కేదార్‌నాథ్ గుడి పవిత్రమైన శైవ క్షేత్రం. గర్హ్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలో ప్రతిష్టితమయిన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు. గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్‌నాథ్గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్‌నాధ్ లను చార్ ఉత్తరాఖండ్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు.
ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్దానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం నేపాల్ లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.
ప్రత్యేకత
కేదార్‌నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. హిమాలయాల్లోని చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఈక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటి.
ప్రయాణ సౌకర్యాలు
రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు మార్గంలో దాదాపు 16గంటల ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ప్రయాణం సాగుతుంది. కేదార్ నాథ్ కు రావాలంటే హరిద్వార్ నుంచే ట్రావెల్స్ మాట్లాడుకుంటే మంచిది. రెండు పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ లకు రూ.1500 నుంచి 2000 మధ్య ఛార్జ్ చేస్తారు. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్ కు రావాల్సిందే. ఉదయం 8గంటలకు రిషికేశ్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండ్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు దొరుకుతుంది. ఆలస్యమయితే మళ్లీ మరుసటి రోజు తెల్లవారుజామునే బయల్దేరాలి. రిషికేశ్ నుంచి శ్రీనగర్, రుద్రప్రయాగ మీదుగా అగస్తముని, గుప్త్ కాశీ, ఫాటా ద్వారా గౌరీ కుండ్ చేరుకుంటారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల కొద్దీ వేచిచూడాల్సి రావొచ్చు. అన్నింటికీ సిద్ధమై ముందుకు కదలాలి. సాయంత్రం 7తర్వాత ఈ రూటులో ప్రయాణం చేయడం అతి కష్టం. ఈ రూటులో ఉండే ఏటీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్ముకోకూడదు. కొండ ప్రాంతాలు కాబట్టి ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు. ముందుగానే నగదు చేతిలో ఉంచుకుంటే మంచిది. ఇక్కడి ప్రజలు చాలా నిజాయితీపరులు. దొంగతనం అన్న విషయమే ప్రస్తావనకు రాదు. డబ్బైనా, వస్తువులైనా ఇబ్బంది లేదు. గౌరీకుండ్ నుండి కాలిబాటలో 14 కిలోమీటర్ల దూరంలో కేదార్‌నాధుని గుడి ప్రతిష్టితమై ఉంది. గౌరీకుండ్ ఒక చిన్న ప్రాంతం. 20 నుంచి 30 ఇళ్లున్న ఈ ప్రాంతం కేదరీనాథ్ వెళ్లేందుకు బేస్ పాయింట్. 100కు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పిపంపిస్తారు. అంత సమయం వరకు బయటనుంచి వాహనాలను అనుమతించరు. గౌరీకుండ్ లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ ఉంటుంది. ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.1100 తీసుకుంటారు. ముందుగానే డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది. మామూలు వ్యక్తులెవ్వరికీ గుర్రం ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇక డోలీ ద్వారా వెళ్లాలంటే దాదాపు రూ.5500 ఖర్చవుతుంది. నలుగురు మనుష్యులు కలిసి మోసుకెళ్తారు. వీళ్లంతా నేపాలీలు. బహుమర్యాదగా ఉంటారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం సాగుతుంది. కాలిబాటన వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే 40 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఏ మాత్రం ప్రయత్నించకపోవడం మంచిది. కాలినడకన వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది. అయితే బాగా అలిసిపోతారు. ఓ వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రధాన అవరోదం వాతావరణం. గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది, చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన 5డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు.
ఆలయ మార్గం
కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళాలి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు. ఈ ఆలయానికి యాత్రికులను గుర్రాలలోను, డోలీలలోను మరియు బుట్టలలోనూ చేరుస్తుంటారు. బుట్టలలో యాత్రికులను ఒక మనిషిని ఒక మనిషి మాత్రమే మోస్తూ చేరవేయడం విశేషం. డోలీలో ఒక మనిషిని నలుగురు పనివాళ్ళు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు. గుర్రాలలో యాత్రీకులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు. వీరు యాత్రికులను ఆలయానికి కొంతదూరం వరకు తీసుకు వెళతారు. తరువాత ఆలయదర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రికులకు తోడు వస్తారు దర్శనానికి సహకరిస్తారు. తిరిగి వారిని భద్రంగా గౌరికుండ్ లోని వారి బస వరకు తీసుకు వస్తారు. పనివాళ్ళ కోరికపై అనేకమంది యాత్రీకులు మార్గంలో అదనంగా వారి ఆహార పానీయాల ఖర్చును భరిస్తారు. రానూ పోనూ 28 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి చేర్చి వారికి రుసుము చెల్లించాలి. కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్నీ యాత్రీకుల నిర్ణయం మాత్రమే. మార్గంలో హిమపాతం, వర్షం లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడినీటిని అందించడం, ప్రాణ వాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరందిస్తారు. ఈ ప్రయాణానికి వెళ్ళే సమయం 5 నుండి ఆరు గంటలు వచ్చే సమయం 3 నుండి నాలుగు గంటలు ఇదికాక దర్శన సమయం అదనం. వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా అరుదు. వీరిలో అనేకమంది నేపాలీయులే వీరు విశ్వాసపాత్రులు రుసుము మాత్రం యాత్రికులు ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆలయమునకు అనేక శ్రమలను ఓర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరికొంత ఇబ్బందిని కలిగించడం సహజం. యాత్రికులకు గౌరీ కుండ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు వారి బస యజమానులు సరఫరా చేస్తుంటారు. వీటికి అదనపు రుసుము చెల్లించి యాత్రికులు తమ వెంట తీసుకు వెళుతుంటారు. వీటిని వాడని పక్షంలో బస యజమానులు తీసుకొని రుసుములో కోంత తగ్గించి ఇస్తారు. ఆలయ ప్రాంగణం కొంత మంచుతో కప్పబడి ఉంటుంది. పేరుకు పోయిన మంచు అక్కడక్కడా యాత్రికులకు వింత అనుభూతిని ఇస్తుంది. ఆలయ సమీపంలో ప్రవహించే నదిని మందాకినీ నామంతో వ్యవహరిస్తారు. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు కొనసాగుతుంది. ఉత్తరకాశి నుండి హెలికాఫ్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇవి అనేకంగా ముందుగానే యాత్రికులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉత్తరకాశి నుండి ఉదయం 6 నుండి 7 గంటల సమయం నుండి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి.