నవవిధభక్తి
భక్తి చేయడం అనేది వారి వారి అనుకూలత / అభిప్రాయాలు లేక వారివీలును బట్టి ఉంటుంది. ఏ విధంగా చేసినా రోజులో అధికసమయం దైవనామస్మరణ చేయడం, ప్రతీదానిలో ఆనందం అనుభవించడం ముఖ్యం, ఆ భక్తి చేయడం అనేది కొందరు భజనలు చేస్తారు, కొందరు జపం చేస్తూంటారు, మరికొందరు ధ్యానం చేస్తారు. ఆ విధంగా పలురకాలుగా దేవుడిని ఆరాధించే మార్గాలు తొమ్మిది. వాటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు.
" శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనమ్
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనమ్ "
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనమ్ "
శ్రవణం : ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలోనే దైవత్వమును గ్రహించి కేవలం శ్రవణం ద్వార భక్తితత్వాన్ని గ్రహించాడు. మనకు ఉన్న సమయాన్ని దైవిక విషయాలు వినటానికి అది ఏ రూపంలోనైనాసరే (ఇప్పుడు అందరి ఇళ్ళలో సిడి ప్లేయర్స్, టేపిరికార్డ్లు ఉంటున్నాయి కదా) పొద్దున్నే సుప్రభాతం, విష్ణు, లలితా సహస్రనామములు, వారి ఇష్టదేవతా స్తోత్రములు వినడం ద్వారా ప్రశాంతమైన మనస్సుతో రోజును ప్రారంభించడం మంచిది.
కీర్తనం : మనందరికి తెలిసిన అన్నమ్మయ్య, త్యాగయ్య, భక్త రామదాసు మొదలైన వాగ్గేయకారులంతా భక్తి చేసినది "కీర్తనం" ద్వారానే. అందరికి అష్టోత్రాలు, సహస్రనామాలు చదవడం రాకపోవచ్చు, వారు అలా బాధపడకుండా, కీర్తనల రూపంలో ఆ శ్రీమన్నారాయణుడిని ఆరాధించవచ్చు.
స్మరణం : కార్తీకపురాణం, విష్ణుపురాణం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం మొదలైనవి అన్ని "స్మరణ" మార్గంగా చెప్పవచ్చు. అంజనేయస్వామి కూడ ఎప్పుడూ రామ నామస్మరణలోనే ఉంటాడు.
పాదసేవ : పాదసేవ కంటే మించినదిలేదు. గురువుగారి కి పాదసేవ, పాదపూజ చేయడం ద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలము. భక్తుడెల్లప్పుడూ భగవంతుని దివ్యచరణాలను తన మనోనేత్రంతో చూస్తూ వాటినే పూజిస్తూ ఉంటాడు. ఈ భక్తిపద్ధతిని పాదసేవనమంటారు. ప్రహ్లాదుడు పులకించిన శరీరంతో అరవిచ్చిన కన్నులతో శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉంటాడని భాగవతం చెబుతోంది. రామచంద్రుని పాదుకలనే అతని దివ్యచరణాలుగా భావించి వాటిని పూజిస్తూ సేవిస్తూ నందిగ్రామంలో గడుపుతూ ఉంటాడు భరతుడు.
అర్చనం : మనం ప్రతినిత్యం చేసే విగ్రహారాధనే అర్చనం. దేవుడిని మనస్పూర్తిగా పూజించడం. పత్రం, పుష్పం, ఫలం, తోయం (జలం) ఇత్యాది పూజాద్రవ్యాలతో తనను తాను మరచిపోయి భగవంతుని పూజించడాన్ని అర్చనభక్తి అంటారు. శ్రీరామచంద్రుడే సింహాసనంపై కూర్చున్నట్టుగా భావించి ఆయన పాదుకలకు భరతుడు ఛత్రం(గొడుగు) పడతాడు.చామరం(వీవన)తో వీస్తాడు.
వందనం : ఇష్టదైవానికి / గురువుకి మనస్పూర్తిగా నమస్కరించడం. రామచంద్రుని చూడగానే పులకితగాత్రుడైన భరతుడు ఆనందబాష్పాలు రాలుస్తూ రాముని పాదాలమీదపడి వందనమాచరిస్తాడు .
దాస్యం : సర్వం ఆ భగవంతునికి అర్పించడమే దాస్యం. లక్ష్మణుడు ప్రతీక్షణం శ్రీరామచంద్రుడికి కావలసినవి అమర్చడం, ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటించడం మొదలైనవి దాస్య భక్తిప్రవృతి గా చెప్పవచ్చు.
సఖ్యం : భగవంతుణ్ని మిత్రుడిగా భావించి అతని మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడమే సఖ్యత. కుచేలుడు దీనికి మంచి ఉదాహరణ. గోపాలునితో స్నేహమొనరించి, ఆ స్నేహమాధుర్యంతోనే అనన్యమైన భక్తిని సంపాదించాడు.
ఆత్మనివేదనం : కామ క్రోధ మద మాత్సర్యాలను గెలిచి నిష్కామభావంతో ఆ దేవదేవుడిని పూజింపాలి.
పూజచేయడానికి అంత సమయం లేదు అంటున్న ఈ యాంత్రికకాలం లో పైన చెప్పిన శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం చేయడంద్వార భగవత్ నామస్మరణ చేయొచ్చు. ఇవి చేయడానికి సమయం సంధర్భం అవసరంలేదు. మీకు ఒక్కనిమిషం సమయం ఉన్నా, ఇష్టమైన నామాన్ని స్మరించండి చాలు.