శివపురాణం - 8 వ భాగం

హాటకేశ్వరం
శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.
పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.
అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.
శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది. అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈవిధంగా నరసింహ స్వామీ దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ.
అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.
శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

శివపురాణం - 9 వ భాగం

మహాకాళేశ్వరం – ఉజ్జయిని
అవంతికాయాం విహితావతారం, ముక్తి ప్రదానాయచ సజ్జనానాం!
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం!! (ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – 3)
ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహా కాళుడికి నమస్కారం చేస్తున్నాము. సజ్జనులకు ముక్తినిచ్చువాడు. అయితే సజ్జనుడు అనగా ఎవరు? పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారము తెలిసి ఉండాలి. శౌచము తెలిసి ఉండాలి. ఈ సదాచారం పథ్యం లాంటిది భగవద్భక్తి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని పథ్యం పాటిస్తే భవరోగమనే రోగం తగ్గుతుంది. కానీ లౌకికంగా బయటవచ్చే వ్యాధికి, భగవత్సంబంధంలో వచ్చే భవరోగమునకు ఒక తేడా ఉంది. ఒకనికి ఆచారం, శౌచం తెలియదు. తెలిసి మానిన వాడు కాదు. కానీ ఆయన గుండెల నిండా భక్తి ఉన్నది. కానీ శౌచం లేకపోయినా వాని భక్తి వృధా పోదు. సదాచారం తెలిసీ దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అతని అక్కరకు రాదు. ఆచారం తెలిస్తే పాటించాలి. తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతం రావాలి. ఏమీ తెలియనప్పుడు ఆచారమయినా అది తెలియక పొరపాటు చేసినా ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఏలుకుంటాడు. మాహాకాళ దర్శనమునందు ‘సజ్జనానాం’ అనేమాట ఎందుకు వాడారో గుర్తెరిగి ప్రవర్తించాలి. అందుకే మహాకాళుడన్నమాట. కామమును పోగొట్టు వాడు, కాలారి, కామారి అనే రెండు మాటలను పరమశివునికి వాడతారు. కాలారిగా అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుని యందు ప్రవర్తించాలి. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనగా స్త్రీ అని, అక్క అని రెండు అర్థములు. అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపము. మనకి మోక్షపురులు ఏడు ఉన్నాయి. వీటిలో జగద్విఖ్యాతి గాంచిన పట్టణం అవంతి – ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒకపక్క మహా కాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాల స్వరూపములై ఉన్నవి. ఇవి లయకారకములై ఉంటాయి. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్న పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసు ఇద్దరూ నడయాడిన ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనా శీలుడై శాత్కాలముల యందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దానియందు అపారమయిన ధృతి కలిగిన బ్రాహ్మణుడు. వేదప్రియుడికి నలుగురు కుమారులు. నలుగురు సుగుణోపేతులే. తండ్రిగారు ఎంత ధర్మానుష్టాన పరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్టాన పరులు. దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు. ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు, రెండవ వానికి ప్రియ మేథుడు, మూడ వానికి సుకృతుడు, నాల్గవ వానికి సువ్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు. ఆ నలుగురు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు.
ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరములలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఏదయినా కష్టం వచ్చినప్పుడే పరీక్షకు నిలబడినప్పుడే వాటి వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబమును ప్రకాశింపచేయాలనుకున్నాడు. భగవంతుడు భక్తుల యెడ అంత ఉదారుడై ఉంటాడు. దూషణుడు అనే రాక్షసుడు లోకం అంతటా బాధలు పెడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎక్కడా ఎవరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు నన్ను మాత్రమే అర్చించాలి, మీరు శివపూజను విదిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చేయనా? అని అడిగాడు వాళ్ళు కనీసం బెదరకుండా శంకరుని రక్షణ యందు మనం ఉండగా మనకు భయం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు. దూషణుడు ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నాడు. అయినా వాళ్ళు కదలకుండా హర ఓం హర అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు. ఇక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమయిన రూపం కాదు. స్వామి మహాకాళ రూపంలో వచ్చి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారమునకు దూషణుడి సైన్యములు బూడిద రాశులై పడిపోయాయి. ఆ రూపము అత్యంత వేడితో వచ్చింది కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చెనకలేదు.బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్యం పొంది చచ్చిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు.
ప్రదోష వేళలో శివమహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు చదవడం చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసినట్లే. ఆ ఫలితం ఉత్తరక్షణం మీ ఖాతాలో పడిపోతుంది. పిమ్మట ఆ స్వూపాన్ని చూసి దేవతలు పొంగిపోయారు. వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు. ‘ఈశ్వరా, మీరు ఇక్కడ లింగరూపంలో వెలవండి. కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు. సజ్జనులు, నీమీద పూనిక ఉన్నవాళ్ళు, నీవు ఉన్నావని నమ్మినవాళ్ళు ఎవరు ఇక్కడకు వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యతా అటువంటి అనుగ్రహ ప్రసరణ కొడకు నీవు ఇక్కడ స్వయంభూ లింగముగా ఉండాలి అని అడిగారు. అప్పుడు స్వామీ తప్పకుండా ఉంటాను అని ప్రసన్న మూర్తియై వెంటనే మహా కాళ లింగముగా ఆవిర్భవించాడు.
ఉజ్జయినిలో శివలింగములు మూడు అంతస్తులుగా ఉంటాయి. క్రిందను ఉండేది మహాకాళ లింగము, మధ్యలో ఓంకార లింగము, ఆపైన నాగేంద్ర స్వరూపమయిన లింగము ఉంటాయి. క్రింద ఉండే మహాకాళ లింగమును భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జయినిలో ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉజ్జయినీ రాజ్యమును పరిపాలిస్తున్నాడు. గొప్ప శివభక్తుడు. ప్రతిరోజూ శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడయిన మణిభద్రుడు చంద్రసేనుడికి ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇనుము, ఇత్తడి దేనిని తగిలినా అవి బంగారంగా మారిపోతాయి. దేశంలో క్షామం ఉండదు. అతివృష్టి ఉండదు. నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పాడు. చంద్రసేనుడు ఆ మణిని కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతున్నాడో తెలుసుకుని ఆయన వద్దవున్న మణిని ఎత్తుకు వచ్చెయ్యాలని భావించారు. అందరూ కలిసి చంద్రసేనుడి మీదికి యుద్ధానికి బయలుదేరారు. లోపల వున్న వేగుల వలన విషయంతెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టం అని గ్రహించి యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే. కానీ లోకంలో ఉన్న రాజులందరూ కట్ట కట్టుకుని వస్తే నేను ఏకాకిని’ అన్నాడు. ఆయనయందు ధర్మలోపం లేదు. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉంది. కాబట్టి తానిప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకీ మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటాను అని భావించి వెంటనే దేవాలయమునకు వెళ్లి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన భక్తి పరిఢవిల్లి ఉంది.
ఆ సమయంలో ఒక గోపాల బాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలి వచ్చి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరూ దర్శనం చేసినా గోపకాంత మనసు చిన్నపిల్లవాడి మనస్సంతగా భగవంతుని యందు కేంద్రీకరించబడలేదు. రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తానుకూడా అలాగే పూజచేయాలి అనుకున్నాడు. కానీ వాడికి పూజ చేయడం రాదు. వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ వాని దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీద ఉంది. ఇప్పుడతడు అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది. వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు. పూజచేయడం రాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజచేయడం ప్రారంభించాడు. రాజు చేస్తున్న పూజయందు సదాచారం ఉన్నది. కానీ ఈ పిల్లవాడు చేసున్న పూజయందు సదాచారం లేదు. కానీ భక్తి ఉన్నది. వాడికి అభిషేకం, పురుషసూక్తం తెలియదు. నైవేద్యం లేదు. కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు. వాడు మనస్సులో అలాగే మహాకాళ లింగానికి పూజ చేస్తున్నాడు. పిల్లవానికి అన్నం పెడదామని గొల్లవనిత వచ్చి పిలిచినా వాడికి ఇవేమీ వినపడలేదు. నటిస్తున్నాడు అని ఆవిడకి కోపం వచ్చింది. గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది. ఆకులన్నిటిని కాలితో తోసేసింది. ఇంట్లోకి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది.
పిల్లవాడు కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఉన్న శివలింగం కనపడలేదు. వెంటనే ఆర్తితో ఏడ్చాడు. ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు. స్వామీ కనపడలేదన్న బెంగతో మూర్ఛపడిపోయాడు. తనకోసం ఇంత పరితపించిపోయిన పిల్లవానిని శంకరుడు చూశాడు. అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీటమీద పట్టు పంచెతో కూర్చుని పూజ చేస్తున్నాడు. వానికి సమస్తమయిన శివజ్ఞానము భాసించింది. తల్లికి ఆ ఘోష వినపడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది. నా వంశమే తరించిపోయిందిరా తండ్రీ ఈ పూజ చేశావని నాకు తెలియదు అని వెళ్లి బిడ్డడిని కౌగాలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించి ఒకమాట చెప్పారు “ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వానికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి ఏమీ తెలియక పోవచ్చు. కానీ పరమేశ్వరుడిని నమ్మాడు. దీనివలన ఈతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్పగొప్ప వాళ్ళందరూ ఈ గొల్లవంశంలో పుడతారు. యితడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు. వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎనిమిది తరములు గడిచిన తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మమే గోపాలబాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. అపుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు. మీ వంశం అటువంటి వంశం కాబోతోంది’ అని హనుమ ఆనాడు శివభక్తి విశేషమును ఆవిష్కరించి వెళ్ళాడు.
ఈవార్త ఊరంతా పాకింది. ఈవార్త బయట విడిది చేసిన శత్రు సైన్యములకు తెలిసింది. ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తాం మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు. అపుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్ళి దేవాలయదర్శనం చేయించాడు. ఇంత భక్తి పరిపుష్టి కలిగిన గోపాల బాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతాయో, మన వంశములు ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి వెళ్ళిపోదాము అని యుద్ధం చెయ్యకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈవిధంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమయిన మహాకాళేశ్వరుని దేవాలయం ఆవిర్భవించింది.
ఉజ్జయిని యందు సంవత్సరమునకు ఒకసారి వర్షాకాలమునకు ముందర ‘పర్జన్యానుష్టానము’ అని చేస్తారు. వర్షములు బాగా పడాలని, పంటలు బాగా పండాలని మహాకాళేశ్వరాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. అంత గొప్ప ఆలయం ఆ ఆలయం.
ఈ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం క్రిందనే శంఖ యంత్రం అనే యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయమునకు గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులు శంఖములు ఊదుతున్నారు అని చెప్పాడు. ఎవరు శంఖమును ఊదాడో వానికి విజయం కలుగుతుంది. మహాకాళేశ్వరుని క్రింద శంఖయంత్రం ఉంది. అందుకని ఆయన దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయమునయినా పొందుతాడు. అపమృత్యుదోషం పోతుంది. ఎటువంటి కోర్కెలు అయినా తీరతాయి. అక్కడి అమ్మవారికి అవంతిక అని పేరు. ఇక్కడ ఉండే కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. ఆవిడ రాత్రివేళ పట్టణం అంతా సంచరించి తెల్లవారే సరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్లి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాడు. తెల్లవారి పోతోంది. లోపల కూర్చున్న ఆయన తనకు జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు. అపుడు అమ్మవారు కాళిదాసును తలుపు సందులోంచి నాలుకను బయట పెట్టమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలుక మీద బీజాక్షరములను రాసింది. అప్పుడు మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద శ్యామలాదండకం చేశారు. ఈ విధంగా కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బిన క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం.
ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరముల నుంచో ఉజ్జయినిలో ఉన్న అంతరాలయమునందు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఈ రెండు జ్యోతులను అఖండ దీపములు అని పిలుస్తారు. ఈశ్వరుడిని మీరు దానిలో చూడవచ్చు.
ఉజ్జయిని దేవాలయంలో భస్మమందిరం అని ఉన్నది. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మ మందిరంలోనికి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ విభూతి అభిషేకం రెండు రకములుగా ఉంటుంది. తెల్లని పల్చటి బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకుని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్నచోటే కాదు అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖముకు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగములు ఇవన్నీ మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినా అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో అభిషేకం చేసుకోవాలి అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారు జామున దేవాలయంలోపలికి పంపిస్తారు. అప్పుడు శ్మశానంలో కాలిన శవభస్మమును అర్చకులు పట్టుకు వచ్చి చుట్టూ కూర్చును ఆ శవ భస్మంతో అభిషేకం చేస్తారు. అప్పుడు నిజంగా మనం కైలాసపర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది.
అసురసంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్రవిచిత్రమయిన నీరాజనములను ఎత్తుతారు. దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు. ఈ దీపారాధనతో కూడిన జ్వాలని నీరాజనంగా చూపించేముందు ఇక్కడ ఒక నియమం ఉంది. మహా కాళేశ్వరుడికి సమీపంలోనే మరొక శివలింగం ఉంది. ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాళుడు. ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహా కాళుడికి పూజచేయడం నిషిద్ధం. కాబట్టి ముందు కోటేశ్వర మహా కాళుడికి నీరాజనములను ఎత్తుతారు. తరువాత కాళేశ్వరుడికి ఇస్తారు. అందుకని ఉజ్జయినిలో కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది.
ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ వెడతారు. ఆయన కారుణ్యమునకు పరాకాష్ఠ ఈ సవారీ ఉత్సవం. దీనిని ఊరేగింపు/ఊరెరిగింపు అంటాం. అపుడు ఉజ్జయిని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, ఎన్నికయిన మంత్రి ఎవరయినా లేదా పరిపాలన చేసే మంత్రి ఈ ముగ్గురు ప్రతి ఏటా స్వామివారి సవారీ ఉత్సవమునకు వచ్చి తప్పనిసరిగా సవారీని మోయాలి. కొన్ని వేల సంవత్సరములనుంచి ఇదే ఆనవాయితీ.
ఉజ్జయినిలో శివరాత్రినాడు స్వామి పెళ్ళికొడుకు అవుతాడు. అపుడు ఆయన పుష్ప కిరీటం పెట్టుకుని పెళ్లికొడుకు అవుతాడు మహాశివరాత్రి వెళ్ళిపోయిన మరునాడు ఈ అలంకారం అంతా తీసేసి మరల భస్మాభిషేకమును అందుకుంటారు. అటువంటి సవారీ జరుగుతుంది. అక్కడే బలరామ కృష్ణులు ఇద్దరూ సాందీపని మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. ఈవిధంగా ఉజ్జయిని అన్నిరకములుగా ప్రకాశిస్తున్నది. అటువంటి దివ్యక్షేత్రమును జీవితంలో ఒక్కసారయినా దర్శనం చేసి, అక్కడ కొన్నిరోజులు గడిపి, జన్మసార్థకం చేసుకోవాలి.

శివపురాణం - 10 వ భాగం

కేదారేశ్వరుడు
కేదారేశ్వర లింగం గురించి ఒకమాట చెప్తారు.
మహాద్రి పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – ౧౧)
ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగము. నరనారాయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రము నందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమయిన శివలింగము. కేదారమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే! కేదారేశ్వర లింగమును దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉంది. ఆ నియమంతోనే దర్శనం చేయాలి.
కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు. పార్థివ లింగము అంటే మట్టితో చేసిన శివలింగం. మట్టితో చేసిన ఆ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మి శివలింగామునకు అర్చన చేస్తున్నారు. అపుడు ఆ శివలింగం లోంచి పరమశివుడు ఆవిర్భవించి ‘మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగమునకు ఇంత అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకొనండి’ అని అడిగారు. అపుడు వారు ‘స్వామీ, ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు ఆవలివైపు హిమాలయ పర్వతశృంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు’ అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు.
హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. కేదారం వెళ్ళడానికి దారి కొన్ని నెలలలో మాత్రమే వీలు చేయబడుతుంది. రాత్రి తొమ్మిది దాటితే ఆ మార్గ ప్రాంతంలో కరెంటు తీసివేస్తారు. అక్కడి కాటేజీలలో చీకట్లోనే పాడుకోవాలి. అక్కడ ప్రయాణం చేయాలి అంటే పాదచారియై వెళ్ళాలి. మంచి హోరుమని వానలా పడిపోతుంది. పైనుంచి క్రిందకి చూశారంటే కళ్ళు తిరిగిపోతాయి.
ఇటునుంచి రుద్రప్రయాగ, అటునుంచి దేవప్రయాగ రెండూ వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగానది – బదరీలో అలకనందానది. పర్వతముల నుండి ఎన్నో జలపాతములు పడిపోతూ ఉంటాయి. సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్ళే వాళ్ళు తక్కువ. డోలీ, లేదా గుర్రముల మీద కూర్చుని వెళ్ళాలి. గుర్రం ఒక్కసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడిని వెతకవలసిన అవసరం ఉండదు. అలా జారితే వాడు కొన్నివేల అడుగుల నుండి క్రింద పడిపోతాడు. శరీరం చిన్నాభిన్నం అయిపోతుంది. యాత్రములో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదారనాథ్ యాత్ర వెళ్ళితీరవలసిన యాత్ర. ఇన్నివేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవళం కనపడుతుంది. లోపలి వెడితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది. అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడుగా వెలిశాడు. కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలామలకము అని శివమహాపురాణం, పెద్దలు నిర్ణయం చేశారు. కేదారం వెళ్ళినపుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది. అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకసారి ఒక విచిత్రమయిన స్థితి ఏర్పడింది. అక్కడ శివలింగం వెలసి కొన్ని యుగములు అయిపొయింది. శివాలయములో శివునికి పునఃప్రతిష్ఠ ఉండదు.
ఒకసారి పాండవులు అయిదుగురు కలిసి కేదారేశ్వర దర్శనమునకు వెళ్ళారు.అప్పటికి ఆలయంలో చిన్న శివలింగం ఉంది. పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట. ఒక చిన్న దున్నపోతు రూపంలో పరుగెత్తాడు. పాండవులు దానిని గమనించారు. వారు అది ఖచ్చితంగా అది శంకరుడే అయి ఉంటాడని భావించారు. మహిషరూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు. దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. వాళ్లకి దాని కాళ్ళు అందలేదు. తోక అందింది. ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై పరమేశ్వరుడు తన పృచ్ఛభాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం. కేదారం వెళ్లి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమ పవనమయిన క్షేత్రం కేదార క్షేత్రం.
అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది. ‘అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ నిజంగా కైలాసంలాగే భాసిస్తూ ఉంటుంది. వర్షం ఆగి సూర్య కిరణములు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కైలాస సమీపమునకు వెళ్లి వచ్చినట్లు అనిపిస్తుంది. శంకర భగవత్పాదులు అక్కడే తమ సత్యదండమును విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు. అక్కడ శంకరుల సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది. అక్కడే చిన్న ఆలయం కూడా ఉంటుంది. కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము.
కేదారక్షేత్రం వెళ్ళినవారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చెయ్యాలి. మన చేతికి వున్నా ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు. ఇకముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది.

శివపురాణం - 11 వ భాగం

కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే!!
మాంధాతృపురంలో వెలసిన వాడు ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వర క్షేత్రము చాలా చిత్రమయిన క్షేత్రము. అక్కడ రెండు స్వయంభూ శివలింగములు వెలశాయి. అందులో ఒకదానిని ‘ప్రణవాకార పరమేశ్వరుడు’ అంటారు. ఆయన ఓంకార స్వరూపియై ఉంటాడు. రెండవది మనము ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. అమలేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇలా రెండు లింగములు వెలయడానికి కారణం తెలుసుకోవాలి.
నారదమహర్షి త్రిలోక సంచారి. మహానుభావుడు గురు స్వరూపుడు. అటువంటి నారద మహర్షి ఒకసారి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చారు. వింధ్యపర్వతమునకు తాను చాలా గొప్పదానను అని, తనంత ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉంది. ఇది ఒక అర్థం లేని ఆభిజాత్యం. ఇక్కడ అదృష్టం ఏమిటంటే అటువంటి సద్గురువు అయిన నారదునితో వింధ్యపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారి అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకుమించిన అదృష్టం లేదు. వాని జీవితం మారిపోతుంది. నారదుడిని చూసి విధ్యపర్వతం అహంకారమును బయట పెట్టింది. అసలు వింధ్యుడు చూడగానే నారదునికి నమస్కారం చెయ్యాలి. కానీ అహంకారంతో మాట్లాడాడు. అపుడు నారదుడు ఒక చిరునవ్వు నవ్వి “నీవు చెప్పినది యథార్థము. నీతో సామానమయిన పర్వతము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది. మేరుపర్వతం కూడా చాలా గొప్ప పర్వతం. నవగ్రహములు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అవి మేరుపర్వతమునకు ప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాయి” అన్నాడు. ఆమాట వినేసరికి వింధ్య పర్వతానికి చాలా బాధ వేసింది. ‘నాకూ ఉన్నాయి శిఖరములు, కానీ వాటి చుట్టూ ఎవరూ తిరగడం లేదు. మేరు పర్వతమునకు ఉన్న కీర్తి నాకు లేదు’ అని అనుకుని ‘నారదా, నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి. మేరుపర్వతం కంటే గొప్ప ఉన్నతిని పొందాలి. అందుకని ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు?” అని అడిగాడు.
అపుడు నారదుడు మహాశివుణ్ణి గూర్చి తపస్సు చేయమని వింధ్యుడికి సలహా చెప్పాడు.వెంటనే వింధ్యుడు మహాశివుణ్ణి గూర్చి శివ పంచాక్షరీ మహామంత్రమును ఉచ్చరిస్తూ తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. దేవతలు మహాదేవుని వద్దకు వెళ్లి ‘మహాదేవా, వాన్ తపస్సు సామాన్యంగా లేదు. మీరు వెళ్ళి ప్రత్యక్షం అవండి’ అన్నారు. అంతటా నిండి ఉన్న నిర్గుణ పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు. వింధ్యుడు బహిర్ముఖుడు అయ్యాడు. ‘నాయనా, నీవు చాలా గొప్ప తపస్సు చేశావు. నీవు ఏమి కోరి ఈ తపస్సు చేశావు? ఏమి కావాలో చెప్పు ఇచ్చేస్తాను’ అన్నాడు. ‘నన్ను లోకములో గొప్పవాడిగా చెయ్యి’ అని అడిగాడు. “నీవు ఇంక అహంకారముతో ప్రవర్తించకు. ఏ నవగ్రహములు అయితే మేరువు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరమును అధిరోహిస్తాను’ అని చెప్పి శంకరుడు వింధ్యుడిని అనుగ్రహించాడు. అపుడు వింధ్యుడు ‘ప్రభూ, దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను, అహంకరించను’ అని చెప్పాడు. అపుడు ఆ వింధ్య పర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్లా ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింధ్య పర్వత శిఖరముల మీద స్వామి రెండు స్వయంభూ లింగములుగా వచ్చాడు. ఒకటి ‘ఓంకార లింగము’, ఒకటి ‘అమలేశ లింగము’. అందుకే మనం చెప్తే ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. ఆ వెలయడం మాంధాతృ పురంలో వెలశాడు. ఓంకారం అంటే ప్రణవము. ప్రణవము మోక్ష దాయకము. ఇపుడు వింధ్య గిరి మీదికి వెళ్లి దర్శనం చేసిన వాడికి మోక్షం వస్తుంది. పక్కన అమలేశుడు ఉన్నాడు. మనందరి యందు ఆసవ మలము, కార్మిక మలము, మాయక మలము అని మూడు రకములయిన మలములు ఉంటాయి. మీరు స్నానం చేసినా ఈ మూడూ వదలవు. కానీ ఈశ్వరుడు ఈ మూడు మలములకు అతీతుడు. ఎవడు మీకు ఈ మూడు మలములకు అతీతమయిన స్థితిని ఇవ్వగలడో, తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగినవాడో వాడు ఓంకారేశ్వరుడు. మీరు కోరిన సమస్త కోరికలనూ తీర్చగలిగిన వాడు. ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు. మీరు అడిగినది ఏదయినా ఇవ్వగలడు. ఇపుడు ఆయన అమరేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు. ఇద్దరుగా అక్కడ వెలసి శంకరుడు నిరంతరమూ జనులకు శుభములను ఇస్తూ ఆ కొండమీద వెలసి ఉన్నాడు. అలా వెలసిన అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదులు ఒక అద్భుతమయిన శ్లోకముతో ఆరాధన చేస్తారు. మనం అమరేశ్వర లింగమును చూసినప్పుడు ఆ భావనను మనస్సులో తెచ్చుకోవాలి. అమలేశ్వర లింగమును, ఓంకారేశ్వర లింగమును మీరు అక్కడ కళ్ళతో చూసి తత్త్వ విచారణ రీత్యా మీ మనస్సు లోపలి తెచ్చుకోవాలి. శంకరులు అంటారు
ఆకాశ శ్చికురాయతే దశదిశాభాగో దుకూలాయతే
శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే,
వేదాంతో నిలయాయ తేసువినయో యస్యస్వభావాయతే
తస్మి న్మే హృదయం సుఖేనరమతాంసాంబే పరబ్రహ్మణి!!
‘సాంబే’ అంటే ‘స అంబే’ – అమ్మతో కూడుకున్న అయ్యా, ఓ శంకరా నీవు పరబ్రహ్మవు. నీవు అమలేశ్వరుడవు. మూడు మలములకు అతీతమై ఉన్నవాడవు. ఇక్కడ నీవు లింగముగా కనపడుతున్నావు. నీవు నాతొ వచ్చినప్పుడు నీవు ఆకాశ స్వరూపుదవై ఉన్నావు. నీవు దిగంబరుడవు. పది దిక్కులు కలిసి నీకు వస్త్రము అయ్యాయి. దిక్కులను అంబరముగా కట్టుకున్నవాడవు. చంద్రరేఖను ఆభరణముగా కలిగిన వాడవు. ఎప్పుడూ ఆనందమయ స్వరూపుదవై ఉంటావు. వేదముల చివరి భాగాములయిన ఉపనిషత్తులయందు చెప్పబడుతుంటావు. వినయముతో నిన్ను తలుచుకుంటే చాలు, మమ్మల్ని ఉద్ధరించడానికి వస్తావు’.

శివపురాణం - 12 వ భాగం

భీమేశ్వర జ్యోతిర్లింగము
భీమేశ్వర జ్యోతిర్లింగం గూర్చి ప్రార్థనా శ్లోకంగా ఒకమాట చెప్తారు.
యం డాకినీశాకినికాసమాజై నిషేవ్యమాణం పిశితా శనైశ్చ!
సదైవ భీమాదిపదప్రసిద్ధం, తమ్ శంకరం భూతహితం నమామి!!
ఇక్కడ ఉండే శంకరుడిని భీమలింగము అని పిలుస్తారు. శివాష్టోత్తరంలో ‘భీమః’ అన్న నామమును మనం చదువుతుంటాము. ‘భీమః’ అనే నామం విష్ణుసహస్రనామ స్తోత్రంలో కూడా ఉంది. ఇది చాలా చిత్రాతిచిత్రమయిన స్వయంభూలింగము.
లింగపురాణం మనకొక మాట చెప్తోంది. వాయువు పేరును ‘ప్రభంజనః’ అని పేర్కొంది. ఆయన గట్టిగా వీస్తే పెద్దపెద్ద వృక్షములు కూడా కూకటి వేళ్ళతో క్రిందపడిపోతాయి. కాబట్టి ఆయన ప్రభంజనుడు. అటువంటి వాడికి శంకరుడు ‘నీవు జీవులలో ఉండి వాళ్ళ కార్యములన్నీ నిర్వర్తించాలి’ అని చెప్పాడు. వెంటనే వాయువు జీవులలోకి వెళ్ళాడు. ఇప్పుడు ప్రభంజనుడై వాయువు మీ శరీరము నిలబడడానికి పది రకములయిన కర్మలను లోపల వుండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే మన బ్రతుకే లేదు.
పూర్వకాలమునందు సహ్య పర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసుని పేరు కర్కటుడు. ఆయన భార్య పేరు పుష్కసి. ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది. ఆమె పేరు కర్కసి. పెరిగి పెద్దదయి యౌవనంలోకి వచ్చింది. తగిన సంబంధం చూడాలి. విరాధుడు అనేవాడిని ఈమెకు తగిన వరునిగా నిర్ణయించి పెళ్ళి చేశారు. కొంతకాలమునకు రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఈవిడకి వైధవ్యం వచ్చింది రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది. ఈ విషయం తెలుసుకుని కుంభకర్ణుడు ఈమె దగ్గరికి వచ్చాడు. కదళీ వనంలో వున్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడకి కుంభకర్ణుడి వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టినవాడు అపారమయిన బలవంతుడు అవాలని ఆమె కోరుకుంది. తన కొడుకు తన భర్త విరాధుడిని, కుంభకర్ణుని సంహరించిన రాముడిని సంహరించగల శక్తిమంతుడు కావాలని ఆమె కోరిక. అందుకని ఆ పిల్లాడిని ‘భీమః’ అని పిలవడం ప్రారంభించింది. భీమః అంటే గోప్పబలం ఉన్నవాడు అని అర్థం.
వాడు పెరిగి పెద్ద రాక్షసుడు అయ్యాడు. వాడు ఒకనాడు తల్లిని “నాన్నగారు ఎక్కడ” అని అడిగాడు. అపుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు విష్ణువును సంహరించాలి’ అని చెప్పింది. విష్ణువు గురించి లోకములనన్నింటిని వెతికి వెతికి విసిగిపోయాడు. ఎవడయినా భగవంతుని పాదములు పట్టుకున్న వాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు. ఇలా భక్తులన్దరినీ చెనకుతూ వెళ్ళిపోతుండగా ఒకానొకప్పుడు కామరూప రాజ్యమును పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజు జోలికి వెళ్ళి ఆయనను ఓడించి తీసుకు వచ్చి కారాగారంలో పెట్టాడు.
సుదక్షిణుడు పార్థివ లింగం పెట్టి రోజూ లింగార్చన చేస్తూండేవాడు. మనస్సుతోనే ఆయన అన్నీ సృష్టించి శివపూజ చేస్తుండేవాడు. అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి ఈవిషయం రాజుకు చెప్పారు. వీడికి ఎక్కడ లేని కోపం వచ్చి నాకన్నా గొప్పవాడు ఎవడు? ఇప్పుడే ఈ లింగమును కత్తితో నరికేస్తాను అని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షిణుడు పరమేశ్వరా నీవు ఆవిర్భవించి వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు.
ఎప్పుడయితే తన చేతిలో ఉన్న చంద్రహాసమును విసిరాడో అంతటా నిండి నిబిడీ కృతమయిన పరమాత్మ ఈ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపమును పొంది పార్థివ లింగంలోంచి బయటకు వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్ళే వాళ్ళని ఉపేక్షించను అని ఉత్తరక్షణం వాడిని కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు ‘భీముడు’ అని చెప్పుకున్నాడు. భీముడు అనగా అద్వితీయ పరాక్రముడు.
ఇందులో తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది. ఆ రాక్షసుని కక్ష విష్ణువు మీద. అయితే ఇక్కడ పరమశివుడు వచ్చాడు. యథార్థమునకు విష్ణురూపం రావాలి కదా! అయితే శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు? అంటే భగవంతుని రెండు పేర్లు చెప్తారు – వామదేవ, వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు. వామదేవ అంటే పరమశివుడు. ఈ రెండు పేర్లలో మారిన అక్షరములు ‘మ’ ‘సు’. ఇప్పుడు ‘సు’ పక్కన ‘మ’ పెట్టండి. ‘సుమ’ అవుతుంది. ‘సుమం’ అంటే పువ్వు. పువ్వు అనగా జ్ఞానం. జ్ఞానం మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు అవుతారు. నామములు, రూపములు మారాయి. తత్త్వరీత్యా ఉన్నది ఒక్కటే పదార్ధం. అందుకే శివలింగమును పూజించి రాముని జోలికి వెళ్ళినా, రావణాసురుని పది తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు. శివ స్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్నా, శ్రీమహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయమును ఆపడు. ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పదార్థము. ‘ఏకోదేవః సర్వభూతాంతరాత్మా స్రవభూతాభివాసః సాక్షీచేతోకేవలోనిర్గుణస్యా’ అంది వేదం. ఆ ఉన్న ఒక్క పదార్థము అవసరమును బట్టి రూపమును మారుస్తుంది. ఇక్కడ భీమః – మీరు ఏమి కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదయినా మీకు ఇవ్వగలిగిన వాడు. ఇప్పుడు ఆ స్థితిలో వచ్చి రాక్షససంహారం చేసి తన భక్తుడయినవాడికి రాజ్యాధికారం ఇచ్చి, తదనంతరం మోక్షమునిచ్చినవాడు.
ఒక్కసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి ‘డాకిన్యాం భీమశంకరం’ అని ఒక్క నమస్కారం చేస్తే భీముడు శంకరుడు మీకు శుభం చేస్తాడు. ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ మిమ్మల్ని కాపాడి ఎటువంటి దుఃఖములు రాకుండా రక్షిస్తాడు.

శివపురాణం - 13 వ భాగం

త్ర్యంబకేశ్వరుడు
‘త్ర్యంబకం గౌతమీ తటే’ అని మనం అంటాము.
సహ్యాద్రి శీర్శే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్రదేశే,
యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తమ్ త్ర్యంబకమీశమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం – ౧౦)
త్ర్యంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు. ఆయనను స్మరించిన వారిని, ఆయనను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించే స్వరూపం ఉన్నవాడు. ఇప్పటివరకు చదివిన స్వయంభూలింగముల విశేషం ఒకలా ఉంటుంది. త్ర్యంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది. ఇది కేవలము ఒక లింగము ఆవిర్భవించిన కథ కాదు. గౌతమ మహర్షి జీవితమును, ఆయన శీలమును, ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు. అక్కడి శివలింగం గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది. ఇక్కడ ఒక నది, ఒక శివలింగం ఆవిర్భవించాయి. మనం తెల్లవారి లేస్తే ఏ నదీజలములు త్రాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు చదవబోతున్నాము.
గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజూ శంభు లింగారాధనము చేస్తుండేవాడు. ఆ లింగానికి శంభులింగము అని పేరు పెట్టాడు. ‘శం భావయతి ఇతి శంభుః’ – మంచి భావములను కల్పించ గలిగిన లింగమును ఆరాధనా చేశాడు. అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే. లోకమంతటినీ లోకేశ్వరునిగా చూడడం. చాలామంది శిష్యులు ఆయనను అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వతశిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమయిన జీవితమును గడుపుతున్నాడు.
ఇలా నడుస్తుండగా కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమయిన క్షామం వచ్చింది. వర్షములు పడలేదు. ఎక్కడా నీరు లేదు. ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివలింగామునకు సహస్ర ఘటాభిషేకం చేస్తారు. చేస్తే వర్షములు పడతాయి. ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనిని గౌతముడు చూసి నేను ఎలాగయినా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను’ అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. ‘నీవు తపస్సు చేశావు. సంతోషించాను. కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు. కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను. లోకమునకంతటికీ నేను నీరు ఇవ్వలేను. నీవు ఒక చిన్న గుండం తవ్వు. నేను అందులో నీళ్ళు పోస్తాను. ఒక వరం ఇస్తాను. ఆ కుండం ఆరదు. ఎప్పుడూ నీళ్లు ఉంటాయి’ అని చెప్పాడు వరుణుడు. అపుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది. తప్పకుండా అలా చేస్తాను’ అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత. వారు తవ్విన గుండంలో నీరు నింపాడు వరుణుడు. అపుడు గౌతముడు అహల్య కలిసి ఈ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమయిన పంటలు పండించాడు. అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్లి చక్కగా ఆ పెట్టిన పదార్థముల నన్నిటిని తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు.
ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారు జామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి. వరుణ గుండంలోకి వెళ్ళి నీళ్ళు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి. వాళ్ళు నీళ్ళు తేవడానికి వెళ్ళారు. అదే సమయమునకు మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది కాబట్టి అమ్మలారా, మీరు ఒక్కదారి అలా ప్రక్కకి తొలగితే మీము నీళ్ళు పట్టుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. స్త్రీలు అన్నారు ‘ మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది. మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం, అభిషేకం ఎక్కువయ్యాయా?అవతలికి పొండి ’ అన్నారు. ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగివచ్చారు. అప్పుడు వాళ్లకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి ‘అమ్మా, ముని పత్నులు మమ్మల్ని అనరాని మాటలు అని పంపించి వేశారు. ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడం’ అని అడిగారు. ఆమాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది.
వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని దెప్పిపొడిచారు. వాళ్ళలో అక్కసు బయలుదేరింది. వెళ్ళి భర్తలను “మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా?” అని అడిగారు. అలా భార్యలు అడిగేసరికి వాళ్లకి కష్టం వచ్చింది. వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలు పెట్టారు. వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతిమఖము అనే మఖము ఒకటి చేశారు. వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తిపొందిన గణపతి యజ్ఞ గుండంలోంచి ఆవిర్భవించాడు. ‘నేను మీకు ఏమి చేసిపెట్టాలి?” అని అడిగాడు. అపుడు వాళ్ళు ‘గౌతముడు పొగరెక్కి ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి’ అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘ఇది మీరు అడగవలసిన మాట కాదు. ఒకనాడు మీకు తాగడానికి నీళ్ళు లేక, తినడానికి అన్నం లేకపోతె ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తొరి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా? ఇది ఎంత కృతఘ్నత! ఇలా చేయకూడదు. అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు” అన్నాడు.
అపుడు వాళ్ళు “నీ దగ్గర నీతులు వినదానిమి మేము ఈ మఖము చేయలేదు. మాకోరిక ఒక్కటే. గౌతముడు ఈ ఆశ్రమం నుండి తరమబడాలి. అలా నువ్వు చేస్తే మేము చేసిన మఖమునకు ఫలితం ఇచ్చినట్లు అవుతంది. కానినాడు నీవు కృతఘ్నుడవు అయిపోయినట్లు మేము భావిస్తాము” అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను. తప్పకుండా మీకోరిక తీరుస్తాను. కానీ మీరు పాడయిపోతారు. తన ఉపాసన యందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్క్రుష్టమయిన కీర్తిని పొందుతాడు. దీనిని మీ మనస్సులో పెట్టుకోండి. మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు. ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు, ఆకుకూరలు వచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ గోవు రూపంలో వచ్చాడు మునుల కోర్కెను తీర్చడానికి గాను. బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా, చేతితో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డిపరక తీసి ఆవుమీద పడేసి ‘హ హ’ అన్నాడు. ఆ గడ్డిపరక పడగానే ఆవు చచ్చిపోయింది. నాకు గోహత్యాదోషం వచ్చింది’ అని ఏడ్చాడు. ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు. అక్కడికి అహల్య, ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. మునులు, మునిపత్నులు వచ్చారు. ఏమయిందని గౌతముని అడిగారు. జరిగింది చెప్పాడు గౌతముడు. అపుడు వారు’ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహా పాతకములు వస్తాయి. నీవు నీ భార్యను, శిష్యులను తీసుకుని ఆశ్రమం వదలి ఎక్కడికయినా పో’ అన్నారు. అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి, ఇక్కడ నీవు ఉంటె మేము ఉండము అంతేకాక ఈవేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు. గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజచేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు. అదేమీ కుదరు పో’ అన్నారు. గౌతముని ప్రాణం ఈశ్వరార్చన. అప్పుడు ఆయన ‘అయ్యో, నేను తప్పకుండా వెళ్ళిపోతాను. అని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం వుంటే చెప్పండి. నేనది చేసుకుని మరల నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను’ అన్నాడు. నిజానికి ఆయనకు తెలియని విషయమా? ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళుతున్నాడు. వీళ్ళు మెట్లెక్కి అహంకారమునకు వెడుతున్నారు. అపుడు వీళ్ళు ‘అయితే ఈ భూమండలమునంతటినీ మూడు మార్లు ప్రదక్షిణ చెయ్యి. అలా చేస్తున్నప్పుడు అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహా పాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి. వచ్చిన తరువాత చాంద్రాయణ వ్రతం చెయ్యి. అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుంది’ అని చెప్పారు. ఒకవేళ అలా చేయలేక పోయినట్లయితే వెళ్లి శంకరుని గూర్చి తపస్సు చెయ్యి. శంకరుడు ప్రత్యక్షమయిన తర్వాత గంగను ఇమ్మని అడుగు. ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగను ప్రవహింపజెయ్యి. తర్వాత అఘమర్షణవ్రతం చెయ్యి. కోటి లింగములు పెట్టు. వాటికి అర్చన చెయ్యి. అలా చెయ్యి అన్నారు. మరల గౌతముడు ఆశ్రమమునకు తిరిగి రాకుడా ఉండేవిధంగా ఉపదేశం చేశారు.
గౌతమ మహర్షి వెళ్లి అద్భుతమయిన తపస్సు ప్రారంభం చేశారు. ఒక పార్థివ లింగమును తీసుకుని పంచాక్షరీ మహామంత్రముతో తదేక నిష్ఠతో శివుణ్ణి ఆరాధన చేశారు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షం అయి ‘నాయనా, ఎందుకింత గొప్ప తపస్సు చేశావు?” అన్నాడు. కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ‘ఈశ్వరా నీకు తెలియనిది ఏముంటుంది? నేను ఆవుని చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాక్కు కల్పించవలసినది’ అని ప్రార్థించాడు. శంకరుడు ‘అయ్యో పిచ్చివాడా. ఇంత తపస్సు చేసి పాపమును తియ్యమని అడుగుతున్నావా? నీకు పాపం ఉన్నాడని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. జగత్తులో ఎవడయినా గౌతమమహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడవు. నిన్ను చూడడానికి నేను వచ్చాను’ అన్నాడు. గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరచి శంకరుని చూసి ఆహా పరమేశ్వరా, వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను అలా తిట్టక పొతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు. వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయింది. వాళ్లకు నేను ఋణపడిపోయాను అన్నాడు.
తరువాత శివుడు ‘గౌతమా! ఏదైనా వరం కోరుకో ఇస్తాను’ అన్నాడు. అపుడు గౌతముడు స్వామీ మీరు నిజంగా నన్నుకానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగను విడిచి పెట్టండి. నేను ఆంద్రదేశమునకు తీసుకువెడతాను’ అనగానే గభాలున గంగ స్త్రీరూపంలో పైనుండి క్రిందికి దూకి తెల్లటి వస్త్రములతో నిలబడింది. గౌతమునికి గంగాదర్శనం అయింది. వెంటనే ఆయన తన రెండు చేతులు ముకుళించి నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లీ అన్నాడు. అపుడు ఆ తల్లి నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తలమీద పడతాను. అపుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు. నీవు నిర్మలుడవు అయినట్లే. వెంటనే శివుని తలమీద వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమిమీద ప్రవహించను అన్నది. అపుడు గౌతముడు ‘అమ్మా, లోకం అంతా సుభిక్షం కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లీ నేను కోరింది అన్నాడు. అపుడు గంగ శంకరుని వంక చూసి స్వామీ, గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగరూపంలో ఇక్కడ వెలయండి. 33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటువెడుతుందో అటు ఉండాలి. అంది. శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు అమ్మా మేము మాత్రం ఏడాదికి ఒకమారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము. పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము. అని గంగామాతను ప్రార్థించారు. గంగ సరే సంవత్సరమునకు ఒకరోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది.
గౌతముని మీద వెడుతున్న గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ త్ర్యంబకుడు అనే పేరుతో వెలశాడు. ఇది పరమశివుని అపారమయిన కారుణ్యమును, సౌలభ్యమును తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఏ మునులయితే గౌతమ మహర్షిని పో పో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ క్రింద పడిందిట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి, శిష్యుల తోటి, దిగుతున్నారు. గంగ వారిని చూసి ‘ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా? అని అంతర్ధానం అయిపోయింది. గౌతముడు ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు.
కొన్నిచోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది. అలా చెప్తే ఈ ఆఖ్యానమునకు అర్థం ఉండదు. గౌతముడు శపించలేదు. తమ గురువుగారు ఇంత చేసినా సరే, గంగాస్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన అసారే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. ఆనాటి నుండి వాళ్ళు జడులై, తమ జీవితములను పాడుచేసుకుని తిరగసాగారు. ఆనాడు వెలసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వరుడు అని పిలవబడుతూ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్నది. ఆయన త్ర్యంబకుడు. అనగా మూడు కన్నులు కలవాడు. ఆ త్ర్యంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నుల వాడా మహాదేవా అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితమును ఇచ్చేస్తాడు. ఒకనది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి మనవరకు బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడయిన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి.

శివపురాణం - 14 వ భాగం

విశ్వేశ్వర లింగము – వారణాసి – భాగం – 1
వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనాశ్లోకం చెప్తూ ఉంటారు.
సానందమానందవనే వసంతం, ఆనందకరం హతపాప బృందం
వారాణసీ నాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!
ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు’ అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే’ – ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను’ అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశి నేను రాను అన్నవాడు కాని, వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈలోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్ట మొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చారు. దీనినే శాస్త్రం ‘నారాయణ, నారాయణి’ అని మాట్లాడింది. ఇపుడు వాళ్ళిద్దరూ చూసి ‘నీ సంకల్పం మాకు తెలిసింది. మేము ఏమి చెయ్యాలి? అని అడిగారు.అపుడు ఆయన తపించండి’ అని చెప్పాడు. నిర్గుణం నుండి సగుణం అయిన తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది.. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణమును సృష్టించాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. ఇలా బతికేటట్లు చేయడానికి కాశి ఇప్పుడు మోక్షపురి అయింది. కాశి భోగపురి కాదు. మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు.
ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణము నందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్లి చచ్చిపోవాలన్నారు. కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తీ మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. ఇప్పుడు అయిదు క్రోసుల కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ళ వంక చూసి ఆశ్చర్య పోతున్నాడు. శ్రీమహావిష్ణువు శరీరమునుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీపట్టణమును ముంచెత్తేస్తోంది. ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణమునాకు త్రిశూల స్పర్శ కలిగింది. నీళ్ళలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే ‘మణికర్ణికా తీర్థం’ అయింది.
అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ‘ ఇప్పటి వరకు ఈ పట్టణమును మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయజలములందు ఈలోకం అంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశి నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు. ఈ కాశీపట్టణం అలాగే ఉండిపోతుంది’ అన్నాడు. కాబట్టి కాశీకి లయంలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు. వేదమును ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభం అయిన భూమి వారణాసి. ‘వారణ’ ‘అసి’ అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటం మీద పడి అక్కడినుంచి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి.
అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు ‘ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలయింది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు కనుక నీవు విశ్వేశ్వర నామంతోను, విశ్వమునకు నాథుడవు గనుక విశ్వనాథుడను నామంతోను పిలవబడతావు’ అని చెప్పింది. సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన. అందుచేత అది స్వయంభూలింగం అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇపుడు ఈ సృష్టి నిలబడదానికి ఆహారం అవసరము. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్తయై అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయై తాను అంతరికీ అన్నం పెడతానని మునికాన్తలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువయినదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది.
భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః’ అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టి వారణాసీ క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనం అందరూ అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది. కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు – గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి పెద్దలయిన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్లకి అలవాటు అవుతుంది. అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడురోజుల పాటు ఆయనకీ అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పటుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సం!!ల స్త్రీ బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను’ అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి సంధ్యావందనం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు. అని అనుకుని ఆపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టేశారు. అమ్మవారు వచ్చి ‘మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అపుడు శంకరుని తీసుకు వచ్చింది. అపుడు వ్యాసుడు అమ్మవారి వంక, అయ్యవారి వంక చూశాడు. అపుడు శంకరుడు ‘వ్యాసా, నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో’ అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు.
వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు ‘వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము, మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడనుండి దక్షారామం వెళ్ళిపో’ అంది. ఇదీ అన్నపూర్ణాతత్త్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం.
శివపురాణం - 15 వ భాగం CLICK HERE
Search This Blog
***

"ఓం నమశ్శివాయ:"
"ఓం వాసుదేవాయనమః"
" శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "
Popular Posts
-
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా సామగ్రి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg. పూలమూరలు : ...
-
దత్తాత్రేయ స్వామి చరిత్ర :..... హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా ...
-
అక్షరాభ్యాసం: పసుపు : 100 g కుంకుమ : 100 g గంధం : 1 box విడిపూలు : ¼ kg పూల మాలలు : 2 మూరలు తమలపాకులు : 20 వక్కలు : 100 g ఖర్జూరములు : 1...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet ...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 20 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet హ...
-
వినాయక చవితి పూజా సామగ్రి వినాయక చవితి: పసుపు : 200 grms కుంకుమ : 200 grms గంధం : 1 box విడిపూలు : 1 kg పూల మాలలు : 5 మూరలు పూల దండలు...
-
పసుపు :100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 pa...
-
మాఘ పురాణం - 1 వ భాగం శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్ని...
-
మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 2...
-
శ్రీ లలితా చాలీసా: లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం చ...
Popular Posts
-
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా సామగ్రి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg. పూలమూరలు : ...
-
దత్తాత్రేయ స్వామి చరిత్ర :..... హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా ...
-
అక్షరాభ్యాసం: పసుపు : 100 g కుంకుమ : 100 g గంధం : 1 box విడిపూలు : ¼ kg పూల మాలలు : 2 మూరలు తమలపాకులు : 20 వక్కలు : 100 g ఖర్జూరములు : 1...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet ...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 20 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet హ...
-
వినాయక చవితి పూజా సామగ్రి వినాయక చవితి: పసుపు : 200 grms కుంకుమ : 200 grms గంధం : 1 box విడిపూలు : 1 kg పూల మాలలు : 5 మూరలు పూల దండలు...
-
పసుపు :100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 pa...
-
మాఘ పురాణం - 1 వ భాగం శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్ని...
-
మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 2...
-
శ్రీ లలితా చాలీసా: లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం చ...