Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

మాఘ పురాణం - 1 వ భాగం Magha puranam - Part 1

మాఘ పురాణం - 1 వ భాగం

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట 
సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననూ, ఆ యజ్ఞమును పూర్తీ చేయవలయుననెడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి, యజ్న స్థలముగా నైమిశారణ్యములో ప్రవహించు గోమతీ నదీతీరమును ఎన్నుకొని ఒక శుభ ముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలయుననెడి కోరికలతో, భరతఖండము నలుమూలలనుండీ తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసము లేర్పరచుకొనిరి.
అచటికేతెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములామూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయన మొనర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి.
ఆవిధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోను, పరివారముల తోను, తండోపతండములుగా యజ్ఞస్థలానికి జేరుకొనిరి. వేలకొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి యుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు, పుణ్యప్రదమైనదియు, 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుటవలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి. 
దూర ప్రాంతాలనుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి. 
సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగ తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణ ఇతిహాసాది సమస్త విషయములందూ వారికి తెలియనిది లేదు. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప నలవికానిది. అటువంటి పుణ్య పురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతం పలికి, సాష్టాంగ దండ ప్రణామములాచరించి యజ్ఞం జరుగు ఆ పండ్రెండు సంవత్సరములలో యెన్నియో పురాణ గాధలు విని తరించవలెననెడి కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి. 
సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తి పరచుట తన విద్యుక్తధర్మమని యెంచి వారి కోరికను మన్నించినారు.
ఒక శుభ ముహూర్తమున ఆశ్రమ వాసులందరూ సూతుల వారికి అర్ఘ్య పాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను జేసి “మునిశ్రేష్ఠా! మునికులతిలకా! ఇంతకుమున్ను ఎన్నియో పురాణ గాధలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి, అందలి సారమును గ్రహించి యుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతికథలు మాకు వినిపించుచునే యున్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు పదునాలుగు లోకములు సంచారము చేసి యున్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొనియున్నారు. గాన వినదగు విషయాలేమైనా యున్నయెడల విరామ కాలములో మాకు వినిపించవలయు”నని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకొనవలెననెడి కుతూహలం కనపరచినందున వారలను జూచి సూత మహాముని ఇటుల పలికిరి – 
“ముని పుంగవులారా! మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకూ విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకున్నూ, వినుట వలన మీకున్నూ పరమార్థము కల్గు’నని పలికెను.
శౌనకాది మునుల కోరిక
సూతమహామునిని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా “ధన్యులమైతి”మని మునులందరూ అమితానందం నొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకొని సూతమహామునితో –
“ఆర్యా! పద్మపురాణమందు లీనమైయున్న మాఘమాసం యొక్క మహాత్మ్యంను మరల మరల వినవలయుననెడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యం, ఆచరించవలసిన విధానం, మాకు వివరించవలసిందిగా” కోరిరి.
ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుటవలన సూతమహర్షి మిక్కిలి సంతసించి యిట్లు పలికిరి.
“ముని పుంగవులారా! మీరందరూ అతిముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుటవలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయములో మాఘమాసం యొక్క మహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కాన సావధాన మనస్కులై ఆలకింపు”డని సూతమహర్షి ఇట్లు వివరించిరి – 
“నేను ణా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నాతండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణ్వంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్ధ్యములు కలిగిన వాడనయితిని. నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినటులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠమహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను.

మాఘ పురాణం - 2 వ భాగం

దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:
దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.
దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.
దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.
అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.
“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.
దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:
దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.
దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.
మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.


మాఘ పురాణం - 3 వ భాగం

వింధ్య పర్వతము:
దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని, చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు.
మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాలనుండి ఆ ప్రాంతమందుండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు.
హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా వున్నది. అది తెల్లగా కూడా వున్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణు భక్తిభావముతో ప్రార్థించిరి. అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను.
“ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించెను.
మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. “రాజా! నీయభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము.
“ ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్ర్వటం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” అట్లు కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.
గంధర్వ యువకుని వృత్తాంతము:
“భృగుమహర్షీ! నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించిననూ పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె ణా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన ణా యీ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాదను తొలగింపజేయుడు” అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను.
“ఓయీ గాంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడునూ మనుజుని కృంగదీయును. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో గూడ పర్వతం నుండీ ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ యీడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను.
ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి.
అంత వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను. 
ఈవిధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకెరిగించి, “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతం? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన యెడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము.


మాఘ పురాణం - 4 వ భాగం

కుత్సురుని వృత్తాంతము:
పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను.
పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమమునియొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకా దంపతులకు ఒక కుమారుడు జన్మించెను.
కుమారునికి అయిదవ యేడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసముయెట శ్రద్దజూపుట, నీతి నియమాలను పాటించుట, దైవకార్యములయందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములనభ్యసించెను. ఈవిధంగా కొంతకాలం గడచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్తవయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు బోవలయునని కోర్కె కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు, మాఘమాసం వచ్చునప్పటికి కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు.
“నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యం” అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను.
మాఘమాసమంతయు ఇచటనేయుండి అధికఫలమును సంపాదించెదను” అని మనమున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యమూ ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆవిధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోరతపమాచరించవలయుననీ తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసికొన సంకల్పించి తపస్సుజేయ మొదలిడెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ, నిశ్చల మనస్సుతోనూ, తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను.
ఆ విప్రయువకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖ, చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో వున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు.
ఈవిధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను.
ఓ విప్రకుమారా! నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండ అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది. గాన నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టము నెరవేర్చెదను” అని శ్రీమన్నారాయణుడు పలికెను.
శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై – ప్రభూ జగద్రక్షకా! సర్వాంతర్యామీ! ఆపద్బాంధవా! నారాయణా! ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏవిధమైన సుఖాలు కోరుటకు నా మనస్సంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిపుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకింకేమియు అవసరము లేదు. కానీ మీ దివ్యదర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శ మిచ్చుచుండవలెను. అదియే నాకోరిక” అని ప్రార్థించెను. శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చెద గాక! అని పలికి నాటినుండీ అచటనే ఉండిపోయెను.
కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై వున్నా తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలడిగిరి.


మాఘ పురాణం - 5 వ భాగం

మృగ శృంగుని చరిత్ర 
ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక ‘కౌత్సు’డని పిలవబడుచున్ననూ ఆతనిని “మృగశృంగు”డను పేరుతొ పిల్చుచుండిరి. అదెటులనగా అతడు కావేరీ నదీతీరమున ఘోర తపస్సు చేసియున్నాడు గదా! అప్పుడాతను శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు, జంతువులు, తమయొక్క శృంగములచే నతనిని గీకెడివి. అందుచేత అతనికి ‘మృగశృంగు’డను పేరు సార్ధకమయ్యెను. 
వివాహమాడు కన్య గుణములు 
మృగశృంగునాకు యుక్తవయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగ శృంగుడు వారిమాట లాలకించి ఇట్లు పలికెను. “పూజ్యులగు తల్లిదండ్రులారా! నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. ఐననూ నా అభిప్రాయము గూడ ఆలకింపుడు. అన్ని ఆశ్రమాలకంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణ మేమనగా ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికీ ఉదాహరణగా స్త్రీయెటులుండవలయుననగా –
శ్లో: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా
శయనేషు రంభా రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ!
ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లి వలెను, రూమున లక్ష్మి వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరువిధముల వ్యవహరింప వలెను.
అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవసరం. ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏవిధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును. ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు కన్యయోక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమయినది. కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు.
గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక, అట్టి మనుజుడు ధర్మ-అర్థ-కామ-మోక్షములను అవలీలగా సాధించగలడు.
భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగాగ్రస్తురాలై ఉండకూడదు. యెంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవా బ్రాహ్మణులను పూజించునదియై, అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను. 
ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును. అయినా అదెటుళ సాధ్యపడును? అని మృగ శృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో నున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను. “కుమారా! నీమాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైననూ మంచి నీతులు నేర్చుకొన్నావు. నీయభీష్టం నెరవేరవలయునన్న ణా దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము” అని పలికెను.


మాఘ పురాణం - 6 వ భాగం

సుశీల చరిత్ర 
భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరిణె వంటి ఒక కుమార్తె గలడు. ఆ కన్యపేరు సుశీల. మంచి శీలం గలది. మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండియూ దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచూ, యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై యుండెను.
ఆమె గుణములు తెలుసుకొని ఆమెవద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగ శృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు. 
ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన అ అముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కూ గానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలది పరుగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలోపడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయి వున్నారు.
ఆ వార్త మృగ శృంగునకు తెలియుటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములనూ చూశాడు. ఎక్కడలేని దుఃఖమూ కలిగింది. వారినెటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్మువరకు దిగి ధ్యానం చేయసాగెను. 
అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగ శృంగుని వద్దకు వచ్చినది. ఐననూ మృగ శృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే వున్నాడు.
ఏనుగు కూడా మృగ శృంగుని కెదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై కెక్కించుకొన్నది. ఐననూ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాపవిమోచనం కలిగించిన ఆ మృగ శృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను.
వింటివా దిలీప మహారాజా! మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాపవిమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో! మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు.


మాఘ పురాణం - 7 వ భాగం

మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట 
ఆవిధంగా ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన అ అముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును గురించి తపస్సు చేయ నారంభించినాడు.
నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేనెంతయు సంతసించితిని. ణా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ యభీష్టం నెరవేర్చెదను” అని యముడు పలికెను.
ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి “మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని జేయుడు” అని ప్రార్థించెను.
మృగశృంగుని పరోపకార బుద్ధికీ, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనేంచి “మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్నాకర్షించింది. నీకు జయమగుగాక” అని యముడు దీవించగా –
మహాపురుషా! మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము సోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా –
“అటులనే నీ కోరిక సఫలమగుగాక” యని యమధర్మరాజు దీవించి యద్రుశ్యుడయ్యెను.


మాఘ పురాణం - 8 వ భాగం

యమలోక విశేషములు 
మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కాంచినటుల లేచి, వారు యమలోకమందు చూచిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి.
యమలోక మందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపినీ ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది.
అపుడా కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖముల ననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు యిత్యాది పుణ్యకార్యములు చేయుటవలన నంతకుముందు చేసియున్న పాపములన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్దమయినది. 
మాఘమాసమందు నదీస్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట కంతకంటే సులభమార్గము మరియొకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.


మాఘ పురాణం - 9 వ భాగం

పుష్కరుని వృత్తాంతము 
ఈవిధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవుతులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటుల నుడివెను. –
“పూజ్యులైన ఓ మహర్షీ! ఈ భూలోకమునకు, యమలోకమునకు దూరమెంత?” చనిపోయిన ణా ముగ్గురు కన్యల ప్రాణములెంత కాలములో వెళ్ళి వచ్చినవి?” అని ప్రశ్నించెను.
వశిష్ఠుళ వారు దీర్ఘముగా నాలోచించి యిటుల బదులు చెప్పిరి. “మాహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి యున్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు.
దీనికొక ఉదాహరణ వివరింతును ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది.
పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండ చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు, భజించుచు జీవితమును గడుపుచున్న పరమభక్తుడు. 
ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొని రండని తన భటుల కాజ్ఞాపించినాడు. యమభటులు వెంటనే పోయి యా విప్రపుంగవుని ప్రాణములు దీసి యమునివద్ద నిలబెట్టినారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనా నిమగ్నుడై ఉండెను. భటులు తోడ్కొని వచ్చిన పుష్కరునివైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. యమ ధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను.
యముడు భటుల వంక కోపంగా చూచి – “ఓరీ భటులారా! పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే మరియొకడు గలడు. వానిని తీసుకురాకుండా యీ ఉత్తముని ఏల తీసుకు వచ్చితిరి?” అని గర్జించుసరికి గడగడ వణికిపోయిరి. 
యమధర్మరాజు పుష్కరుని వైపు జూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు” అని చెప్పెను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచి పోవుదును” అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను.
పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరుల పాడుచున్న నరక బాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షల ననుభవించుచుండుట పుష్కరుడు కనులారాగాంచెను. 
అతనికి అమితమగు భయము కలిగెను. తన భయం బోవుటకు హరినామ స్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమతమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపు చేయడమైనది. యమలోకమంతయు చూచిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుని స్మరించుచుండెను.
ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగివచ్చిన వారున్నారు. ఇది నిజము.
మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు.
అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్యగరపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను.



మాఘ పురాణం - 10 వ భాగం click here


మాఘ పురాణం - 1 వ భాగం Magha puranam - Part 1 click here

మాఘ పురాణం - 2 వ భాగం Magha puranam - Part 2 click here

మాఘ పురాణం - 3 వ భాగం Magha puranam - Part 3 click here


Popular Posts

Popular Posts