శ్రీరామ రామ రామే
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం,
రామ నామ వరాననే.
రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం,
రామ నామ వరాననే.
(ఈ శ్లోకం మూడు సార్లు పఠించితే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం)
శ్రీరామ రామ రామ అని మూడుసార్లు రామ నామాన్ని జపిస్తే విష్ణు సహస్ర నామాన్ని జపించినంత పుణ్యఫలం లభిస్తుందని సాక్షాత్తు మహాశివుడు పార్వతిమాతతో చెప్పాడు. రామనామ విశిష్టత అమోఘమైనది. అద్వితీయమైనది. ఇహలోకాన్నుండే బాధలను తొలగించి, పర లోకాన ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించేది. ఈ నామాన్ని సదా స్మరణం చేసే వారి ఇంట్లో లేమి ఉండదని, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి. కబీర్‌దాస్, తులసీదాస్, భక్తరామదాసు లాంటి మహా భక్తులెందరో రామనామమే పరమావధిగా భావించి, పునీతులయ్యారు. రామనామ విశిష్టత అనన్య సామాన్యమైనది.‘రామ’నామ మందు మంత్రాత్మకమైన నిగూఢార్ధం ఇమిడి ఉంది. ఇందులో ‘ర’కారము రుద్రుని, ‘అ’కారము బ్రహ్మను, ‘మ’కారము విష్ణువుని సూచిస్తుంది. కనుకనే ‘రామ’శబ్దం బ్రహ్మవిష్ణు, శివాత్మక రూపంగా భావించడం జరుగుతోంది. అలాగే ‘రామ’అనే శబ్దం జీవిత్మ పరమాత్మలకు స్వరూపంగా కూడా చెప్పడం జరుగుతోంది. ఇందులో ‘రా’అనే అక్షరాన్ని ‘తత్’అని అనగా ‘పరబ్రహ్మము’ అని ‘మ’ అనే అక్షరానికి ‘త్వం’ అనగా జీవాత్మ అని అర్థం చెబుతారు. అలాగే అష్టాక్షరి మహామంత్రమయిన ఓం నమో నారాయణాయ నమఃలో ‘రా’ బీజాక్షరం, పంచాక్షరి మహామంత్రమయిన ఓం నమఃశివాయలో ‘మ’ బీజాక్షరం ఇందులో ఇమిడి ఉన్నాయి. అందువల్లే ఇది రెండు మంత్రాల శక్తిని, మహత్తును కల్గి ఉందని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత శక్తిదాయకమైన రామ మంత్ర జపంవల్ల ముక్తిమోక్షాలు లభిస్తాయి. కనుకనే హరిహరాత్మకమైన ఈ ‘రామ’నామ మంత్ర రాజాన్ని తారక మంత్రంగా చెప్పడం జరుగుతోంది.
భవబంధాల నుంచి తరింపచేయడంవల్లనే ‘రామ’మంత్రాన్ని తారక మంత్రమని పిల్వడం జరుగుతోంది. అంతేకాకుండా ‘రామ’ నామ శబ్దం ప్రాణాయామ శక్తిగా కూడా చెబుతారు. స్వభావ సిద్ధంగా పూరకమైన శ్వాసను ‘మ’కారంతో కుంభించి, ‘రా’కార ఉచ్ఛారణతో రేచకం చేయడం వల్ల ప్రాణాయామం సంపూర్ణంగా జరుగుతుంది. ఆ కారణంగా ‘రామ’ నామ శబ్ద ఉచ్ఛరణంవల్ల ఒక పక్క రామనామ సంకీర్తనా ఫలం, మరో పక్క ప్రాణాయామం జరిగి, ఆరోగ్యం చేకూరుతుందని శాస్తక్రోవిదులు చెబుతున్నారు. ఆ కారణంగా రామ నామాన్ని ఏకాగ్రతతో ఐదు నిముషాలు ఉచ్ఛరిస్తే, మనస్సు నిర్మలమై, ఏకాగ్రత సిద్ధిస్తుందని, సత్‌కార్యాలకు పునాది పడుతుందని చెబుతారు. త్రిమూర్త్యాత్మక రూపమైన ‘రామ’నామాన్ని నిత్యం పఠించి ఆంజనేయుడంతటి పరమభక్తుడు దైవమయ్యాడు. రామనామ స్మరణే పరమావధిగా భావించిన ఆ స్వామి జగద్విఖ్యాతినొందాడు. రామనామమే తన ఉచ్ఛ్వాస నిచ్చ్వాసలుగా భావించిన కబీరు, భక్తరామదాసులాంటి మహాభక్తులు స్వామి కృపకు పాత్రులై, జగద్విఖ్యాతి నొందారు. రామ నామంలోని విశిష్టతను, మహత్తును తెలిసిన పరమేశ్వరుడు, ఆ మంత్రాన్ని జపించమని సాక్షాత్తు పార్వతి మాతకు చెప్పాడు. శ్రీహరి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మికి రామనామ శబ్దానికున్న మహత్తును వివరించాడు. రామ నామం విశేషమైనది. గొప్ప మహత్తు కలది. భవ బంధాలనుంచి దూరం చేసి, ముక్తిని మోక్షాన్నిచ్చేది. ఆ కారణంగానే ఇది పరమోత్కృష్ట మంత్ర రాజంగా పూజింపబడుతోంది. రామనామ స్మరణంవల్ల బ్రహ్మవిష్ణు, శివులను పూజించిన ఫలం దక్కుతుంది. దీనివల్ల విష్ణుసహస్ర నామాన్ని, శివ పంచాక్షరిని పూజించిన ఫలం దక్కుతుంది. ‘రామ’శబ్దంలోని రెండు అక్షరాలు మనో నిగ్రతను పెంచి, ఏకాగ్రతను వృద్ధిచేసి ఆధ్యాత్మిక ద్వారాలను తెరుస్తాయి.
దుష్కర్మలన్నీ పటాపంచలై, మనోనిబ్బరం ఏర్పడుతుంది. ఫలితంగా మానసికానందం సొంతమవుతుంది. శివకేశవులకు భేదం లేదని తెలిపే ఈ నామ స్మరణంవల్ల సర్వసౌభాగ్యాలు సిద్ధిస్తాయి. సర్వమనోకామనలు సిద్ధించి, భవిష్యత్తు నందన వనమవుతుంది. ఆధ్యాత్మిక చింతనాసక్తి ఉన్న భక్తులంతా ఈ నామాన్ని జపించడంవల్ల ఆధ్యాత్మికాసక్తి పెరిగి, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది.