Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

గజేంద్ర మోక్షం Gajendra Moksam

క: శ్రీ మన్నామ! పయోద
శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా
రామా జనకామ! మహో
ద్దామ! గుణస్తోమధామ! దశరధ రామా!
క: ఏ కథల యందుఁ బుణ్య
శ్లోకుఁడు హరి సెప్పఁబడును సూరిజనముచే
నా కథలు పుణ్యకథలని
యాకర్ణింపుదురు పెద్ద లతి హర్షమునన్.
శా: అన్యాలోకన భీకరంబులు జితాశానేకపానీకముల్
వన్యేభంబులు గొన్ని మత్తతనులై ప్రజ్యా విహారాగతో
దన్యత్వంబున భూరి భూధరదరీ ద్వారంబులందుండి సౌ
జన్యక్రీడల నీరుగాలి వడి కాసారావగాహార్థమై. 
క: తలఁగవు కొండలకైనను
మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం
గలఁగవు పిడుగుల కైనను
నిల బల సంపన్నవృత్తి నేనుగు గున్నల్. 
మ: అటఁ గాంచెం గరిణీవిభుండు నవఫుల్లాంభోజకల్హారమున్
నటదిందిం రదివారముం గమఠమీనగ్రాహ దుర్వారమున్
వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీతీరమున్
జటులోద్ధూత మరాళ చక్రబక సంచారంబుఁ గాసారమున్ 
క:తోయజగంధంబు దోఁగిన చల్లని
మెల్లని గాడ్పుల మేను లలరఁ
గమల నాళాహార విమలవాక్కల హంస
రవములు సెవుల పండువులు సేయు
ఫుల్లదిందీవరాంభోరుహా మోదంబు
ఘ్రాణరంధ్రంబుల గారవింప
నిర్మల కల్లోల నిర్గతాసారంబు
వదన గహ్వరముల వాడు దేర్పఁ
తే. ద్రిజగ దభినవ సౌభాగ్య దీప్తమైన
విభవ మీక్షణములకును విందు సేయ
నరిగి పంచేంద్రియ వ్యవహారములను
మఱచి మత్తేభయూథంబు మడుఁగు జొచ్చె. 
క: తొండంబుల బూరించుచు
గండంబులఁ జల్లుకొనుచు గళగళ రవముల్
మెండుకొన వలుఁదకడుపులు
నిండఁ న్వేదండకోటి నీరుం ద్రావెన్ 
మ: ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం
డభమార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పైఁ జిమ్మునా
రభటి న్నీరములోన బెల్లెగసి న క్రగ్రాహ పాఠీనముల్
నభమం దాడెడు మీనకర్కటములం బట్టెన్ సురల్ మ్రాన్పడన్. 
సీ: భుగభుగాయిత భూరి బుద్దుదచ్ఛటలతోఁ
గదలుచు దివికి భంగంబు లెగయ; 
భువన భయంకర ఫూత్కార రవమున
ఘోరనక్రగ్రాహ కోటి బెగడ;
వాలవిక్షేపఁ దుర్వార జంఝానిల
వశమున ఘుమఘుమా వర్త మడరఁ 
గల్లోలజాల సంఘట్టనంబులఁ దటీ
తరులమూలంబులై ధరణిఁ గూల
తే. సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసిపట్టె. 
క: వడిఁ దప్పించి కరీంద్రుఁడు
నిడుదకరం బెత్తి వ్రేయ నీరాటంబుం
బొడ వడఁగినట్లు జలములఁ
బడి కడువడిఁ బట్టెఁ పూర్వపదయుగళంబున్. 10 
క: జవమును జలమును బలమును
వివిధములుగఁ బోరుకరటి వీరతకు భువిన్
దివి మకరమీన కర్కట
నివహము లొక్కటన మిత్ర నిలయముఁ బొందెన్. 
శా: ఆటోపంబునఁ జిమ్ము ఱొమ్మగల వజ్రాభీల దంతంబులం
దాటించున్ మెడఁజుట్టిపట్టిహరి దోర్దండాభ శుండాహతిన్
నీటన్ మాటిమాటికిం దిగువఁగా నీరాటమున్ నీటి పో
రాటం దోటమిపాటుఁ జూపుట కరణ్యాటంబు వాచాటమై. 
ఆ: మకరితోడఁ బోరు మాతంగ విభుని నొ
క్కరుని డించి పోవఁ గాళ్లు రాక
కోరి చూచుచుండెఁ గుంజరీయూథంబు
మగలు తగులు గారె మగువలకును. 
క: జీవనంబు దనకు జీవంబై యుంట
నలవుఁ జలము నంత కంత కెక్కి
మకర మొప్పె డస్సె మత్తేభమల్లంబు
బహుళపక్ష శీత భాను పగిది. 
మ: ఉఱుకుం గుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచుఁ; బాదంబులన్,
నెఱయం గంఠము వెన్నుదన్ను నెగయున్ వాలము హేలాగతిన్,
జఱుచున్ న్నుగ్గుగ దాఁకు; ముంచు మునుఁ గున్ శల్యంబులుం దంతముల్
విఱుగన్ వ్రేయుచుఁ బొంచి పొంచి కదియున్ వేదండయూథోత్తమున్. 
మ: పొడగానం బడకుండ డాఁగు వెలికిం బోవంగఁ దా నడ్డ మై,
పొడచూపుం జరణంబులం బెనఁగొనుం బోరాక రా రాక బె,
గ్గడిలం గూలఁగఁ దాచు లేఁచుతఱి నుద్ఘాటించు లంఘించు బ,
ల్విడిఁ జీరుం దలఁగున్ మలంగు నొడియ వేధించుఁ గ్రోధించుచున్. 
శా: పాదద్వంద్వము నేలమోపి పవనుం బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని
ష్ఖేద బ్రహ్మపదావలంబనగతిన్ గ్రీడించు యోగీంద్రు మ
ర్యాదన్‌నక్రమువిక్రమించెఁ గరిపాదాక్రాంతనిర్వక్రమై. 
క: వనగజంబుఁ నెగుచు వనచారిఁ బొడగని
వనగజంబ కాన వజ్రిగజము
వెల్ల నై సురేంద్రు వేసి సుధాందులఁ
బట్టఁ బట్టనీక బయలు ప్రాఁకె. 
మ: పృథుశక్తిన్ గజమాజలగ్రహముతోఁ బెక్కేండ్లుపోరాడి సం
శిథిలంబై తనలావు వైరిబలముం జింతించి మిథ్యామనో
రథ మింకేటికి? దీని గెల్వ సరి పో రం జాలరా దంచు న
వ్యథమైయిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్.
శా: ఏరూపంబున దీని గెల్తు? నిటు మీఁ దేవేల్పుఁ జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారి ప్రచారోత్తము?
వ్వారింపం దగువార లెవ్వ? రఖిల వ్యాపార పారాయణుల్
లేరే! మ్రొక్కెద దిక్కుమాలిన మొఱా లింపం బ్రపుణ్యాత్మకుల్. 20 
శా: నానానేకపయూథముల్ వనములోనం బెద్దకాలంబు స
న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ
ద్దానాంభఁ పరిపుష్ట చందనలతాం తచ్ఛాయలం దుండ లే
కీనీరాశ కిటేల వచ్చితి, భయం బెట్లోకదే యీశ్వరా. 
ఉ: ఎవ్వనిచే జనించు జగ; మెవ్వనిలోపల నుండు లీనమై;
యెవ్వని యందుడిందుఁ; బర మేశ్వరుఁ డెవ్వడు; మూల కారణం
బెవ్వఁడ నాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్. 
క: ఒకపరి జగములు వెలి నిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
సకలార్ధ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.
క: లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం
జీఁకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్. 
క: నర్తకుని భంగి బెక్కగు
మూర్తులతో నెవ్వఁడాడు? మునులు దివిజులుం
గీర్తింప నేర రెవ్వని
వర్తన మొరు లెఱుఁగ రట్టి వాని నుతింతున్. 
క: కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను
గలఁడు కలం డనెడువాఁడు గలఁడో లేఁడో. 
సీ: కలుగఁడే నాపాలి కలిమి సందేహింపఁ
గలిమిలేములు లేక కలుగువాఁడు; 
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ
బడిన సాధుల కడ్డ పడెడువాఁడు 
చూడఁడే నా పాటుఁ జూపులఁజూడక
చూచువారలఁ గృపఁ జూచువాఁడు; 
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱుఁగువాఁడు; 
తే. అఖిలరూపులుఁ దనరూప మైనవాఁడు
నాదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె చూడఁడె తలఁపఁడె వేఁగరాఁడె. 
శా: లావొక్కింతయులేదు; ధైర్యము విలో; లంబయ్యె బ్రాణంబులున్;
ఠావుల్దప్పెను; మూర్ఛవచ్చెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర; కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా! 
క: విను దఁట జీవుల మాటలు
చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో
యను దఁట పిలిచిన సర్వముఁ
గను దఁట సందేహ మయ్యెఁ గరుణావార్థీ. 
ఉ: ఓ కమలాప్త! యోవరద! యో ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విమలప్రభావ! రా
వే కరుణింపవే తలఁపవే శరణార్థిని నన్నుఁ గావవే! 30 
మ: అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా,
పల మందారవనాంతరామృతసరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంకరమావినోదియగు నా పన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁ గుయ్యాలించి సంరంభియై. 
మ: సిరికిం జెప్పఁడు; శంఖచక్రయుగముం జేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణి కాం
తర ధమ్మిల్లముఁ జక్కనొత్తఁడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజ ప్రాణవనోత్సాహియై. 
తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్, దాని వె
న్కను బక్షిమంద్రుఁడు, వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్. 
క: అడిగెద నని కడు వడిఁజను
నడిగినఁ దను మగుడ నుడుగఁడని నడ యుడుగున్
వెడవెడచిడిముడి తడఁబడ
నడు గిడు; నడు గిడదు జడిమ, నడు గిడనెడలన్ 
క: చనుదెంచెన్ ఘనుఁడల్లవాఁడె; హరిపజ్జంగంటిరేలక్ష్మీ? శం
ఖనినాదం బదె; చక్రమల్లదె; భుజంగధ్వంసియున్వాఁడె క్ర
న్నన నేతెంచె నటంచువేల్పులు నమో నారాయణాయేతి ని
స్స్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవ స్థావక్రి కిం జక్రికిన్. 
క: కరుణాసింధుఁడు శౌరివారిచరమున్ ఖండింపఁగా బంపె స
త్వరితాకంపితభూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబర శుక్రముంబహువిధ బ్రహ్మాండభాండచ్ఛటాం
తరనిర్వక్రము బాలితాఖిలసుధాంధశ్చక్రము జక్రమున్. 
క: అంభోజాకరమధ్య నూతన నలిన్యాలింగన క్రీడనా
రంభుం డైన వెలుంగు ఱేని చెలువారన్ వచ్చినీటన్ గుభుల్
గుంభధ్వానముతోఁ గొలంకును గలంకం బొందఁగాఁజొచ్ఛి దు
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై. 
క: భీమంబై తలఁద్రుంచి ప్రాణములఁ బా పెంజక్ర మాశుక్రియన్
హేమాక్ష్మాధర దేహమున్ జకిత వన్యేభేంద్ర సందోహమున్
గామక్రోధనగేహమున్ గరటి రక్తస్రావగా హంబు ని
స్సీమోత్సాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్ 
క: మకర మొకటి రవిఁ జొచ్చెను
మకరము మఱియొకటి ధనదు మాటున దాఁగెన్;
మకరాలయమునఁ దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్. 
క: తమముం బాసిన రోహిణీ విభుక్రియన్ దర్పించి సంసారదుః
ఖము వీడొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పా
దము లల్లార్చి కరేణుకావిభుఁడు సౌందర్యంబుతో నొప్పె సం
భ్రమదాశాకరిణీ కరోర్జిత సుధాం భస్య్నాన విశ్రాంతుఁడై. 40 

Popular Posts

Popular Posts

Ads