బలరాముడు
మహావిష్ణువు శ్వేతతేజస్సు బలరాముడుగాను, నీలతేజస్సు శ్రీకృష్ణుడుగాను అవతరించి దుష్టశిక్షణ చేసారు. చెరశాలలో ఉన్న దేవకి సప్తమగర్భాన్ని యముడు తన మాయ చేత ఆకర్షించి, రోహిణిదేవి గర్భంలో ప్రవేశపెట్ట్టాడు. ఈ సందర్భంలోనే బలరాముడికి సంకర్షణుడు (సంపూర్తిగా ఆకర్షించినవాడు) అనే పేరు వచ్చింది. బలవంతులలోకి బలవంతుడు కనుక బలరాముడు అని పేరు. బలరామదేవుడు ఆదిశేషుని అవతారం. సాందీపుడి దగ్గర బలరామకృష్ణులు శిష్యరికం చేసారు. బలరాముడికి దుర్యోధనుడు అంటే మహాప్రీతి. భార్య రేవతీదేవి, నాగలి ఆయుధం, ఎప్పుడూ నీలిరంగు వస్త్రాలనే ధరిస్తాడు, జెండా పైన తాటిచెట్టు గుర్తు ఉంటుంది. భీముడు, ధుర్యోధనుడు గదావిద్యను బలరాముడిదగ్గరే నేర్చుకొన్నారు. పాండవ కౌరవ యుద్దంలో తటస్థంగా ఉన్నాడు. ఆ తటస్థ స్వభావాన్ని నిలుపుకోడానికి సరస్వతి నదీతీరంలో ఉన్న తీర్ధయాత్రలకు బయలుదేరివెళ్ళాడు. 42 రోజుల యాత్ర ముగించుకొని, భీమ దుర్యోధనుల గదాయుద్ధ సమాయానికి తిరిగివచ్చాడు. ఆ గదాయుద్ధంలో భీముడు, ధుర్యోధనుడి తొడలు విరగగొట్టడం గదాయుద్ధధర్మం కాదు అని ఆగ్రహిస్తాడు బలదేవుడు. మైత్రేయమహర్షి శాపం వలన మరియు భీముడి ప్రతిఙ్ఞ వల అలా జరిగింది అని కృష్ణుడు చెప్పగా బలరాముడు శాంతించాడు.
కురుక్షేత్ర యుద్ధం తరువాత బలరాముడు అరణ్యంలో ఒక వృక్షం క్రింద కూర్చొని ధ్యానంలో నిమగ్నమైన సమయంలో అతని నోటినుండి తెల్లని సర్పం బైటకువచ్చి పడమటిసముద్రంలో లీనమైనది. బలరాముడు ఆదిశేషు అవతారం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము.