. కనుక దానికి మందు లోపలి నుండే వేయాలి. ఆలోపం జ్ఞానంలో ఏర్పడుతుంది కనుక జ్ఞానం ద్వారానే మందు వేయాలి. అంటే ఉపదేశం ద్వారానే జ్ఞానాన్ని పూరించాలి. అట్లా మన స్వరూపం ఏంటో మనకు తెలిస్తే క్రమంగా మనలో ఏర్పడ్డ దుష్పరిణామాలు తొలగుతాయి. పిళ్ళై లోకాచార్య స్వామి అట్లాంటి సంసారం అనే సర్పంచే కాటు వేయబడ్డ మనలాంటి వారికి ఒక జీవాతువుని ప్రసాదించారు. జీవాతువు అంటే ప్రాణం నిలిపే ఔషదం అని పేరు. అట్లా వారు చేసారని వారిని స్మరించుకొనే శ్లోకం ఇది.

లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే |
సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః ||

సంసారం అనే సర్పంచే కరవబడ్డ జీవుడికి జీవౌషదాన్ని ఇచ్చిన మహనీయులు. ఆయన పేరు లోకాచార్యులు. అజ్ఞానాన్ని తొలగించినవారు కనక వారిని గురువు అని వ్యవహరిస్తాం.
సంసారం అంటే సముద్రం అని కూడా వ్యవహరిస్తారు. మనలో ఉండే కోరికలే సముద్రంలో ఉండే నీరు. శరీరాన్ని పోశించుకొనే కోరికలే కల్గుతున్నాయి మనలో. ఆ కోరికలను తీర్చుకునే క్రమంలో ఎన్నో తప్పటడుగులు వేస్తున్నాం. అందులోనే మునకలు వేస్తున్నాం. అట్లాంటి సముద్రంలోంచి బయట పడాలి అంటే విష్ణు అనే ఓడని తీసుకోవాలి అని మన ఋషులు చెబుతారు. మనకు కనిపించే ఈ ప్రపంచానికి వెనకాతల ఉండి నడిపే పరమాత్మని గుర్తించగలిగితే చాలు, మనం ఈ వస్తువులతో గడిపినా వాటి వెనకాతల పరమాత్మ వరకు చూడగలం. సంసారం అనే సముద్రం నుండి బయట పడాలి అంటే విష్ణు అనే ఓడను పట్టుకొని ప్రయాణించడమే మార్గం.

Popular Posts

Popular Posts

Ads