Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

నృసింహావతారం Nrsinhavataram Nrsimhaavataaram

నృసింహావతారం
మిగిలిన అవతారములలోవలే తల్లి దండ్రులతో నిమిత్తములేకుండా స్వచ్చందంగా ఆవిర్భవించిన అవతారమే ఈ "నృసింహ అవతారము". పూర్వం వైకుంఠపురిని ద్వారపాలకులైన 'జయ విజయులు' సంరక్షించుచూ ఉండు సమయాన, ఒక్కసారి సనక, సనందన, సనత్కుమార సనత్సజాతులైన బ్రహ్మమానసపుత్రులు వైకుంఠవాసుని దర్శనార్థమై వస్తారు. వారు వచ్చినది శ్రీమహావిష్ణువు ఏకాంత సమయం అగుటవల్ల, శ్రీహరి దర్శనానికి వారిని అనుమతించక అడ్డగిస్తారు. దానితో ఆగ్రహించిన ఆ తపోధనులు వారి ఇరువురును శ్రీ మహా విష్ణువునకు విరోధులై మూడు జన్మలపాటు రాక్షసులుగా జన్మించండి అని శపిస్తారు. అలా శాపగ్రస్తులైన వారు ఇరువురుమొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులుగారెండవ జన్మలో రావణ, కుంభకర్ణులుగా, మూడవ జన్మలో శిశుపాల, దంతవక్త్రులుగా జన్మిస్తారు. అలా మొదటి జన్మలో దితి, కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులుగా జన్మించి ఘోరమైన తపస్సులుచేసి, ఆ వరగర్వంతో లోకకంటకులైనారు. దానితో దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం ఆ అసురుల వరాలకు అనుగుణమైన ఎన్నో అవతారాలు ఎత్తుతూ వాటిలో వరాహా రూపంలో హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు. 
హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సుచేసి తనకు ఏవిధముగాను మరణమే లేదు అను వరగర్వముతోవిర్రవీగిపోతూ ఉంటాడు. (గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశమునందుగాని, దిక్కులలోగాని, రాత్రిగాని , పగలుగాని, చీకటిగాని, వెలుతురుగాని, నీటిజంతువులు, క్రూరమైన అడవిజంతువులవల్లగాని, సర్పాలవల్లగాని, దేవతలవల్లగాని, మనుషులవల్లగాని, అస్త్రశస్త్రాలవల్లగాని, ఇంటగాని, బయటగాని, చావులేకుండా వరం) అట్టి దానవుడి నలుగురి కుమారులలో పెద్దకుమారుడైన "ప్రహ్లాదుడు" విష్ణుభక్తుడు, దానితో వానిని గురుకులాల్లో వేసి బుద్ధిని మార్చుటకు ప్రయత్నిస్తాడు. హరినామస్మరణ వీడమని సామ, దాన, భేద, దండోపాయాలతో ప్రయత్నిస్తారు.ఆగ్రహించిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునితో నిన్ను అనుక్షణము కాపాడుచున్న శ్రీహరి ఎక్కడ ? ఈ స్తంభమున చూపగలవా? అని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రహ్లదుడు తండ్రీ! సర్వాంతర్యామి అయిన శ్రీహరి
"ఇందు గలడందు లేడను
సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
డెందెందు వెదెకి చూసిన
అందందే కలడు దానవాగ్రణి కంటే! 
కలడందురు దీనుల యెడ
కలడందురు పరమ యోగిగణముల పాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో! "
అని జవాబు ఇస్తాడు. అయితే ఈ స్తంభమునందు చూపగలవా? అని ఆగ్రహంతో తనచేతిలో ఉన్న గదతో ఒక్క ఉదుటన స్థంబాన్ని గట్టిగా కొడతాడు.
"వైశాఖ శుక్ల పక్షేతు చతుర్థశ్యాం సమాచరేత్ ,
మజ్జన్మ సంభవం వ్రతం పాపప్రణాశనం"
అని సాక్షాత్తు శ్రీహరి స్వయముగా ప్రహ్లాదునితో చెప్పినట్లు "నృసింహపురాణం"లో చెప్పబడినది. ఆవిధంగా ప్రహ్లాదుని విశ్వాసమైన (సర్వాంతర్యయామి) అనిపలుకులకు ప్రామాణికంగా హిరణ్యకశ్యపుడు మోదిన స్తంభము ఫెళఫెళమని విరిగిపడుచుండగా భూమ్యాకాశాదులు దద్దరిల్లేలా సింహగర్జన చేస్తూ ఉగ్రనరసింహ రూపంతో ఆవిర్భవిస్తాడు. సింహంతల, మానవశరీరం. సగం మృగత్వం, సగం నరత్వం. ఇంకా ఆమూర్తిలో క్రౌర్యం, కరుణ, ఉగ్రత్వం, ప్రసన్నత ఆవిధంగా పరస్పర విరుద్ధమైన గుణాలతో కూడియున్న అవతారమూర్తిలా ఉన్నారు ఆ నృసింహస్వామి. అలా ఆవిర్భవించిన ఆ స్వామి హిరణ్యకశ్యపుడు పొందిన వరాలను ఛేదించకలిగే రూపాన్ని మరియు అట్టి వాతావరణాన్ని అంటే అటురాత్రి ఇటుపగలు కాని సంధ్యా సమయాల్లో, ఇటు భూమి అటు ఆకాశముకాని ప్రదేశము "గడపపైన" మృగ నరలక్షణాలతో గూడి, ఒక్క ఉదుటన హిరణ్యకశ్యపుని మెడపట్టి తన తొడలపై పరుండబెట్టి జీవము నిర్జీవముకాని గోళ్ళతో ఉదరమును చీల్చిచండాడి సంహరించినాడు.అనంతరము ఆ ఉగ్రనరసింహమూర్తిని దేవతలు ఎవ్వరు శాంతింప చేయలేక, స్వామిని శాంతింప చేయమని ప్రహ్లాదుడిని కోరతారు. అలా ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించిన ఆ స్వామి శ్రీ మహాలక్ష్మీ సమేతుడై భక్తులకు ప్రత్యక్షమౌతాడు. అట్టి స్వామి నిర్యాణములేని అవతారమూర్తిగా, పిలిస్తే పలికేదైవంలా భక్తుల పాలిట కల్పతరువుగా కొనియాడబడచూ పూజించబడుచున్నారు.

Popular Posts

Popular Posts

Ads