శ్రీమద్భాగవతం - 71 వ భాగం

శుకమహర్షి చెప్పిన లీలలలను విని పరీక్షిత్తు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ‘ప్రపంచములో ఇంతటి గొప్ప అదృష్టమును పొందిన యశోదా నందుల వంటి భార్యాభర్తలు ఎవరయినా ఉన్నారా? ఆ నంద యశోదలది ఏమి అదృష్టము! వారిద్దరూ ఏమి పూజ చేశారు? వారు ఏ పూజ చేస్తే కృష్ణుడు వారికి యిలా కొడుకయి పుట్టాడు? ఈ విషయమును చెప్పవలసినది’ అని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు.
అపుడు శుకబ్రహ్మ ‘వారేమీ తపస్సు చేయలేదు. కృష్ణ పరమాత్మ భూమిమీద అవతరించే ముందు దేవతలను తమ అంశలతో భూమిమీద ఆవిర్భవించమన్నాడు. బ్రహ్మగారి దగ్గర ఉండే వసువులలో ప్రముఖుడయిన వాడు ద్రోణుడు, ద్రోణుడి భార్య ధరం. బ్రహ్మగారు వీరిద్దరినీ పిలిచి ‘శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా భూమిపై ఆవిర్భవిస్తున్నాడు. మీరిద్దరూ కూడా వెళ్ళి భూమిమీద అవతరించండి’ అన్నారు. అపుడు వారు ‘మేము అవతరిస్తాము.గొల్లవానిగా, గొల్లవాని భార్యగా మేము జన్మిస్తాము. కానీ దయచేసి మాకొక వరమును యీయవలసినది. భూమిమీద అవతరించిన కృష్ణ పరమాత్మని మా కొడుకు అనే భావనతో కొడుకుగా లాలించి పెంచి పోషించేలా మాకు వరమునీయవలసినది’ అని కోరారు. దాని ప్రకారం వారు భూమిపై యశోదానందులుగా జన్మించి, కృష్ణ పరమాత్మకు తల్లిదండ్రులుగా ప్రవర్తించారు.
ఉలూఖల బంధనము :
ఉలూఖల బంధనం ఒక అద్భుతమయిన శ్రీకృష్ణ లీల. భాగవతం మొత్తం మీద తలమానికమయిన లీల యిదే. చాలామంది ఈ లీలను చెప్పమని అడిగి, తమ యిండ్లలో చెప్పించుకుని విని పొంగిపోతూ ఉంటారు. ఒకనాడు యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుకుతున్నది. భగవానుడు జన్మించిన తరువాత నందవ్రజంలోని వారందరూ అధిక ఐశ్వర్యవంతులయారు. గొల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమయిన వస్త్రములు ధరించి భగవన్నామము చెపుతూ చల్ల చిలికేవారు. యశోద పెరుగు చిలుకుతూ ఒకపక్క నోటివెంట భగవన్నామం పలుకుతోంది. భగవత్కథలు పలుకుతోంది. మనస్సులో కృష్ణయ్యను తలుచుకుంటోంది. ఆ సమయమునకు అక్కడికి బాలకృష్ణుడు వచ్చి అమ్మా నాకు బాగా ఆకలి వేస్తోంది. నాకు తొందరగా పాలు ఇవ్వు’ అన్నాడు. ఆమె పిల్లవాడు ఏమి చేస్తాడో చూద్దామని పెరుగు చిలకడం ఆపకుండా ఇంకా చిలుకుతూనే ఉంది. అపుడు కృష్ణుడు ‘నువ్వు పాలు చిలకడం ఆపి నాకు పాలు యిస్తావా ఇవ్వవా? అని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరిగితే పిల్లవాని చెయ్యి నొప్పి పెడుతుందేమోనని తల్లి అనుకుని చల్ల చేయడం ఆపేసింది. కొడుకుని ఒడిలో పడుకోబెట్టుకుని స్తన్యం యిస్తోంది. పాలు తాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావడం ఆవిడ చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయేమోనని పక్కన ఒక పీటవేసి దానిమీద పిల్లవాడిని కూర్చోపెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. పొయ్యి మీదవున్న పాలకుండను జాగ్రత్తగా దింపి చుట్ట కుదురు మీద పెట్టింది. ఈవిధంగా పాలు తాగుతున్న వాడిని పక్కన పెట్టేసి మరుగుతున్న పాలకుండను దింపడానికి వెళ్ళిపోయింది.
తల్లి తనను ఎందుకు దింపివేసినది అని చూశాడు. అంతే కృష్ణుడికి కోపం వచ్చేసింది. అపుడు అక్కడ వున్న ఒక రాయితీసి కుండకి వేసి కొట్టాడు. కుండ పగిలిపోయింది. అందులోంచి వెన్నముద్దలు తేలి, పైకి వస్తున్న పెరుగు ఒలికిపోయి పల్లంవైపు ప్రవహిస్తోంది. దీనిని తల్లి చూస్తే కోప పడుతుందని క్రిందపడిన వెన్నను నోట్లో పెట్టుకుని, గబగబా మింగేస్తూ తనకి పాలివ్వలేదని మధ్యమధ్యలో దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. అమ్మ ఇంకా తనని చూడలేదు. ఆవిడ పాలకుండను పొయ్యిమీద నుంచి దించే ప్రయత్నంలో ఉండిపోయింది. ఆవిడ వచ్చి చూస్తే కోప పడుతుందని రెండుచేతులతో రెండు వెన్నముద్దలను పట్టుకుని గబగబా యింట్లోంచి బయటకు వచ్చి పక్క యింట్లోకి వెళ్ళిపోయాడు. ఆ యింట్లో దంచడానికి పనికిరాని కొయ్యరోలు ఒకటి ఉంది. ఆరోలును తిరగేసి దానిమీద ఎక్కి నిలబడ్డాడు. అమ్మ వస్తుందేమోనని తిరిగి చూస్తూ ఆకలివేస్తోంది అని మధ్య మధ్యలో దొంగ ఏడుపు రాగాలు తీస్తున్నాడు. అలా చేస్తూ అక్కడ చెట్ల మీద వున్నా కోతులను పిలిచాడు. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడ ఎక్కి కూర్చున్నాయి. వాటన్నిటికి ఆ యింట్లోని వెన్న తెచ్చి పెడుతున్నాడు. అవి చక్కగా ఆ వెన్నను తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు.
ఆవిడ పాలకుండను దింపి వెనక్కి తిరిగివచ్చి కృష్ణుడి కోసం చూసింది. ఇంకెక్కడి కృష్ణుడు! కుండ పగిలిపోయింది. ప్రవహిస్తున్న మజ్జిగ, వెన్న వీటినన్నిటిని చూసింది. ‘గోపికలు చెప్పింది యథార్థమే. వీడు చాలా అల్లరి చేస్తున్నాడన్నమాట’ అని అనుకుంది. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఒక రాతిని తిరగేసి దానిమీద కూర్చుని కోతులకు వెన్న పెట్టేస్తున్న కృష్ణుని చూసింది. అపుడు ఆవిడ వీడి అల్లరి ఎక్కువయి పోయింది. ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వేడిని యివాళ కట్టి కొట్టెస్తాను’ అనుకుంది. గోపకాంతలు అందరూ యశోద ఏమి చేస్తుందా అని పరిశీలిస్తున్నారు. అపుడు యశోద ‘ఈవేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తాను’ అంది. అనగానే కోతులకు పెడుతున్న వెన్న వదిలేసి ఆరోలు మీదనుంచి దూకేశాడు. కృష్ణుడిని పట్టుకుందామని ఆవిడ వెతుకుతూ దగ్గరకు వెళ్ళింది. ఈయన పరుగెత్తుకుంటూ వెళ్ళి స్తంభం చాటున నక్కేవాడు. అమ్మా నేనింక ఎప్పుడూ దొంగతనం చేయను, ఎవరింటికీ వెళ్ళాను, వెన్న తిననే తినను, నన్ను కొట్టకు’ అని కళ్ళు నులిమేసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అరిచెయ్యి అంటా కాటుక అయిపొయింది. బుగ్గలన్నీ కాటుక అయిపొయింది. ఈ లీల జరుగుతుంటే 33కోట్లమంది దేవతలు, పార్వతీ సహితుడై ఈశ్వరుడు, బ్రహ్మగారు ముక్కున వేలు పెట్టుకుని చూశారు. ఆయన ఆ రోజున అంత భయమును నటించాడు.
అమ్మ ఎటునించి వస్తుందోనని క్రీగంట చూస్తూ పరుగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి దొరికిపోయాడు. కొడదామనుకుని చేయి ఎత్తింది. కానీ కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్న చిన్ని కృష్ణుని ముఖం చూసేసరికి కొట్టలేక ‘నిన్ను కట్టేస్తాను’ అని మాత్రమె అనగలిగింది. యశోద ఎంత అదృష్టవంతురాలో. ఎవరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు. అపుడు ఆమె కృష్ణుడిని కట్టెయ్యడం కోసమని తాడుకోసం వెడుతోంది. అక్కడ కవ్వమునకు అంతకు ముందు పెట్టి తిప్పిన తాళ్ళు ఉన్నాయి. వాటిని తీసి బొజ్జ చుట్టూ తిప్పుతోంది. తిప్పితే రెండు అంగుళములు తక్కువ వస్తోంది. ఎన్ని తాడులు ముడివేసి కడదామనుకున్నా ఎప్పుడూ రెండు అంగుళములు తక్కువ వస్తోంది.
చిక్కడు సిరి కౌగిటిలో, జిక్కడు సనకాది యోగి చిట్టాబ్జములం
జిక్కడు శృతిలతికావలి, జిక్కె నాతడు లీల దల్లి చేతన్ రోలన్!!
ఆయన లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందామనుకుంటే ఆమె కౌగిలికి దొరకని వాడు, సనక సనందనాది మహర్షుల మనస్సులకు చిక్కనివాడు, వేదమంత్రములకు దొరకని వాడు, ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడినాడు.చివరికి యశోదాదేవి కృష్ణుడిని త్రాటితో రోటికి కట్టేసి నీతులు చెప్పడం ప్రారంభించింది. అపుడు నిజంగా కొడుతుందని భయపడిన వాడిలా అమాయకంగా చూస్తున్న స్వామికి, ఒంటిమీద శ్రీవత్సం తప్ప మరొక మచ్చలేని స్వామికి, పొట్టభాగం అంతా తాడుతో నలిగిపోయి గుర్తు పడిపోయింది.
రెండు అంగుళముల తాడు తక్కువ అవడం అంటే ఏమిటి? భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఎందుకు పూజ చేస్తున్నామో మరిచిపోవాలి. నా స్వామికి యిది చేయకుండా నేను ఎలా ఉండగలను? అనే భావాన పెరగాలి. అపుడు మీరు చేసిన పూజకు కోరిక ఉండదు. ఒక ప్రయోజనమును ఆశించి చేస్తున్నాను, నేను ఈ పూజను చేస్తున్నాను అను ఈ రెండు భావనలను మరిచిపోతారు. అదీ విచిత్రం. అపుడు పూజలో తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతారు. ఈ రెండు భావనలను మరచి పోవడమే తాడు రెండు అంగుళములు తక్కువ అవుతున్నదనే విషయమును మరిచిపోవడం. అలా ఎలా తక్కువవుతున్నదాని తెలియక పోవడం. ఇటువంటి తాదాత్మ్యానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. కేవలము భక్తి చేత పరమాత్మ వశుడు అవుతాడు.
జ్ఞానులచే మౌనులచే, దాసులచే యోగసంవిధానుల చేతం
బూని నిబద్ధుండగునే, శ్రీనాథుడు భక్తి యుతుల చేతం బోలెన్?
మౌనముగా వున్న వాళ్లకు, జ్ఞానులకు, దయానం చేసేవాళ్ళకు, దానం చేసేవాళ్ళకు భగవంతుడు యిలా లొంగుతాడని చెప్పలేము. కేవలము పరమ భక్తితో ఆయన వెంటపడి మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా, అది ఉద్ధరించి ఈశ్వరుని కట్టి మీ దగ్గరకు తీసుకువచ్చి నిలబెట్టగలదు. అది కేవలం భక్తికే సాధ్యం.
ఇక్కడ పరమాత్మ యశోద భక్తికి లొంగి ఆమెకు పట్టుబడిపోయాడు.
శ్రీమద్భాగవతం - 72 వ భాగం
యమళార్జున భంజనము:
యశోదాదేవి కృష్ణుని తెసుకు వెళ్ళి రోటికి కట్టేసింది. ఆయన విడిపించుకోవడం చేతకాని వాడిలా నటిస్తున్నాడు. కర్మపాశముల చేత లోకముల నన్నిటిని కట్టగలిగిన పరమాత్మ, తాను ఆ కట్టు విప్పుకోలేని వాడిలా నటిస్తూ పెరట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. కొడుక్కి శిక్ష వేశాను కదా అనుకోని అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది. గోపకాంతలు కూడా వెళ్ళిపోయారు. కృష్ణుడిని అలా చేస్తే గోపకాంతలు అనవసరంగా తల్లికి చెప్పి కృష్ణుడిని బాధపెట్టిన వారమయ్యామని లోపల బాధపడ్డారు. ఇప్పుడు ఆశ్చర్యకరమయిన ఒక లీల ప్రారంభం అయింది. ఆ ఇంటి ప్రాంగణంలో రెండు పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అవి కొన్ని వందల సంవత్సరముల నుండి అక్కడ పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి వాటి మానులు చాలా స్థిరమయిన స్థితిలో ఉన్నాయ్. వాటిని కూలదోయడం అంత తేలికైన విషయం కాదు. రోటికి కట్టివేయబడిన పరమాత్మ నెమ్మదిగా రాతిని ఈడ్చుకుంటూ పాకుతున్నాడు. అంత బలశాలియై ఆయన పాకుతూ వెనకాల రాలును ఈడ్చుకు వచ్చేస్తున్నాడు. ఈ రెండు మద్దిచెట్ల మధ్య నుంచి పిల్లవాడు అటువైపు వెళ్ళిపోయాడు. ఈడుస్తున్న రోలు అడ్డం తిరిగింది. అది రెండు మద్ది చెట్లకి అడ్డుపడింది. కృష్ణుడు రాతిని ముందుకు లాగాడు. ఆ రెండు మద్ది చెట్లు ఫెళఫెళమనే పెద్ద ధ్వనులతో పక్కకి పడిపోయాయి. ఆ రెండు వృక్షముల నుంచి మహాపురుషులు ఇద్దరు ఆవిర్భవించారు.
ఆ చెట్లలోంచి బయటకు వచ్చిన యిద్దరు కూడా యక్షులు. వాళ్ళ పేర్లు నలకూబర మణిగ్రీవులు. వాళ్ళు కుబేరుని కుమారులు. కుబేరుడు ఐశ్వర్యమునకు అధిపతి. ఆయన నవనిధులకు దేవత. ఆయనకు రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి ౦ ఆయన అపారమయిన ఐశ్వర్యమునకు ఆధిపత్యంలో ఉంటాడు. రెండు – సర్వకాలములయండు ఆయన శంకరుని పక్కన నిలబడి ఉంటాడు. కైలాసంలో పరమశివుని పక్కన నిలబడి స్వామీ ఎప్పుడయినా పని చెపుతారేమో నని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ రెండు లక్షణములు గలిగిన కుబేరుడు అహంకరించినట్లు మీకు పురాణములలో ఎక్కడా కనపడదు. కుబేరుడు విశ్రవసువు బ్రహ్మ కుమారుడు. రావణాసురుని కన్న ముందు పుట్టాడు. పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయి ‘ఏమి కావాలి?’ అని అడిగారు. అపుడు కుబేరుడు తనకు దిక్పాలకత్వం ప్రసాదించమని కోరాడు. అపుడు బ్రహ్మగారు ‘నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను. నీవు ఉత్తర దిక్కున శంకరుని పక్కనే ఉంది నవనిధులకు అధిపతివై ఉంటావు. నిన్ను కుబేరుడని పిలుస్తారు’ అన్నారు.
కుబేరుని జీవితంలో ఒకే ఒక్కసారి పొరపాటు జరిగింది. హిమవత్పర్వత ప్రాంతములో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ సౌందర్యమును చూసి తెల్లబోయి ఎవరీ కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు. దానివల్ల కుబేరుని కన్నులలో ఒక కన్ను మెల్లకన్ను అయిపొయింది. అది తప్ప కుబేరుడు తన తండ్రిగారయిన విశ్రవసు బ్రహ్మగారు ఎలా చెపితే అలా ప్రవర్తించేవాడు. తండ్రిగారు కాంచన లంకను విడిచి పెట్టివేయవలసిందని చెపితే విడిచిపెట్టేసి తమ్ముడయిన రావణునికి ఇచ్చేశాడు. తాను ఉత్తర దిక్కుకు పోయి వేరే నగరమును నిర్మించుకున్నాడు. తన తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానమును రావణాసురుడు ఎత్తుకు పోతే మారుమాట్లాడలేదు. అంతటి మహానుభావుడు కుబేరుడు. ఐశ్వర్యము వలన కుబేరుడు మదించినట్లు ఎక్కడా కనపడదు. భగవద్భక్తుడు కనపడితే అతని పాదములకు వంగి నమస్కరించగలడు. తండ్రి ఐశ్వర్యమునకు మాత్రమె వారసత్వమును పొంది తండ్రి సంస్కృతికి కొడుకులు వారసత్వం పొందక పొతే, వారు ప్రమాదంలో పడతారు. అదే యిక్కడ జరిగిన గొప్ప విశేషం.
నలకూబర మణిగ్రీవులు ఒకనాడు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. స్నాతకం చేసేటప్పుడు మామగారు పురుషుని చేత ఒక ప్రమాణం చేయించుకుంటాడు. ‘నీవు ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయకూడదు. అలా అయితేనే పిల్లనిస్తాను’ అని. మనకి సంస్కృతం తెలియదు కాబట్టి గొడవ లేదనుకోండి! అసలు ఆయన అడిగినట్టూ తెలియదు. మనం యిచ్చినట్టూ తెలియదు. దిగంబరంగా స్నానం చేస్తే శరీరం పిశాచగ్రస్తమయిపోతుంది. నలకూబరమణిగ్రీవులు దిగంబరంగా స్నానం చేస్తున్నారు. వారితో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒంటిమీద బట్ట లేదు. వారు మధువు సేవించి ఉన్నారు. తాము అలా ప్రవర్తించకూడదనే విషయమును మరచిపోయి ఉన్నారు. వీళ్ళు అటువంటి స్నానం చేస్తుండగా ఆకాశ మార్గమున నారద మహర్షి వెళ్ళిపోతున్నారు. గంధర్వకాంతలకు బుద్ధి కలిగింది. వాళ్ళు గబగబా ఒడ్డుకువచ్చి వస్త్రములు కట్టుకుని నారదమహర్షికి నమస్కరించారు. నలకూబరమణిగ్రీవులు మాత్రం దిశమొలలతో నిలిచి నారద మహర్షికి కనీసం నమస్కారం కూడా చేయలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచి పధ్ధతి కాదు. పెద్దల మాటల యందు, ప్రవర్తన యందు, వారియందు, గౌరవమును కలిగి వుండాలి. నారదుడు సామాన్యుడు కాదు. అంత అవిధేయతతో నిలబడ్డ వారిని చూసి నారదుడు మనస్సులో ఒకమాట అనుకున్నాడు.
‘వీళ్ళకి కలవారి సుతులం అనే అహంకారం వచ్చింది. ఈ సంపాదన వీరి తండ్రిది. వీరు ఈవేళ మదోన్మత్తులై ఉన్నారు. తండ్రి గుణముల యందు వీరికి వారసత్వం లేదు. కాబట్టి వీరికి ఈ ఐశ్వర్యమును తీసివేస్తాను. అపుడు వీరికి దేనివలన అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది. వీళ్ళ కంటికి ఇప్పుడు కాటుక పెట్టాలి. ఏ కాటుక పెట్టుకుంటే అవతలి వారిలో ఉన్న భక్తికి వంగి నమస్కరించడం అలవాటు అవుతుందో ఆ అన్జనమును వీళ్ళ కళ్ళకి దిద్దుతాను. వీళ్ళకు బుద్ధి చెపుతాను’ అనుకుని వారితో ‘మీరు కోట్ల సంపదకు పడగలెత్తిన కుబేరుని కుమారులు. మీకు బట్టకట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు. కాబట్టి అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి మీరు నూరు దివ్య సంవత్సరముల పాటు యమళార్జునములనే పేర్లతో మద్ది చెట్లయి నందవ్రజమునందు పడి యుండెదరు గాక!’ అని శపించాడు. ఇప్పుడు వీరికి ఒంటికి పట్టిన మదం తీరిపోయి నారదుని కాళ్ళమీద పడ్డారు. గురువు అనుగ్రహించాలి. నారదుని అనుగ్రహం చూడండి. అందుకని ఆయన ‘ఇపుడు మీకు పట్టిన మదం ఇంకెన్నడూ మీ తలలకు ఎక్కకూడదు. అలా చేయగలిగిన శక్తి ముకుంద పాదారవిందముల నుండి స్రవించే రజస్సుకు మాత్రమె ఉంది. భగవంతుని పాదములను చూడగానే ఆయన పాదములకు తగిలేటట్లుగా శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ పాదరేణువులు తలమీద పడాలి. భాగవతుల పాద ధూళిలోకి బ్రహ్మాండములలో ఉండే శక్తి చేరి ఉంటుంది. ఆ పాదధూళి వారి తలమీద పడగానే వారు పుణ్యతీర్థములలో స్నానం చేసినంతటి ఫలితమును పొందుతారు. అదే వారి పున్యమునకు, ఐశ్వర్యమునకు, వారి అభివృద్ధికి హేతువు అవుతుంది. అందుకు మీరు నందవ్రజంలో మద్ది చెట్లయి పుట్టండి. కృష్ణ పరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదములనుండి స్రవించిన పరాగము మీ మీద పడుతుంది. అపుడు చెట్ల రూపంలో వున్నా మీరు చెట్ల శరీరమును వదులుతారు. మీరు నా పట్ల అపచారం చేస్తే చేశారు కానీ నా అనుగ్రహము వలన ఉత్తరోత్తర మోక్షమును పొందుతారు. నారాయణ భక్తులు అవుతారు. అపారమయిన ఐశ్వర్యముతో ఉంటారు. మరల యథా రూపమును పొంది మీ యక్ష లోకమునకు చేరుకుంటారు. చేరుకొని మీ సంపత్తిని మీ సౌఖ్యమును పొందుతారు’ అని అనుగ్రహించాడు. ఈ విధంగా నారదమహర్షి శాపావసానమును యిచ్చారు. దీనివలన యిప్పుడు పడిపోయిన రెండు చెట్లనుండి వెలుపలికి వచ్చిన మణిగ్రీవనలకూబరులు రెండు చెట్ల మధ్యవున్న ఏడుస్తున్న కృష్ణుని చూసి నమస్కరించి స్తోత్రం చేశారు.
నీ పద్యావళు లాలకించు చేవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరం బనిసేయు హస్తయుగముల్ నీమూర్తిపై జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్
నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్త్రేక్షణా!!
ఈపద్యమును ఒకసారి చదువుకుంటే చాలు. మనం పూజ చేసినట్లే. స్వామీ, మాము ఎప్పటికీ మరల అహంకారం రాకుండా, మా కళ్ళు ఎల్లప్పుడూ నీ మూర్తినే చూడగలగాలి. మా శిరస్సులు నీ పాదములను తాటించగలగాలి. ఎప్పుడెప్పుడు ఈశ్వరుని సేవిడ్డామా అని మనస్సునందు తొందర గలగాలి. అటువంటి సిత్తమును మాకు ప్రసాదించవలసినది’ అని చేతులెత్తి పరమాత్మను ప్రార్థించారు. అపుడు ఆయన ‘తథాస్తు’ మీకు అటువంటి బుద్ధి కలుగుతుంది. మీరు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకమును చేరుకొంది’ అని చెప్పారు. వాళ్ళు బయలుదేరి యక్ష లోకమునకు వెళ్ళిపోయారు.
ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాడో ఆ భక్తులకు వంగి నమస్కరించగలగాలి. అపుడు మీరు ఎల్లప్పుడూ ఐశ్వర్యమును అనుభవిస్తూ ఆనందంగా ఉండగలరు అనే మహోత్కృష్టమైన సందేశమును ఈ లీల మనకు అందజేస్తోంది. యశోదానందులు అక్కడ ఉన్న గోపాలురు ఈ చెట్లు పడిపోయిన శబ్దమును విన్నారు. ఈ రెండు చెట్లూ భూమి మీద ఎలా పడ్డాయి అని అక్కడి వాళ్ళందరూ అనుకుంటున్నారు. చెట్లు పడిపోవడం కృష్ణునితో పాటు ఆడుకుంటున్న చిన్న పిల్లలు చూశారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వచ్చి ఈ చిన్ని కృష్ణుడే రోలు యీడ్చుకుంటూ రెండు చెట్ల మధ్యలో వచ్చాడు. అలా వచ్చినపుడు ఈ రెండుచెట్లూ భూమిమీద పడిపోయాయి. అందులోనుండి దివ్యతేజస్సుతో యిద్దరు మహాపురుషులు వచ్చారు. వారు చిన్ని కృష్ణుని స్తోత్రం చేసి ఊర్ధ్వ లోకములకు వెళ్ళిపోయారు. అది మేము చూశాము అన్నారు.
పెద్దవారు వీళ్ళమాటలు కొట్టి పారేశారు. ఏమీ తెలియని చిన్నపిల్లవాడి వాలే ఎదో పాటను పాడుతున్నాడు. ఆ పాటకు అర్థం ఏమీ ఉండదు. గోపవనితలు చుట్టూ చేరి తాళం వేస్తుంటే తన కాళ్ళ గజ్జెలు మోగేటట్లుగా కాళ్ళు చేతులు తిప్పుతూ గంతులు వేస్తున్నాడు. ఇంతగా అమాయకత్వంతో ఉన్న పిల్లవాడిని చూసి వానికి దైవీశక్తులు ఉన్నాయని ఎవరు అనుకుంటారు? ఈవిధంగా కృష్ణుడు నందవ్రజంలో వారిని మభ్యపెడుతున్నాడు. అలా మభ్యపెడుతున్న కృష్ణుని మనసు దర్శనం చేసిన నాడు మనలను ఆవహించి వున్నా మాయ తొలగిపోతుంది. గర్భిణి అయిన స్త్రీ దశమ స్కంధం వింటే కృష్ణ భగవానుడి వంటి కొడుకు పుడతాడు.
శ్రీమద్భాగవతం - 73 వ భాగం
ఒకనాడు గోపాలురందరూ కలిసి నందవ్రజంలో జరుగుతున్న సంఘటనలను గురించి చర్చించుకుంటున్నారు. ‘నందవ్రజంలో చాలా విపరీతమయిన సంఘటనలు జరుగుతున్నాయి. చిన్ని కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎంతోమంది రాక్షసులు ఎన్నో రూపములతో వచ్చారు. ఇతనిని సంహరిద్దామనుకుంటున్నారు. కేవలము భగవంతుని నిర్హేతుకమయిన కృప వలన కృష్ణుడు కాపాడబడుతున్నాడు. కాబట్టి మనం ఈ ప్రాంతమును విడిచిపెట్టేద్దాము. ఇక్కడకు దగ్గరలో బృందావనము అనే ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ సమృద్ధిగా నీరు దొరుకుతుంది. పచ్చిగడ్డి దొరుకుతుంది. మనం అందరం భద్రంగా ఉండవచ్చు’ అని అక్కడ వున్నా గోపకులలో పెద్ద వాడయిన ఉపనందుడు అనే ఆయన అన్నాడు. మిగిలిన గోపకులందరూ ఆయన చెప్పిన మాట విన్నారు. ఇప్పటికి కూడా భారతదేశంలో అత్యంత పవిత్రమయిన ప్రదేశములలో బృందావనం ఒకటి. భగవంతునితో సంబంధం కలిగిన మహర్షులు కూడా అక్కడకు వచ్చి బృందావనంలో భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటారు. బృందావనంలోని మట్టిని తీసి కొద్దిగా నోట్లో వేసుకున్న వాడు గొప్ప అదృష్టవంతుడు. ఉత్తరక్షణం నందవ్రజంలోని గోపగోపీజనం ఆ ప్రదేశమును వదిలిపెట్టి, బృందావనమునకు బయలుదేరి వెళ్ళిపోయారు.
వత్సాసుర వధ :
ఇపుడు ఒక చిత్రమయిన లీల జరిగింది. ఆవులమందలోకి కొత్త ఆవుగాని వచ్చినట్లయితే గోపబాలురు దానిని కనిపెట్టేస్తారు. ఒకనాడు ఆ మందలోనికి ఒక కొత్త ఆవు వచ్చింది. వీళ్ళు దానిని కనిపెట్టి ఆ విషయమును కృష్ణునికి చెప్పారు. కొత్త ఆవుదూడ చెంగుచెంగుమని ఆడుతోంది. కృష్ణుడు దానిని చూశాడు. కొత్తగా వచ్చిన దూడ ఒక రాక్షసుడు. కంసుని పనుపున కృష్ణుని చంపడానికి దూడ రూపంలో వచ్చాడు. వాని పెరు వస్తాసురుడు.
కృష్ణుడు ఏమీ తెలియనట్లుగా దాని దగ్గరకు వెళ్ళి, దాని తోక పట్టుకున్నాడు. తరువాత రెండు చేతులూ చాపి దాని నాలుగు కాళ్ళను పట్టుకుని గభాలున పైకెత్తి, తోకతో ఆ నాలుగు కాళ్ళను కట్టేశాడు. ఇపుడు ఆ దూడను చంపెయ్యాలి. దానిని గిరగిర తిప్పి అక్కడే వున్నా వెలగచెట్టుకు వేసి కొట్టాడు. అలా కొట్టేసరికి అక్కడ ఏకకాలంలో ఇద్దరు రాక్షసులు చచ్చారు. ఒకడి పెరు కపిత్థాసురుడు, వెలగచెట్టు రూపంలో వచ్చాడు. రెండవ వాడు వత్సాసురుడు, అతడే దూడ రూపంలో వచ్చాడు. ఈ లీల జరిగినప్పుడు దేవతలు పుష్ప వృష్టిని కురిపించారు. ఎంత రాక్షసుడు అయినప్పటికీ శ్రీకృష్ణుడంతటి వాడు ఆవుదూడను అలా చంపవచ్చునా – అది పాపము కాదా- అది గోహత్య అవలేదా అనే సందేహం మనకి కలుగుతుంది. ఆవుదూడ రుచికి ప్రసిద్ధి. ఆవుదూడకి ఏది పడితే అది పడదు. ఆవుదూడ వృద్ధిలోకి రావాలని దానిచే పాలుకూడా చాలా తక్కువగా తాగిస్తారు. తినకుండా ఉండడానికి దాని మూతికి ఒక బుట్ట కట్టేస్తారు. అది ప్రతిదానినీ తిందామనుకుంటుంది. అలాగే వెలగ పండు వాసనకు ప్రసిద్ధి. వాసనను దాచలేము. ఆవుదూడ, వెలగపండు రుచికి, వాసనకు ప్రసిద్ధి చెంది ఉంటాయి. రుచి వాసనలు మనలను జన్మ జన్మాంతరములుగా తరుముతుంటాయి. ఉండకూడని రుచి, వాసనల యందు మనస్సు నిలబడి పోయినట్లయితే దానివలన చాలా ప్రమాదం ఉంది. అందువలనే ప్రయత్నపూర్వకంగా సుఖములను పరిత్యజించడం అలవాటు అవాలి. లేకపోతె ఈ మనస్సు వెళ్ళిపోయి ఏదో ఒకదానియందు ఉండిపోతుంది. అంత్యకాలం వచ్చినపుడు మనస్సు డానికి బాగా ఇష్టమయిన రుచిని పట్టుకుని, యింద్రియములను గబగబా మూట కట్టి ఏదో ఒక ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అదే వాసన. వెళ్ళి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినపుడు పాత శరీరము నుండి వాసనను తీసుకువస్తుంది. అందుకనే పుట్టుకతోనే వాసనలు వచ్చేస్తాయి. ఒక్కొక్కడు పుట్టుకతో దుర్మార్గ ఆలోచనలు చేస్తాడు. ఒక్కొక్కడు పుట్టుకతో భగవంతుని వైపు వెడతాడు. ఈ వాసన వెలగపండు. అసురీశక్తి. మనస్సు అనుభవించడం, గుర్తుపెట్టుకోవడం అనేదే రుచి. వెళ్ళిపోయే ముందు మనస్సు బతికి వున్నన్నాళ్ళు వ్యామోహం దేనిమీద పెరిగిపోయిందో దానినే పట్టుకుని కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే తరువాతి జన్మలో ఆ వాసన కోసమే జీవుడు తిరుగుతూ ఉంటాడు. అందుకనే ఒక్కొక్కడు చిన్నతనం నుంచే దుష్ట సాంగత్యం వైపు వెళ్ళిపోతాడు. వాడిని వెనక్కు తీసుకురాలేము. అటువంటి వాడిని ఈ లీల మాత్రమే బాగుచేయగలదు. వాడికి ఈ లీల వినిపించాలి. అమ్మను చూడగానే కాముకత్వం ఎలా చల్లారి పోతుందో అలా ఈశ్వరుని గురించి వినేసరికి వాసనా బలం క్షీణించి ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది. మీరు మీ వాసనలను ముందు జయింపలేరు. అందుకని భక్తితో కృష్ణా కృష్ణా అని భగవంతుని ప్రార్థించాలి. భాగవతం దశమస్కంధము వినాలి. ఈ లీలవిని పొంగిపోవాలి. కృష్ణుడిని మనసులో పెట్టాలి. అపుడు ఈ రుచి లోపలి, ఈ వాసన పైకి వస్తుంది.
బకాసుర వధ :
ఒకానొక సమయంలో కంసుని పనుపున కృష్ణ భగవానుడిని చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పెరు బకాసురుడు. బకుడు అనగా కొంగ. గోపకులు అందరూ ఉదయముననే కృష్ణ బలరాములతో కలిసి తమ గోసంపదనంతటినీ తీసుకుని బృందావనమునకు బయలుదేరారు. వారికి అక్కడ ఒక పెద్ద పర్వతం ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది. బకుడు అన్ని పనులను మానివేసి ఒకే విషయం మీద దృష్టిపెట్టి ధ్యానం చేస్తున్న వాడిలా, తాను నోరు విప్పి మాట్లాడితే అది తన సత్త్వ రూపమునకు భంగమన్న ఉద్దేశంతో, మహాపురుషులయిన వారు మౌనమును ఆశ్రయించి ఎలా ఉంటారో అలా, ఏ విధంగా ఇతర ఆలోచన లేకుండా, శ్రీకృష్ణ పరమాత్మ మీదనే దృష్టిపెట్టి ఉన్నాడు. మీరు కొంగను పరిశీలించినట్లయితే అది చాలా ఆశ్చర్యకరంగా నిలబడుతుంది. అది చెరువు ఒడ్డునో ఎక్కడో ఒక్క కాలు మీద నిలబదినట్లుగా ఉంటుంది. చూడడానికి చాలా సత్త్వగుణంతో ఉన్నదని, ఒకరికి అపదారం చేయనిది నమ్మేలా ఉంటుంది. కానీ దాని మనస్సులో ఉండే భావన వేరు. కృష్ణ పరమాత్మను ఈ గోపబాలుర నుండి వేరుచేస్తే, కృష్ణుడిని ఒక్కడినీ నిర్జించగలిగితే మిగిలిన గోపాల బాలురందరూ తమంత తాము ప్రాణములను విడిచిపెట్టేస్తారు. అందుకని బకుడనబడే రాక్షసుడు కృష్ణుడిని చంపాలనే ఆలోచనతో వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఏది కొత్తది కనపడినా కృష్ణుడికి చెప్పడం గోపబాలురకు అలవాటు. ‘కృష్ణా, ఆ కొంగను చూడు, అది ఎంత తెల్లగా, పెద్దగా ఉందొ చూడు’ అన్నారు.
అది ఒక్కసారి తన పాదమును భూమికి వేసి తాటించి పైకిలేచి,రెక్కలు అల్లారుస్తూ నోరుతెరుస్తూ, నోరు మూస్తూ, ఆకాశంలో వేగంగా తిరగడం ప్రారంభించింది. దాని రెక్కల నుండి వచ్చిన గాలికి అక్కడ వున్న చెట్ల కొమ్మలు విరిగి కిందపడిపోతున్నాయి. అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తున్నారు. చటుక్కున ఆ పక్షి కిందకు దిగి కృష్ణ పరమాత్మను తన రెండు చంచూపుటములలో యిరికించుకుని ఎగిరిపోయి ఒక పర్వట శిఖరం మీద అకూర్చుని కృష్ణుడిని మింగేసింది. ప్రాణము పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో, కృష్ణుని బకుడు మింగేస్తే గోపబాలురు అలా అయిపోయారు. ఆయన లేనినాడు తమకు అస్తిత్వమే లేదని భావిస్తున్నారు. ఇదీ భగవంతుని పట్ల వాళ్ళకి ఉన్న గౌరవం. ఇదీ వారికి వున్నా భక్తి. కృష్ణుడు భగవంతుడని వారికి తెలియదు. ఆ పదార్థము అటువంటిది. ఏవస్తువును ప్రేమిస్తే ఆనందమును మాతమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మము అని తెలియనక్కరలేదు. ఎప్పుడయితే వీరంతా ప్రాణములు లేని యింద్రియములలా అయిపోయారో ఉత్తర క్షణమునందు కొంగ కంఠమునందు ఉన్న కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రము వలే అయిపోయినాడు.
కంఠమునందు వున్నవాడు బయటవున్న గోపబాలుర ఆర్తిని గ్రహించాడు. ఈ బాలురు వెనక్కి తిరిగి పారిపోయినట్లయితే, పరమాత్మ ఉత్తరక్షణం వైకుంఠమునకు చేరగలడు. కానే తన గురించి ఆర్తి పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి యిపుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం యివ్వాలి. అందుకని కొంగ కంఠం నుండి బయటకు రావడానికి ఆయన అగ్నిహోత్రం అయిపోయాడు. వెంటనే కొంగ కక్కేసింది. ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు ముక్కుపుటములతో పొడిచి చంపేస్తాను అలా చంపి మ్రింగివేస్తాను అని తన చంచూపుటములు పెట్టి పొడుస్తూ ఆయన వెంట పడింది. అటువంటి దాని చంచూపుటములను రెండింటిని గట్టిగా పట్టుకుని గడ్డిపరకను చీల్చినట్లుగా చీల్చి, కృష్ణుడు ఆ పక్షిని చంపివేశాడు. ఆ పక్షి కొంగగానే ఎందుకు రావాలి? వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చంపాడు. అలా రాకుండా చంపకూడదా?బకుడు అనే రాక్షసుడు ఎక్కడో లేదు. మనలోనే ఉన్నాడు. అతని పెరు దంభము. దంభము అంటే పైకి ఒకలా కనపడుతూ లోపల మరొకలా ఉండుట. దంభమును నిగ్రహించలేరు. ఇది పైకి ఒకలా ఉంటుంది. లోపల ఒకలా ఉంటుంది. ప్రతిక్షణం వెన్నంటి ఉంటుంది. మనస్సును ప్రయత్నపూర్వకంగా గెలవాలి. దంభము మహా పాపకార్యము. దంభము సత్యముగా ఉండడమును అంగీకరించదు. సత్యమంటే కృష్ణుడు. కృష్ణుడిని తినేస్తాను అంటుంది. లోపల ఎలా ఉన్నామో పైన కూడా అలా వుండే ప్రయత్నం మొదలు పెట్టాలి. అందుకు భగవంతుని స్మరణ చేయడం మొదలు పెట్టాలి. ఈ నామ స్మరణ మనస్సుని నిరంతర ప్రక్షాళన చేస్తూ ఉంటుంది.
దంభమును తప్పించుకోవడం కష్టం. అది సత్యమును మ్రింగుతుంది. అందుకని ముందుగా కృష్ణుడు మ్రింగబడాలి. ఆర్తి చెందేవాడు వుంటే అగ్నిహోత్రమై బయటకు రావాలి. దంభమును చీల్చాలి. అలా చీలిస్తే కృష్ణుడు తనంత తాను గోపాల బాలురకు దక్కాడు. ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ఆయనను ఆర్తితో ప్రార్థిస్తే ఆయనే మన దంభమును తీసువేస్తాడు. ఆయనే మనలను రక్షించి పుణ్య పురుషుడుగా మారుస్తాడు.
దీపము మీద వెళ్ళి పడిపోయిన శలభాములు ఎలా కాలిపోతాయో అలా ఈ పిల్లవాడిని ఎంతమంది రాక్షసులు నిర్జిద్దామని ప్రయత్నం చేసినా వారందరూ మడిసిపోయినారు. హృదయంలో భగవంతుని నిలబెట్టడం చేతనవాలి. అసురీ గుణములు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినా నామం పట్టుకుని పరమాత్మను హృదయంలో నిలబెడితే అవి మడిసి పోయి రాలి పోయి, నీవెప్పుడూ పవిత్రమయి ఉండిపోతావు. గోపాల బాలురు కృష్ణుని గురించి ఆర్తి చెందినట్లు మనుష్య జన్మలోనికి వచ్చినందుకు నీవు భగవంతుడి గురించి ఆర్తిచెండడం నేర్చుకోవాలి. ఇది వేరొకరి ప్రబోధం చేత వచ్చేది కాదు. నీఅంత నీవుగా పరిశీలనం చేసుకోవాలి. భగవంతుని గూర్చి ఆర్తి, భక్తి అలవాటు చేసుకోవాలి. అవి మాత్త్రమే నిన్ను రక్షించగలవు. అన్యములు రక్షించలేవు. బకాసుర సంహార వృత్తాంతము నుండి ఈవిశాయమును మనం గ్రహించాలి.
శ్రీమద్భాగవతం - 74 వ భాగం
అఘాసుర వధ
ఒకనాడు కృష్ణపరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి యింటికి వెళ్ళిపోతున్నాడు.అపుడు ఆయనకు ఒక ఊహ వచ్చింది. ‘రేపటి దినమున మనం అందరం కలిసి వనభోజనములకు వెడదాము. కాబట్టి పిల్లలారా రేపు పొద్దున్న మీరందరూ బయలు దేరేటప్పుడు చక్కగా చిక్కములు పట్టుకొని, అందులో మీకిష్టమయిన మధుర మధురమయిన పదార్థములు పట్టుకొని రండి. మనందరం కలిసి వెడదాము. అరణ్యంలో మనందరం కలిసి కూర్చుని తెచ్చుకున్న చల్దులు ఆరగిద్దాము’ అన్నాడు. కృష్ణుడు పిల్లలకు ఎంత చెపితే అంత. మరునాడు వాళ్ళందరూ వనభోజనములకు బయలుదేరారు. వారు వివిధరకముల ఆటలకు సంబంధించిన పందెములు వేసుకుంటూ, హాస్యమునకు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళారు. అకక్డ కొలనులలో నీళ్ళల్లో పడి చేపల్లా ఈదేవారు. కృష్ణునితో ఆడుకునే వారు. కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవారు. అక్కడ వాళ్ళు ఆడని ఆటలు లేవు. పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టగలిగిన రక్కసుడు ఒకడు వచ్చాడు. వానిపేరు అఘాసురుడు. అఘము అనగా పాపము. అతను బకాసురుని సోదరుడు. ‘నా సోదరుడైన బకాసురుని కృష్ణుడు నిర్జించాడు. గోపాల బాలురందరికి ప్రాణ సమానమయిన వాడు కృష్ణుడు. కాబట్టి ఈ కృష్ణుని చంపి తినేస్తాను’ అనుకున్నాడు.
వాడు వచ్చి కొండచిలువ రూపంలో దారికి అడ్డంగా పడుకున్నాడు. కొండచిలువ వెంటాడి ఏ ప్రాణినీ చంపదు. అది పట్టింది అంటే మ్రింగి వేయడమే. అది ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దానిని అలాగే జీర్ణం చేసేసుకుంటుంది. ఇప్పుడు అఘాసురుడు అనే కొండచిలువ మార్గమునకు అడ్డంగా పడుకుని ఉంది. దాని నోటి పైదవడ ఆకాశమునకు పెట్టింది. క్రింద దవడ భూమిమీదకి పెట్టింది. ఈ పిల్లలు అక్కడికి వచ్చారు. దారికి అడ్డంగా పడివున్న దానిని గుర్తించి దానిని కొండచిలువగా నిర్ధారించుకున్నారు. ఏమి చేయాలా అని వారు వెనక్కి తిరిగిచూశారు. వెనక చిన్నికృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు. వీళ్ళు అన్నారు ‘బకాసురుని చంపిన కృష్ణుడు మన వెనకాతల ఉన్నాడు. ఎదురు కొండచిలువ వుంటే మనకేమిటి భయం! మనం వెళ్ళిపోదాం’ అని వారు నవ్వుకుంటూ, వారి చిక్కములు పట్టుకొని ఆవుల్ని, దూడలని, ఎద్దులని, అన్నింటిని ఆ కొండచిలువ నోట్లోకి తోలేసి వారు కూడా అందులో ప్రవేశించారు. ఆ కొండచిలువ అఘాసురుడు అని కృష్ణుడికి తెలుసు. ‘దూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. గోపబాలురందరూ నేనున్నాని గోసంపదతో సహా అఘాసురుని నోటిలోపలికి వెళ్ళిపోయారు. అది నా కోసమే యింకా దవడలను మూయలేదు. ఇపుడు వారినందరినీ బ్రతికించడానికి నేను వెళ్ళాలి’ అని కృష్ణుడు అనుకుని దాని నోటి దగ్గరకు వెళ్లేసరికి, వీరందరూ దాని కంఠం దగ్గరకు వెళ్ళిపోయారు. అది నాలుకను చుట్టి గబుక్కున మ్రింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. లోపల వున్నా విషజ్వాలలకి వారు మరణించారు.
కృష్ణుడు దాని కంఠం దగ్గరకి వెళ్ళగా కృష్ణుని కూడా మ్రింగబోయింది. పైనున్న దవడను నొక్కింది. నొక్కేసరికి స్వామీ నిటారుగా పెద్ద స్తంభంలా అయిపోయారు. అది నోటిని నొక్కేసరికి స్తంభం లాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకుని పైకి వచ్చింది. ఈయన తన శరీరమును పెంచాడు. డానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు. గిలగిల కొట్టుకుంది. అటు తిరిగింది. ఇటు తిరిగింది. తిరుగుడు పడిపోయి గిలగిల కొట్టుకుంటోంది. ఆ సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వారినందరినీ కృష్ణుడు చూశాడు. అసురసంధ్యవేళ అవుతుండగా నక్షత్రములతో కలిసి ఆకాశామునందు ప్రకాశిస్తున్న చంద్రబిమ్బములా కేవలము తన కన్నులనుండి కారుణ్యామృతదృష్టిని చిన్ని కృష్ణుడు వాళ్ళమీద ప్రసరింప జేశాడు. ఆయన కారుణ్యామృతదృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులు, అన్నీ జీవించాయి. అందరూ ఆ కొండచిలువ నోట్లోంచి ఇవతలికి వచ్చేశారు. బయరకు రాగానే వారొక అద్భుతమును చూశారు. ఆ పాము కొనప్రాణంతో కొట్టుకుంటోంది. చివరకు దాని ప్రాణం పోయింది. దానిలోంచి ఒక దివ్యమయిన వెలుగు వెలువడి పైకిలేచి చిన్నికృష్ణుడి లోకి వెళ్ళిపోయింది. దీనితో ఇంత పాపపు రక్కసుడు మోక్షమును పొందేశాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపములన్నీ విరిగిపోయాయి.
ఈ లీలలోని అంతరార్థం మనం తెలుసుకోవాలి. అఘాసురుడు ఒక పాపపు రక్కసుడు. పాపము అనగానేమి? పాపము అంటే దుష్కర్మ. పాపకర్మనుండి దుఃఖము వస్తుంది. పాపకర్మ కొండచిలువలా నోరు తెరుచుకుని మనదారిలోనే పడుకుంటుంది. పాపకర్మ మనమే దానిలోకి నడిచేటట్లుగా చేస్తుంది. అది ఎప్పుడూ తనంత తానుగా వచ్చి మింగదు. పాపకర్మ మిమ్ములను మింగలేదు. ‘నేను పాపము చేయను’ అని మీరు అనుకుంటే పాపము మీచేత చెడ్డపనిని చేయించలేదు. కానీ మనలో మోహ బుద్ధి బయలుదేరుతుంది. ఏదో అప్పటికి ఒక సుఖమును కోరి ఫరవాలేదులే చేసేద్దాం అనుకుని పాపపు పనిని చేస్తాడు. అందుకని కొండచిలువ నోట్లోకి వీళ్ళే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి పాపకర్మ, పుణ్య కర్మ అంటే ఏమిటో తెలియాలంటే సత్కర్మకీ, దుష్కర్మకీ భేదం తెలియాలంటే వేదం తెలియాలి. అందులో ధర్మమునకు సంబంధించిన భాగములను చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలురకి అవన్నీ తెలియవు. పాపకర్మకి దేవతలు కూడా భయపడతారు. అటువంటి పాపకర్మ యందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. కానీ వెడుతున్నప్పుడు ఒకపని చేశారు. ‘వెనక కృష్ణుడు ఉన్నాడు’ అని కృష్ణ భగవానుని మీద పూర్తీ నమ్మకం కలిగి వుండి దాని నోటిలోకి ప్రవేశించారు. అలా చేయడం పాపమా, పుణ్యమా అనేది వారికి తెలియదు. పాపపు పనిని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. తెలిసి నీవు పాపమును చేస్తే ఆ పాపఫలితమును నీవే అనుభవించవలసి ఉంటుంది. అందుకే శాస్త్రము మరణము పాపము వలన వస్తుంది అని చెపుతోంది. పాపమే మరణమును ఇస్తుంది. చేసిన పాపము భయంకరమైనది అయితే అకాల మృత్యువు ఇవ్వబడుతుంది. పుణ్య చేసిన వాడికి కూడా మృత్యువు వస్తుంది కానీ అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసినప్పుడు, దేవాలయమునకు వెళ్ళినప్పుడు, పుణ్య నదీస్నానం చేసినప్పుడు ‘అనాయాసేన మరణం – వినా దైన్యేన జీవితం’ ఈ రెండింటినీ అడగాలి. చేసిన పాపమును అనుభవములోనికి ఈశ్వరుడు వృద్ధాప్యము నందు తెస్తాడు. ప్రతిజీవికీ మరణం తథ్యం. కానీ చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాపపుణ్యములు మృత్యు సమయమునందు తెలుస్తాయి’ అని పెద్దలు అంటారు. ‘అనాయాసేన మరణం – వినా దైన్యేన జీవితం’ – ఈ రెండు ఎప్పుడు వస్తాయి? మీ వెనకాల ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మీరు ప్రవరించగలిగితే చాలు. మీరు చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడయినా తప్పు చేస్తే దేవుడి ముందు అంగీకరించి ఆ తప్పునకు భగవంతుని క్షమాపణ అడగాలి. అప్పుడు తప్పులు చేయడం అనేదే ఉండదు. దీనికి ముందు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడన్న భయం మనసులో ఉండిపోతుంది.
అఘాసుర వధ ఘట్టంలో గోపబాలురను ఈశ్వరుడు రక్షించగలిగాడు. ఇది పరమాత్కృష్టమయిన కథ ఇది మనకందరికీ చిరస్మరణీయమై, నిత్య స్మరణీయమై, ప్రతిరోజూ భగవంతుని యందు పూనికను పెంచి, ఈశ్వరుడు మనలను అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది.
బ్రహ్మ గోవత్సములను, గోప బాలకులను అంతర్దానంబు చేయుట ఇక్కడ శుకుడు పరీక్షిత్తుకు ఈ కథను చెపుతూ చిన్న మెలిక పెట్టారు. దీనిని ‘కౌమార పౌగండ లీల’ అంటారు అని చెప్పారు. మొదటి అయిదేళ్ళ వయస్సును కౌమారము అంటారు. తరువాతి అయిదేళ్ళను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారములో జరిగినది పౌగండములో ఎలా చెప్పారు? పిల్లలందరికీ ఈ కథ అయిదవ ఏట జరిగింది. ఏడాది పాటు ఈ పిల్లలు యింటికి వెళ్ళలేదు. అందుకని ఈ లీలను శుకుడు ‘కౌమారపౌగండలీల’ అని చెప్పారు. అపుడు పరీక్షిత్తు ఈ లీల చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కౌమారంలో జరిగిన విషయం పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు యింటికి ఎందుకు వెళ్ళలేదు? నాకీ కథ దయచేసి వివరంగా చెప్పవలసింది’ అని శుకమహర్షిని ప్రార్థించాడు. ఆర్తి కలిగిన శిష్యుడు ఉంటే గురువుకి ఉత్సాహంగా ఉంటుంది. అపుడు శుకమహర్షి నీ ఆనందమును చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తోంది. వినవలసింది’ అని డానికి సంబంధించిన కథను చెప్పడం ప్రారంభించారు. ఈ పిల్లలను బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీరినందరినీ తీసుకొని బృందావనం లోపలి వెళ్ళాడు. బాగా ఎండగా ఉంది. అపుడు కృష్ణుడు గోపబాలురతో
‘ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్క డీ
దండన్ లేఁగలు నీరు ద్రావి యిరవందం బచ్చికల్ మేయుచుం
దండంబై విహరించుచుండఁగ నమందప్రీతి భక్షింతమే?”
మీరు ఇప్పటివరకు ఎండలో తిరిగారు. బాగా ఆకలివేస్తోంది. దాహం వేస్తోంది. మనం చల్దులు తెచ్చుకున్నాం కదా! నీడలో కూర్చుని వాటిని తిందాము’ అన్నాడు.
జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్
శిలలుం బల్లవముల్దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!
గోపాల బాలురికి తాము ఎందులో తింటున్నాము, ఏమిటి తింటున్నాము అనేది లెక్కలేదు. తామరపువ్వు బాగా విచ్చుకుంటే దాని రెక్కలనీ ఒకదానిమీద ఒకటి వుండి మధ్యలో కర్ణిక ఉంటుంది. కర్ణికకు చుట్టూ రేకులన్నీ విచ్చుకుని ఉంటాయి. అలా కృష్ణుడిని వారందరి మధ్యలో కూర్చుండ జేశారు. వీళ్ళందరూ కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు గోపబాలురు. వారికి శౌచము అంతగా తెలియదు. ఒకడు రాయి తెచ్చుకుని, తను తినే ఆహార పదార్ధమును ఆ రాతిమీద పెట్టుకున్నాడు. ఒకడు నాలుగు చిగురుటాకులు కోసుకు తెచ్చుకుని తను తినే ఆహారం దానిమీద పెట్టుకున్నాడు. ఒకడు కొద్ది గడ్డికోసి తెచ్చుకుని ఆ గడ్డిని కంచంలా అమర్చి, దానిమీద తను తెచ్చుకున్న చల్దిమూటను పెట్టుకున్నాడు. ఒకడు తాను తెచ్చుకున్న చిక్కమును పరుచుకుని ఆ చిక్కంమీద తినేస్తున్నాడు. ఒకడు చెట్లకు అల్లుకొనిన పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోసి దానిమీద పెట్టుకుని తింటున్నాడు. ఒకడు ఒక పెద్ద అడివి పువ్వును కోసితెచ్చి ఆ పువ్వులో పెట్టుకుని తింటున్నాడు.
మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు; నూరుఁగాయలు దినుచుండు నొక్క;
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి; చూడు లేదని నోరు చూపునొక్కఁ;
డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిదమాడి; కూర్కొనికూర్కొని కుడుచు నొక్కఁ;
డిన్నియుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన; మనుచు బంతెనగుండు లాడు నొకఁడు;
కృష్ణుఁ జూడు మనుచుఁ గికురించి వడి మ్రోల,మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు;
నవ్వు నొకఁడు; సఖుల నవ్వించు నొక్కఁడు; ముచ్చటాడు నొకఁడు; మురియు నొకఁడు.
ఒకడు వాని యింటినుంచి ఊరగాయలు తెచ్చాడు. ఎడమచెయ్యి పూజయందు గాని, భోజనమునందు కానీ దూష్యము. కానీ వాడు చల్దిముద్ద ఎడమచేతిలో పెట్టుకున్నాడు. ఊరగాయ అన్నం తింటూ పక్కవాడికి వాడి ఊరగాయలను చూపించి ఊరించేవాడు. ఒకడు పక్కవాని చల్దిమూట నుంచి ఊరగాయను తీసి అవతలి వానికి తెలియకుండా గుటుక్కున మ్రింగి, పక్కవాడు అడిగితె నోరు చూపించి ‘నేనెక్కడ తిన్నాను?’ అనేవాడు. ఒకడు పక్కవాళ్ళు విస్తళ్ళకు ఆకులు తెచ్చుకుందామని పక్కకి వెడితే వాళ్ళ చల్ది మూటలలోని కొన్ని ఆహార పదార్థములను తీసేసుకొని గబగబా అయిదారుగురి చల్ది తననోట్లో కుక్కేసుకునేవాడు. ఒకడు తాను బంతెనగుండ్లు తింటాననే వాడు. బంతెన గుండ్లు అంటే అందరి విస్తళ్ళ నుండి కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. ఒకడు కృష్ణుని చూపించి ‘ఆ ఆవకాయ ముక్కలు పట్టుకుని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా’ అనేవాడు పక్కవాడు కృష్ణుడి వంక చూసేసరికి వాడి విస్తరిలోని ఆవకాయ ముక్కను వీడు తినేవాడు. ఒకడు నవ్వుకుంటూ, ఒకడు తాను నవ్వకుండా తన మాటలచేత పక్కవాళ్ళని నవ్విస్తున్నాడు. ఇన్ని రకములుగా వీరందరూ అక్కడ అన్నం తింటున్నారు. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళు కృష్ణుణ్ణి చూస్తూ తింటున్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది. వీళ్ళకి అదొక గమ్మత్తు.
శ్రీమద్భాగవతం - 75 వ భాగం
కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును జాఱి రానీక డా చంక నిఱికి
మీగడపెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి చేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి
సంగడీల నడుమ జక్కగ గూర్చుండి నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద శైశవంబు మెఱసి చల్ది గుడిచె!!
అందరి మధ్య నిలబడి కృష్ణపరమాత్మ తనమీద ఉన్న ఉత్తరీయం తీసి, నడుముకి కట్టి అందులోకి వేణువును దోపి, ఆవులను తోలే కర్ర, ఊదే కొమ్ముబూరను ఎడమ చంకలో పెట్టుకుని, ఎడమచేతిలో చద్ది అన్నపు ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ్ళ సందులో పెట్టుకుని దానిని నంజుకుంటూ అన్నమును తింటున్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టికున్నది గతరాత్రి వండిన పదార్ధం. నిలవ వున్న పదార్థం ఈశ్వర నివేదనమునకు పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉన్నది. డానికి నిలవ దోషం లేదు. ఆయన యాగభోక్త. మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ‘ఓం నమోనారాయణాయ స్వాహా’ అని మంత్రం చెప్పి స్రుక్కు సృవములతో నేతిని పోస్తే హవిస్సు వేస్తే, అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈవేళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ముక్కలు నంజుకుని తింటున్నాడు. యాగభోక్త అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరులు అన్ని లోకములనుండి వచ్చేశారు. ‘ఏమి ఆశ్చర్యం! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని పరమాత్మ, గోపబాలురతో కలిసి స్నానం చెయ్యకుండా, ఇంతమంది మధ్య కూర్చుని తాము ఎంగిలి చేసి పెట్టినది తింటున్నాడు. ఏమి ఆశ్చర్యము’ అని వారందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యములు చేస్తున్నారు. దేవతలు అందరూ ఆనందముతో ‘గోవిందాగోవిందా’ అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడ్డాయి. ఈ అల్లరి ఏమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకం నుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశాడు. అక్కడ బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలురందరితో కలిసి తింటున్నాడు. ‘ఈ ఎంగిలి ముద్దలు ఎడమ చేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మా? అఘాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని యితడు బ్రతికించాడా? యాగములందు తప్ప హవిస్సులు స్వీకరించని పరబ్రహ్మ యింత సులభుడయినాడా? ఇది నేను నమ్మను. ఆ పిల్లవాడు పరబ్రహ్మము కాదు’ అని అనుకున్నాడు.
‘నేను చతుర్ముఖ బ్రహ్మను, ఇంటి పెద్దను. నాలుగు మోములు కలవాదిని. వేదములు చదివినవాడిని. నామయ తప్పించుకోలేడు’ అని వెంటనే ఒక మాయ చేశాడు, అక్కడే నీరు త్రాగి పచ్చికతింటున్న ఆవులని, దూడలని, ఎద్దులను కొంచెం దూరముగా తీసుకువెళ్ళి మాయం చేసేసి, వాటినన్నిటిని ఒక కొండగుహలో పెట్టేశాడు. అన్నం తింటున్న పిల్లలు కృష్ణా మన ఆవులను దూడలను నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను. మీరు అన్నం తింటూ వుండండి’ అని చెప్పి ఆవులను వెతకడానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. వాటి పాదముల జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. ఒకచోట మంద అంతా విడిపోయి వెళ్ళినట్లు కనపడింది. ఆవులు కనపడక పోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ వున్న గోపాల బాలురను మాయం చేసేశాడు. ఇక్కడ చూస్తే గోపాల బాలురు లేరు. అక్కడ ఆవులు లేవు. దూడలు లేవు. ఎద్దులు లేవు. సాయంకాలం అయిపోతోంది. ఇక యింటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలేరి, మా ఆవులేవి అని అడుగుతారు. అందుకని అవి ఏమైపోయాయి అని ఒకసారి దివ్యదృష్టితో చూశాడు. తన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈవేళ మొహబుద్ది పుట్టింది. ఆయన తనమీద మాయ చేశాడని తెలుసుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు వచ్చాయి అన్ని ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాలబాలురు అయిపోయాడు. అన్నీ తానే, తానే అన్నీ అయిపోయాడు. తానే తనని తోలుకుని అన్నింటితో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళాడు.
ఒక్కొక్క తల్లిదగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఒక్క కృష్ణుడే ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు ఏ దూడలు, ఆవులు, ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు. ఆ తల్లిదండ్రులు, గోపకాంతలు, గోపాల బాలురని చూసి మా పిల్లవాడే అని మురిసిపోయారు. కృష్ణుడు రోజూ ఇలా గే చేస్తున్నాడు. ఈలోగా త్రుటికాలం కనురెప్ప మూసి తెరచినంతకాల అయింది. బ్రహ్మగారికి త్రుటి అంటే మనకి సంవత్సరకాలం. సంవత్సరం అయిన తరువాత కృష్ణుడు ఏమిచేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలను ఇటు ఇత్ప్పాడు. అవే ఆవులు, అవే దూడలు, గోపాల బాలురు యిక్కడ ఉన్నారు. తాను దాచాడు కదా అని తాను దాచిన గుహను చూశాడు. వారందరూ గుహలో ఉన్నారు. ఇప్పుడు మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడ్డాడు. బ్రహ్మనయిన నేను ప్రాణులన్నింటినీ సృష్టిస్తాను.నేను సృష్టించిన ఆవులు, దూడలు, గోపబాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే అక్కడ ఉన్నారు. అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడయినా ఉన్నాడా’ అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. అది ఖాళీగానే ఉంది. కాబట్టి తానే సృష్టికర్తగా ఉన్నాడు. మరి అక్కడ కనపడుతున్న వారెవరా అని ఆలోచించాడు. అపుడు బ్రహ్మగారికి గుర్తు వచ్చింది. ‘నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతడు పరబ్రహ్మ. ఎవని నాభికమలము నుండి నేను పుట్టానో వాడు యిపుడు చిన్ని కృష్ణునిగా ఉన్నాడు. వాని మాయముండు నా మాయ తుత్తునియలయిపోయింది. నేను దీనిని తెలుసుకోలేక పోయాను’ అని అనుకోగానే ఒక్కసారి మొహబుద్ది విడిపోయింది. ఇప్పుడు చిన్ని కృష్ణుని పరబ్రహ్మమును చూద్దామని అటుచూశాడు. చూసేసరికి ఆవులలో, దూదలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుడిలో నాలుగు భుజములతో, శంఖచక్రగదాపద్మములను పట్టుకొని పట్టు పీతాంబరములతో శ్రీవత్సముతో కౌస్తుభ మణితో, వనమాలతో, కిరీటముతో, పెద్ద పెద్ద కుంతలములతో, వెలిగిపోతున్న పరబ్రహ్మము అనేకముగా దర్శనం ఇచ్చాడు. ఇన్ని కాంతి పుంజములను చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకిలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేనిమీద పనిచేయ్యదో దానిమీద మాయకమ్మే ప్రయత్నం చేశాను’ అనుకుని ‘స్వామీ! దయచేసి నేను చూడగలిగినట్లు కనపడు’ అని ప్రార్థించాడు. అపుడు ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. ఈ లీలను చేసినది తానేనని ఒకరోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు.
ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి
శంపాలతికతోడి జలదంబు కైవడి; మెఱుఁగు టొల్లియతోడి మేనివానిఁ
కమనీయ మృదులాన్నకబళ వేత్ర విషాణ; వేణుచిహ్నంబుల వెలయువాని
గుంజా వినిర్మిత కుండలంబులవాని; శిఖిపింఛవేష్టిత శిరమువానిఁ
వనపుష్పమాలికావ్రాత కంఠమువాని; నళినకోమల చరణములవానిఁ
గరుణ గడలుకొనిన కడకంటివాని గో పాలబాలుభంగిఁ బరగువాని
నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!
శంపాలతిక అంటే మెరుపుతీగ. కృష్ణుడు మెరుపుతీగతో కూడిన వర్షాకాలములోని నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు. పైన చిన్న ఉత్తరీయం ఉంది. ఎడమచేతిలో పెరుగు అన్నపు ముద్ద ఉంది. ఎడమ చంకలో కొమ్ము బూర ఉంది. చేతిలో కర్ర ఉంది. పీతాంబరమును కట్టుకున్నాడు. ఏనుగు దంతంతో చేయబడిన కుండలములు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి ఈక నొకదానిని పెట్టుకున్నాడు. అరణ్యములలో దొరికిన పద్మములతో కూడిన తీగనొకదానిని దండగా మేడలో వేసుకున్నాడు. అలా కనపడుతున్న కృష్ణుని పాదములమీద పది బ్రహ్మగారు స్తోత్రం చేశారు.
ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని న్నీలోకంబున నీ వనాంతరమునం దీ మందలోఁ గృష్ణ యం చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే?
నాకీ దిక్కుమాలిన బ్రహ్మపదవి ఎందుకు? బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీ క్రుతమయిన నీవు, ఈ వేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతున్నావు. నీతోకలిసి ఆడుకుని పొంగిపోయిన ఈ గోపబాలుర పాదములకు అంటుకొనిన ధూళికణమును తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టమును నాకు కటాక్షించు. నాకు ఈ బ్రహ్మపదవి వద్దు’ అన్నాడు.
ఎవరు ఈ బ్రహ్మగారు చేసిన స్తుతిని చదువుతారో వారిని మాయ విడిచిపెడుతుంది. అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయం లేకుండా, అంతటా సంతోషముతో చూస్తూ, తేలికగా ప్రాణములు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మములో కలిసిపోతారు. ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈవిధంగా కౌమారం నందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడింది. ఏడాది పాటు కృష్ణుడే అన్నీ అయి వున్నాడు

శ్రీమద్భాగవతం - 76 వ భాగం

ధేనుకాసుర వధ:
ఒకనాడు కృష్ణభగవానుడు బలరామునితో కలిసి ఆవులను, దూడలని తీసుకుని బృందావనం లోనికి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజూ ఆ ఆవులను, దూడలను తీసుకువెళ్ళి కాపాడే ఆ పరయట్నంలో ఉన్నారు. మనకి భాగవతంలో కథ ఎక్కువగా కృష్ణునితో అనుసంధానం అవుతుంది. కానీ ఈ ఘట్టం జరిగేరోజున కథను బలరామునితో అనుసంధానం చేశారు. కృష్ణభగవానుడు ఆ రోజున బలరాముని కీర్తన చేస్తాడు. ‘అన్నయ్యా, ఈవేళ చెట్లన్నీ వంగి వున్నాయి. మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళనన్నిటిని కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళను మీరు తినాలని అవి కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ పాదఘట్టన చేత పరవశిస్తోంది. అన్నయ్యా, మీరు మహాపురుషులు’ అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే, బలరాముని శిరస్సును ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని పాదములను కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.
కొన్ని ఆవులు కనపడలేదు. వారి ఆవుల మందలో కొన్ని వేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమి ఉంటుంది? పిల్లలందరూ పరుగుపరుగున వచ్చి ఒకమాట చెప్పారు. ‘బాలరామా, ఇక్కడకు దగ్గరలో తాటికోట ఒకటి ఉన్నది. అక్కడి తాటిచెట్లకు పెద్దపెద్ద తాటిపళ్ళు ఉన్నాయి. అవి ముగ్గి చెట్టునుండి క్రిందపడ్డాయి. పిల్లలందరికీ ఆ పండ్లు తినాలని కోరిక. కానీ అక్కడ ధేనుకాసురుడని పిలువబడే గార్దభాసురుడు ఉండేవాడు. అతడు గాడిద రూపంలో వున్నా రాక్షసుడు. గాడిద తాటిపండు తినదు. తాటిపండు వాసన తెలియదు. కానీ అది ఎవ్వరినీ తోటలోనికి రానివ్వదు. ఎవ్వరినీ ఆ తాటిపండ్లు తిననివ్వదు. ఒకవేళ ఎవరయినా ఆ తాటిపండు తినడానికి లోపలికి వచ్చినట్లయితే యిది గబగబా వెళ్ళి వెనకకాళ్ళు ఎత్తి అవతలా వాడి గుండెల మీద తన్ని వాడు మరణించేటట్లు చేస్తుంది. కాబట్టి ఎవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈమాట చెప్పి వాళ్ళు అన్నారు – మాకు ఎప్పటినుంచో ఆ తాటిపళ్ళు తినాలని ఉంది. బలరామా, మాకు ఆ తాటిపళ్ళు తినే అద్రుస్తమును కల్పించవా’ అని అడిగారు.
అపుడు బలరాముడు ‘మీకేమీ భయం లేదు. నా వెంట రండి’ అన్నాడు. బలరాముడు అపారమయిన బలశాలి. గోపబాలురనందరినీ ఆ తాటి వనంలోనికి తీసుకువెళ్ళాడు. అక్కడకు వెళ్ళి ఒక తాటి చెట్టును పట్టుకుని ఊపాడు. తాటిపళ్ళు గలగల క్రింద రాలాయి. పిల్లలందరూ బలరాముడు తాటిపళ్ళను ఇప్పించాడని ఎంతో సంతోషంగా వాటిని తింటున్నారు. దానిని గార్దాభాసురుడు చూశాడు. ‘ఇన్నాళ్ళ నుంచి ఈ తాటిపళ్ళు ఎవరు తినకుండా కాపాడాను. ఈవేళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తినేస్తున్నారు’ అని వాడు వెంటనే గాడిదరూపంలో వచ్చి బలరాముడి గుండెలమీద తన వెనక కాళ్ళతో తన్నబోయాడు. అపుడు బలరాముడు గార్దభాసురుని రెండుకాళ్ళు ఒడిసిపట్టుకుని వాడిని గిరగిర త్రిప్పి ఒక తాటిచెట్టు మీదికి విసిరాడు. అది వెళ్ళి ఒక తాటి చెట్టుకు తగిలింది. ఆ గాడిద దెబ్బకు ఆ తాటిచెట్టు వెళ్ళి ఇనొక తాటిచెట్టు మీద పడింది. దాని విసురుకి ఆ తాటిచెట్టు వెళ్ళి మరొక తాటిచెట్టు మీద పడింది. పెద్దగాలి వస్తే ఎలా పడిపోతాయో అలా అక్కడి తాటిచెట్లన్నీ కూలిపోయాయి. హాయిగా పిల్లలందరూ ఆ తాటిపళ్ళు తినేశారు. గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు మరణించాడు. ఆ గాడిదకు బోలెడు పిల్లలు ఉన్నాయి. ‘మా నాన్నగారిని ఎవరో సంహరించారు’ అని పిల్ల గాడిదలు అన్నీ కృష్ణుడు మీదకి, బలరాముడి మీదకి యుద్ధానికి వచ్చాయి. బలరాముడు ఆ గాడిదలన్నింటినీ అవలీలగా చంపివేశాడు.
పుట్టుకతో మీ అంతటమీరు ప్రయత్నం చేయకుండా అలవాడే గుణం ఒకటి ఉంటుంది. దాని పేరే లోభము. అది మనిషికి సహజంగా ఉండే స్వభావం. మామిడి చెట్టుకు నీరు పోస్తే అది మామిడికాయలను ఇస్తుంది. కానీ తను కాయించిన కాయలలో ఒక్క కాయనయినా మామిడి చెట్టు తినదు. నది రాత్రనక, పగలనక ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దాహం వేస్తోందని నది తన నీళ్ళు తాను ఒక్క చుక్క త్రాగదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారుచేస్తుంది. తన పాలను తీసుకువెళ్ళి ఆవుదగ్గర పెడితే అది వాసన చూసి వదిలేస్తుందే తప్ప ఒక్క చుక్క పాలను త్రాగదు. ఈ ప్రపంచంలో తనవి కానివి అన్నీ తెచ్చుకుని దాచుకునే దుర్మార్గుడు మనుష్యుడు ఒక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ యితరుల కోసమే జీవిస్తాయి. తమకి అని వాటికి దాచుకోవడం చేతకాదు. కానీ మనిషికి మాత్రం పుట్టుకతో లోభగుణం వస్తుంది. ఈ లోభమును మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే డానికి అంతు ఉండదు. తృప్తి అనేది మనస్సులో కలగాలి. చితి ఒక్కసారి కాలుస్తుంది. చింత నిరంతరం కాలుస్తుంది. అది ఎక్కువయిపోకుండా ఉంటాలంటే మనిషి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని వైపు తిరగాలి. అలా తిరగకపోతే మనస్సుకి ఆలంబనమును మనస్సు వెతికేసుకుంటుంది. ఎప్పుడూ ఐశ్వర్యం గురించో, పిల్ల గురించో, మరియొక దాని గురించో ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది. దానివలన ఎప్పుడూ బాదే. ఇటువంటి లోభ గుణం చేత నరకము వస్తుంది. భార్యా బిడ్డలని పోషించడానికి ధనార్జన చెయ్యాలి. దానిలో కొంత నిలవ చేయాలి. దానిని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టలేదు. మనిషి సంపాదించిన పుణ్యఫలమును భార్య, పిల్లలు అందరూ పంచుకుంటారు. కానీ పాప ఫలమును మాత్రం ఎవరూ పంచుకోరు. దానిని వాడే అనుభవించాలి. అటువంటి పాప ఫలితమును పొందకుండా ఉండాలంటే పుణ్య కార్యములను చేయాలి. ప్రయత్నపూర్వకంగా అర్హులయిన ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్నదానిలో ఎంతో కొంత ఉదారముగా దానం చేయాలి. ఈ లోభ గుణమును విరుచుకోవడం మీ అంతటా మీకు రాదు. మహా పురుషుల జీవితములను ప్రయత్నపూర్వకంగా చూడాలి. పదిమందికి సేవచేయడానికి ఎవడు ముందుకు వస్తున్నాడో వానిని స్వార్థం లేకుండా పొగడడంలో వెనుకంజ వేయకూడదు. అందుకే కృష్ణ భగవానుడు బలరాముడిని స్తోత్రం చేశాడు. మహాపురుషులను సేవిస్తే, మహాపురుషుల జీవితములను తెలుసుకుంటే మీలోవున్న లోభగుణము విరిగిపోతుంది. పదిమంది కోసం బ్రతకడం అలవాటవుతుంది.
కాళియ మర్దనము:
ఒకనాడు కృష్ణభగవానుడు గోపబాలురతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ నాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునానదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. అపుడు వారు కాళిందిలో వున్న నీరు త్రాగారు. వెంటనే వారందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణా దృష్టితో చూశాడు. అపుడు ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. ఆ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తుంటాయి. ఆ నీల్లి ఉడికిపోతున్నట్లుగా ఉంటాయి. ఆ నీటినుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. ‘ఈ నీళ్ళు ఎందుకు యిలా వున్నాయి?’ అని వాళ్ళని అడిగాడు.
డానికి కారణం – ఎప్పటినుంచో ఆ మడుగులో కాళియుడు అనబడే నూరు తలలు కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకుని ఉంటుంది. డానికి అనేక భార్యలు. ఎందఱో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషమునంతటినీ ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితం అయింది అని తెలుసుకున్నాడు. కృష్ణుడు ‘మీరు అందరూ మరణించడానికి యిది కారణం. కాబట్టి యిప్పుడు నేను ఏమి చేస్తానో చూడండి’ అని తాను కట్టుకున్న పంచెను మోకాళ్ళ మీదవరకు తీసి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. నెమలి ఈకను కూడా బాగా బిగించి కట్టుకున్నాడు. రెండు పాదములను నేలపై గట్టిగా తాటించి ఒకసారి ఊగాడు. అక్కడ ఒక కడిమిచెట్టు ఉంది. కృష్ణుడు ఆ చెట్టును ఎక్కాడు. నాటితో తన జన్మ ధన్యమయి పోయిందని, తనంత ప్రాణి మరొకటి లేదని ఆ చెట్టు అనుకుంది. క్రింద వున్న మడుగు కూడా ఈవేళ సుకృతం అవుతోంది. గోపాలబాలుడుగా ఉన్న కృష్ణ పరమాత్మ ఆ మడుగు నీళ్ళల్లోకి సింహము దూకినట్లు దూకాడు. ఆయన నీళ్ళల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. అసలు ఈ మదుగును చూసేసరికే అందరూ భయపడతారు. అలాంటిది ఇలాంటి మడుగులోనికి దూకడానికి ధైర్యం ఎవరికీ వున్నది?” అని సాక్షాత్తు కాళియుడే చూశాడు. అందులో ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతున్న చిన్ని కృష్ణుడిని చూశాడు. ‘ఎంత ధైర్యం ఈ పిల్లాడికి. నేను ఉన్న మడుగులోకి దూకుతాడా?’ అనుకుని పడగలు విప్పి కాటువేశాడు. కృష్ణ పరమాత్మ స్పృహ తప్పాడు. అపుడు కాళియుడు తన దీర్ఘమయిన శరీరంతో కృష్ణ పరమాత్మను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. ఒడ్డున ఉన్న గోపాల బాలురు భయంతో పరుగుపరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు.
ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఏమి జరిగిందోనని భయపడుతున్నారు. కృష్ణుడు కనపడడం లేదు. కాళియమడుగులోని నీటిలో దూకాడు అన్నారు. అందరూ వెతుక్కుంటూ వచ్చారు. కృష్ణుడు కాళింది మడుగులో పాముచేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు. ఆ పాము నిన్ను కరిచింది. అదేదో మమ్మల్ని కరిస్తే మేము చచ్చిపోయినా గొడవలేకపోను. ఎందుకంటే మేము చచ్చిపోతే నీవు బ్రతికిస్తావు. నీవు చనిపోతే మేము నిన్ను బ్రతికించలేము. నీవు చనిపోయిన తరువాత అయ్యో ఏమి చేస్తాము అని వెనక్కి వెడతామని అనుకుంటున్నావేమో నువ్వు అలా మరణిస్తుండగా మేము అలా చూస్తూ బ్రతికి ఉండము. కాబట్టి మేమూ కాళింది మడుగులో దూకేస్తాము. మేమూ ఆ పాము విషంతో చచ్చిపోతాము’ అని యశోద కొంగు బిగించుకుని కాళింది మడుగులోకి దూకేయబోయింది. యశోద వెనుక గోపకాంతలందరూ దూకే ప్రయత్నంలో ఉన్నారు. గోపాల బాలురు కూడా అదేప్రయట్నంలో ఉన్నారు.
ఇపుడు పరమాత్మ దీనిని చూశాడు. తనను గురించి ఆర్తి చెందేవారున్నారు. ‘నేను వీళ్ళకి దక్కాలి’ అనుకున్నాడు. ఒక్కసారి తన శరీరమును వెడల్పుగా, పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసిన పాము మధ్యలో వున్నశరీరం పెరిగిపోతే, కాళియుని శరీరం అంతా ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయింది. ఆ పిల్లవాడు ఒక్కసారి పైకెగిరి పిడికిలి బిగించి ఆ పడగల మీద ఒక్క గుద్దు గుద్దాడు. అలా గుద్దేసరికి అది నవరంధ్రముల నుండి నెత్తురు కక్కేసింది. పట్టు వదిలేసి కిందపడిపోయింది. దానిని కృష్ణుడు చూశాడు.
కాళియుని తోకపట్టుకుని ఎగిరి పడగల మీదకి ఎక్కాడు. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దానిని తొక్కుతూ ఉండేవాడు. మణులతో కూడిన ఆ కాళియుని పడగలు ఆయన నాట్యం చేసే రంగస్థల మంటపం అయింది. గోపకులు, గోపకాంతలు అందరూ ఆయమున ఒడ్డున సంతోషంతో ‘శభాష్ కృష్ణా’ అని సంతోషంతో అరుస్తున్నారు. ప్రేక్షకులుగా దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఆయన పడగల మీద ఎక్కి తొక్కుతుంటే తలల పగిలిపోయి, లోపల వున్న మణులు చెల్లాచదరయి పోయాయి. దాని నోట్లోంచి నెత్తురు ధారలుగా కారి నీటిలో పడిపోతోంది. అప్పటివరకు విషముతో నల్లగా వున్న నీటిపైన నెత్తురు తెట్టుగా కట్టింది. కాళియుడు శోషించి పోయి నీటిలో పడిపోయే స్థితి వచ్చింది.

శ్రీమద్భాగవతం - 77 వ భాగం

కాలియునికి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళు తమ బిడ్డలను ఎత్తుకుని తమ ఒంటిమీద వున్నా ఆభరణములు చిక్కుపడి చెల్లాచెదరయి పోతుండగా, కొప్పు ముడులు విడిపోగా, పెట్టుకున్న పుష్పములు రాలిపోతుంటే ఒంటిమీద బట్ట సరిగా ఉన్నదో లేదో కూడా చూసుకోకుండా పరుగుపరుగున అక్కడకు వచ్చి చంటిపిల్లలను కృష్ణుని పాదముల దగ్గర పడుకోబెట్టి ఆయనను ప్రార్థన చేశారు. ఈ కాళియుడు ఇంతకు పూర్వం ఎటువంటి తపస్సు చేశాడో! ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో! ఎటువంటి గొప్పగొప్ప పనులు చేశాడో! మహాత్ములయిన వారికి కూడా దర్శనం అవని నీ పాదపద్మములు ఈవేళ మాభార్త తలలమీద నాట్యం చేస్తున్నాయి. అతని శిరస్సులన్నీ నీ పాదముల ధూళిచేత అలంకృతమయ్యాయి. ఇవాళ మా భర్త పుణ్యాత్ముడు. అంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నీవు అంత గొప్ప అనుగ్రహమును యిచ్చావు. ఈవేళ లక్ష్మీదేవికంటే మా ఆయనే గొప్పవాడు. లక్ష్మీదేవి పొందని వైభోగామును ఇవాళ మా భర్త పొందాడు. ఇంత గొప్ప తపస్సు చేశాడు. దయచేసి మా మనవిని కూడా నీవు వినవలసింది’.
‘ఈశ్వరా! మా తల్లిదండ్రులు ఈ కాళియుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడు అవుతాడని అతనిని ఎవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుదని, మమ్మల్ని యితనికిచ్చి పెండ్లిచేశారు. మా అయిదవతనం, మా పసుపుకుంకుమలు యితని ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్ళు పెళ్ళిచేస్తే మాకు పసుపు కుంకుమలు వచ్చాయి. అయిదవతనం వచ్చింది. అవి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు. ఉండవు అని నీవు తెల్చేస్తున్నావు. నీవు అనాథ నాతుడవు. అటువంటప్పుడు నీవే మమ్మల్ని అనాథలను ఎలా చేస్తావు? భక్తుల కోర్కెలు తీర్చే స్వామీ, మాకు పతిభిక్ష పెట్టవలసినది’ అని అడిగారు.
ఇప్పుడు కాళియుడు కృష్ణుని స్తోత్రం చేశాడు. ‘ఈశ్వరా, తప్పు నాదే. ఎక్కడ తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. ఈవేళ ఈ ప్రమాదం నాకు ఎక్కడినుంచి వచ్చినదో నేను గ్రహించగలిగాను’ అన్నాడు. కాళియుడు స్తోత్రం చేయగానే పరమాత్మ అన్నారు –
ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. వారికి దాహం వేస్తే ఈ మడుగులోని నీరు త్రాగుతారు. నీవంటి ప్రమాదకారి ఇందులో పడుకుంటే నీళ్ళు విషం అవుతాయి. నీవు యిక్కడ ఉండవద్దు. నీవు పూర్వం రమణక ద్వీపంలో ఎక్కడ ఉండేవాడివో అక్కడికి వెళ్ళిపో. రమణక ద్వీపమునకు వెడితే గరుడుడు నిన్ను చంపెస్తాడని భయపడుతున్నావు. నీ భయం నాకు తెలుసు. నీకా భయం లేకుండా ఇవ్వాళనుండి నీ జాతి మొత్తానికి ఒక అభయం ఇస్తున్నాను. మీ పడగల మీద కృష్ణ పాదములు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణ పాదములు కనపడతాయి. కృష్ణ పాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తరుమదు. గరుడుడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు. అందుకని రమణక ద్వీపమునకు వెళ్ళిపో’ అలా అనగానే కాళియుడు కృష్ణునకు నమస్కారం చేసి తేనే మొదలగు మధుర పదార్థములు, మంచిమంచి హారములు, పట్టు బట్టలు తెచ్చి కృష్ణ భగవానునికి బహూకరించి తన స్నేహితులతో బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మరల రమణక ద్వీపమునకు వెళ్ళిపోయాడు.
ఈ కాళియ మర్దనమును ఉభయ సంధ్యలందు ఎవరు వింటున్నారో వారికి ఇన్నాళ్ళనుండి కాళియుడిళా లోపల పట్టిన విషము పోతుంది. బాహ్యమునందు కాళియమర్దనం విన్న వాళ్ళని పాములు కరవవు. అది కృష్ణ భగవానుడి వరం. ఇందులోని తత్త్వమును మనం గ్రహించాలి. కాళియుడంటే ఎవరో కాదు. మనమే. యోగశాస్త్ర ప్రకారం మనకు హ్రుదయక్షేత్రమునుండి 101నాడులు బయలుదేరుతాయి. వాటిని జ్ఞాన భూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు యిస్తాడు. వీటిని మీరు సద్బుధ్ధితో వాడుకున్నట్లయితే అందరియందు ప్రేమతో, భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రముల నుండి మేధకి జ్ఞాన ప్రసరణ జరుగుతుంది. దీనిలోనికి ఇపుడు కాళియుడు వచ్చి కూర్చున్నాడు. కాళియుడికి ఒక రహస్యం ఉంది. యితడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. ‘రమణ’ అనే మాటకు శబ్ద రత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పు అయినదో డానికి రమణకము అని పెరు. అనగా ఎలా ఉండాలో అలా వుంటే అది రమణకము. కాళియుడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. అక్కడ వున్న వాళ్ళకి గ్రద్దలంటే భయం. అందుకని ప్రతిరోజూ కూడా కొంతకొంతమంది కొద్ది తేనె, కొద్ది చలిమిడి, కొద్ది చిమ్మిలి పట్టుకువెళ్ళి గ్రద్దలకి ఆహారంగా పెట్టేవారు. అలా పెట్టేలా నియమమును ఏర్పాటు చేసుకున్నారు. గ్రద్దలు వచ్చి అలా పెట్టినవి తినేసి వెళ్ళిపోయేవి. పాముల జోలికి వచ్చేవి కావు. ఒకరోజున కాళియుని వంతు వచ్చింది. వానిని కూడా కొద్ది తేనే, చిమ్మిలి చలిమిడి పెట్టమని అడిగారు. ‘ఎవరికి పెట్టాలి?’ అని అడిగాడు కాళియుడు. గరుడుడు వస్తాడు అతనికి బాలి ఆహారమును పెట్టాలి అన్నారు. అపుడు కాళియుడు ‘గరుత్మంతు డెవరు? నేను పెట్టను. నేను బలవంతుడిని’ అన్నాడు. అయితే నీఖర్మ అని కాళియుడిని వదిలేశారు. గరుత్మంతుడు వచ్చి ‘నాకు ఈవేళ ఆహారం పెట్టని వారెవరు? అని అడిగాడు. మిగిలిన పాములు కాళియుడు పెట్టలేదని చెప్పాయి. కాళియుడి మీదకి గరుత్మంతుడు వెళ్ళేలోపల గరుత్మంతుడి మీదకి కాళియుడు వెళ్ళాడు. తన నూరు పడగలూ ఎత్తి గరుత్మంతుడి ఎడమరెక్క మీద కాటు వేశాడు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. కాళియుడిని వెంటపడి తరిమి తన రెక్కతో కొట్టాడు.కొడితే కాళియుడి ఒళ్ళంతా బద్దలయిపోయి నెత్తురు వరదలై కారిపోయింది. వెనుక గరుత్మంతుడు తరుముకు వస్తున్నాడు. కాళియుడికి గరుత్మంతునికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు. ఆటను పారిపోయి సౌభరి తపస్సు చేసుకునే కాళింది మడుగులోకి దూరిపోయాడు.
అక్కడికే ఎందుకు వెళ్ళాడు? ఒకనాడు సౌభరి మహర్షి సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒకరోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజును ఎత్తుకుపోయి తినేశాడు. వెంటనే సౌభరి మహర్షి గరుత్మంతుడిని శపించారు. ‘సంతోషంగా సంసారం చేస్తున్న చేపలలో ఒక చేపను నిష్కారణంగా తిన్నావు కాబట్టి నీవు ఎప్పుడయినా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు’ అన్నారు. అందుకని గరుత్మంతుడు అక్కడికి రాడు. కాబట్టి కాళియుడు కాళింది సరస్సును చేరాడు.
ఈశ్వరుడు ముందు రమణకమును అనగా మనుష్య శరీరమును యిస్తాడు. ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపము. దీనితో మీరు హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు. కాళ్ళతో దేవాలయమునకు వెళ్ళవచ్చు. చెవులతో భాగవతమును వినవహ్చు. నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు. కానీ మనిషి ఏమి చేస్తాడంటే సంసారంలో హాయిగా సుఖంగా ఉంటూ, దేవతలకు తాను పెట్టవలసిన భాగమును పెట్టడు. తత్సంబంధమయిన క్రియలు చేయడం మానివేస్తాడు. నీవు ఎన్ని సుఖములను అనుభవిస్తున్నా కనీసంలో కనీసం కొద్ది చిన్న బెల్లపు ముక్కనయినా పూజగదిలో పెట్టి రోజూ ఒక్కసారి భగవంతునికి నివేదన చేసి దానిని కళ్ళకు అడ్డుకుని నోట్లో వేసుకోవాలి. కానీ మనిషి ఇవేమీ చేయదు. చేయనని తిరగబడతాడు. ఇలా తిరగబడడం గరుత్మంతుడి మీద తిరగబడడం వంటిది. దేవతలు ఆగ్రహమును ప్రదర్శిస్తారు. అపుడు ప్రమాదం వస్తుంది. అక్కడే వుంది మరల దేవతారాధన చేస్తే చిన్నతనం! అందుకని ఎవరెవరు దేవతారాధనకు యిష్టపడరో అటువంటి చోటికి వెళతాడు.అందుకని ఇక్కడ కాళియుడు కాళింది మడుగుకి వెళ్ళాడు. లోపల మార్పు రాలేదు. ఆ మడుగుని విషముగా తయారుచేస్తున్నాడు. తనలో వున్నా నూరు జ్ఞాన ప్రసార కేంద్రములను ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. ఇప్పుడు భయంకరమయిన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈశ్వరుడు యీ విషమును వెనక్కి తీయడు. ఆ అహంకారము పెరిగి పెరిగి భగవంతుని నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్ళాడు. ఈశ్వరుడు యింక క్షమించడు. అందుకని గోపాల బాలురు ఆవుదూడలు మడుగులోని నీటిని త్రాగి మరణించాలి. అలా అపచారం జరిగింది. ఇప్పుడు ఈశ్వరునికి ఆగ్రహం వచ్చింది తన భక్తుల జోలికి వెడితే ఈశ్వరుడు ఊరుకోడు. నూరు పడగలు పగిలి పోయేటట్లు తొక్కేశాడు. కాళియుని భార్యలు శరణాగతి చేశారు కాబట్టి వదిలాడు. ఇపుడు లోపల వున్నా బుద్ధి సద్బుద్ధి అయింది. ఇపుడు విషమును బయటకు తీసి మరల వదిలిపెట్టాడు.
కాళియమర్దనము వింటే మనలోని నూట ఒక్క నాడులలో వున్న విషం వెనక్కు వెళ్ళి సద్బుధ్ధితో మనం అందరం హాయిగా కృష్ణ పరమాత్మ పాదములను శిరస్సునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాబట్టి కాళియ మర్దనమునకు బాహ్య ప్రయోజనము ఏమిటి? అంటే పాము కరవదు. అంతర ప్రయోజనము ఏమి? అంటే లోపలిపాము నీరసిస్తుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీనిని కాళింది మడుగు చేయదు. మరల రమణక ద్వీపం చేస్తుంది. కాళియమర్దనం వినగానే మరల ఈ శరీరమంతా శుద్ధి అయిపోతుంది. కాళియమర్దనం అనే లీలకు అంత పరమ పవిత్రమయిన స్థితి ఉంది.
శ్రీమద్భాగవతం - 78 వ భాగం
ప్రలంబాసుర వధ :
ఒకనాడు కృష్ణుడు, బలరాముడు గోపబాలురు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వారు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు బలరాముడు నాయకుడు. రెండవ జత్తూ కృష్ణుడు నాయకుడు. కృష్ణుడు చాలా చమత్కారి. జట్ల ఎంపిక చేస్కునే ముందు కృష్ణుడు బలరాముని ఓ చెట్టు చాటుకు తీసుకువెళ్ళి ‘అన్నయ్యా, ఈవేళ గోపబాలురలో ప్రలంబుడు అనే రాక్షసుడు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి చేరాడు. వాడు నా జోలికి రాదు. నిన్ను చంపుదామనే వచ్చాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వాడిని నేను నా జట్టులో పెట్టుకుని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉంటాను. వాడిని నీ జట్టులోకి కోరవద్దు’ అని చెప్పాడు. ఆమాట చెప్పిన తరువాత యిద్దరూ వెనక్కి వచ్చారు. ప్రలంబాసురుడికి కడుపులో ఒక బెంగ ఉంది. కృష్ణుడు మీదికి గతంలో చాలామంది రాక్షసులు వచ్చి మడిసిపోయారు. కృష్ణుడికి ప్రమాదం తెచ్చిన వారు ఎవరూ లేరని ప్రలంబాసురునికి తెలుసు. కాబట్టి కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా బలరాముని జోలికి వెళ్ళడం తేలిక అనుకున్నాడు. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచి ఉండలేక కృష్ణుడు తానె ప్రమాదం కొని తెచ్చుకుంటాడని అతడు భావించాడు. బలరాముడికి ఏదయినా ప్రమాదం తెద్దామనే ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనను భావించాడు. బలరాముడికి ఏదయినా ప్రమాదం తెద్దామనే ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనను నమ్ముకున్న వాడిని, తనకోసమని అవతారమును స్వీకరించిన వాడిని, తాను పడుకుంటే పరుపయిన వాడిని, తాను కాలుపెడితే పాదపీఠమయిన వాడిని, తాను కూర్చుంటే పైన గొడుగయిన వాడిని, తాను నడుస్తుంటే ఛత్రము పట్టిన వాడిని ఈశ్వరుడు అంత తేలికగా వదిలిపెడతాడా? తన వారన్న వాళ్ళని ఈశ్వరుడు వెయ్యి కళ్ళతో కాపాడుకుంటాడు. అందుకని ప్రలంబుడిని తన జట్టులో పెట్టుకున్నాడు.
ఆట ప్రారంభం అయింది. ఈరోజున కృష్ణుడు బృందం ఓడిపోయింది. బలరాముడి బృందం గెలిచింది.ఇప్పుడు బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మోయాలి. ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రలంబుడు బలరాముడిని తాను మోస్తానని ముందుకు వచ్చాడు. బలరాముడికి అర్థం అయి సరే మొయ్యి అన్నాడు. అక్కడ ఒక ఒక నియమం పెట్టబడింది. ఎవరు ఎవరిని మోసినా అక్కడ గీయబడిన గీతవరకు తీసుకువెళ్ళి అక్కడ వదిలెయ్యాలి. అక్కడవరకు మాత్రం మొయ్యాలి. సరేనని బలరాముడిని ప్రలంబుడు ఎక్కించుకున్నాడు. ‘పర్వతమంత బరువు వున్నాడేమిటిరా?’ అని అనుకుంటున్నాడు. పరుగెడుతున్న ప్రలంబుడు గీతదాటి వెళ్ళిపోతున్నాడు. పైన కూర్చున్న బలరాముడు, ప్రలంబుని ఆగమని అరుస్తున్నాడు. కానీ వాడు ఆగడం లేదు. ఇంకా బాలుడి రూపంలో మొయ్యలేనని రాక్షసుడు అయిపోయాడు. తమ్ముడు ముందుగానే చెప్పాడు కాబట్టి ఏ భయం లేకుండా బలరాముడు వాడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. అపుడు ప్రలంబాసురుని తల బ్రద్దలై వాడు నేలమీద పడిపోయి మరణించాడు. అప్పుడు పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించారు.
ఈలీలలో మనం తెలుసుకోవలసిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఉంది. సాధారణంగా భగవంతుడిని ఏమీ చేయలేక, భగవంతుని భక్తులను హింసించే ప్రయత్నం కొంతమందిలో ఉంటుంది. భగవంతుడే అటువంటి వాళ్ళ మృత్యువుకు మార్గమును తెరుస్తాడు. ఆ భక్తుడిని ఆయనే, బలరాముడిని కృష్ణుడు రక్షించుకున్నట్లు రక్షించుకుంటాడు. కాబట్టి భగవద్భక్తులను హింసించడం, తిరస్కరించడం, భగవంతుని పట్ల ప్రేమగా వున్నట్లు నటించడం పరమ ప్రమాదకరం. దాని వలన ఈశ్వరానుగ్రహమును పొందరు. బలరాముడిని చంపితే కృష్ణుడు చనిపోతాడన్న ప్రలంబుడి ఊహ ఎంత ప్రమాదకరమో భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళగలము, వాళ్ళను ఉపేక్షించవచ్చు, వాళ్ళని ప్రమాదం లోనికి తీసుకువెళ్లవచ్చు భగవంతుడిని ఏమీ చేయలేం కాని భక్తులను ఏమైనా చేయవచ్చు అని అనుకోవడం అంత అవివేకం. ఈశ్వరుడు భక్తులను కంటిని రెప్ప కాపాడినట్లు కాపాడుతూనే ఉంటాడు. భగవంతుని వలన వారు అటువంటి రక్షణ పొందుతారని భాగవతులయిన వారందరికీ కూడా ఒక గొప్ప అభయమును ఇస్తూ ఈశ్వరుడు ప్రలంబవధ అనబడే ఈ లీలను చేసి, మనకందరికీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి యిన్ని గొప్ప విషయములను ఆవిష్కరించి ఉన్నాడు.
గోపికా వస్త్రాపహరణం :
భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత చేసిన లీలలు అనేకము ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టము పరమ ప్రామాణికమయినది. ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల.
బృందావనంలో వుండే గోపకాంతలు అందరూ కూడా కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఒక విచిత్రమయిన విషయం. ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడయిన వరుడు ఒక యింట్లో ఉన్నాడనుకొండి ఆ ఊళ్ళో ఉన్న కన్యలందరూ ఎక్కడయినా అతనిని భర్తగా పొందాలని సామూహిక పూజ చేస్తారా? చేయరు. కానీ ఇక్కడ గోపకాంతలు అటువంటి పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్క్రుష్టమయిన ప్రతిపాదన. వారు మార్గశీర్ష మాసములో ఒక వ్రతము చేశారు. యథార్థమునకు భాగవతంలో గోపకాంతలు మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం. వీరందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది కాబట్టి పార్వతీ దేవికి కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. కృష్ణుడిని ఉపాసన చేసి కృష్ణుని భర్తగా పొందాలి. కానీ మధ్యలో కాత్యాయనీ దేవి పేరుతొ పార్వతీదేవిని ఉపాసన చేసే కృష్ణుడు ఎలా భర్త అవుతాడు? ఇందులోనే ఒక చమత్కారం ఉంది. ఇందులోనే ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణి అని పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ నారాయణి వీరు భార్యాభర్తలు కాదు. అన్నాచెల్లెళ్ళు. అందుకే వీరిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. కృష్ణుడికి కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతలు అందరూ కాత్యాయనీ వ్రతం చేస్తారు. గోపకాంతలు ప్రతిరోజూ ఇసుకతో కాత్యాయనీ దేవి మూర్తిని చేసేవారు.
కాత్యాయని మహామాయే మహాయోగే నదీశ్వరి
నందగోపసుతం దేవీ పతిం మే కురుతే నమః!!
అదీ వాళ్ళు చేసిన సంకల్పం. వారందరూ లౌకికమయిన భర్తను అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తెర తొలగి జీవ బ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యము అవడం కోసమని అమ్మా నీ అనుగ్రహం కలగాలి. మాకు కృష్ణుడిలో కలిసిపోయే అదృష్టం కలగాలి అని దానిని భార్యాభర్త్రు సంబంధంగా మాట్లాడుతున్నారు. ఆ వ్రతమును ముప్పది రోజుల పాటు మార్గశీర్షంలో చేయాలి. ప్రతిరోజూ గోపకాంతలు నిద్రలేచేవారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా యమునానది తటము దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది. కదంబవృక్షం, కడిమి చెట్టు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమయినది.అమ్మవారికి ‘కదంబ వనవాసిని’ అని పేరు. అక్కడ సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయడం కోసమని యమునా నదిలోనికి దిగారు. ఇంతమంది కలిసి వివస్త్రలై యమునా నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు. వారు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయమును తెలుసుకున్నారు.
ఇప్పుడు గోపకాంతలు కాత్యాయనీ దేవి ఉపాసన చేసి ఫలితమును అడుగుతున్నారు. ఫలితము ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు. వాళ్ళ భక్తీ అంత గొప్పది. కానీ వారు చేసిన కర్మయందు తేడా వచ్చింది. ఆ దోషము ఉన్నంత సేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది. ఫలితమును ఇవ్వడం కుదరదు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఏది ప్రతిబంధకంగా ఉన్నదో దానిని ఈశ్వరుడు తీసివేస్తాడు. ఈ ప్రతిబంధకమును కాత్యాయనీ దేవి తియ్యాలి. కానీ యిక్కడ ప్రతిబంధకమును తొలగించడానికి కృష్ణుడు వస్తున్నాడు. దీనిని బట్టి కాత్యాయని, కృష్ణుడు వేర్వేరు కాదని మనం అర్థం చేసుకోవాలి. కాత్యాయని ఆడది, కృష్ణుడు పురుషుడు అదెలా కుదురుతుంది అని మనకి అనుమానం రావచ్చు. కానీ పరమేశ్వరుడికి రూపం లేదు. ఆయన జ్యోతి స్వరూపము. కంటితో మేము చూడకుండా ఉండలేము అన్నవారి కోసమని ఒక సగుణమయిన రూపం ధరించి పరమాత్మ ఈ భూమిమీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపమీ అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఇప్పడు ఇక్కడ అంతటా వున్నవాడు సాకారత్వమును పొంది ఫలితమును యివ్వడానికి కృష్ణుడిగా వస్తున్నాడు. కృష్ణుడు గోపాల బాలురందరినీ పిలిచి మీరందరూ నిశ్శబ్దంగా ఇక్కడినుండి వెళ్ళిపొండి అన్నాడు. నిజంగా కృష్ణావతారం స్త్రీల మాన మర్యాదలను పాడుచేసే అవతారం అయితే కృష్ణుడు అలా అని ఉండేవాడు కాదు. కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం వారు అక్కడినుండి వెళ్ళిపోయారు. వారికి వ్యామోహం లేదు. కృష్ణుడు ఏమి చేస్తాడో చూడాలన్న తాపత్రయం లేదు. ఈయన మాత్రం గోపకాంతల వస్త్రముల నన్నిటిని పట్టుకుని కడిమిచెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇపుడు స్త్రీలు అందరూ నీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు అన్నారు
కొంటివి మా హృదయంబులు, గొంటివి మానంబు; లజ్జ గొంటివి; వలువల్
గొంటి; వికనెట్లు సేసెదొ, కొంటెవు గడ!నిన్ను నెరిగికొంటిమి కృష్ణా!!
ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషము వాళ్లకు తెలియదు. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకు వద్దామని అనుకున్నారు. వస్త్రములు కనపడలేదు. ఏమయినవా అని చూస్తె చెట్టుమీద కృష్ణుడు కనపడ్డాడు. వాళ్ళు అడిగింది సాంసారికమయిన లౌకికమయిన భర్త్రుత్ర్వం కాదు. ఆ వ్రతంలో ఆయనలో ఐక్యమవడాన్ని వారు అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమని అంటున్నారు? కొంటె కృష్ణా! ఏమి పనులయ్యా యివి? మేము ఎలా బయటకు వస్తాము? నీవు ఇలాంటి తుంటరి పనులు చేయకూడదు. కాబట్టి మా వస్త్రములు మాకిచ్చేసి ఇక్కడినుండి నీవు వెళ్ళిపో’ అన్నారు.
శ్రీమద్భాగవతం - 79 వ భాగం
మీరు అందరూ వ్రతం చేస్తున్నారు కదా! ఈ వ్రతమును ఏ ఫలితం కోసం చేస్తున్నారు? మీ ప్రవర్తన చూస్తుంటే ఎవడో ఒకడు మీ మనస్సులను హరించాడని తెలుస్తోంది. వాడిని భర్తగా పొందాలని మీరు అందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరికోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి’ అన్నాడు. వాళ్ళు అందరూ నవ్విన నవ్వును బట్టి వాళ్ళందరూ తననే తమ భర్తగా కోరుకుంటున్నారని ఆయనకు తెలిసిపోయింది.ఆయన అన్నారు – నిజంగా మీరు నా యింటికి దాసీలుగా, భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లుగా నడుచుకుంటామని అంటే నీటినుండి బయటకు రండి. మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను’ అన్నాడు.ఇక్కడ ‘దాసీ’ అనే పదమును చాలా జాగ్రత్తగా చూడాలి. దాని అర్థం – తాను చేసిన ప్రతి పనివలన తన భర్త అభ్యున్నతిని, తన భర్త కీర్తిప్రతిష్ఠలు పెరిగేటట్లుగా ప్రవర్తించడం. అలా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. అటువంటి స్త్రీ తానుచేసిన ప్రతి పనితో తన భర్త ఔన్నత్యమును నిలబెడుతుంది. అది అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నేను చెప్పిన మాట వినాలని మీరు అనుకుంటే నేనొకమాట చెపుతాను. నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి అన్నారు.
ఆయన ఆడపిల్లల వలువలు ఎత్తుకుపోవడం మదోద్రేకంతో చేసిన పని కాదు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి.
“మీరు నన్ను చూసి సిగ్గు పడతారేమిటి? చిన్నతనం నుండి మనం అందరం కలిసి పెరిగాము. శ్రీకృష్ణుడు బయట ఉన్నవాడు కాదు. ఈ కృష్ణుడు లోనున్న వాడు. అన్ని ప్రాణుల హృదయాంతరముల వున్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను లేని నాడు అది శివము కాదు శవము. నేను వున్నాను కాబట్టి మీరు మంగళప్రడులాయి ఉన్నారు. వ్రతమును చేయగలుగుతున్నారు. మీరు నన్ను భర్తగా పొందాలనుకున్తున్నారు. వ్రతం చేస్తున్నారు. కానీ ఒంటిమీద నూలుపోగు లేకుండా నీళ్ళలోకి దిగి స్నానములు చేస్తున్నారు. అలా దిగంబరంగా స్నానం చేయడం వలన వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయిన వరుణుడి పట్ల అపచారం జరిగింది. వ్రతం చేసేవాళ్ళు వివస్త్రలై స్నానం చేయకూడదు. ఒంటిమీద బట్టతోటే స్నానం చేయాలి. మీరు అపచారం చేశారు. రేపు ఈ వ్రతము పూర్తయిన పిమ్మట కాత్యాయనీ వ్రతం చేశాము కానీ ఫలితం రాలేదని అంటారు. ఇప్పుడు ఆయన ఒక ఆజ్ఞ చేశారు. నిజంగా మీరు వ్రాత ఫలితమును కోరుకుంటే నన్ను భర్తగా మీరు కావాలని అనుకుంటే నేనొక మాట చెపుతాను మీరు చెయ్యండి. 30 రోజుల నుండి మీరు వ్రతం చేయడం లేదు. ప్రతిరోజూ వ్రతభంగం చేస్తున్నారు. మీరు చేస్తున్న వ్రత భంగమునకు మీకు శిక్ష వేయాలి. మీకు ఫలితం ఇవ్వకూడదు. కానీ నేను శిక్ష వేయాలని అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్రతంలోని భక్తికి నేను లొంగాను. మీ పొరపాటును దిద్దాలని అనుకుంటున్నాను. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది. మీరందరూ చేతులెత్తి నమస్కారం చెయ్యండి. అపుడు ప్రాయశ్చిత్తం అయిపోతుంది కాబట్టి మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ఆ వలువలు కట్టుకుని కాత్యాయనీ దేవిని ఆరాధించండి. అపుడు నేను మీ భర్తను అవుతాను’ అన్నాడు స్వామి. వాళ్ళు వినలేదు. అదీ చిత్రం! వాళ్ళు మేము స్త్రీలం. నువ్వు పురుషుడివి. నీవు చెట్టుమీద కూర్చుని చూస్తుండగా మేము ఒడ్డుకు వచ్చి చేతులు ఎత్తి ఎలా నమస్కరిస్తాము? అలా కుదరదు’ అన్నారు.
భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు. మీరు నా భర్త్రుత్వమును అడుగుతున్నారు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యం. మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడ ఉంటాయి? రెండుగా ఉండిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలి అంటే రెండుగా వున్నవి అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్లిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తమ అస్తిత్వమును నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులెత్తి మ్రొక్కండి. మ్రొక్కి వస్త్రములు తీసుకొనవలసింది’ అని అన్నాడు.
ముందు కొంతమంది గోపికలు అది కుదరదన్నారు. చాలా అల్లరి చేశారు. కృష్ణుడితో వాదించారు. వాళ్ళు ‘ఆడవాళ్ళం ఎలా వెడతాము? కొంటె కృష్ణుడు ఎన్నయినా చెపుతాడు. మనం వివస్త్రలుగా బయటకు వెళ్ళి చేతులు ఎత్తి నమస్కారములు పెడతామా? మనం స్త్రీలం. అలా చేయడం కుదరదు’ అన్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్ళకుండా అలా కంఠం వరకు నీళ్ళలో మునిగి వుందాము అనుకున్నారు. మార్గశీర్ష మాసం. మంచు బాగా కురుస్తోంది. వాళ్ళందరూ నీటిలో గడగడ వణికి పోతున్నారు. ఏమి చేస్తే బాగుంటుందా అని తర్జనభర్జనలు చేస్తున్నారు. అప్పుడు అందులో ఒక గోపిక అంది – దేనికి మొహమాటం? ఆయన జగద్భర్త. ఇన్ని లీలలు చేసినవాడు. ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాము. అటువంటప్పుడు మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే మనకి వచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతి చేతనే మనం అన్ని కోట్ల జన్మలను ఎత్తాము. ఇవాళ ఈశ్వరుడే మన ఎదురుగా నిలబడి అలా నమస్కారం చెయ్యండి. మీరు చేసిన దోషము విరిచేస్తాను. మీకు ఫలితం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా వున్నా దోషమును ఈశ్వరుడు చెప్పినా సరే ఈశ్వరుడి పేరెత్తనంటే ఆయన చెప్పినది చేయను అని అంటే మనకు ఫలితం ఎక్కడినుండి వస్తుంది? అందుకని నమస్కరించేద్దాము అంది.
మనము ఒక వ్రతం చేస్తాము. వ్రతం చేసేముందు సంకల్పం చెపుతాము. అలా చేసినప్పటికీ వ్రతఫలితం అందరికీ ఒకేలా రాదు. ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. మనస్సు ఎక్కడికో పోతుంది. ఈశ్వరుడిని స్మరణ చేయదు. అటువంటప్పుడు మీకు వ్రత ఫలితం రాదు. క్రతువులో దోషం జరుగుతోంది. వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం జరిగి వుంటే ఈశ్వరుని నామములు చెప్పడం ద్వారా ఆ దోషం విరిగిపోతుంది. నామ స్మరణతో వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకనే ఒకటికి పదిమాట్లు కనీసంలో కనీసం భగవంతుని నామము జపించాలి. పెద్దలు నామమునకు యిచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదు. నామము క్రతువునందు వున్న దోషమును విరుస్తుంది. అపుడు గోపికలు అందరూ కలిసి నామమును చెప్పి ఈశ్వరుడు చెప్పినట్లు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని, అందరూ కలిసి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకు వచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్లకి ఇచ్చేశారు.
ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ‘ఓ లక్షణవతులారా! మీరు చేసిన వ్రతము ఏమిటో నాకు అర్థం అయింది. కాత్యాయనీ దేవిని మీరు నోచిన నోము దేనికొరకు చేశారో ఆ ఫలితమును నేను మీకు యిచ్చేస్తున్నాను’. కాత్యాయనీ దేవి నోమునోస్తే ఫలితమును కృష్ణుడు యిస్తున్నాడు. ఇద్దరూ ఒకటేననే తత్త్వమును మనం తెలుసుకోవాలి. తత్త్వము తెలుసుకొనక పొతే మీయందు సంకుచితత్వము వచ్చేస్తుంది. ఉన్నది ఒక్కడే. కానీ స్వామి ఎన్నో రూపములలో కనపడుతూ ఉంటాడు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోంది. ‘ఇకమీదట మీరు చేసిన నోముకు ఫలితమును యిచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు’ అన్నాడు. ఈ మాట చాలా పెడసరంగా కర్కశంగా ఉంటుంది. ఈ మాటకు అర్థం మనకు రాసలీలలో తెలుస్తుంది.
ఇక్కడ రాత్రులందు అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింగోద్భవం అర్థరాత్రి జరిగింది. కృష్ణ జననం అర్థరాత్రి జరిగింది. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించడం అనునది జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మీరు మోక్షం వైపు నడుస్తారనడానికి గుర్తు. ‘అందరూ చీకట్లో ఉంటె మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అనగా మీకు చీకటి లేదు. మీకు అజ్ఞానము నివృత్తియై ఈశ్వరుని తెలుసుకుంటాను. ఆ జ్ఞానమును మీకు యిస్తున్నాను’ అన్నాడు. ఈ మాటలు విన్న తరువాత గోపికాంతలు ఆనందంతో మంద దగ్గరకు వెళ్ళారు. పశువుల దగ్గరకు వెళ్ళారు.
‘మంద’ అంటే పశువులతో కూడినది. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మందకడకు వెళ్ళారు అంటే వారు కేవలం ఆవుల దగ్గరకు, దూడల దగ్గరకు వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతిజీవి పశువే. ఇంట్లో వున్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు. ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరి కొన్ని పాశాములతో కట్టబడింది. ఆవిడ మరొక పశువు. ఈ పశువుల పాశములను విడిపించగలిగిన వాడు ఎవడు ఉన్నాడో ఆయనే పశుపతి. ‘మీరు పశువులతో కలిసి పశువులలో ఉంటారు. ఎప్పుడూ నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేక కృష్ణ సాయుజ్యమును పొందుతారు. నామము ఏదయినా ఫలితం ఒక్కటే’ అని గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో. కాత్యాయనీ వ్రత ఘట్టంలో యిన్ని రహస్యములు చొప్పించి కృష్ణ పరమాత్మ చేసిన మహోత్కృష్టమయిన లీల ఆ కాత్యాయనీ వ్రతమనే లీల.
యీలీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏమి చేయాలో మనకు అర్థం అవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. పూజా మంత్రములను చదువుతూ మీ మనస్సు రంజిల్లి పోవాలి. అలా రంజిల్లి పోవాలంటే దానికి రెండే రెండు బాటలు ఉంటాయి. ఒకటి అర్థం తెలియనప్పుడు విశ్వాసము చేత పరమాత్మ నామమును పట్టుకోవాలి. అర్థం తెలిస్తే మీ మనస్సు తనంత తాను రంజిల్లుతుంది. అలా రంజిల్లుతూ నామములు చెపుతూ పూజ చేస్తే ఆ నామము మీ పాపములను దహిస్తుంది. అలా కాకుండా నామము అర్థం తెలియకపోయినా అది పెద్దలు చెప్పిన నామము అర్థం తెలియకపోయినా అది పెద్దలు చెప్పిన నామము, దానిని స్మరించడం వలన ఒక శుభ ఫలితం కలుగుతుంది అని నమ్మి సంతోషంతో మీరు నామము స్మరిస్తూ పూజచేసినా, అప్పుడు కూడా అంటే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వారము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసము లేకపోతే మాత్రం మరీ ప్రమాదం. ఏమీ తెలియకపోయినా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు, తెలిసివున్న వాడి కంటే గొప్పవానిగానే పరిగణింపబడతాడు.
అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామ చెప్పగలిగితే జ్ఞానితో సమానమయి పోతావు. ఈ విషయమును ఆవిష్కరించిన లీల కాబట్టి ఈ కాత్యాయనీ వ్రత ఘట్టము పరమోత్కృష్టమయిన ఘట్టము.
శ్రీమద్భాగవతం - 80 వ భాగం
శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తుట:
ఒకనాడు నందుడు, ఉపనందుడు మొదలైన ఇతర పెద్దలనందరినీ కూర్చోబెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణభగవానుడు ఈవిషయమును తెలుసుకున్నాడు. అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చినట్లు ఇంద్రుడికి అహంకారం వచ్చింది. ‘నా అంతటి వాడిని నేను – పరబ్రహ్మమేమిటి – నాకు అధికారం ఇవ్వడం ఏమిటి – నేనే వర్షము కురిపించడానికి అధికారిని’ అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. పరమాత్మ ఇంద్రునికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. అందుకని ఒక లీల చెయ్యబోతున్నాడు.
తండ్రి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పెద్దలందరూ కూర్చుని సమాలోచనలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ‘నాన్నగారూ, పెద్దలయిన వారికి అరమరికలు ఉండవు కదా! వాళ్ళు ఏదయినా మంచి విషయమయినపుడు అది పెద్దలు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా, వారి సలహాను వింటారు కదా! అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేనిగురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా?’ అని అడిగాడు. అపుడు నందుడు ‘అయ్యో నాన్నా, నీకు తప్పకుండా చెప్తానురా. అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఏముంది. రా వచ్చి కూర్చో’ అని ఇలా చెప్పాడు.
‘మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ఆరాధింపబడిన దేవేంద్రుడు ప్రీతిచేంది వర్షమును కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది.గడ్డి పెరిగితే ఆ గడ్డిని మన పశువులు తింటాయి. బాగా గడ్డి తింటే ఎక్కువ పాలను ఇస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. దీనికంతటికీ మూలం ఇంద్రునికి యజ్ఞం చెయ్యడంలో ఉంది. ఆ యజ్ఞం చేత ప్రీతిచేంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రునికి యజ్ఞం చేద్దామనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దామని అనుకుంటున్నాము’ అన్నాడు.
కృష్ణుడు ఇంద్రునికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసమే ఆ సమయంలో తండ్రి వద్దకు వచ్చాను. ఇపుడు కృష్ణుడు తండ్రిని మాయచేసి మాట్లాడుతున్నాడు. అపుడు కృష్ణుడు అన్నాడు – నాన్నగారూ, నేను ఇలా చెప్పానని అనుకోవద్దు. ఎవరయినా సరే, వారు చేసిన కర్మలను బట్టి ఆయా స్థితులకు చేరుతారు. ఎవడు చేసిన కర్మ వలన వానికి గౌరవము గాని, సమాజములో ఒక సమున్నతమయిన స్థితి కాని, జన్మ కాని కలుగుతున్నది కదా! అటువంటప్పుడు ఎవరి గొప్పతనమునకు గాని, ఎవరి పట్నామునకు గాని వారు చేసిన కర్మే ఆధారము. ఆ కర్మే ఫలితమును ఇస్తోంది. మనం చేసిన కర్మవలననే మనం ఐశ్వర్యమును పొందగాలిగాము. పశుసంపద మన ఐశ్వర్యం. మనం పశువులను పోషించుకోవడానికి గోవర్ధన గిరి గడ్డిని ఇస్తోంది. ఈ కొండమీద మన పశువులు మేస్తున్నాయి. మన కంటికి కనపడి మనకి ప్రతిరోజూ గడ్డి యిస్తున్నది గోవర్ధన గిరి. మీరేమో కంటికి కనపడని ఇంద్రునికి యజ్ఞం చేస్తానంటున్నారు. మీరు యజ్ఞమును కంటికి కనపడే గోవర్ధన గిరిగి చేయాలి. అందుకని ఇంద్రయాగం వద్దు. మనం గోవర్ధనగిరికి యాగం చేద్దాము’ అన్నాడు.
కృష్ణుని మాటలకు నందుడు ఆశ్చర్యపోయి ‘నీవు చెప్తున్నది నిజమే. కానీ ఏదయినా యాగం చేస్తే దానికి ఋషి ప్రోక్తమైన ఒక కల్పము ఉంటుంది కదా! కానీ నీవు గోవర్ధన గిరి యాగం అంటున్నావు. దానికి పూజ ఎలా చేయాలో నీకు తెలుసా?” అని అడిగాడు. కృష్ణుడు దానికి ‘ఇంద్రయాగమునకు ఏమేమి సరుకులు తెచ్చేవారో ఆ సరుకులనే తీసుకువచ్చి పూర్వం ఏ పదార్థములను వండించారో వాటిని ఈ యాగమునకు కూడా వండించండి. కానీ పూర్వం వీటినన్నిటిని పట్టుకువెళ్ళి ‘ఓం ఇంద్రాయ స్వాహా’ అని అగ్నిహోత్రంలో వేసేవారు. ఇపుడు నేను చెప్పిన యాగంలో ఇవన్నీ తీసుకువచ్చి ముందు బ్రాహ్మణులను కూర్చోపెట్టి ముందుగా వారికీ మధురపదార్థములను పెడతారు. వారు తింటారు. మిగిలిన పదార్ధం బ్రాహ్మణోచ్ఛిష్టము అవుతుంది. అది మనలను రక్షిస్తుంది. అందుకని ఆ మిగిలిన పదార్ధమును మనందరం అరమరికలు లేకుండా తినేస్తాము. ఆ తరువాత కుక్కలు మొదలయిన వాటిని పిలిచి వాటన్నిటికి కూడా పెడతాము. ఆ తరువాత మన పశువులన్నిటికీ మంచి గడ్డి, జనపకట్టలు ఇవన్నీ పెడతాము. అవి వాటిని తింటాయి. అవి వాటిని తిన్న తరువాత వండిన పదార్ధమును కొన్ని కడవల తోటి పక్కన పెడతాము.పిల్ల పిచ్చుక, మేక కుక్క గోపకాంతలు, గోపాలురు, నేను మీరు అని ఏమీ చూసుకోకుండా లేగదూడలతో సహా అందరం గోవర్ధన గిరికి ప్రదక్షిణం చేద్దాము’ అన్నాడు. అపుడు నందాదులు ఇదేదో చాలా బాగుంది అయితే అలా చేద్దాము అన్నారు. అనుకున్నట్లే చేసి గిరికి ప్రదక్షిణం చేయడానికి కిందికి వచ్చి గోవర్ధన గిరికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నారు. వెనకాతల పెద్దపెద్ద ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. కృష్ణుడు గోపాల బాలురిలో ఒకడిగా ప్రదక్షిణం చేస్తున్నాడు. కానీ తానే గోవర్ధన గిరిమీద ఉన్న గోవర్ధనుడిగా కనపడుతున్నాడు.
ఈ చప్పుళ్ళు ఇంద్రునికి వినపడ్డాయి. బృందావనంలో ఏమి జరుగుతున్నదని సేవకులను ప్రశ్నించాడు. అపుడు భటులు ‘అయ్యా, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెపుతాము. ప్రతి ఏడాది గోపాలురు వానలు పడాలని మీకు పెద్ద యాగం చేస్తూ ఉంటారు. ఈ ఏడాది నుంచి వాళ్ళు ఈవ్రతమును మార్చేశారు. మీకు చెయ్యడంలేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు. వాళ్ళకి ఆ గోవర్ధన గిరియే పశువులు తినడానికి గడ్డి ఇస్తోందట. అందుకని వారు గోవర్ధన గిరికే యాగం చేస్తున్నారు’ అని చెప్పాడు. వారి మాటలు వినేసరికి ఇంద్రునికి ఎక్కడలేని కోపం వచ్చింది. ‘నాకు యాగం చేయవద్దని చెప్పిన వాడెవడు?గోపాల బాలురు పెరుగు నెయ్యి, తాగి వీళ్ళకి కొవ్వు పట్టింది. నేను ఒకనాడు పర్వతములకు ఉండే రెక్కలను నా వజ్రాయుధంతో తెగనరికాను. అటువంటి వజ్రాయుధమును ఆయుధముగా కలిగిన వాడిని. నన్ను పురందరుడు అని పిలుస్తారు. కృష్ణుడు చెప్పడం వాళ్ళు వినడం ఆయన ఏమయినా ఋషియా లేక దేవుడా? వీళ్ళ సంగతి చెప్తాను చూడండి’ అని మేఘమండలము నంతటినీ పిలిచి వీళ్ళు వర్షం కురియడం వలన వచ్చిన ఐశ్వర్యమదముతో నన్ను మరచిపోయారు. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి బృందావనం అంతా చీకటి అయిపోయేటట్లుగా కంమేయండి. పిడుగులు కురిపించండి. మెరుపులు మెరిపించండి. ఆ దెబ్బలకు గోవులు చచ్చిపోవాలి. జనులు చచ్చిపోవాలి. భూమికి, ఆకాశమునకు తేడా తెలియకూడదు. అంతంత వడగళ్ళు పడాలి. ఏనుగు తొండములంత లావు ధారలు పడిపోవాలి. భూమి అంటా జలంతో నిండిపోవాలి. ప్రాణులు అన్నీ అందులో కొట్టుకు పోవాలి. నేను వజ్రాయుధమును పట్టుకుని ఐరావతమును ఎక్కి వెనకాతల వస్తాను.మీరు వెళ్ళండి’ అన్నాడు.
ఇక్కడ గోపకులు గిరిప్రదక్షిణం పూర్తిచేసుకొని వచ్చారు. ఆవులు దూడలు ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఈలోగానే బృందావనం అంతా గాఢాంధకారం అయిపొయింది. ఇంతకుముందు ఎన్నడూ వినని రీతిలో పిడుగులు పడిపోతున్నాయి. ఆకాశం అంతా మెరుపులు ఆ మెరుపులలో వచ్చే కాంతిని అక్కడి గోవులు, ఎద్దులు దూడలు తట్టుకోలేక పోతున్నాయి. అవి ఎక్కడివక్కడ కూలబడిపోయాయి. ఇపుడు గోపకులు కృష్ణా, నీవు రక్షించాలి, మిగిలిన ప్రాణాలు అన్నీ మరణించక ముందే కాపాడు’ అన్నారు. పరమాత్మ ఒక్క క్షణం ఆలోచించలేదు. కృష్ణుడు అక్కడ వున్న గోవర్ధన పర్వతమును అవలీలగా, అమాంతం పైకి ఎత్తి తన చిటికిన వేలు మీద పట్టుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ, ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగును పట్టినట్లు ఆ మహా శైలమును పట్టుకున్నాడు. ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపకులు, గోపాల బాలురు అందరూ ఆ గోవర్ధన గిరి కిందకు వచ్చేశారు. కృష్ణుడు హాయిగా నవ్వుతూ ఆ గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దానికింద నిలబడ్డారు. ఆయన పట్టుకున్న గోవర్ధనగిరి అనబడే గొడుగుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చిటికిన వేలు కర్ర. ఆయన భుజ మూపురమే దానికి ఉన్న వంపు తిరిగిన మూపు. దానికి అన్నివైపుల నుండి జాలువారుతున్న నీటి దారలో ముత్యములతో కట్టిన అలంకారములు. దానికింద నిలబడి ‘మమ్మల్ని ఇంద్రుడు ఏమి చేస్తాడ’ని నవ్వుతున్న గోపకాంతల నోళ్లలోంచి వస్తున్న కాంతులు అక్కడ పట్టిన రత్నదీపములు. రత్న నీరాజనములు. ఆయన వారిని ఏడురాత్రులు ఏడు పగళ్ళు ఏడేళ్ళ వయసులో తన చూపులతో పోషించాడు.
కృష్ణుడు గోవర్ధన పర్వతమును పట్టుకుని అలా నిలబడితే కొంతమంది పర్వతము క్రిందకు రావడానికి భయపడ్డారు. అపుడు కృష్ణుడు
బాలుం డీతఁడు; కొండ దొడ్డది; మహాభారంబు సైరింపఁగాఁ
జాలండో; యని దీని క్రింద నిలువన్ శంకింపఁగాబోల; దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైఁబడ్డ నా
కేలల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్!!
‘వీడు చిన్నపిల్లాడు పెద్ద గోవర్ధన గిరిని పట్టుకున్నాడు.ఏమో తొందరపడి క్రిందకు వెళితే పిల్లవాడు కొండను వదిలేస్తే ప్రమాదం వస్తుందేమోనని బయట నిలబడతారేమో! నన్ను నమ్మండి. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ గోవర్ధన గిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు. మీకు రక్ష. నేను చెప్తున్నాను. వచ్చి ఈ కొండ క్రింద చేరండి. మిమ్మల్ని నేను రక్షిస్తాను’ అన్నాడు. అందరూ వచ్చి కొండ క్రింద చేరారు. అలా ఏడురోజులు మీనాక్షీతత్త్వంతో పోషించాడు.
ఆ తర్వాత ఇంద్రుడు చూశాడు. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నాడు. వర్షమును, ఉరుములను, పిడుగులను ఆపించివేశాడు. వర్షం ఆగిపోయింది. ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఇంత చిన్న పిల్లాడేమిటి, గోవర్ధన గిరి ఎత్తడమేమిటి? దానిని ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు పట్టుకుని ఉండడం, ఏమిటి? వీళ్ళందరూ వెళ్ళి దానిక్రింద చేరడమేమిటి? ఇది నిజమా? లేకపోతె ఆ పిల్లాడి రూపంలో పరబ్రహ్మము ఉన్నాడా? అని అనుమానించాడు. ఇప్పుడు తన పదవి ఎగిరిపోతుంది అని భయపడ్డాడు. గోవర్ధన గిరి వద్దకు వచ్చి చూసేసరికి ఒక్కసారికి మహానుభావుడయిన పరమాత్మ దర్శనం ఇచ్చాడు. ఇచ్చేసరికి ఇంద్రుడు ‘నన్ను కన్న తండ్రీ! పరబ్రహ్మమా పొరపాటు అయిపొయింది. మహానుభావా, అహంకారమునకు పోయాను. నా అహంకారమును తీసివేయడానికి గోవర్ధనోద్ధరణము చేశావని గుర్తించలేకపోయాను. ఈశ్వరా, క్షమించు’ అన్నాడు. అపుడు కృష్ణ పరమాత్మ ‘సరే, నీ తప్పును నీవు అంగీకరించావు కాబట్టి నీవు ఇంద్రపదవిలోనే ఉండు, కానీ అంతటి వాడినని ఆహంకరించకు. నీపైన వున్నవాడు, నీయందు అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం యిస్తే నీవు వర్షం కురిపించావు. తప్ప నీ అంత నీకుగా ఈ అధికారం లేదు. నేను యిచ్చాను కాబట్టి నీవు దానిని పొందగలిగావు అని గుర్తుపెట్టుకో’ అన్నాడు. ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కామధేనువు స్వర్గలోకం నుండి పరుగుపరుగున వచ్చి ఈశ్వరా నోరువున్న మనుష్యులు కష్టం వస్తే ఎక్కడయినా దాక్కుంటారు. కానీ మా ఆవులు, ఎద్దులు దూడలు నోరులేని జీవములు. వాటిని బయట కట్టేస్తారు. కానీ నీవు జగద్భర్తవు, జగన్నాథుడవు, విశ్వేశ్వరుడవు, మా కష్టం నీకు తెలుసు. అందుకని ఈవేళ గోవులను కాపాడావు. కాబట్టి నిన్ను ‘గోవిందా’ అని పిలుస్తూ ‘నీకు నమస్కారం చేస్తున్నాను’ అంది. ఐరావతం పరుగుపరుగున వెళ్ళి ఆకాశగంగలో వున్నా నీళ్ళను బంగారు కలశములలో తెచ్చి అభిషేకం చేసింది. కామధేనువు యిచ్చిన అవుపాలతో దేవేంద్రుడు స్వహస్తాములతో కలశాములతో కృష్ణుడికి అభిషేకం చేశాడు. దేవతలు నాట్యం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. పుష్పవృష్టి కురిసింది. భగవానుడు గోవిందుడు అయ్యాడు. ఎవరయినా ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు మాత్రమే బ్రతుకుతారు. అందుకని బ్రతికి ఉన్నన్నాళ్ళు కష్టం లేకుండా ఉండాలంటే గోవింద నామమును ఆశ్రయించి తీరాలి. ఈ గోవిన్దనామము ఎంత గొప్పతనమును వహించినది అంటే ఇప్పటికీ వేంకటాచలంలో శేషాద్రి శిఖరం మీద వెలసిన స్వామి గోవిందనామంతో ప్రతిధ్వనించి పోతూ, పద్మావతీ దేవిని వక్షఃస్థలంలో పెట్టుకొని కారుణ్య మూర్తియై పద్మపీఠం మీద నిలబడి మనకి దర్శన ఇస్తున్నాడు.
భాగవతం - 81 వ భాగం CLICK HERE