Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

అష్ఠాదశ శక్తిపీఠాలు Asthadasa Saktipithalu

దక్షయఙ్ఞ కార్యక్రమమే అష్ఠాదశపీఠాలకు ఏర్పడటానికి మూలం ఐనది. తాను జరపబోయే బృహస్పతియాగానికి దక్షుడు అందరిని ఆహ్వానిస్తాడు, తన కూతురు దాక్షాయణిని, అల్లుడు శివుడిని తప్ప. తన ఇష్టంతో సంబంధంలేకుండా దాక్షాయణి శివుడిని పెళ్ళాడటమే అందుకు కారణం. పిలుపు లేకుండానే, దాక్షాయణి యాగానికి వస్తుంది (పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవల్సిన అవసరంలేదు అనే ఉద్దేశ్యంతో ). అక్కడ దక్షుడు, ఇతరులు చేసిన శివనింద భరించలేక ఆమె యోగాగ్నికి ఆహూతైంది. 
ఉగ్రరూపుడైన శివుడు, విషాదంతో దాక్షాయణి మృతదేహాన్ని భుజాన వేసుకొని, జగత్రక్షణ కూడా పక్కనబెట్టి, సంచరించసాగాడు. సృష్టి, స్థితి, లయంలో ఏ ఒక్కట్టి ఆగినా అనర్ధాలు ఏర్పడే అవకాశం ఉంది అనే ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, విష్ణుదేవుడు, శివుడిని కార్యోన్ముక్తుడు చేయుటకై, తన చక్రాయుధంతో దాక్షాయణిమృతదేహాన్ని ఖండాలుగా చేస్తాడు. ఒక్కోభాగము ఒక్కోచోట పడ్డాయి అవి పడిన ప్రతీచోట శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. 
ఓం లంకాయాం శాంకరీదేవి, కామాక్షీ కాంచికాపురీ
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండే క్రౌంచపట్టణే 
అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హా పురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా 
ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగల్య గౌరికా 
వారణాస్యం విశాలాక్షీ, కాశ్మీరేతు సరస్వతీ
అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం, సర్వశత్రు వినాశనం
సర్వరోగహరం దివ్యం, సర్వ సంపత్కరం శుభం


శాంకరీ మాత 1
 
అమ్మవారి మొలభాగము పడినచోటు త్రికోణమలై (ట్రికోమలీ) శ్రీలంక. త్రి =3, కోణ = కోణం, మలై = కొండ, త్రికోణాకారంలో ఉన్న కొండ మీద అమ్మవారు ఉన్నారు. గుడి భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైనచోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.
కామాక్షీ మాత 2 

అమ్మవారి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆదిపరాశక్తి యోగపీఠంగానూ, కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

శృంఖలా మాత                              











అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. పశ్చిమ బెంగాల్లో ఉన్న హుగ్లీ జిల్లాలోని "పాండువా" అనే ప్రాంతాన్ని శక్తిపీఠంగా
అందరూ విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళలతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం ప్రత్యేకత.మరొక కధనం ప్రకారం ...ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరు, కోల్‌కత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంగళాదేవిగా ( శృంఖలాదేవి) భావిస్తారు.

చాముండి మాత 4


అమ్మవారి కురులు చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి పరమేశ్వరి, శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. "మహాబలాద్రి శిఖర" అనే కొండపై అమ్మవారు వెలిసారు కావున ఆ కొండ కాలక్రమములో చాముండికొండగా మారింది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.



జోగులాంబ మాత 5
















మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ 
దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు. జోగులాంబ ఉగ్ర రూపంలో ఉంటుంది, చతుర్భుజి గా కపాలము, గొడ్డలి, ఖడ్గము, పాన పాత్ర ధరించి, శవమును ఆశనముగా కలిగి, ఎడమవైపు తల తిప్పి మోకాళ్ళపై కూర్చొనిఉన్న ఒక శిరస్సు పై తన వృష్టభాగాన్ని ఆనించి, అరికాలు కనపడేలా ఎడమపాదం నేలపై ఆనించి, కపాలమును యఙ్ఞోపవీతంగాను, ఐదు ఆకులవలె వేలాడుతున్న కటిసూత్రం ధరించి ఉంటుంది.

భ్రమరాంబిక మాత 6














అమ్మవారి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగాతయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు అమ్మవారు తుమ్మెదరూపంలో (భమరము అంటే తుమ్మెద) అవతరించిందట. మల్లికార్జునము అంటే తెల్లటి మల్లే పువ్వు. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.


మహాలక్ష్మి మాత 7


అలనాటి కరవీర ప్రాంతమే ఈనాటి కొల్హాపూర్‌. అమ్మవారి నేత్రాలు పడిన ప్రదేశము. పూణెకు 240 కి.మి దూరంలో ఉత్తరాన కొల్హాపూర్‌ మహాలక్ష్మి ఆలయం ఉంది. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి కొల్హాసుర రాక్షస సంహారం అనంతరం ఈ కరవీరప్రాంతం కొల్హాపూర్‌గా రూపాంతరం చెందింది. హిందూ ఆలయాలు సహజంగా తూర్పు ఉత్తరదిశగా ఉంటాయి. కాని ఇక్కడ మహాలక్ష్మి ఆలయం పడమరదిశగా ఉంటుంది. 'ఇక్కడ మరో ప్రత్యేకతేమిటంటే ఆలయంలో పశ్చిమాన ఒకచిన్న గవాక్షం ఉంది.














సంవత్సరంలో మార్చి, సెప్టంబర్ నెలల్లో సూర్యాస్తమయ సమయంలో 3రోజులు సూర్య కిరణాలు ఈ కిటికీగుండా ప్రసరించి అమ్మవారి ముఖంపై ప్రకాశిస్తాయి. ఈ 3రోజులు 'కిరణోత్సవాలుగా జరుపు కుంటారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నాలుగు చేతులతో అమ్మవారి నల్లరాతి విగ్రహం మూడు అడుగుల ఎత్తున ఉంటుంది.దివ్యాభరణాలతో వెలిగిపోయే ఆ అమ్మని వర్ణించడం ఎవరితరమూ కాదు.


ఏకవీరా మాత 8

అమ్మవారి కుడిచేయి పడినచోటు, మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రం. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు.














ఇంకో కధనం కూడా ఉంది :
జమదగ్ని ఆఙ్ఞచే, తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించాడు పరశురాముడు. ఆ శిరస్సు రూపంలో ఉన్న మాయా శక్తే " ఏకవీర ", మిగిలిన రేణుకాదేవి శరీరం, భూదేవిగా పూజలు అందుకొంటోంది.


మహాకాళి మాత 9


అమ్మవారి పైపెదవి పడిన ప్రదేశం ఉజ్జయిని. పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గంగానదికి ఉపనది అయిన క్షిప్రానదీ
తీరంలోని ఉజ్జయిని నగరం సప్తపురి క్షేత్రాలలో ఒకటి. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రాలలో ఒకటి.


పురుహూతిక మాత 10


పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన అమ్మవారి పీఠభాగం(పిరుదులు) పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో),తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. క్రీ.శ 210 కాలంలో శ్రీపురం, పురహూతికాపురంగా పేరు ఉన్న ఈ పట్టణం కాలక్రమానా పీఠికాపురంగా రూపాంతరం చెందింది.


గిరిజాదేవి మాత 11
















అమ్మవారి నాభిభాగం పడిన ప్రదేశం, ఒరిస్సాలోని జాజ్పూర్. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌కు 120కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని గిరిజాదేవి, బిరిజా, బిరిజాదేవిగా పలునామాలతో పిలుస్తారు. అమ్మవారి విగ్రహం బంగారు ఆభరణా లతో వివిధ పుష్పమాలికలతో అందంగా నిండుగా అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపించే ఈ విగ్రహానికి వెండి కిరిటీం ధరింపజేస్తారు. భువనేశ్వర్‌లోని జగన్నాధస్వామివారి ఆలయానితో పోలిస్తే ఈ ఆలయం చాలా చిన్నది. ఇక్కడ ముఖ్యవిషయం అమ్మవారి ఆలయానికి దగ్గరలో పితృదేవతలకు నాభి కుండం లో పిండ ప్రదానాలను నిర్వహిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కాశీకి వెళ్ళి చేరుతుందని భక్తుల విశ్వాసం. నాభి కుండంలో రోజులో అసంఖ్యాకం గా పిండప్రదాన తర్పణ కార్యక్రమాలు నిర్వహిం చినా నీటి మట్టం పెరగదు. ఇంతవరకూ నీరు ఇంకిపోలేదు. 4,5 అడుగులలోతున నీరు ఎప్పుడూ అదే స్థాయిలో ఉండటం విశేషం.ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.


మాణిక్యాంబ మాత 12













అమ్మవారి ఎడమచెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరోచోట వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబా దేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్ర యంత్రానికి, అమ్మవారికి ఏకకాలంలో పూజలు జరగడం ఈ క్షేత్ర విశిష్టత. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడని స్థలపురాణం. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు.

కామాఖ్యా మాత 13












అస్సాం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారు. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది.ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. కామరూపదేశం తాంత్రిక విద్యకు ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.


మాధవేశ్వరి మాత 14

అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు.సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వాడుకలోకి వచ్చింది.


సరస్వతీ మాత 15


అమ్మవారి కుడిచేయి పడిన ప్రాంతం కాశ్మీర్లో ఉంది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత


పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది. పాకిస్తాన్ వాళ్ళు (పాక్ ఆక్రమిత కాష్మీర్) ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేసారు. చాల భాదాకరమైన విషయం :(. కాష్మీరీ పండితుల విన్నపంతో రోజూ ఆ శిధిలమైన గుడి దగ్గరక దీపం పెట్టడానికి ఒక పురోహితుడిని మాత్రం అనుమతిస్తారని వినికిడి.

వైష్ణవీ మాత 16
 

అమ్మవారి నాలుక పడినచోటు, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతం. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన అమ్మవారు వైష్ణోదేవి. జగన్మాత శ్రీవైష్ణవిదేవి గుహలోపల కొలువుదీరి ఉంది.సుమారు 98 అడుగుల గుహలో గుహగోడపై శ్రీవైష్ణవీదేవి దర్శనమిస్తుంది.గుహలో కొలువుదీరిన జగన్మాత రాయి రూపంలో దర్శనమిస్తుంది. ఈ మూర్తిక్రిందిభాగం ఒకటిగానే ఉండి శిఖరస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి మూడుగా విభజింపబడి ఉంటుంది. ఎడమవైపు తెల్లని భాగం శ్రీ సరస్వతిగా, మధ్యలోని పచ్చని భాగం శ్రీలక్ష్మిగా, కుడివైపున ఉన్న నల్లని భాగం శ్రీమహాకాళిగా చెప్పబడుతూ ఉంది.అంటే ఈమె ముగ్గురు శక్తుల సమ్మేళనంతో ఏర్పడిన ఏకరూపం. అమ్మవారు కొలువుదీరి ఉన్న గుహలో అమ్మవారి కంటే ముందే ’చరణ్ గంగా’ ఉంది. ప్రవహిస్తూ ఉన్న ఈ నీటిలో భక్తులు కాళ్ళు కడుక్కుని అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటారు.


మంగళగౌరి మాత 17
















అమ్మవారి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఫల్గుణీనదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు.


విశాలాక్షి మాత 18


అమ్మవారి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

Popular Posts

Popular Posts

Ads