Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శివరాత్రి మహాత్మ్యం Shivaratri Is The Epicenter

శివరాత్రి మహాత్మ్యం



మన పండుగలన్నీ తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ లెక్కన శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహా శివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాస శివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును మాస శివ రాత్రిగా చెప్తుంటారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. మాఘ బహుళ చతుర్దశి అర్దరాత్రి వరకు వ్యాపించి లేకపోతే అనగా అమావాస్య ముందే ప్రవేశించినట్లు అయితే అంతకుముందు రోజు మహా శివరాత్రి అవుతుంది. ఈ లెక్కన మహా శివ రాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు. మహా శివరాత్రి ఒకవేళ మంగళ వారం రోజున వస్తే దానికున్నవిశేషం చెప్పలేనిదని ధర్మ సింధువు మాట.

శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి.
అవి ఒకటి పగటి పూట ఉపవాసం ఉండటం. రెండు ఆ రోజు రాత్రి జాగరణ చెయ్యడం.
ఇక పూజల సంగతి వేరేగా చెప్ప వలసిన పని లేదు.
శివ నామ స్మరణం ఎంతో ప్రధానం.
శివ రాత్రి రోజున చెయ్యవలసిన వాటిని శ్రీనాధ మహా కవి తన శివరాత్రి మహాత్యం కావ్యంలో ఇలా చెప్పాడు…
ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రాజాపత్య వ్రత ఫలాన్ని ఇస్తుందన్నారు. అలాగే ఆ రాత్రి నాలుగు జాములలో అవధానపరులై శివ అర్చన చెయ్యాలి. ఈ వ్రతం చెయ్యటానికి అన్నికులాల వారూ అర్హులే. ఈ వ్రతం వల్ల మహా పాతకాలన్నీ పోతాయి.
మహా శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలను శివలింగం ఉద్భవ కాలం అని అంటారు.
ఆ సమయంలో రుద్రాభిషేకం , పంచాక్షరి మంత్ర జపం చెయ్యడం మంచిది. శివుడు జ్యోతి స్వరూపుడై లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం.
శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించటానికి ఒక పురాణ కథ ఉంది.
ఒక సారి బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి మాటా మాటా పెరిగి ఎవరు గొప్పో అని తేల్చుకోవాలనుకున్నారు. వీరి వాదన తార స్థాయికి చేరింది. ఇద్దరు సై అంటే సై అనుకున్నారు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి కలిగిన అహంకారాన్ని తొలగించి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే శివుడు మాఘ మాసం చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు.
బ్రహ్మ, విష్ణువు ఆ లింగం ఆద్యాంతాలను తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు. మరోవైపు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఆది, తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని శివుడు వద్దకు వస్తారు. తాము ఓడిపోయామని ఒప్పుకుంటారు.
అప్పుడు శివుడు తన నిజ రూపంతో వీరికి దర్శనమిస్తాడు. అంతే కాకుండా అనుగ్రహించి వారిలోని అహాన్ని పోగొడతాడు. దానితో బ్రహ్మ, విష్ణువు శివుడి ఆధిక్యతను పూజించి కీర్తిస్తారు.
ఆ రోజే మహా శివ రాత్రి అయిందని కూడా అంటారు.
శివ పూజలో ప్రతిమ లింగాకారంలో ఉంటుంది. శివ పూజకు మారేడు దళం, అలంకరణకు తెల్ల పూల మాల ప్రధానం. శివునికి ఆవు నేతితో చేసిన దీపారాధనను కుడివైపున, నువ్వుల నూనె దీపారాధన ఎడమ వైపున పెట్టాలి.
శివ లింగాన్ని నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి చూడాలనే మాట వాడుకలో ఉంది. అదేంటో చూద్దాం.
శివుడు వాహనం నంది. నందీశ్వరుడు ఎప్పుడూ తన స్వామి తన మీదే తిరగాలనే కోరుకుంటాడు. . ఆలయాలలో శివుడుకి నేరుగా నంది ఉంటుంది. ఈ నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలన్నది సంప్రదాయం. అలా చూడటం వల్ల శివుడు సాక్షాత్తు నంది పైన కూర్చున్నట్టు కనిపిస్తాడు భక్తుడి కనులకు. అలాగే నందీశ్వరుడు కూడా తనపై ఎక్కి కూర్చున్న శివుడిని దర్శించినందుకు సంతోష పడి శివుడికి భక్తుడి విషయాన్ని చేరవేసి ఆనందాన్ని కలుగ చేస్తాడని పెద్దల మాట.
మహాభారతంలోని శాంతి పర్వంలో సుస్వరుదు అనే వ్యాధుడు తెలియక చేసిన శివపూజ వల్ల జన్మాంతరాన చిత్ర భానుడనే రాజై పుట్టినట్టు, ఆ చిత్రభానుడు శివరాత్రి వ్రతాన్ని చేసినట్లు భీష్ముడు చెప్తాడు. ఇలా శివరాత్రికి సంబంధించి వివిధ పురాణాలలోని కథలను చదివినా, భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసినా, జాగరణ చేసినా, పూజలు చేసినా ఎంతో మంచిది

మహాశివరాత్రి వ్రత కథ:


ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.
ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.
మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్ధించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.
రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.
మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహరముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.

ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను.
"ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.
అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."
ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు,
వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము .

Popular Posts

Popular Posts

Ads