ఆదిత్యహృదయము
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః
రావణుని యొక్క సారధి అతని ఆఙ్ఞ ప్రకారము రణరంగంలో రధముంచిన తరువాత రామ-రావణ యుద్ధాన్ని చూచుటకై వచ్చిన దేవతలతో కూడ వచ్చినవాడునూ, భూతభవిష్యద్వర్త మానములను 3కాలములు యెఱిగిన అగస్త్యమహర్షి అంతవరకు రావణునితో జరిగిన యుద్ధంలో అలసి యున్నవాడై మరల యుద్ధము కొరకు వచ్చిన రావణుని ఎదురుగ చూచి పరత్వ ప్రకటనలేకుండా మనుష్యుడుగానే వ్యవహరింపుచు, ఇతనిని చంపుటెట్లా అని చింతలో మునిగియున్న రాముని దగ్గరకు వచ్చి అతనితో ఇట్లు పలికెను.
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి
కుమారా, ఆజానుబాహో, రామ రామ అని ప్రేమతో పిలిచి, రహస్యమైనదియు, వేదమువలె నిత్యమైనదియగు స్తోత్రమును వినుము. దీనివలన యుద్ధమున సమస్త శతృవులను జయింపగలవు.
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివం
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివం
ఆదిత్యహృదయము పరమపావనమైనది. మనలోగల కామక్రోధాలు అను అంతః శతృవులను, మనలను ద్వేషించువారిని నశింపచేయు శక్తి ఈ స్తోత్రములో ఉంది. శుభం కలుగుతుంది, లభించిన జయము, కూడిన శుభములు కలకాలము నిలబడుతాయి. ఈ స్తోత్రపఠనము జయము కలుగజేయును.
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం
ఈ మహామంత్రము సకల పాపములను పోగొట్టి ఆయుషును పెంచి చింతలు, శోకములనుండి ఉపశమింపచేస్తుంది. కావున ఇంతకు మించిన స్తోత్రం లేదు. కోరిక లేకుండా స్తుతించు భక్తులకు మోక్షమును కలుగచేస్తుంది.
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం
రామా, పూజింపవలసిన దేవతా స్వరూపమును గూర్చి నీకు ధ్యానము నిమిత్తము తెలుపుచుంటిని, ఆ సూర్యభగవానుడు బంగారు కాంతివలె ప్రశస్తమైన కిరణములు కలిగి బాగుగా ఉదయించినవాడును, సత్వ, రజో, తమోగుణములకు ప్రతీకలైన దేవాసురులచే నమస్కరింపబడువాడును, తన తేజో గుణముచే చంద్రుడు, అగ్ని మొదలగు తేజోమండలములను కప్పివేయువాడునూ, ఎండవానలచే సమస్త లోకాలను నియమించువాడునగు సూర్యభగవానుని పూజింపుము.
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
భాస్కరుని ఉపాసించవలసిందని ఉపదేసించిన తరువాత, దేవతలెందరో ఉండగా ఈ సూర్యదేవునిని ఎందుకు పూజింపవలెను అను సందేహము తొలగించుటకు అగస్త్యమహర్షి ఇలా చెప్పాడు. సకలదేవతలు ఆ భాస్కరునిలోనే మూర్తీభవించి యున్నరు. దేవతలను రాక్షసులను సమభావముతో పోషించు సాత్వికస్వభావము సూర్యకిరణాలలో స్వతస్సిద్ధంగా ఉన్నాయి. అందరికి సమానంగా ప్రకాశము, ప్రేరణ కలుగచేయుచున్నాడు.
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, కుమారస్వామి, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, భూతభవిష్య వర్తమానములను తెల్పు కాలపురుషుడును, శిక్షించు యమధర్మరాజును, కాంతి నొసగు చంద్రుడుం జలాధిపతియగు వరునుడు ఈ సూర్యభగవానుడే.
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః
సూర్యుని సర్వదేవాత్మకత్వము అంతటితో ఆగలేదు, వంశవృద్ధికరులైన పితృదేవతలు, ఎల్లప్పుడు ఉండే వసువులు ఎనిమిదిమంది, బ్రహ్మముఖమునుండి సృజింపబడి మంత్రమూర్తులైన సాధ్యులు పన్నెండుమంది, ఆధి వ్యాధులను పోగోట్టు అశ్వనీ కుమారులు ప్రజలకు ప్రాణములను పోసే ప్రజాపతి, ఆ ప్రాణములను హరించే యముడు, భూమిని సస్యశ్యామలంచేసే చంద్రుడు, ఆలోచనలను ఇచ్చు మనువు,గాలి, నిప్పు, ఊపిరి, ఋతువులు, పగలు,రాత్రి వీటన్నింటికి మూలాధారము సూర్యుడే. ఇంతవరకు సూర్యుని గురించి వివరించి, సూర్యుడినే ఎందుకు పూజింపాలి అని తెలిపారు అగస్త్యమహర్షి. ఇకముందు తెలిపేది ఆదిత్యహృదయం.
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
ఓ సూర్యదేవా, నీవు ఆదిత్యుడవు, జగత్తును సృష్టించువాడవు. తమ కర్మలందు ప్రవర్తింపచేయువాడవు. ప్రశస్తకిరణాలతో కాంతిగలవాడవై ప్రకాశమునొసగి పగటిని కలుగచేయువాడవు.
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండాంఽశుమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండాంఽశుమాన్
పచ్చని గుఱ్ఱములు కలిగి, వేయికిరణములతో, సప్తనామక అశ్వములు కలవాడును, శంఖ చక్ర, గదా, పద్మములు ధరించువాడును, చీకటిని పోగొట్టి, సుఖమును కలిగించువాడును, సమస్తరూపములను కృశింపచేయువాడును, మరణించిన అండమునుండి పుట్టినవాడు.
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః
అతను హిరణ్యగర్భుడు, సృష్టికి ఆది, ఆధారం ఈ హిరణ్యమె. ఈ హిరణ్యం సూర్యగర్భంలో పుష్కలంగా ఉంది. శిశిరంలో ఉన్న చల్లదనం, సుఖం సూర్యునినుండే లభిస్తాయి. అతని కడుపులో బంగారం ఉన్నట్లే అగ్ని కూడా ఉన్నది. అదితికి అల్లరు బిడ్డగాన అతడున్నచోట పవిత్రమొవ్తుంది. "శంఖ" - శం : సుఖమును, ఖ : ఆకాశన్ని తెలుపును కావున, సూర్యగమనం ఆకాశానికి పావనత్వం ఇస్తుంది. అతడున్నచోట మంచు నిల్వనందున మంచును హరించి మంచిని పెంచే గొప్పవాడు సూర్యుడు.
వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః
ఆకాశానికి అధిపతి అగుటవలన, అతనికి వ్యోమనాధుడనే పేరు వచ్చింది. చీకటిని చీల్చుకొని వేదత్రయాన్ని (ఋగ్వేద, యజుర్వేద, సామవెదములు) త్రిలోకాలకు వినిపిస్తూ, మేఘాలను మెరిపిస్తూ వర్షాన్ని కురిపిస్తూ, నీళ్ళతో చెలిమి కలిగి, దక్షిణాయనంలో వింధ్యాచలం మీద సంచరించువాడు.
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోధ్భవః
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోధ్భవః
కోపమొస్తే కాలాగ్నిలా మండిపడువాడు, సూర్యమండలం అతనికి జన్మకుండలి. ఆ మండలికి అతడే ప్రభువు. ఉదయకాలంలో పింగళవర్ణంలో (తేనె రంగు) ఉంటాడు. ప్రాణులందరిని తపింపచేయువాడును, నూతనంగా ప్రపంచాన్ని సృష్టించగలవాడు కనుక ఇతనికి "కవి" అను నామము సార్ధకము. విశ్వరూపుడై అన్ని భావాలకు, భవములకు, భువనాలకు ఇతనే మూలము.
నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే
ఆకాశంలో కనిపించే అశ్వని మొదలు రేవతి వరకు గల 27 నక్షత్రములకు, కదలిక కల చంద్రాది గ్రహములకు, కదలిక లేని చుక్కలకు సూర్యుడే ప్రభువు. మన సూర్యుని లాంటి సూర్యులు అనేకమంది బ్రహ్మాండంలో ఉన్నారు. వారికి ఆదిసూర్యుడు ఆదిత్యుడు. అలాంటి ఆదిత్యులు పన్నెండుమంది ఉన్నారు. వారిలో విష్ణువు ప్రధానుడు. [ఈ ద్వాదశాత్మ స్తుతితోటి ఆదిత్యహృదయంలోని పూర్వార్ధం అనగా స్తుతి భాగం ముగుస్తుంది]
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః
సూర్యుడు తూర్పు దిక్కున ఉదయపర్వతము పై ఉదయించును. పడమరదిక్కున అస్తమనపర్వతము పై అస్తమించును. కావున ఈ పర్వతముల స్వరూపునిగానే భావించి, అట్టి వేవెలుగుల ప్రభువునకు, పగటి కాలమునకు అధిపతి అగు కాంతిదేవునకు నమస్కారము.
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
ఎన్నడు అపజయమెరుగని జయస్వామికి నమస్కారము, మంగళముతో కూడిన జయాన్ని ప్రసాదించే జయభద్రునకు నమస్కారము, పచ్చని గుఱ్ఱాల రధముపై పయనించే, అదితి కుమారునకు, వేవెలుగులస్వామికి నమస్కారము
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమోనమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమోనమః
వీరుడైన ఉగ్రమూర్తికి నమస్కారము. సంసారమందలి సారమును దెలిసినవాడైనందున, తాను దానికి దూరంగా ఉండి భక్తులను ఆ సంసారం నుండి తరింపచేయగల తరణికి నమస్కారము. వేకువన వీచే చల్లగాలికి హాయిగా నిద్రించు తామరకమలాలను తన ఉదయకిరణ స్పర్శచే మేలుకొలిపే చిన్మయ మూర్తికి నమస్కారము. సర్వ సమర్ధుడైన ఆ ప్రచండభానునకు నమస్కారము.
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః
బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను కూడా సర్వాపదలనుండి రక్షించే వాడును, చక్కని కాంతితో వెలుగుచుండువాడును, భయంకరమైన దేహముతో సమస్త విషయములను భక్షించే సూర్యునకు నమస్కారము ఈ శ్లోకము మత్స్య, నృసింహావతారములను సూచించును.
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
చీకటిని పొగొట్టి మంచును చీల్చివేసి, శతృవులను సం హరించే సూర్యుడు అమితాత్ముడు. చేసిన మేలును మరచువారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించే వాడు, అటువంటి దినాధిపతి వచ్చేవరకు మనము మేలుకొని, ఆ జ్యోతిర్మయునకు జలాంజలి యొసంగుటే మన కృతఙ్ఞత. అట్టి జ్యోతిర్మయునకు నమస్కారము.
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే
కాచిన బంగారము వలె కళకళ లాడుచు, భక్తులను బాధించు సంసారమును పోగొట్టువాడును, మనకు లోపల ఉండే అఙ్ఞానమును, వెలుపల బాధించే చీకటిని పోగొట్టుచు, కాంతి స్వరూపుడై, లోకమునకు సాక్షిభూతుడు, సకల కార్య దక్షుడైన విశ్వకర్మకు నమస్కారము.
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
ఈ సూర్యుడు ప్రాణి సమూహమునంతయు, లయింపచేసి మరల ఆ ప్రాణి సముదాయమును సృజించుతాడు, అతను తన వేడి కిరణాలతో శిక్షిస్తాడు, తిరి అవే కిరణాలతో చల్లని వర్షమును ప్రసాదించి రక్షిస్తాడు.
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం
మనము నిదురించు సమయమునందు కూడా సూర్యుడు మనలో అంతర్యామి ఐనందున సర్వకాల సర్వావస్థలందును మన తోడుగాఉండి రక్షించును. అగ్నిహోత్రములను శ్రద్ధగా ఆచరించే యజమానులకు దీక్షితులని పేరు. వారికి ఈ లోకములో సకల సంపదలు వచ్చునని, ఆ ఫలరూపేన సూర్య భగవానుడే ఉన్నాడని భావము.
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః
వేదములు, కృతువులు, ఆ కృతువుల యొక్క ఫలము కూడా సూర్యభగవానుడే. పదునాలుగు లోకములందు ఏయె పనులు కలవో అవన్నియు ఈ పరిపాలకుడైన ఆదిత్యుడే.
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ
రఘురామా, మానవులకు ఆపదలు వచ్చుట సహజము. అప్పుడు ఎనలేని భయము గలుగును. ఏమిచేయుటకు తోచదు. అరణ్యమార్గమున ప్రయాణవశమున చిక్కుకొన్నపుడును, ఎవరైన ఈ ఆదిత్యహృదయమును కీర్తించినయెడల అతను సమస్త దుఃఖములు తొలగిపోవును.
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
దేవతలకు ప్రభువై, జగత్తును పాలించువాడైన ఆదిత్యుని ఏకాగ్ర చిత్తముతో పూజింపుము. ఈ స్తోత్రాన్ని 3సార్లు జపించుము. యుద్ధము నందు తప్పక జయము కలుగును.
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతం
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతం
ఓ ఆజానుబాహుడువైన రామా, ఈ క్షణంలోనే నీ చేతిలో రావణ సంహారం జరుగుతుందని అగస్త్యమహర్షి రామునకు బోధి స్తాడు. రాముని బాహువులలో ఉపాస్యదైవమైన ఆదిత్యుని పరాక్రమము సంక్రమించిందని తెలిపి అగస్త్యమహర్షి వచ్చిన చోటునకే వెళ్ళెను.
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్
మహా పరాక్రమశాలియగు రఘురాముడు ఈ ఆదిత్యహృదయమును విని శతృసంహారమునకు దైవానుగ్రహము గలిగినందులకు సంతసించినవాడై చింతను విడిచెను. పవిత్రమైన అంతఃకరణముతో ఈ స్తోత్రమును ధారణ చేసెను
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
అంత రాముడు మూడు పర్యాయములు ఆచమించి పరిశుద్ధుడై ఆదిత్యుని దర్శించుచూ ఈ స్తోత్రమును 3సార్లు జపించి అంతులేని ఆనందముతో ధనస్సును చేతబూనెను.
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్
ఈ స్తోత్రమును జపించుటవలన సంతోషము కలిగిన రాముడు యుద్ధమునకు సన్నద్ధుడై రావణుని ఎదుట నిలిచి సర్వయత్నముతో అతనిని సంహరింపుటకు సిద్ధుడయ్యెను.
అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి
నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి
అప్పుడు దేవతల మధ్యనున్న రవి, రాక్షస ప్రభువు యొక్క సంపూర్ణ నాశనమును నిశ్చయమని తెలుసుకొని రామప్రభువును చూసి వారికి మిక్కిలి సంతసము కల్గించుచున్నవాడై త్వరపడుమని పలికెను.
ఆదిత్యహృదయమును చదవటానికి ఐదు నిమిషాలు కూడా పట్టదు. సూర్యుడు ఉదయించేందుకు ఎంతకాలంపడుతుందో సరిగా అంతే సమయంలో ఈ స్తోత్రం చదవవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు కాలాలలో చదవవచ్చు. నియమనిష్ఠలతో చదువుట ముఖ్యము. యెప్పుడు చదివినా ఉదయించిన సూర్యబింబాన్ని మనస్సులో ఉంచుకొని చదవటం ముఖ్యం.
రోగికి మందు తయారీ విధానం తెలియకపోయినా, మందును సరైన సమయంలో తీసుకొనటంద్వార రోగం నుండి బైటపడ్డట్లు, అర్ధం తెలియకపోయినా, శ్రద్ధగా, నిష్ఠతో ఆదిత్యహృదయం చదివితే సకల శ్రేయస్సులు లభిస్తాయి. ఇక దాని అర్ధం తెలుసుకొని చదివితే ఆఆనందము గురించి చెప్పనలవికాదు.