శ్రీమద్భాగవతం - 61 వ భాగం

‘నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహా ప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయిపోయాయి. ఇంతకుముందు 99యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. ఇపుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటాను అని చెప్పలేను. అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది నేను చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది~ ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమే. కానీ నేను మూడు రకములుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళదగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఎవరు నన్ను కోరుకుంటుంటారో వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తె నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వటువువి. నేను చక్రవర్తిని కాబట్టి నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకో’.
వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక ఏమడిగెదో దాత్రీ సురేంద్రోత్తమా!!
ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిచ్చేస్తాను’ అన్నాడు. అపుడు వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. కాబట్టి నాకు నీవు ఇవ్వగలిగినడేమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడు అని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చాను అని అంటే నేను బ్రహ్మానందమును పొందేస్తాను. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు.
అపుడు బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండముల నన్నిటిని జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితె అది ఇస్తాను’ అన్నాడు.
వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు
గొడుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.
‘అవన్నీ ఇస్తానంటావేంటయ్యా! నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకెందుకు ఇవన్నీ? నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు. అపుడు బలిచక్రవర్తి
ఓ వతువా! ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ, బంగారు చెంబుతో నీళ్ళు పొయ్యి, ఆ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోసేస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొందిపోతూ నీళ్ళు పట్టుకు వద్దామని లోపలి వెళుతోంది. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అపుడు అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చారు. రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట యిచ్చావా? అని అడిగాడు. అపుడు బలిచక్రవర్తి ‘గురువుగారూ, ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగాడు. ఇస్తానన్నాను’ అన్నాడు. అపుడు శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకున్తున్నాడు. ఎందుకు పుచ్చుకుంతున్నాడో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. కాబట్టి నీజోలికి రాలేడు. అందుకని నీతో యుద్ధం చేయకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును లాగి ఇంద్రునకు ఇస్తాడు. అందుకని మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టను అని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాట యిచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.
వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు
జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప!!
శుక్రాచార్యుల వారు రాక్షస నీటి చెప్పారు. మనం చేయకూడదు. దానిని ప్రాణ భయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా ఆయన చెప్పారు. అంతేకానీ ఈనీతి మనందరి కోసం కాదు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు.దాని వలన పాపం రాదు. అందుకని మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగు కూడా ఇవ్వకు. ప్రమాదం. ఆయనను నమ్మకు’ అన్నాడు.
అంటే బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు! లక్ష్మీ నాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.
ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!!
‘ఆయన చేయి లక్ష్మీ అమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆచేయి ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి చేతితో ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాను. ఒక్కొక్క సారి ఆ చేతితో ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేటట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతోంది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై.
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!!
‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. అంతేకానీ ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా! నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాట పోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను అటువంటి జాబితాలో చేరను. నేను దానం చేసేస్తాను’ అన్నాడు. అపుడు శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేశాను. ఇవాళ మళ్ళీ నీవు నీ గురువు మాట కాదన్నావు. కాబట్టి ఇపుడు నిన్ను శపిస్తున్నాను. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు గాక!’ అని శపించాడు.

శ్రీమద్భాగవతం - 62 వ భాగం

వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారు పళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి అక్కడ కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ అమృత పాత్ర నాగలి అలాంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లని పాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూశాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదమేదున్నదో ఆ పాదమును చూశాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాడు. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకోని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూశాడు. బాలి చక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నాడు. కానీ నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి, చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచే సరికి కళ్ళు పెట్టి చూస్తున్న శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది అపుడు బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసేశాడు.
వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.
ఇంతింతై వటుడింతై. ఇంతింతై, వటుడింతై, మరియు తానింతై, నభోవీధి పై
నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై!!
పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పడి అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలో నుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు.
రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై శిరోరత్న మై
శ్రవ ణాలంకృతి యై గళాభరణ మై సౌవర్ణ కేయూర మై.
ఛవిమ త్కంకణ మై కటిస్థలి నుదంచ ద్ఘంట యై నూపుర.
ప్రవరం బై పదపీఠ మై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్!!
వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా ఉంది. తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. అపుడు సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయిపొయింది. ఇంకా దాటారు అపుడు పాదములకు పెట్టుకున్న అందెలా అయిపొయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్ర పీతలా అయిపోయిందట. అనగా బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.
ఆయన బలి చక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది” అని అడిగాడు. అపుడు బలిచక్రవర్తి
సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!!
నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించదానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. అపుడు బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు నకు ఈ సిరిని ఇచ్చాడో వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. కాబట్టి మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసి కూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథ రక్షకుడని పేరు. నీ సన్నిధానంలో నేను అనాథను కావడమా! నాకు భర్త్రు భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.
పది దిక్కులా వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. ఇపుడు బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వచ్చాడు. బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు. ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు.
అపుడు శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను ఇప్పుడు వీనిని రక్షించాలి. వానిని వరుణ పాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. కాబట్టి అతనికి నేను ఏమి యిస్తానో తెలుసా? సావర్ణి మనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాణి ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము. కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుంటాను. నాలో కలిపేసుకుంటాను. అప్పటి వరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పది దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు. ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు.
మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. కానీ ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి యిప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు యింత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం యిస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణ పాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణి మనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.
‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి యిచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.
ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లి ఇంతే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసమునిస్తాను. వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు.
ఇది అంత పరమ ప్రఖ్యాతమయిన ఆఖ్యానము.

శ్రీమద్భాగవతం - 63 వ భాగం

నవమస్కంధము – అంబరీషోపాఖ్యానము
అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమయిన విషయము. అంబరీషుడు నాభాగుని కుమారుడు. నాభాగుడు అనే చక్రవర్తి సామాన్యుడు కాదు. ఆయన చాలా గొప్ప రాజు. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి సహజముగా కొన్ని గుణములు అలవడ్డాయి. ఆయన పాటించిన గుణములు మనందరం మన జీవితములలో పాటించవలసినవి. తపస్సు చేయడం ఎంత గొప్పదో తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడం అంత భయంకరమయిన విషయము. చాలా గొప్ప అధికారం వుండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమయిన వ్యక్తి. ఒక మహర్షి శాపమును ఇస్తే దానిని తప్పుకున్న వాడు మనకి కనపడడు. కానీ అంబరీషుడు మాత్రం అటువంటి మహర్షి శాపము నుండి తప్పించుకున్నాడు. అదీ ఈ చరిత్రకు ఉన్న గొప్పతనం.
అంబరీషుని చిత్తము ఎప్పుడూ శ్రీమహావిష్ణువు పాదములను పట్టుకుని ఉండేది. అనగా ఆయన పరిఢవిల్లిన భక్తిచేత ఉన్నాడు. ఏది మాట్లాడినా హరి గుణములను వర్ణన చేస్తూ ఉంటాడు. ఆయన చెవులు ఎప్పుడూ మాధవుని కథా శ్రవణము వినడానికి ఉత్సాహమును పొందుతూ ఉండేవి. అంబరీషుడు భగవంతుని ముందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడు.భగవంతుడిని నమ్ముకున్న భాగవతులు కనపడితే వారి పాదముల వాసన ముక్కుకు పట్టేటట్లు వారి పాదముల మీద పడేవాడు. వారి పాదముల నుండి వెలువడే పద్మముల సువాసనను ఆయన ఆస్వాదించేవాడు. అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు. ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు. అయినా ఆయన రాజ్య పాలనమును విస్మరించలేదు. అంబరీషునికి అంతఃపురముల మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుర్రముల మీద, ధనం మీద, ఉద్యాన వనముల మీద, కొడుకుల మీద, బంధుమిత్రుల మీద రాజ్యం మీద, భార్య మీద, అంతఃపురము మీద కోరిక లేదు. కానీ వీటి అన్నింటితో ఉన్నాడు. దీనినే కర్తవ్య నిష్ఠ అంటారు. ఆయా విషయముల యందు వెర్రిగా వ్రేలాడడం లేదు.
అలా పరమ పవిత్రమయిన జీవితమును గడుపుతున్న స్థితిలో అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేశాడు. దానికి వసిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించాడు. భూరి తాంబూలములను ఇచ్చాడు. ఒక సంవత్సరం పాటు ద్వాదశీ వ్రతము చెయ్యాలని అనుకున్నాడు. ఏకాదశీ వ్రతమునకు, ద్వాదశీ వ్రతమునకు తేడా ఏమీ లేదు. దశమి నాటి సాయంత్రము నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసము అంటే ‘అశనము’ అని శాస్త్రంలో ఒక మాట ఉంది. అశనము అంటే వ్యక్తికీ క్రిందటి జన్మలలో ఉన్న దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యము ఉన్నా, ఆకలి వేస్తున్నా తినుండా తనని తాను ఒకరోజు మాడ్చుకోవడం. ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్త్వికమయిన పదార్ధం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్చితమయిన సాత్త్వికమయిన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసము ఉంటారు. అంబరీషుడు ఏకాదశీ వ్రతమును చేస్తున్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా పదార్థములను తినేయ్యడాన్ని పారణ అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పు లేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని ద్వాదశి నాడు భోజనం చేసేయవచ్చు. అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశీ వ్రతమును పూర్తి చేసేశాడు. ఏకాదశి తిథి అయిపొయింది తెల్లవారి సూర్యోదయం అయింది. సంవత్సరకాలం పాటు చేసిన ఏకాదశీ వ్రతం పరిపూర్ణమయింది. యజ్ఞమును పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా మీరు ఆపివేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తి అయినట్లు లెక్కకు రాదు. యజ్ఞభ్రంశం అయిపోతుంది. ఇక్కడ ఏకాదశీ వ్రతం పూర్తి అవుతోంది. ఎలా పూర్తి కావాలి? వీళ్ళు ద్వాదశి తిథి వుండగా భోజనం చేయాలి. తాము భోజనం చేసేముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళిందీ నది ఒడ్డుకు వెళ్ళి నదీ స్నానం చేశారు. అనంతరం మధువనం లోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు. అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. వారికి దానములను ఇచ్చారు. వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు. వాళ్ళందరూ కడుపు నిండా తినిన తరువాత యితడు ద్వాదశి పారణం చేయాలి. తనుకూడా భోజనం చేయాలి.
అందరి భోజనములు పూర్తి అయిన తరువాత తాను భోజనం చేద్దామని సిద్ధ పడుతుండగా అక్కడికి దుర్వాసో మహాముని వచ్చారు. దుర్వాసుడు సర్వకాలముల యందు వేదముల యందు వేదాంతముల యందు బుద్ధిని నిక్షేపించిన వాడు. గొప్ప తపస్సును పాటించిన వాడు. సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినటువంటివాడు. వచ్చిన దుర్వాసో మహర్షిని అంబరీషుడు ఈశ్వరునిగా భావించాడు. పొంగిపోయి ‘అయ్యా! ఊరకరారు మహాత్ములు! ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని. నీవు శివాంశ సంభూతుడివి. నీవు నా యింటికి అతిథిగా వచ్చావు. ఏమి నా భాగ్యము. ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణ. మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి భోజనం చేయాలి. మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. మీరూ నేనూ తొందరగా భోజనం చేయాలి. ద్వాదశి కాబట్టి మన యిద్దరికీ యిదే ధర్మం. కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్త శేషమును నేను తింటాను’ అన్నాడు. దుర్వాసో మహర్షి అలాగే వస్తాను అని తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఆయన యమునా నదీ జలములలో స్నానమునకు దిగాడు. ఇక్కడ మాయ కమ్మింది. దుర్వాసో మహర్షి మహా భక్తుడు. ఈశ్వర ధ్యానమునందు సమయమును మరచిపోయి జలములలో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇపుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది. అతను పారణ చేయాలి. లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేలోపల పారణ చేయకపోతే వ్రతభంగం అయిపోతుంది. వ్రత భంగం అయిపోతే ఆటను మరల ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులను పిలిచాడు. సభలో వున్న మహా పండితులను పిలిచాడు. విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ‘ఆయన చూస్తే మహర్షి, ధ్యానంలో ఉన్నాడు. పిలవకూడదు. నీవు చూస్తే గృహస్థు. వ్రతం చేసి వున్నావు. భంగం జరుగ కూడదు. పోనీ పారణ చేసేయ్యడమే కదా అని నీవు ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానము చేసినట్లు అవుతుంది. కాబట్టి తినకూడదు. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. కాబట్టి నీకు మధ్యే మార్గం ఒకటి చెపుతాము. సలిలము పుచ్చు’ అన్నారు. అంటే కాసిని నీళ్ళు తాగమన్నారు. అయితే ‘నేను కొద్ది నీళ్ళు పుచ్చుకుంటాను ఆయన తినగా మిగిలిన శేశామునే నేను భోజనముగా తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది అందుకని నీళ్ళు ఒక్కటే పుచ్చుకుంటాను’ అని ఆయన నీళ్ళను పుచ్చుకున్నాడు.
ఇలా ఇక్కడ నీళ్ళు పుచ్చుకోగానే దుర్వాసో మహర్షి ధ్యానంలోంచి బయటకు వచ్చారు. ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చి గబగబా అంబరీషుని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఎదురువచ్చి అయ్యా! ద్వాదశి తిథి వెళ్ళిపోబోతోంది. మీ గురించే చూస్తున్నాను. ముందు మీరు భోజనమునకు కూర్చోండి. తరువాత నేను చేస్తాను’ అన్నాడు. ఇపుడు దుర్వాసుడు అంబరీషుడు నీళ్ళు తాగాడు అని లోపల తెలుసుకుని కోపం వచ్చింది. ఆయనకు ఒక పక్క లోపల ఆకలి. ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ. రెండూ కలిసి ‘ఇంత మహర్షిని నేను నీకు ఇంత చవకబారు వానిలా కనపడ్డానా? పిలిచి ముందు నువ్వు తాగి నాకు నీ యింట్లో అన్నం పెడతావా? అంటే నీ భుక్త శేషం నేను తింటున్నాను. నా భుక్త శేషం నువ్వు తినడం లేదు. ఇది నాకు అవమానము. కాబట్టి నిన్ను ఉపేక్షించను. నీవు విష్ణు భక్తుడివా? చూడు నిన్ను ఏమి చేస్తానో. ఇప్పుడు నేను గొప్పో నీవు గొప్పో తెలియాలి’ అన్నాడు. కోపంతో చేతిలోకి నీళ్ళు తీసుకుని తన జటాజూటం నుండి జటనొకదానిని సమూలంగా పెరికి నేలకేసి కొట్టాడు. అందులోంచి భయంకరమయిన ఒక క్రుత్యను సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనిని చెపితే దానితో ఆకలి తీర్చుకుంటుంది. తన కళ్ళముందు కృత్య అంబరీషుని తినెయ్యాలని అనుకున్నాడు. హద్దులేని క్రోధమునకు వెళ్ళిపోయాడు. ఇపుడు ఆ క్రుత్యను ప్రయోగించాడు. ఈ కృత్య చేతిలో భయంకరమయిన శూలం పట్టుకుని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడింది. భయంకరమయిన క్రోధంతో కృత్య అంబరీషుని మీద పడింది. దీనిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు. తాను బ్రాహ్మణుడు అయివుంది అవతల వారి స్థితి గమనించకుండా నిష్కారణమయిన కోపం పెంచేసుకుంటున్నాడు. ఆ కోపమునకు అందరూ బాధ పడుతున్నారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తున్నాడు. ‘నాకు తెలిసి అపరాధం చేయలేదు. తెలియక చేసిన దోషము దోషము కాదు. నేను ధర్మం తప్పలేదు’ అని నమస్కారం చేస్తూ నిలబడి పోయాడు. ఇపుడు ధర్మాధర్మములకు ఫలితమును ఇవ్వగలవాడు కదలాలి.
ఇపుడు సుదర్శనం కదిలింది. ఇపుడు ధర్మం అంబరీషుని యందు ఉన్నది. సుదర్శనం కదిలి కృత్య మీదకి వెళ్ళింది. కృత్య కాలిపోయింది. తరువాత సుదర్శనం బ్రాహ్మణుడి వెంట పడింది. ఇపుడు సుదర్శనమునకు వెన్నిచ్చి దుర్వాసుడు పరుగెత్తడం మొదలు పెట్టాడు. ఆయనకిప్పుడు ఆకలి, కోపము అన్నీ పోయి ప్రాణ రక్షణలోకి వచ్చాడు. దుర్వాసుడు పరుగెత్తి పరుగెత్తి బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. అపుడు బ్రహ్మగారు మిక్కిలి చతురతతో ‘అయ్యో మహర్షీ, నీకు ఎంత కష్టం వచ్చింది? అంబరీషుడి జోలికి వెళ్ళావా? యిప్పుడు నీవు విష్ణు మూర్తి పాదములను ఆశ్రయించు. ఏ మహానుభావుడి కనుకొలకులు ఎర్రబడితే నా బ్రహ్మస్థానము ఊడిపోతుందో ఆ సత్యలోకము ఆగిపోతుందో అటువంటి వాని జోలికి నేను వెళ్ళలేను. ఆ చక్రమును నేను ఆపలేను’ అన్నారు. ఇపుడు దుర్వాసుడు కైలాసమునకు పరుగెత్తాడు. దుర్వాసుడు పరమశివుని అంశ. మహాదేవా! నీకన్నా గొప్పవాడెవడున్నాడు? నన్ను కాపాడవలసింది’ అన్నాడు. అపుడు పరమశివుడు ‘నాకూ, దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, బ్రహ్మగారికి అర్థం కానిది ఏదయినా ఉన్నదంటే అది విష్ణు మాయ ఒక్కటే. అందుకని ఆయన సుదర్శనమును నేను ఆపలేను. వైకుంఠమునకు వెళ్ళి విష్ణువు కాళ్ళమీద పడి ప్రార్థించు’ అని అన్నాడు. ఇపుడు దుర్వాసుడు వైకుంఠమునకు వెళ్ళాడు. అక్కడ శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీర్చి ఉన్నాడు. దుర్వాసుడు వెళుతూనే శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ ఆయన పాదముల మీద పడిపోయి ఆయన రెండు కాళ్ళను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని పాదముల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు. అపుడు ఆయన ‘ఏమిటయ్యా యిలా పడిపోయావు. ఏమయింది? లేవవలసింది’ అన్నాడు. ఆయనకు తెలియదా? సుదర్శనమును పెటినవాడు ఆయనే కదా! కానీ ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు. దుర్వాసుడు జరిగినది చెప్పి తనను రక్షించమని కోరాడు. అపుడు ఆయన ‘నాకు ఒక బలహీనత ఉంది. తీగలన్నీ పీకి తాడుచేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్లు నన్నిలా నిలబెట్టేసి తాళ్ళతో కట్టి లక్ష్మీదేవి ఉన్నాడని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలచుకుంటూ ఉంటారు. అలా పట్టుకుని వెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు ఒకడు. నేనేకావాలి అని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దానివెనక ఆవు పరుగెత్తినట్లు నేను వానిని రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరుగెడుతుంటాను. కాబట్టి నీ వెనుక వస్తున్నా నా సుదర్శన చక్రం అంబరీషుడిని రక్షిస్తోంది. వాడు బ్రాహ్మణుడా, తపస్సు చేశాడా, రాజా, కేవలం వ్రతం చేశాడా యివన్నీ నేను చూడను పరమ భక్తితో ఉన్నవాడికి నేను వశుడనయి ఉంటాను. అన్నిటితో వుంది అన్నిటిన్ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను.నాకు అది ఒక లక్షణము’ అన్నాడు.
నీవు వానిపట్ల చేసిన టప్పుడు నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడు. ఇపుడు పరుగు పరుగున అంబరీషుని వద్దకు వెళ్ళాడు. దుర్వాసో మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు. అదీ ఆయన ధర్మం అంటే. అంబరీషుని పాదములు పట్టుకుని ‘మహానుభావా! ఈ సుదర్శన చక్రదారల నుండి నీవే నన్ను రక్షించాలి’ అన్నాడు. అంతటి మహాత్ముడు తనవలన క్రోధమును పొంది అన్ని కష్టములు పడి తన కాళ్ళు పట్టుకొనినందుకు అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రమును ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనను వింటే మనలను తరుముకు వస్తున్నా దురితములనుండి మనం కాపాడబడతాము. సుదర్శన చక్రమునకు నమస్కరించి ‘కోరిన వాళ్లకి నా దగ్గర వున్నది లేకుండా యిచ్చిన వాడనయితే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనయితే నేను చేసిన పూజలకు శ్రీమహావిష్ణువు సంతోషమును పొందిన వాడయితే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది, శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలి పొడువు గాక!” అన్నాడు. దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటిని ఒట్టు పెట్టాడు. ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది.
దుర్వాసుడు ‘ఆహా! గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఇన్ని ఏండ్లు తపస్సు చేసి పొందలేక పోయాను. ఆ శ్రీ మహావిష్ణువు నామము జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పినా, శ్రీమన్నారాయణుని పాదములకు నమస్కరించినా, వారిని ఏ కష్టములు అడ్డవు. నీవు అటువంటి మహానుభావుడవు. నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి. నీ వైభవము ఏమిటో నేను ఈ వేళ చూశాను. మిత్రుడవై రక్షించావు. ఇకనుండి నీపేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్లకి శ్రీమన్నారాయణుని పాదములయందు భక్తి కలుగుతుంది’ అని అంబరీషుడిని స్తోత్రం చేస్తూ దుర్వాసో మహర్షి వెళ్ళబోయాడు. అపుడు అంబరీషుడు ‘మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు. మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్ధమును భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చేయండి’ అన్నాడు. అపుడు దుర్వాసుడు పరమసంతోషంగా భోజనమునకు కూర్చున్నాడు. కాబట్టి క్రోధము ఒక్కటి వుంటే ఎంతటి దానిని ఎలా పాడుచేస్తుందో మనం గమనించాలి. అందువలన క్రోధము నొక్క దానిని ప్రక్కన పెడితే తపస్సులో యెంత కిందనున్న వాడయినా అంబరీషుడు ఏ స్థితిని పొందాడో మనం గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉంది అంబరీషుడు సాధించిన విజయమునకు మనం అందరం పొంగిపోయి అంబరీషుని పాదములకు వేయి నమస్కారములు చేయాలి.
ఆ మహానుభావుడు అంబరీషుడు తదనంతరం తపస్సు చేసి ఈశ్వరుని పునరావృత్తిరహిత శాశ్వత నారాయణ సాయుజ్యమును పొంది తరించినాడు.

శ్రీమద్భాగవతం - 64 వ భాగం

శ్రీరామ చరిత్ర :
నవమస్కంధములో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమ స్కంధమును ప్రారంభం చేసేముందు నవమ స్కందములో రామాయణమును చెప్పారు. నవమ స్కందములో రామచంద్ర ప్రభువు సంకీర్తనము విశేషంగా చేయబడింది. ఇక్ష్వాకు వంశములో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే, సంతానం కలగడానికి ప్రతిబంధకమయిన పాపము పరిహరింప బడి, యజ్ఞపురుషుని అనుగ్రహము చేత లభించిన పాయస పాత్రలోని పాయసమును తన ముగ్గురు ధర్మపత్నులయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి యిస్తే పుట్టిన రామలక్ష్మణభరత శత్రుఘ్నుల నలుగురు కుమారుల యందు మహాధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనం కోసమని, తాను వివాహం చేసుకున్న సీతమ్మతో కలిసి తండ్రిని సత్య వాక్యమునందు ప్రతిష్ఠితుని చేయడం కోసం, పద్నాలుగు సంవత్సరములు అరణ్య వాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల పీచమడచి, అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో కబంధ వధ జరిగిన తరువాత సుగ్రీవుని జాడ తెలుసుకుని, సుగ్రీవునితో మైత్రి చేసి, వాలిని సంహరించి, హనుమ సహాయంచే నూరు యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున వున్న లంకా పట్టణంలో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మజాడ హనుమ ద్వారా తెలుసుకుని, సముద్రమునకు సేతువు కట్టి, ఆవలి ఒడ్డుకు చేరి, రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి, తిరిగి సీతమ్మను తాను పొంది పదకొండు వేళా సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి, రామరాజ్యము అని పేరుతెచ్చి, ఎన్నో ఆశ్వమేధములు, వాజపేయములు, పౌండరీకములు మొదలయిన యాగములు చేసి, మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అద్భుతమయిన కొలమానమును ఏర్పాటు చేసిన విశేషమయిన అవతారము రామావతారము.
ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతనగారియందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది. రాముడు కృష్ణుడు అని యిద్దరు లేరు కనుక ఆ రాముడే కృష్ణకథ చెప్పించాడు.
దశమ స్కంధము – పూర్వ భాగము – శ్రీకృష్ణ జననం
భాగవతంలో దశమ స్కంధము ఆయువుపట్టు లాంటిది. ఈ దశమ స్కంధము జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఇందులో వ్యాస భగవానుడు కృష్ణ భగవానుని లీలలను విశేషమయిన వర్ణన చేశారు. పోతనగారు దానిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. దశమ స్కంధమును ప్రారంభం చేస్తూ ఒకమాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చింది. ‘మహానుభావా! భూలోకంలో ఎందఱో రాజులు భూమి పతులమని పేరు పెట్టుకొని పరమ దుర్మార్గమయిన పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది అధర్మాత్ములు ఈవేళ భూమిమీద తిరుగుతున్నారు. వారి భారం నాకు ఎలా తగ్గుతుంది? అటువంటి వారి మదమణచి భూమి భారమును తగ్గించవలసినది’ అని ప్రార్థించింది. భూభారము అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే, ఎన్ని ప్రాణులు వున్నా, భూమికి ఎప్పుడూ బరువు కాదు. కాని ధర్మమూ తప్పి ప్రవర్తించే మనుష్యులను చూసి భూమి భారమని బాధపడుతుంది. అన్నిటిని సృష్టి చేసినది బ్రహ్మగారే కదా! అందుకని బ్రహ్మగారిని అడిగింది. ‘భారము తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారకుడయిన శ్రీమహావుష్ణువు అనుగ్రహం కాబట్టి నీవయినా నేనయినా ఆయనను ప్రార్థన చేయాలి’ అని ఆనాడు బ్రహ్మగారు ధ్యాన మగ్నుడై పురుషసూక్తంతో స్వామి వారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానము నందు ఆయనకు ఒక వాని వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నారు ‘భూమీ! నీవేమీ బెంగపెట్టుకోవద్దు. స్వామి తొందరలో కృష్ణావతారమును స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షససంహారం ప్రారంభం చేసేస్తాడు. ఎందఱో రాక్షసులు, దుర్మార్గులు మరణిస్తారు. నీకు భారము తగ్గుతుంది. దేవతలను, సుర కాంతలను తమతమ అంశలతో భూమిమీద జన్మించమని స్వామి ఆదేశం యిచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యునిగా లోకమునకు జ్ఞానమును ఇస్తాడు’ అని చెప్పాడు. అపుడు భూమాత పరమ సంతోషమును పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమని నిరీక్షణ చేస్తోంది.
ఈలోగా భూలోకంలో యదువంశమునకు చెందిన శూరసేనుడు అనే రాజు మధుర రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశామునకు చెందినా వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకాయన పేరు ఉగ్రసేనుడు. ఒకాయన పేరు దేవకుడు. వీరు ఇద్దరూ అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములలో దేవకుని కుమార్తె దేవకి. ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని చెల్లెలు దేవకీ దేవి. దేవకీదేవిని శూరసేనుని వసుదేవునకిచ్చి వివాహం చేశారు.
దశమ స్కంధము ఉపనిషత్ రహస్యము. దశమ స్కంధము ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానమును తెలుసుకోగలిగారంటే మీ హృదయగ్రంథి విడిపోయినట్లే! కృష్ణ జననం పరమ పవిత్రమయిన ఆఖ్యానం. దేవకీ వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుర్రములను, బంగారు ఆభరణములతో అలంకరింపబడిన ఏనుగులను, కొన్ని వేల రథముల నిండా బంగారమును, కొన్ని వందలమంది దాసీజనమును ఏర్పాటు చేసి, మహానుభావుడయిన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేళా రథములు అనుసరించి వెడుతున్నాయి. దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రథమును చోదనం చేయడానికి ఒక సారథి ఉంటాడు. ఇలాంటి సమయంలో అక్కడికి కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలు అంటే మహాప్రేమ. ఆమె తన తండ్రిగారి సోదరుని కుమార్తె అయినా, కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ. ఆయన దేవకీదేవి రథమును నడపడానికి సిద్ధపడ్డాడు. అందరూ చాలా సంతోషించారు. తానే చెల్లెలిని అత్తవారింటిలో దింపుతానని గుఱ్ఱముల పగ్గములు పట్టుకున్నాడు. వెనక దేవకీవసుదేవులు కూర్చున్నారు. రథం వెళ్ళిపోతున్నది.
అపుడు అశరీర వాణి కొన్ని మాటలు పలికింది. ‘అశరీరవాణి’ చాలా గమ్మత్తయిన మాట. శరీరము వుంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తున్నదని గుర్తు. కనీసంలో కనీసం ఎదురుగుండా నామ రూపములతో ఏదో ఉండాలి. మనుష్యుడు లేకుండా మాట ఉండదు. కానీ యిక్కడ శరీరము లేదు కానీ మాట వినబడుతున్నది అంటున్నారు. అదీ చిత్రం. అశరీర వాణి ఏమని పలికిందంటే ‘’తలోదరి’ అంటే పైకి కనపడని కడుపు కలది. కొంతమందికి కడుపు కనపడదు. అసలు కడుపు ఉన్నదా లేదా అనే అనుమానం ఉన్నట్లు ఉన్నవాళ్ళని ‘తలోదరి’ అంటారు. అసలు కడుపు లేనట్లుగా శుష్కించిన కడుపులా కనపడుతోంది. ఈ కడుపులో ఎనమండుగురు పుట్టబోతున్నారు. వారిలో ఎనిమిదవ వాడు కంసుడిని చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది. ‘ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా, రథము నడుపుతున్నావు! కాని ఈమె ఎనిమిదవ గర్భము నిన్ను చంపేస్తుంది’ అని అశరీర వాణి పలికింది.
ఇప్పటి వరకు కంసుడు పరమప్రేమతో ఉన్నాడు. ఆకాశంలోంచి ఈమాట వినపడగానే వెంటనే రథమును ఆపాడు. క్రిందికి దిగాడు. కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమయిన కోపం వచ్చేసింది. తన ఎడమ చేతితో చెల్లెలి కొప్పు పట్టుకొని రథములో నుండి క్రిందకు లాగేశాడు. ఒరనుండి కరవాలమును తీసి ఆమెను నరికివేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆసమయంలో వాసుదేవుడు మాట్లాడాడు. ఇది చాలా గమ్మత్తయిన సన్నివేశం. ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్న వాడు బావమరిది, తన చేల్లెలినే లాగేసి చంపేస్తాడని కాని, అశరీరవాణి పలుకుతుందని గాని వసుదేవుడు కల గనలేదు. ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా చాలా పెద్దమనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పలేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ముందు కంసుని అనుగ్రహం కోసమని బ్రతిమలాడాడు. ప్రపంచంలో పరమపవిత్రమయిన సంబంధములలో ‘అన్న’ అనిపించుకున్న రక్తసంబంధం ఒకటి. అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికి వుండాలని కోరుకోవాలి. ‘బావమరిది బ్రతక కోరతాడు’ అని ప్రపంచంలో ఒక సామెత ఉంది. నీవు అన్నవి. కాబట్టి రథం తోలడానికి వచ్చావు. కాబట్టి నీ చెల్లెలిని సంతోష పెట్టాలి. చక్కని మాటలు నాలుగు మాట్లాడాలి. కానీ నువ్వు చంపేస్తాను అంటున్నావు. గాలి మాటలు నమ్మి చెల్లెలిని చంపేస్తావా! రేపు ప్రపంచం నిన్ను ఏమంటుంది? అరివీర పరాక్రమము కలిగినవాడు భోజవంశంలో పుట్టినవాడు అయిన కంసుడు ఒక చెల్లెలి ఎనిమిదవ గర్భము వలన చాచ్చిపోతాననే గాలిమాట విని, ఇంకా పాదముల పారాణి ఆరని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది.. అది ఎంత మహాపాపం. అందుకని తొందరపడి చంపకు. నిన్ను అభ్యర్థిస్తున్నాను’ అన్నాడు.
అపుడు కంసుడు ‘అది మిన్నులమోతో, అధికారిక వాక్యమో నాకు అనవసరం.ఈమె కడుపున పుట్టిన ఎనిమిదవ పిల్లాడి వలన నాకు ప్రాణహాని అని నాకు వినపడింది. అందుకని నేను చంపేస్తాను’ అన్నాడు.
అపుడు వసుదేవుడు ‘నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది. ఒకవేళ నీవు ఈమెను చంపివేశావనుకో నీకు చావు రాకుండా ఉంటుందా? చెల్లెలిని చంపిన పాపమునకు అధోగతికి వెళ్ళిపోతావు. కాబట్టి నీ చెల్లెలిని విడిచిపెట్టెయ్యి’ అన్నాడు. ఎంత గొప్ప వేదాంతమును చెపితే మనసు మారే అవకాశం ఉంటుందో దానిని చెప్పాడు. ఏడురోజులు వినేది శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పారు. ఏడు క్షణములలో వినేది వసుదేవుడు కంసునికి చెప్పాడు. కానీ వాని మనస్సు మారలేదు. అపుడు కంసుడు ‘నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు. నేను మరణమును అంగీకరించను. దేవకిని చంపేస్తాను’ అన్నాడు. ఇపుడు వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నదున్నట్లు చెపితే కంసుని తలకెక్కదని భావించాడు. ఇపుడు తానొక ధర్మము నిర్వర్తించాలి. తన భార్యను రక్షించుకోవాలి. జ్ఞాన బోధ చేస్తే వీని బుద్దకు ఎక్కదు. అలాగని ఎలాగయినా తన భార్యను రక్షించుకోవాలని అసత్యమును చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. కానీ అది కంసుని మనస్సుకు నచ్చేది అయి ఉండాలి. ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీదేవి ప్రాణములను రక్షించడం అనుకుని ‘బావా, అయితే నీకొక మాట చెబుతాను. నీ చెల్లెలికి పుట్టిన ఎనిమిదవ వాని చేత కదా నీవు మరణించగలనని అనుకుంటున్నావు. కాబట్టి ఈ దేవకీ దేవి గర్భమునుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని, పుట్టీ పుట్టగానే తీసుకువచ్చి నీకు యిచ్చేస్తాను. వాడిని నువ్వు చంపెయ్యి. అపుడు నీకు మృత్యువు రాదు కదా! అంతేకానీ నీ చెల్లెలిని చంపడం ఎందుకు? పాపకర్మ కదా! నీ మృత్యుహేతువును నువ్వు చంపినట్లయితే ప్రపంచం నిన్ను తప్పు పట్టదు. నువ్వూ ధర్మం తప్పనక్కరలేదు. నేనూ ధర్మం తప్పనక్కరలేదు. ఆమెను విడిచి పెట్టు’ అన్నాడు.
అపుడు కంసుడు ‘ఇదేదో బాగానే చెప్పాడు’ అనుకుని మీ యిద్దరు హాయిగా అంతః పురమునకు వెళ్ళిపొండి’ అని ఆ రథమును వదిలిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

శ్రీమద్భాగవతం - 65 వ భాగం

దేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకువెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి ‘బావా, చూశావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో! పిల్లవాడు పుట్టగానే నీవే తీసుకు వచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. కానీ బావా, ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది! మొదటి వాడిని చంపడమెందుకు? తీసుకువెళ్ళిపో’ అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు పుట్టాడు. ఎనిమిదవ గర్భమును కదా ఇమ్మన్నాడు. అందుకని రెండవ పిల్లవానిని తీసుకు వచ్చి యివ్వలేదు. ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు. ఆ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి, నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోకకళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరకు వచ్చి ‘కంసా! ఎంత వెర్రివాడవయ్యా! అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు. నువ్వు క్రిందటి జన్మలో ‘కాలనేమి’ అను పేరు గల రాక్షసుడవు. నిన్ను శ్రీమహావిష్ణువు సంహరించారు. నీ తండ్రి, తల్లి, దేవకీ, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు’ అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు.
ఇపుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా! వసుదేవుడిని ఆరుగురి పిల్లలను తీసుకురమ్మనమని కబురుచేశాడు. ‘ఎనిమిదవవాడికి వీళ్ళు సహాయ పడితే నా బ్రతుకు ఏమయిపోవాలి? అందుకని ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి’ అనుకుని పిల్లలను చంపేశాడు. తరువాత తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన – ఇలాంటి వారినందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. తరువాత వస్తున్న గర్భం ఏడవ గర్భం. కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమయిన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు. లోకకళ్యాణకారకుడు. ‘నారం దదాతి యితి నారదః’ అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? ఇపుడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడు అని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీభాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యమును చెప్పారు. పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని యిద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. అపుడు బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపునా పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపునా పుట్టారు. అప్పటికి వాళ్ళకి వున్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిశాయమును వారు తండ్రి అయిన హిరణ్యకశిపునకు చెప్పారు. అపుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందేశారా?కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి.
అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపునా పుట్టారు. వాళ్ళ శాపం ఈజన్మతో ఆఖరయిపోతుంది. వీళ్ళు యిప్పుడు గతజన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గతజన్మలో వీరి తండ్రి కాలనేమి. కాలనేమి యిపుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వేరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. అదీ నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవతాంర్గతం.
కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములనన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీమహావిష్ణువుని తనకడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారమునందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. అందుకని యోగమాయను పిలిచి ఒకమాట చెప్పాడు. ‘నీవు భూమి మీదకి వెళ్ళు. అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉంది. ఇప్పుడు వసుదేవుని తేజస్సు దేవకీదేవిలో ఏడవ గర్భంగా ఉన్నది. అందులో శేషుని అంశ ఉన్నది. అందుకని ఎవరికీ తెలియకుండా ఆ గర్భస్థమయిన పిండమును వెలికి తీసి దానిని తీసుకు వెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. అప్పుడు యిక్కడ జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడన్న పేరుతొ జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నీవు వెళ్ళి ఆపని చేయవలసినది’ అని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండమును బయటికి లాగి నందవ్రజంలో నందుని దగ్గర వున్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది.
ఇవాళ భాగవతమును వింటున్నప్పుడు యిది జరుగుతుందా అని మనమెవ్వరమూ సందేహించనవసరం లేదు. ఇప్పుడు యిటువంటివి ప్రపంచంలో జరుగుతున్నాయి కదా! ఇప్పుడు మనవాళ్ళు చేసే పనిని అప్పుడు భాగవత కాలంలోనే మహర్షులు చేశారు. చాలా బలవంతుడయిన వాడు కాబట్టి ఆయనకు ‘బలభద్రుడు’ అని పేరు. లోకముల నన్నింటిని ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దమును ప్రక్కన పెట్టి ‘బలరామా’ అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశ పెట్ట బడ్డాడు అందుకని ‘సంకర్షణుడు’ అని పేరు వచ్చింది. ఈవిధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది. తదనంతరం కృష్ణపరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణుని పూర్ణమయిన తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడి లోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఈ గర్భంలోకి ముప్పది కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇదీ గర్భశుద్ధి అంటే. వారందరూ మహానుభావా! నీవు మాయందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులయిన వారిని నిగ్రహిస్తున్నారు. కాబట్టి ముకుందా నీవు అమ్మ గర్భంలోనుండి బయటకు రావసింది అని పరమాత్మను స్తోత్రము చేస్తున్నారు.
ఇక్కడ కంసుని పరిస్థితి దారుణంగా ఉంది. దేవకికి అష్టమ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. తొమ్మిదవ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనపడుతోంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం. జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసునికి కూడా కనపడుతోంది. అందుకనే నారదుడు ధర్మరాజు గారితో ‘కొందరు వైరముతో కూడా ఈశ్వరుని పొందుతున్నారు’ అన్నాడు. కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతోంది. శ్రావణ మాసంలో అర్థరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. అప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉంది. కంసుడు గాఢనిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి యినుప గొలుసులు వేశాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేశాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమయినా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్ళకు చేతులకు యినుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆతల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్థరాత్రి పన్నెండు గంటల వేళయింది.
మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. నాలుగు బాహువులతో, నల్లటి మబ్బు వంటి కాంతితో, పట్టు పీతాంబరము కట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొనిన వాడై, మహానుభావుడు వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండ స్థలములయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో, చంటిపిల్లవాడిగా వసుదేవునికి దర్శనం యిచ్చాడు. అటువంటి పిల్లవానిని చూసి సంకెళ్ళలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాను నేను ఎన్ని దానాలు చెయ్యాలి. కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. కానీ నేను చెయ్యడానికి కూడా లేదు. ‘కృష్’ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసేశాడు. తరువాత ఒక్కసారి నీళ్ళు ముట్టుకున్నాడు. మానసికముగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు. ‘నేను కారాగారమునుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను’ అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. అపుడు కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ ‘భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెపుతాను వినండి.

శ్రీమద్భాగవతం - 66 వ భాగం

స్వాయంభువ మన్వంతరంలో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు. ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ 12వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షం అయి ‘ఏమి కావాలి?’ అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. ‘నీలాంటి కొడుకు కావాలి’ అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేదు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకమారు అడిగితే నేను మూడు మార్లు పుట్టాను. ఒకమారు నేను పృశ్నికి పృశ్నిగర్భుడుగా, రెండవ మారు అదితి కష్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా ఇప్పుడు కృష్ణభగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. అంతరార్ధం తెలిసినా తెలియకపోయినా నా కథ విని, నన్ను స్మరిస్తూ, నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి’ అన్నాడు.
ఈమాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ‘ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమయిన యోగమాయా దేవి యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరల అక్కడ నుంచి ఆడపిల్లను తెచ్చి దేవకీ ప్రక్కన పడుకోబెట్టు’ అన్నాడు.
వెంటనే వసుదేవుని కాళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలామంది తలమీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారమునకు యినుప గొలుసులు, తాళములు, మేకులు ఉన్నాయి. అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటకు వచ్చాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడ పట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు. ఆకాశం అంతా నల్లటి మబ్బుపట్టి ఉంది. గాఢాంధకారము. శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమునా దగ్గరికి వెళ్ళాడు. యమునానది విపరీతమయిన వేగంతో ప్రవహిస్తోంది. వసుదేవుడు పరమాత్మను గుండెల మీద పెట్టుకుని యమున వంక చూశాడు.
కృష్ణ భగవానుని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు యిచ్చిన సముద్రములా యమునా చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకుని మళ్ళీ తిరిగి వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుప సంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణ పరమాత్మను గుండెలమీద ధరించాడు. అనగా యిప్పుడు వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు. దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకియందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి. లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది.
ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పలమీద రాజముద్ర ఉన్నదే లేనిదీ చూశారు. రాజముద్ర ఉన్నది. కాబట్టి లోపలి వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు ఆడపిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్న వాడు పరుగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీ దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్లే తన పిల్లే, తానే రక్షించుకోవాలని అనుకుంటోంది. అనుకోని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టేసుకుంది. ‘అన్నయ్యా ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు, మేనకోడలు. నన్ను నమ్ము ఆరుగురిని చంపేశావు. ఏడవది గర్భస్రావము అయిపొయింది. ఇది ఆడపిల్ల. ఇంటికి ఆడపడుచు. నీకు కోడలు. నువ్వు మన్నన చేయాలి. పసిపిల్ల అయిన దానిని చంపేడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనయినా బ్రతకనివ్వు. చంపవద్దు అన్నయ్యా’ అని ఏడుస్తూ వేడుకుంది.
కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కళ్ళు పట్టుకు లాగేశాడు. లాగేసి గిరగిర త్రిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయై కూర్చుంది. అటునుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. ‘నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 నామాలతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ 14 నామములు వింటున్నారో వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ వున్నా నీవు రక్ష చేస్తావు’ అన్నాడు. ఆ తల్లి అఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపములు సమర్పిస్తున్నారు. నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవి అన్నీ తీసుకుని క్రింద వున్న కంసుని చూసి ఒకమాట అంది. ‘ఓరీ దుర్మార్గుడా! పిల్లలందరినీ రాళ్ళకు వేసి కొట్టి చంపావు. నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతోపాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం’ అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది.
వెంటనే కంసుడు పరుగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు.
అవతల నంద వ్రజంలో ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది.నంద వ్రజం భగవద్భక్తులతోనూ, గోవులతోను నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోష పడిపోతున్నారు. చూచివడ్డాము అని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు “అబ్బ పిల్లవాడు ఎంత బాగున్నాడే!’ అని పరవశించిపోతున్నారు. బయట నంద ప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకము చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి ‘లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడు అవుతాడు. లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనయినా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడు. అని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడకు వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్ళు పోయమని అడిగారు. లోకములన్నింటిని ప్రళయం చేసేయ్యాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకుమీద ఏమీ తెలియనివాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రశాయి. ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకొని నీళ్ళు పోయించుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగ కృష్ణుడు. ఆఖరుకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోపెట్టారు.
౨. పూతన సంహారం :
కంసుడు అష్టమ గర్భమును తాను సంహరించగలనని ఎన్నో ప్రయత్నములు చేశాడు. ఎన్ని ప్రయత్నములు చేసినా అష్టమ గర్భం జారిపోయి ఇంకొకచోట పెరుగుతోంది. తన మృత్యువును ఏ ప్రయత్నమూ చేత తాను అధిగమించలేకపోతున్నాడు. ఈ సత్యమును కంసుడు అంగీకరించి ఉంటే కంసుడి జీవితం వేరొకరకంగా మారి ఉండేది. ఇక్కడ కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయముననే తన మంత్రులను పిలిఛి విషయమును చెప్పాడు. ‘మీరు అందరూ చూశారు. నిన్న నేను ఆ బిడ్డను చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారిపోయి పైకి వెళ్ళి నీవు తొందరగా మరణించబోతున్నావు. నిన్ను చంపేవాడు నాతొ కలిసి పుట్టి వేరొకచోట పెరుగుతున్నాడు’ అని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉంది’ అన్నాడు.
అపుడు కంసుని చుట్టూ వున్నవాళ్ళు ‘రాజా! ఈ మాత్రం డానికే భయపడి పోతావేమిటి? మీ ధాటికి ఆగలేక దేవతలందరూ దాక్కుని ఉన్నారు. మీ శక్తి మామూలుది కాదు. మీరు మాకు ఒక్క ఉత్తరువు ఇచ్చారంటే మేము అంతటా తిరిగి కొత్తగా పుట్టిన పిల్లల దగ్గరనుంచి పళ్ళు వస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తాము’ అన్నారు. నీ ప్రధాన శత్రువు శ్రీమహావిష్ణువు. గతంలో నీవు కాలనేమిగా ఉండగా నిన్ను సంహరించాడు. నీకోర రహస్యం చెపుతాను విను. ఇప్పటికి కూడా పిల్లవాని రూపంలో వచ్చి నిన్ను ఎవరు చంపుటారో తెలుసా? విష్ణువే చంపుతాడు. విష్ణువు మూలమును తీసివేయాలి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో దానిని తీసివేయాలి’
ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుని నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతముగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, ఎవరు అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, జేక్కడ ఆవులు ఉన్నాయో, ఎక్కడ దూడలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హోమములు జరుగుతున్నాయో, వీటినన్నింటిని నాశనం చేసేస్తే విష్ణువు అనేవాడు లేకుండా పోతాడు. అప్పుడు యింక మనకు శత్రువు వుండదు. అందుకని వీటినన్నిటిని నాశనం చేసేస్తాము. మాకు అనుజ్ఞ ఇవ్వండి’ అన్నారు. అక్కడ నంద వ్రజంలో కృష్ణ భగవానుడు పెరుగుతున్నాడు. అసలు జన్మించిన వలసిన అవసరం లేని వాడు. ‘అజాయమానో బహుధా విజాయతే’ అని వేదం అంటోంది. జన్మించ వలసిన అవసరం లేనివాడు అనేకమయిన జన్మలను పొందుతున్నాడు. అటువంటి వానికి జాతకర్మ చేస్తున్నారు. ఆయన కన్నా ముందు వున్నవాడు ఎవడూ లేడు. ఆయన తర్వాత ఉండేవాడు లేదు. కాబట్టి ఆయన ఎప్పుడూ తల్లిపాలు త్రాగి ఎరుగడు. అటువంటి వాడు ఈవేళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకొని పాలు త్రాగుతున్నాడు. పరబ్రహ్మము అనుగ్రహం ఎంత ఆశ్చర్యం! ఆ యశోద ఎంత పుణ్యం చేసుకుందో కదా! ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా ఆ యశోదను చూడాలనుకుంటే వేంకటాచలంలో వేంకటరమణుని సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా అందుతున్నదీ లేనిదీ చూస్తూ వకుళ మాతగా కూర్చుంది. ఆయనకు హానీ తెలియదు, వృద్దీ తెలియదు. ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం పెరగడం, తరగడం లాంటివి ఉండవు. అలాంటి వాడు ఆశ్చర్యంగా రోజురోజుకీ అమ్మ ఒడిలో పెరుగుతున్నాడు. ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలు కాని మూర్తి ఇవాళ ఏమీ చేతకాని గోపకాంతల ఇళ్ళల్లో పెరిగి పెద్దవాడయి ఆడుకుంటున్నాడు. నందవ్రజంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారు నైవేద్యం పెట్టనవసరం లేకుండా తానె అడిగి తినేశాడు. ప్రత్యక్ష కైంకర్యం. ఎంత అదృష్టం. ఎంత చదువుకున్నా బ్రహ్మము ఎలా వుంటుంది అంటే చెప్పడం కుదరదు.
‘యతోవాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా”
మనస్సు, వాక్కు ఇంకా మేము పరబ్రహ్మము గురించి చెప్పలేము అని ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మము ఉంది. అటువంటి పరబ్రహ్మము గురించి ఏ చదువు చెప్పలేదో ఆ పరబ్రహ్మము ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది పరమాత్మ కారుణ్యము. ఏదయినా ఈశ్వరానుగ్రహంలో నుంచే వస్తుంది.

శ్రీమద్భాగవతం - 67 వ భాగం

ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఆవిడ బాలఘాతకి. ఆవిడ శిశువులను చంపగలదు. శిశువులు ఎక్కడ వున్నా తొందరగా పసిగట్టగలదు. ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకుంటుంది. మార్చుకుని భవనమునందు ప్రవేశించింది. ఆమె శిశువులను చాలా గమ్మత్తుగా చంపుతుంది. చంపుతున్నప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. విషమును పాలలా ఇస్తుంది. అటువంటి పాలు త్రాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకు ఉన్న శక్తి. ఆమె చంపేదానిలా కనపడదు. పెంచేదానిలా కనపడుతుంది. ఇపుడు ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె ఆకాశం నుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో వున్న కృష్ణ పరమాత్మను కనిపెట్టింది. లోపలి ఊయల దగ్గరకు వెళ్ళింది. పర్యంకము దగ్గరకు చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుని దగ్గరకు చేరింది. ఆమె రాశీభూతమయిన పిల్లవాని సౌందర్యమును చూసి ‘నేను సహజంగా రాక్షసిని. చాలా వికృతంగా ఉంటాను. కానీ ఇపుడు నా రూపమును మరుగుపరచి చాలా అందమయిన దానిలా వచ్చాను’. ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచపు ఆంతరము నందంతటా నిండిపోయిన వాడు, బాహ్యమునందు నిండిపోయిన వాడు అయిన పరమాత్మకు, ఈవిడ ఎందుకు వస్తోందో తెలుసు. కాలు చేయి పొట్టకింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి వుండిన పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసి అయినా ఆ బాలుని అందమునకు వశపడిపోయింది. ఆమె తెలియకుండానే ‘నేను నీ అందమును తీసెయ్యడానికి ఇంత అందంగా వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకూ పనికిరాకుండా అయిపోతావు’ అని అంది.
పూతన తెలియకుండా అలానే ‘నళినదళాక్షా’ అని పిలిచింది. ‘తామరరేకుల వంటి కన్నులు వున్న పిల్లవాడా! ఎంత అందంగా ఉన్నావురా! నా పాలు ఒక గుక్కెడు తాగావంటే ఇంత అనడమూ చటుక్కున మాయమయిపోతుంది. నా అందమేమిటో అప్పుడు చూద్దువుగాని! నీ అందానికి సార్థకత వస్తుంది. రా త్రాగు’ అని గబగబా ఉయ్యాలలో వున్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తనం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి వానిని చూశారు. ‘అయ్యయ్యో! అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు! మా పిల్లవాడు అన్యస్త్రీల క్షీరమును స్వీకరించడు. ఆగుఆగు’ అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే. ఒక్కసారి ఆ విషమును నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాడిని తీసి ఒడిలో పెట్టుకుని, వాడి ముఖమును త్రిప్పి, ఎలాగయినా సరే స్తనము నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలో ఆవులించాడు. ఒకసారి క్రీగంట చోశాడు. మరల నిద్ర వచ్చేసినవాడిలా కళ్ళు మూశాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. ‘పాలు తాగక తప్పదా’ అన్నట్లుగా చూసి విసుక్కుని అయినా పాలను తాగడం అలవాటయిన వాడిలా అమ్మ స్తన్యం త్రాగినట్లే ఆ స్తనమును తన బుజ్జి బుజ్జి వేళ్ళతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు త్రాగాడు.
ఆ రెండు గుక్కలలో ఆమె గుండెలలో ప్రాణముల దగ్గరనుంచి ఆవిడ శరీరంలో వున్న శక్తినంతటిని లాగేశాడు. ఇప్పటి వరకు ‘తాగు తాగు’ అనడమే తప్ప ‘వదులు వదులు’ అనడం తెలియదు. ‘వదలరా బాబోయ్ అంటోంది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన తాగేశాడు. ఆయన పాలు తాగెయ్యగానే ఆమె కామరూపం పోయింది. పోయి ఒక్కసారి గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమయిన శరీరంతో క్రిందపడిపోయింది. 13కి.మీ దూరం ఎంత ఉంటుందో అంట పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. స్తన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెలమీద ఉన్నాడు. ఆ గుండెల మీద వున్న కృష్ణుడిని అలాగే చేతులతో పట్టుకొని గిరగిరతిరిగి పడిపోయింది. ఆమె కోరలు నాగటి చాళ్ళలా ఉన్నాయి ముక్కు రంధ్రములు పెద్ద కొండగుహల్లా ఉన్నాయి. ప్రవత శిఖరములు ఎలా ఉంటాయో అటువంటి స్తనములు. పూతన కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఆమె శరీరం చుట్టూ గోపగోపీ జనమంతా నిలబడి ‘ఎంత పెద్ద రాక్షసి’ అంటున్నారు. కృష్ణుడు ఆమెమీద ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోదా రోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడు అని పూతన భుజములమీద నుండి పర్వతమును ఎక్కినట్లు ఎక్కారు. పసికూన అయిన కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని, ఏమీ తెలియని వాడిలా బోసి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో పిల్లవాడు బ్రతికి వున్నాడు అని పిల్లాడిని ఎత్తుకుని భుజంమీద పెట్టుకొని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి క్రింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనకా భయం? ‘భయకృద్భయనాశనః’ అని ఆయనకు పేరు. గోపికలు అనుకుంటున్నారు. వీళ్ళదీ పరమభక్తి అంటే! వాళ్లకి కృష్ణుని గొప్పతనం తెలియదు. అయినా వారు కృష్ణుని ప్రేమించారు.
ఇప్పుడు ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఆవుతోక పిల్లవాడి చుట్టూ తిప్పి, ఆవు మూత్రము ఆయన మీద చల్లి, ‘నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించు గాక, తొడలను ముకుందుడు రక్షించుగాక’ అంటూ పరమాత్మ పన్నెండు నామములు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమయిన అన్గాములకు పేడ పూస్తూ రక్షపెట్టారు. ‘ఏమి భక్తిరా వీళ్ళది?’ అని ఆయన మనస్సులో నవ్వుకుంటున్నాడు. ఇంతలో ఒక చిత్రమయిన గమ్మత్తు జరిగింది.
నంద వ్రజమునకు పూతన రావడానికి పూర్వము నందుడు మధుర వెళ్ళాడు. కంసరాజుకి ఈయన సామంతుడు. కాబట్టి ప్రతియేడాది కప్పం కట్టాలి. కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకువెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి, మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుని చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురువచ్చి కౌగలించుకొని ‘నందా, నిన్ను కలవడం చాలా సంతోషం. నీకు కొడుకు పుట్టాడని విన్నాను. ఎంత ఐశ్వర్యము వున్నా పిల్లలు లేని ఇల్లు అసలయిన ఐశ్వర్యము లేని ఇల్లే కదా! అందుకని నీవు గొప్ప ఐశ్వర్యమును పొందావు. నేను చాలా సంతోషిస్తున్నాను’ అన్నాడు. అపుడు నందుడు ‘నిజమేనయ్యా, నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకూ ఆరుగురు కుమారులు పుట్టారు. కానీ ఆ ఆరుగురినీ దుష్టుడై కంసుడు సంహరించాడు. వసుదేవా నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నాకొడుకు నీ కొడుకే’ అని అన్నాడు. నిజమునకు కృష్ణుడు వసుదేవుడి కొడుకేగదా! వసుదేవుడు త్రికాల వేది. అపుడు వసుదేవుడు ‘నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి. నీవు తొందరగా బయలుదేరి నందవ్రజమునకు వెళ్ళిపో’ అన్నాడు. ఎందుకంటే కంసుడు కృష్ణుడిని పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడు అని తెలుసు.
నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు. దారిలో పడివున్న రాక్షసి శరీరమును చూశాడు. వసుదేవుడు చెప్పినది యధార్థమని గ్రహించారు. ఆ శరీరమునంతటినీ ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రమును వెలిగించారు. ఆవిడ రాక్షసి. శరీరం కొవ్వుతో నిండిపోయి ఉంది. కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అగరువత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో వున్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరువత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి వుంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి అ ‘పిల్లవాడు నా కొడుకు’ అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో! వాళ్ళు వెళ్ళే స్థితిని నేను చెప్పలేను అన్నారు పోతనగారు.
ఇది పూతన సంహార ఘట్టము. ఈ ఘట్టమును తాత్త్వికంగా పరిశీలించాలి. భాగవత దశమ స్కంధము ఉపనిషత్ జ్ఞానము. ఆవిడ పేరు పూతన. అమరకోశం ‘పునాతి దేహం పూతన’ అని అర్థం చెప్పింది. దేహమును పవిత్రముగా చేయుడానికి పూతన అని పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిదీ అని ప్రశ్నిస్తే నాది అని చెపుతాము. అయితే ఇప్పుడు నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానము. ‘నేను నేను’ అంటున్నది ఏది? అంటే తెలియక ఆ ‘నేను’ని చీకటితో, అజ్ఞానముతో కప్పివేశాము. అదే పూతన. అవిద్య. ‘నేను’కు ‘నాది’ తోడవుతుంది. నేను అనేది అబద్ధము. ఈ అబద్ధామునకు నాది అనే మరియొక అబద్దం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. ‘నా’ అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. ‘నేను, నాది’ అనే రెండు పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహము ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. కానీ దేహసంబంధమయిన సుఖములు విషముతో సమానమయినవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మరూపమును తెలియనివ్వవు. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమయినా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవదర్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మనపట్ల విషములు కావు అమృతములు అయిపోతాయి. భగవంతుని అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతోంది. శుద్ధి లేకుండా తింటే విషం అయిపోతుంది. పూతన కృష్ణునికి విషపూరిత స్తన్యమును ఇచ్చింది. విషము అమృతము అయిపోయింది. మీకు కూడా అన్నింటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటు అయితే అది అమృతం అవుతుంది. మనస్సును దేహమును కూడా శౌచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంహారమునందు ఉన్న పెద్ద ప్రయత్నము.
ప్రకృతి వికారమయిన శరీరం పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. కానీ దీనియందే ఉండిపోతే అసత్యమయిన ‘నేను’నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును యివ్వదు. అసత్యమయిన ‘నేను’ సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒకనాడు జ్ఞానము అవుతుంది. జ్ఞానము ఎప్పుడు కలిగేదీ మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానమును అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒకరోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అపుడు అసలు ‘నేను’ను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహారఘట్టం. అందుకనే కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. ఇది దేహమును పవిత్రం చేసింది. అపవిత్రమయినది పవిత్రం అయింది. పవిత్రము అవగానే లోపల వున్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది. మారిపోయి అసలు ‘నేను’ను పసిగట్టగలిగిన స్థితికి తీసుకు వెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమయిన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు.

శ్రీమద్భాగవతం - 68 వ భాగం

శకటాసుర సంహారం :
కృష్ణ లీలలు అన్నీ కూడా మనకు జీవితంలో చేయి ఇచ్చి పైకి ఎక్కించే లీలలు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం. ఎంత వినినా వేదాంతము వేదాన్తముగా ఎప్పుడూ లోపల నిలబడదు. పక్క ఒక ఆలంబనము ఉండాలి. మీరు అన్నమును అన్నముగా తినలేరు. పక్కన కూరో, పచ్చడో, పులుసో ఉండాలి. అలాగే వేదాంతము ఎప్పుడూ కథగా ఉండాలి. అటువంటి కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. పరమాత్మ చేసే లీలలు కర్మతో చేసినవి కాదు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం ఉంటుంది.
ఒకనాడు కృష్ణపరమాత్మ బోర్లా పడ్డాడు. పిల్లలను మొదట్లో పడుకోపెట్టినపుడు ఎటు పడుకున్నవాడు అటే పడుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసేపని బోర్లాపడడం. పిల్లవాడు బోర్లాపడితే ఆ రోజున యింట్లో అదొక పెద్ద ఉత్సవం. బోర్లాపడ్డాడు అని బొబ్బట్లు మొదలయిన పిండివంటలు వండుకు తినేస్తారు.
కానీ యశోద అలా చెయ్యలేదు. ముత్తైదువలను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలను ఇచ్చింది. వాళ్లకి చీరలు, రవికల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానము చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నిటికి దైవం వైపు చూస్తోంది. యశోద అంటే యశస్సును ఇచ్చున్నది అని అర్థము. కీతి ఎటు పక్కనుంచి వస్తుందో జీవితము ఎటువైపు నడవాలో యశోదవైపు నుంచి తెలుస్తుంది. పిల్లాడు బోర్లాపడితే మనం బొబ్బట్లు వండుకు తినడం కాదు! శివాలయమునకు వెళ్ళి అభిషేకం చేయించాలి. లేదా రామాలయమునకో, కృష్ణాలయమునకో వెళ్ళి తులసి పూజ చేయించాలి. నీ మనవడు బోర్లాపడే అదృష్టం ఈశ్వరుడు నీకు సమకూర్చినాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడమును ఈశ్వరానుగ్రహంగా భావించాలి. నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం అంతా పశువులు, పాడి. వాళ్ళ ఐశ్వర్యం అంతా పాలకుండలు, పెరుగు కుండలు,నేతి కుండలు, అరటి పళ్ళ గెలలు మొదలయినవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టేశారు. అక్కడే ఒక మంచం వేశారు. ఆ మంచం మీద ఒక పరుపు వేశారు. ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లాపడ్డాడు. కాబట్టి అతడికోసం చేస్తున్నారు. కానీ ఉత్సవం వేడుకలో పడి ఈయనని మరచిపోయారు. ఈయనకు ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉన్నది. ఆయనది చిన్ని అరికాలు. దానికి పెసర గింజలంత చిన్నిచిన్ని వేళ్ళు. అందులోనే శంఖం, చక్రం, నాగలి, అమృతపాత్ర మొదలయిన దివ్యచిహ్నములు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు.
ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ ధ్వంసం అయిపోయాయి. అక్కడి నుండి క్రిందపడిపోయి తుత్తునియలయిపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు, యశోద, నందుడు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు. బండి చాలా పెద్దది. ఆకాశమునకు ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అపుడు యశోద పిల్లవాడిని తీసుకుని సముదాయించింది. ‘అయ్యో! నాన్నా! ఆకలి వేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేమీ నొప్పి పెట్టలేదు కదా! అని పిల్లాడిని ఎత్తుకుని పాలిచ్చింది. అది అమ్మ హృదయం. అది మాతృత్వమునకు ఉన్న గొప్పతనం. మాతృత్వమునందు దేవతాంశ ప్రవేశించి పరాభట్టారికరూపమై నిలబడినది. అందుకని స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది. కృష్ణుడు ప్రదర్శించిన లీల చాలా చిన్నది. దీనిలో వున్న అంతరార్థమును మనం గ్రహించేటందుకు ప్రయత్నించాలి. మనకు ఈ శరీరమును భగవంతుడు ఇచ్చాడు. శరీరము మనం నిర్మించుకున్నది కాదు. అన్నింటిని ‘నావినావి’ అంటారు. ‘నావి’ అని చూపించిన ఈ శరీరములో ఏ ఒక్కటీ తనది కాదు. ఏదీ తాను తేకపోయినా ఈశ్వరుడు దీనిని నిర్మాణం చేశాడు. ఈశ్వరునిచే ఇంత గొప్పగా నిర్మింపబడి ప్రసాదింప బడిన ఈ దేహము దేనికొరకు? ఇది శకటము. ఈ బండిని ఎక్కి మీరు తీరమును చేరగలరు. కానీ మనము ఈ బండినెక్కి తీరమును చేరడం లేదు. ఎందువలన? దీనిని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. కానీ మీరు లక్ష్యం వైపు వెళ్ళడం లేదు. ఈ మానవ శరీర శకతంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహములని తలంపడు. తలంపక అన్నీ కూడా ‘నా ప్రజ్ఞ’ అంటూ ఉంటాడు. కానీ ‘ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు. అందువల చేయగలిగాను’ అనడు. అలా జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహము వలన తాను ఆపనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి. కానీ అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటమును ఎక్కి లక్ష్యమును చేరతారు. లేకపోతే యిది ‘శకటతి యితి శకటః’ అవుతుంది. శం అనగా సుఖము, ఈశ్వరుడు. ఈ శకటమును నీవు ఎందుకు ఎక్కావు తెలుసుకుంటే దానిని ఈశ్వరానుగ్రహమని భావించడం ప్రారంభిస్తాడు. ఈశ్వరానుగ్రహం తప్పు పనులు చేయించదు. సాత్త్వికమైన ప్రవృత్తిలోనికి తిప్పేస్తుంది.
అనగా యిప్పుడు నీవు ఎక్కిన శకటమునకు ఎవరు సారధిగా ఉన్నాడు? ఈశ్వరుడు. స్థిత ప్రజ్ఞుడయిన సారధి శకటమును వేయికళ్లతో చూసి నడిపిస్తాడు. అపుడు శకటములో ప్రయాణిస్తున్న జీవునికి ఏ ప్రమాదము కలుగదు. సారధియే బుద్ధి. ఆ బుద్ధిని నీది అనకుండా దానిని కృష్ణ పాదముల దగ్గర పెట్టేయాలి. తెలిసికాని, తెలియక కాని పరమభక్తితో భాగవతంలో దశమ స్కంధార్గత శకటాసుర వృత్తాంతమును విన్నంత మాత్రం చేత శకటాసురుడు – జీవుడు ప్రయాణిస్తున్న యీ బండి రాక్షసుడు. ఎప్పుడు? ‘యిదే నేను – అన్నీ నేను చేస్తున్నాను’ అనే భావన ఉన్నప్పుడు. కృష్ణుడు జగదాచార్యుడై వచ్చాడు. అజ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి దానిని చీల్చదానికి అర్థరాత్రి పుట్టాడు. ఇపుడు ఆయనేమి చేశాడు? ‘మనః మనః’ అనకురా, ‘నమః నమః’ అను అని చెపుతాడు. అపుడు జీవుడు కర్మచేత, భక్తిచేత, జ్ఞానము వైపు నడుస్తాడు. ఈవిధంగా శకటా సుర సంహారం పైకి చిన్న లీల. అంతరమునందు స్వామి ఎంత పెద్ద రహస్యమును దాచారో చూడండి.
తృణావర్తోపాఖ్యానం :
క్రుశ్ని చేష్టితముల వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్లకి జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక ఉత్తమమైన దశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యమును చేరుకుంటారు. కథా శ్రవణం చేతకూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది. పరీక్షిత్తు శుకమహర్షి చెప్పిన బాహ్యకథనే విన్నాడు. విని మోక్షమును పొందాడు కదా! జీవితంలో అసలు భాగవతం వినడం కాని, చదవడం కాని చాలా గొప్ప విషయములు. భాగవతమును విన్నంత మాత్రం చేత వాని జీవితం కొన్ని కోట్ల జన్మల తరువాత ఒక మలుపు తిరిగింది అని లెక్క.
ఒకనాడు నందవ్రజంలో పక్కన రోహిణి వుండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆనందంగా ఉంది. హఠాత్తుగా ఒళ్ళో వున్న కృష్ణుడు చాలా బరువయిపోయినట్లుగా అనిపించాడు. పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. పిల్లవాడు ఇంత బరువుగా వున్నాడేమిటి? అనుకుని పిల్లవాడిని పక్కన దింపింది. అక్కడికి కంసుని పనుపున ఒక రాక్షసుడు వచ్చాడు. అతని పేరు తృణావర్తుడు. అతడు పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడు. ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది. ధూళి కన్నులలో పడిపోయింది. ఇంతకూ పూర్వం ఎప్పుడూ అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీమన్నారాయణుని అవతారమయిన చిన్ని కృష్ణుని కళ్ళల్లోకి ధూళి పడిపోయింది. అందరూ కన్నులు మూసి వేసుకుని ఏమయింది అని చూసేలోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకుపోయాడు. కేవలం కృష్ణుని సంహరించడమే అతని లక్ష్యం. ‘ఆవర్తము’ అంటే త్రిప్పడం. గిరగిర త్రిప్పుతూ కృష్ణుడిని ఆకాశంలోకి తీసుకు వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపి క్రింద పడెయ్యాలని అతని ఉద్దేశం. సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది. గుండ్రంగా తిరుగుతూ కృష్ణుడిని తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది.

శ్రీమద్భాగవతం - 69 వ భాగం

రాక్షసుడు చిన్నికృష్ణుని ఎత్తుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అలా ఎత్తుకు వేల్లిపోతున్నప్పుడు పిల్లలకి భయం వేసినట్లయితే వాళ్ళు కంఠమును గట్టిగా పట్టుకుంటారు. రాక్షసుడు కృష్ణుడిని పైకి తీసుకు వెళ్ళిపోతుంటే కృష్ణుడు తన చిన్నచిన్న చేతులతో రాక్షసుడి కంఠమును గట్టిగా పట్టేసుకుని కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరు చేయలేని పనిని తాను చేస్తున్నాను కదా అని రాక్షసుడు సంతోషిస్తున్నాడు. కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరిగిపోవడం ప్రారంభించాడు. ఈ బరువుకి వాడు క్రిందపడిపోవడం మొదలు పెట్టాడు. ‘ఇంత బరువుగా ఉన్నావేమిటి వదులు, వదులు!’ అని అరవడం ప్రారంభించారు. పట్టుకుంటే వదలడం పరమాత్మకు ఉండదు! ఆనాడు బాణం కొడితే త్రిపురములు ఎలా పడిపోయాయో, గట్టిగా కంఠమును కౌగలించుకుంటే పైనుంచి తృణావర్తుడు అలా క్రింద పడిపోతున్నాడు. పెద్ద రాళ్ళ కుప్ప మీద పడిపోయాడు. అలా పడిపోవడం వలన రాక్షసుని శరీరం ముక్కలైపోయింది. కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరం మీద పడుకొని మరల ఏమే తెలియని వాడిలా చక్కగా ఆడుకుంటూ అమ్మకోసం చూస్తున్న వాడిలో దొంగ ఏడుపు ఏడుస్తూ పాకుతున్నాడు. తల్లి చూసింది.
ఏమీ తెలియని వాడు, భక్తుడయిన వాడు పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు. ఇక్కడే ఈ తృణావర్తోపాఖ్యానంలో యశోద రాక్షసుని కళేబరం మీద పడిపోయి వున్న చిన్ని కృష్ణుడిని తీసుకుని భుజం మీద వేసుకుని ఒక విషయమును విజ్ఞాపన చేసింది. ఈ పద్యం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవలసిన పద్యం.
గత జన్మంబుల నేమి నోఁచితిమొ? యాగశ్రేణు లేమేమి చే
సితిమో? యెవ్వరి కేమి పెట్టితిమొ? యే చింతారతింబ్రొద్దు పు
చ్చితిమో? సత్యము లేమి పల్కితిమొ? యే సిద్ధప్రదేశంబుఁ ద్రొ
క్కితిమో? యిప్పుడు చూడఁగంటిమిచటంగృష్ణార్భకున్నిర్భయున్.
పిల్లలకి గండం ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలను ఆ గండం తరుముకు వచ్చేస్తుంది. అది ప్రమాద రూపంలో ప్రాణములను తీసుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ప్రమాద రూపంలో మృత్యువు ప్రాణమును తీసుకు వెళ్ళాలా కూడదా అని అప్పుడు ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. అప్పుడు ఫలితం ఇవ్వాలి. పిల్లలు ప్రమాదము నందు వెళ్లిపోతుంటారు. వారు దీర్ఘాయుష్మంతులు కాకుండానే వారికి అపమృత్యువు వచ్చేస్తుంది. అలా తీసుకెళ్ళే ముందు పరమాత్మ తల్లిదండ్రుల ఖాతాను ఒకసారి చూస్తాడు. ఇపుడు ఆ పిల్లవాడి గండం గట్టెక్కించదానికి తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యములు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. స్త్రీలు నోచే ఒక్కొక్క నోము చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నట్లు ఉంటుంది. కానీ ఆ నోము ఫలితములు ఆ నోము నోచిన వారిని కొన్ని కోట్ల జన్మలు కాపాడతాయి. సత్యం చెప్పడం చాలా కష్టం. సత్యమును పలకాలి. మహాపురుషుల ఆశ్రమములను దర్శించాలి. వారు ఆత్మజ్ఞానులై ఈశ్వరునితో సమానమైన వారు. అలాగే భగవంతునికి పూజలు చేయాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వారు ప్రయత్నపూర్వకంగా ఇలాంటి పనులు చేసి తీరాలి. ఈమాటలు చెప్పి తల్లి యశోద పిల్లవాడిని తీసుకొని పొంగిపోయి, ముద్దులు పెట్టుకొని ‘నానా, నేను బతికానురా, నువ్వు దొరికావు’ అంది. చిత్రం ఏమిటంటే ఎన్నిమాట్లు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకు తెలియదు. వీటినన్నితిని చేస్తున్నవాడు కృష్ణ పరమాత్మ అని. తెలియనక్కరలేదు.
ఈ లీలలో అంతరార్థం ఏమిటి? ‘తృణము’ అంటే గడ్డిపరక. దానికన్నా తేలిక అయినది ప్రపంచంలో ఉండదు. ‘ఆవర్తనము’ అంటే త్రిప్పుత. త్రిప్పేది ఏది? తృష్ణ. తృష్ణకే తృణావర్తుడు అని పేరు. గృహస్థు పుణ్యం ఖర్చు అయిపోతుంటే మరల పుణ్యమును సంపాదించేసుకుంటూ ఉండాలి. అందువలన ప్రయత్నపూర్వకంగా మరల పుణ్యం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే దెబ్బతినడు. వచ్చే జన్మల యందు కూడా ఇది నిలబడుతుంది. ఒక్కొక్కరు చేసుకున్న పుణ్యం వలన అతడు పట్టినదల్లా బంగారం అవుతుంది. ఒక్కొక్కడు ఏది పట్టుకున్నా ఐశ్వర్యం అలా కలిసివస్తుంది.
కానీ తృష్ణయందు మీరు చిక్కుకోకూడదు. వచ్చిన దానియందు తృప్తిలేక ఇంకా సంపాదించాలని అనుకున్నారంటే ఇక ఆ సంపాదనకు హద్దు ఉండదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొంతవరకు దాచుకోవడం తప్పు కాదు. కానీ అది అర్థంలేని దాపరికం అయిపోతే అది తృష్ణగా మారుతుంది. దీనివలన వాడు ఆ శరీరంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోతాడు. అలా తిరగడంలో డబ్బు సంపాదించి సంపాదించి ఒకనాడు మరణిస్తాడు. ఇలా సంపాదించడంలో వానికి గల పుణ్యం అంతా వ్యయమైపోయింది. అందువల వీడు ఉత్తర జన్మలలో దరిద్రుడు అవుతాడు. మీరు వంద రూపాయలు సంపాదించుకున్నట్లయితే అందులో కనీసం అయిదు రూపాయలు పుణ్యం నిమిత్తం ఖర్చు పెట్టి తీరాలి. మరి ఉత్తర జన్మకు పుణ్యం అవసరం కదా! అందుకని ఈ అయిదు రూపాయలు మీ పుణ్యం ఖాతాలో జమచేయబడతాయి. దీని వలన ఉత్తర జన్మలో అన్నవస్త్రములకు లోటులేకుండా సంతోషంగా బ్రతకగలుగుతారు. కాబట్టి ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంట జాగ్రత్తగా ఖర్చు పెట్టడం తెలియాలి. అది తెలియకపోతే మనిషి పాడయిపోతాడు. డబ్బు సంపాదించు కానీ తృష్ణకు లొంగకు. తృష్ణకు విరుగుడు తృప్తి. తృప్తి వస్తే తృష్ణ ఆగిపోతుంది. తృప్తి లేకపోతే లోపల తృష్ణ రగులుతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కు తిరిగిచూసి ఒక వయస్సు వచ్చిన తరువాత కొన్నింటికి చెక్ పెట్టకపోతే ఆ తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. తృప్తితో తృష్ణను గెలవగలగాలి. తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చి మొత్తం నందవ్రజ ప్రజలందరి కళ్ళు మూసేశాడు. తృష్ణకు లొంగితే తృష్ణ గడ్డిపరకను చేసి తిప్పేస్తుంది. నందవ్రజ ప్రజలందరూ కృష్ణా కృష్ణా అని ఏడ్చారు. అపుడు కృష్ణుడు తృణావర్తుని చంపాడు. చంపి తానే వాళ్లకు దక్కాడు. వాళ్ళు దక్కించుకున్నారా, తాను దక్కాడా? తానే దక్కాడు. కాబట్టి అస్తమానూ భగవంతుని నామం చెప్పడం మొదలు పెట్టినట్లయితే అదే భగవంతుడిని మీ దగ్గరికి తీసుకువచ్చి, మీ బుద్ధిని మార్చి, మిమ్మల్ని సక్రమమయిన మార్గంలోకి తిప్పేస్తుంది. అలా తిప్పి ఏది గెలవలేక జీవితం పాడైపోతున్నదో దానిని గెలవగలిగిన మార్గమును ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. తృప్తి కలవాడు చక్రవర్తి కంటే అధికుడు. మనం తరించదానికి భగవంతుని నామము, రూపము పట్టుకుంటే చాలు అని తృణావర్తోపాఖ్యానం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇదీ కృష్ణ పరమాత్మ సౌజన్యం అంటే!
శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలలు :
నెమ్మది నెమ్మదిగా కృష్ణ బలరాములు పెద్దవారవుతున్నారు. లోకమున కంతటికీ నడక నేర్పే పరమాత్మ నందవ్రజంలో తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఏమి ఆశ్చర్యం అని ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారు. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఆహా ఏమి అదృష్టం ఏ పరమాత్మకు హవిస్సులు ఇస్తున్నామో అటువంటి పామాత్మ ఈవేళ బుడిబుడి నడకలు నడుస్తున్నాడు’ అని దివ్యదృష్టితో చూసి సమాహి మగ్నులయిపోయారు. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకు మరణకాలం దగ్గరకు వచ్చిందని వాళ్ళ అడుగులు తడబడడం మొదలుపెట్టాయి. అమ్మ చెపుతున్న కథలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. తల్లి చిన్న వేణువును ఇస్తే ఆ వేణువును ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజుల పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు.
తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెఱిభూతి పూఁతగాఁగ;
ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు తొగలసంగడికాని తునుకగాఁగ;
ఫాలభాగంబుపైఁ బరగు కావిరిబొట్టు కాముని గెల్చిన కన్నుగాఁగఁ;
గంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగు మెడకప్పుగాఁగ;
హారవల్లు లురగ హారవల్లులుగాఁగ; బాలలీలఁ బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును వేఱులేమిఁ దెలుప వెలయునట్లు!!
ఈ సందర్భంలో పోతనగారు ‘మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటుంటే నాకు కృష్ణుడు కనపడడం లేదు. ఒంటినిండా భస్మం అలముకున్న బాలశంకరుడు కనపడుతున్నాడు అన్నారు. ఆయన మెడలో చిన్న హారం వేసుకొని మధ్యలో నీల పతకం ఉంటే ఆ పతకం కాంతి కంఠం మీద కొడుతుంటే గరళమును కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనపడుతున్నాడు. అమ్మ కొప్పుకు కట్టిన ముత్యాల సరాలు చూస్తుంటే కపర్ది అని పెద్ద జటాజూటం వుండి అందులో గంగమ్మను ధరించి చంద్రరేఖను పెట్టుకున్న శంకరుడు దర్శనం అవుతున్నాడు. మెడనిండా అమ్మ హారములు వేస్తే నాగ భూషణుడై పాములను ధరించిన శంకరుడు దర్శనం అవుతున్నాడు. చిన్ని కృష్ణుడు నా వంకచూసి పోతనా, కృష్ణుడు, శివుడు అని ఇద్దరు లేరయ్యా’ అని నాకు పాఠం చెప్పినట్లు, ‘కృష్ణుడు శివుడని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్త్వము సుమా అని నాకు పాఠంచెప్పాడా అన్నట్లుగా కనపడ్డాడు’ అని పద్యం రాసుకున్నారు. మహాను భావుడు ఎంత శివకేశవ అభేదమును పాటించి ధన్యుడయిపోయాడో చూడండి!
మహానుభావుడు పోతనగారు కృష్ణుని బాల్యలీలలు వర్ణిస్తూ ఎన్నో చక్కని పద్యములు వ్రాశారు. ఇపుడు మనం పోతనగారిని మరచిపోయాం. అది మన దౌర్భాగ్యం. కనీసం ఒక్క గ్రామములో గాని, పట్టణంలో కానీ, పోతనగారి విగ్రహం లేకపోవడం చాలా విచారించవలసిన విషయం. పిల్లలకి, ఈయనరా పోతనగారు’ అని చెప్పడానికి ఇళ్ళల్లో పోటో లేని దరిద్రానికి తెలుగుజాతి దిగజారిపోవడం మన దౌర్భాగ్యం.
అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి పోయేవాడు. అన్ని ఇళ్ళల్లో వున్న వెన్న నెయ్యి అన్నీ తినేసేవాడు. ఎవరయినా తన మీద నేరములు చెపితే అమ్మ నమ్మకుండా ఉండాలని బయటే మూతి అంతా శుభ్రంగా తుడిచేసుకునే వాడు. అలా వెన్నలన్నీ తినేసి వచ్చాడు. కృష్ణ పరమాత్మ అలా వెన్న నెయ్యి తినడంలో ఒక రహస్యం ఉంది.
మొదట మీ అంతట మీరుగా చేసుకోవలసిన ప్రయత్నంతో ఏర్పడే మనస్సు నిర్మలమయిన మనస్సు ఈ నిర్మలత్వము ఎవ్వరూ తేలేరు. మీ అంతట మీరు ఈశ్వర కథాశ్రవణం చేసి, భగవంతుడిని మనస్సుకి ఆలంబనం ఇచ్చి రాగద్వేషములకు అతీతంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా నిర్మలంగా ఉన్న మనస్సును’పాలకుండ’ అని పిలుస్తారు. ఇపుడు ఈ మనస్సుకు ఈశ్వరుని తీసుకు వచ్చి ఆలంబనం ఇచ్చినట్లయితే అది పొంగిపోవడం మొదలుపెడుతుంది. భక్తితో కూడిన కర్మాచరణమును సంతోషంతో కూడిన పూజను చేయడం మొదలు పెడతారు. అలా పూజ చేస్తే దాని చేత భక్తి ఏర్పడుతుంది. భక్తి చేత ఏర్పడిన కర్మ వలన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధి వలన వైరాగ్యభావన కలుగుతుంది. ఈ వైరాగ్యమనే అగ్నిహోత్రము మీద నిర్మలమయిన మనస్సు అనబడే పాలుకాగాలి. ఈ పాలు ఎర్రటి తొరక కడతాయి. కమ్మటి పాలు నిర్మల కైంకర్యము అయిన మనసు వలన, భక్తివలన వైరాగ్యభావన అనే అగ్నిహోత్రం మీద కాలి, కాగి వున్నాయి. ఇప్పుడు ఈ పాలు పెరుగు అవ్వాలి.
పాలను పెరుగుగా మార్చాలంటే పెరుగు కావాలి. పెరుగే పాలను పెరుగుగా మారుస్తుంది. ఇంతకూ పూర్వం ఈశ్వరుని గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవరు అనుభవించాడో వాడే వచ్చి మరల ఆమాట చెప్పాలి. గురువు ఉపదేశం వినాలి. పెరుగు పాలలోకి వచ్చి తోడుకుంటుంది. రమించిపోయి బోధిస్తున్న గురూపదేశమును కదలని కుండలా పట్టాలి. ఈ పాలలోకి ఆ పెరుగు పడాలి. అలా పడితే ఆ పాలు తోడుకుంటాయి. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అలా పరంపరగా గురువు వెనుక గురువు తయారవుతాడు.
పెరుగు గట్టిగా తోడుకున్న తరువాత ఇప్పుడుమీరొక పని చెయ్యాలి. ఇంతకూ పూర్వం గురువులు చెప్పిన మాటలను చెవితో విని వదలడం కాకుండా వారు చెప్పిన మాటలను లోపల బాగా తిప్పాలి. ఈ తిప్పడమే మననము అనే కవ్వము. ఇది తిరుగుతుంటే పెరుగు చిలకబడుతుంది. గురువు వలన తాను విన్న విషయములను కూర్చుని మనసుపెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది. ఆయన వెంటనే వచ్చేస్తాడు. పెరుగును చిలికితే లోపలనుండి వెన్న పైకి వస్తుంది. పైకి తేలుతుంది. వెన్నకి రెండు లక్షణములు ఉంటాయి. ఈ వెన్నను అగ్నిహోత్రం మీద అపెడితే కరిగి నెయ్యి అవుతుంది. నీటిలోకాని, మజ్జిగలో కానీ వేస్తె తేలుతుంది. భగవత్సంబంధమయిన జ్ఞానమనే గ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే వున్నా పైకి కనపడని నెయ్యి యిప్పుడు చిట్టచివరి దశలోపైకి వస్తుంది. పాలను నెయ్యిగా తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. కానీ నేతిని తిరిగి పాలుగా మార్చలేము. ఒకసారి బ్రహ్మ జ్ఞానమును పొందేసిన తర్వాత ఇంకతాను వెనక్కి వెళ్ళడు. తాను ప్రారబ్ధం అయిపోయే వరకు శరీరంలో ఉంటాడు. శరీరం పడిపోతూ ఉండగా అమ్మయ్య శరీరమును వదిలి పెట్టేస్తున్నాను అని జీవుడు సంతోషిస్తాడు.
ఇటువంటి ఆత్మజ్ఞాన స్వరూపమయిన వెన్న నెయ్యి కాదు. దీనిని ఆధారం చేసుకుని ఆత్మదర్శనం అవ్వాలి. దానికి నిధి ధ్యాసనం లోనికి వెళ్ళాలి. లోపలి వెన్న ఎవ్వరికీ పనికిరాదు ఒక్క ఈశ్వరునికే పనికి వస్తుంది. అనగా అత్యంత ప్రశాంతమయిన ప్రదేశమునందు కూర్చుని పరమేశ్వరుని ధ్యానం చేయాలి. ఈ వెన్నను ఒక్క ఈశ్వరుడే తింటాడు. అన్యులు దీనిని తినలేరు. ఈశ్వరుడు ఇక్కడకు వచ్చి తినడమే గోపకాంతల ఇళ్ళల్లోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడం. అపుడు ఆ భక్తి, ఆ వెన్న కృష్ణ స్పర్శ చేత జ్ఞానముగా మారుతుంది. అది నేయి. అది యజ్ఞమునందు పడుతుంది. అదే హవిస్సుగా మారుతుంది. ఈ శరీరము పడిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతాడు. ఇదీ కృష్ణుడు వెన్న తినడం అంటే! అంతేకానీ చేతకాక, పనిలేక, అవతారమును స్వీకరించి వాళ్ళింట్లోకి, వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు. ఎందుకు వెన్న తిన్నాడో అంతరమునందు విచారణ చేయాలి. దీనిని నవనీత చోరత్వము అంటారు. వెన్నను ప్రసాదంగా స్వీకరించడం వెనకాతల వున్న రహస్యం అది!

శ్రీమద్భాగవతం - 70 వ భాగం

కృష్ణ పరమాత్మ వెన్నలన్నీ తినేసి వచ్చాడు. ఆ వచ్చిన గోపీజనమును చూసి యశోద ‘ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు? అని అడిగింది. అక్కడకు వచ్చిన గోపకాంతలు అందరూ ఒకరి తర్వాత ఒకరు కృష్ణుని మీద ఫిర్యాదులు చెప్పడం ప్రారంభించారు. ఒక గోపకాంత అన్నది
బాలురకు బాలు లేవని, బాలింతలు మొరలు వెట్ట పకపక నగి యీ
బాలుండాలము సేయుచు నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!!
‘అమ్మా యశోదా! నీవేమిటో ‘మా అబ్బాయి మా అబ్బాయి’ అని పొంగిపోతున్నావు కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? చంటి పిల్లలకి తల్లి పాలు లేకపోతే ఆవుపాలు పడతారు. బాలింతలు సాయంకాలం అవుతోంది. ఇక పిల్లాడికి పాలు పడదాం అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుపాలు వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేస్తున్నాడు. ఆ దూదలన్నీ వచ్చి ఆవుల పాలను తాగేస్తున్నాద్యి. అపుడు మీవారు ఎదురుగుండా వున్న చెట్టుకొమ్మ ఎక్కి దూడలను వదిలినందుకు మేము బాధ పడుతుంటే అతను చక్కగా నవ్వుతూ కూర్చుంటున్నాడు. మాకు దొరకడు’ అని చెప్పింది.
ఇందులో ఉండే అంతరార్థమును పరిశీలిద్దాం. మనకి మన కుటుంబం వరకే మన కుటుంబం. పక్కింటి వాళ్ళ అబ్బాయి తినకపోతే నాకెందుకు అనుకుంటాం. కానీ ఈశ్వరుడు జగద్భర్త. ఈ లోకమునంతటికీ తండ్రి. ఇపుడు ఆయన రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు. ఆవుదూడలు అంటే ఉపనిషత్తులు. వాటిని పోషిస్తున్నాడు. ఈశ్వరుడు ఉపనిషత్ జ్ఞానమును పోషిస్తాడు. అందుకని దూడలను వదిలాడు. రెండవది ఆవులు ఎక్కడికో వల్లి గడ్డితిని కుడితి తాగి వాటిని పాలుగా మారుస్తున్నాయి. ఆవులు తమ దూడలకు పాలను ఇవ్వడానికి సంతోషంగా ఎదురు చూస్తుంటాయి. ఇంటి యజమాని వచ్చి ముందుగా దూడ దగ్గరకు వెళ్ళి దానిమెడలో వున్న ముడిని విప్పెస్తాడు. వెంటనే దూడ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆర్తితో తల్లి పాలను తాగుతుంది. పాపం, ఇంకా దూడకు ఆకలి తీరదు. వీడు ఆ దూడను లాగేసి స్తంభమునకు కట్టేసి వీడి పిల్లాడి కోసం పాలను పితకడం ప్రారంభిస్తాడు. దాని దూడ దాని పిల్ల కాదూ! నీ పిల్లాడు ఎక్కువా! కానీ ఈశ్వరునికి ఆవు తనబిడ్డే, దూడా తన బిడ్డే. అందుకని ఆయన వదిలాడు. నీవు ఆయనను వంక పెట్టడం ఎందుకు? నీవు ఆయనలలో దొంగ ఎవరు? నీవా, ఆయనా? ఆయన దొంగ కాదు. నీవు దొంగ. నీ దొంగతనం దాచుకుని చోరలీల ని ఆయనయందు దొంగతనం చెపుతున్నావు. అటువంటివారి దొంగ బ్రతుకును స్వామి బయటపెడుతున్నాడు. ఇదీ దీని అంతరార్థం.
మరొక గోపస్త్రీ
పడతీ నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాలా
పడుచులకు బోసి చిక్కిన, కడవల బో నడిచె నాజ్ఞ గలదో లేదో?
యశోదా, నీకు అసలు క్రమశిక్షణ లేదు. నీకే లేనిది నీ పిల్లాడికి ఎలా వస్తుంది? ఏమి చేశాడో తెలుసా! మా యింట్లో పాలన్నీ ఎర్రగా కుండల్లో కాచాము. అటువంటి పాలు పిల్లలందరినీ తీసుకు వచ్చి చప్పుడు చేయకుండా కుండలను ఎత్తి ఆ పాలన్నీ తాగేసి ఆ కడవలను క్రిందపారేసి వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. పాలూ పోయాయి, కడవలూ పోయాయి. ఇదెక్కడి పిల్లాడు’ అంది.
ఒకరికి పెట్టడం అన్నది లేకుండా ఎప్పుడూ తమకోసమే దాచుకునే వారి యిట్లో ఐశ్వర్యమును ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. అసలు పరాయి వాడికి పెట్టడం రాని యింట్లోంచి లక్ష్మీదేవిని ఎలా తీసుకు వెళ్ళిపోవాలో నారాయణునికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకువెళ్ళి పోతాడు. కాబట్టి పరులకు పెట్టడం నేర్చుకుంటే నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది. నీవు ఏది పెట్టావో అది నీకు ఆస్తి. పుణ్యం నిన్ను కాపాడుతుంది. అదీ ఇక్కడ కృష్ణుని ఈ చర్యలోని అంతరార్థం. ఇపుడు మరొక గోపిక లేచింది. ఈవిడ కొంచెం తెలివయినది. అప్పటికే కృష్ణుడు వచ్చి దొంగతనములు చేస్తున్నాడు అని కిందపెడితే పాలు పెరుగు తాగేసి కుండలు పగల కొట్టేస్తున్నాడు అని తెలుసుకుంది. అందుకని ఆమె తన కోడలిని పిలిచి ‘కుండలను క్రింద పెట్టకు ఉట్టి మీద పెట్టు కృష్ణుడికి అందదు’ అంది. అందరూ హాయిగా పడుకున్నారు. కృష్ణుడు వచ్చి చూశాడు. ‘అమ్మా ఎంత తెలివయిన దానివే! నీవు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు అనుకుంటున్నావా అనుకున్నాడు. ఈశ్వరుడు ఐశ్వర్యమును తీసివేయాలంటే ఎక్కడ పెడితే మాత్రం తీయలేడు! ఆయన ఎక్కడ వున్నా వెన్నను (భక్తిని) తింటాడు అని రెండవ అర్థం. ఇపుడు కృష్ణుడు రోళ్ళు, పీటలు వేశాడు. చెయ్యి అందలేదు. అందుకని కుండకు క్రింద కన్నం పెట్టాడు. అందులోంచి శుభ్రంగా మిగతా పిల్లలందరితో కలిసి వెన్న తినేశాడు. ఆ గోపస్త్రీ ‘యశోదా, నీ కడుపు పైకి కనపడదు కానీ యింత తిండి తినేసే పిల్లవాడిని ఎక్కడ కన్నావమ్మా? వెన్న పాలు చేరలు పట్టి తాగేస్తున్నాడు’ అంది. మరొక ఆమె అమ్మా, మా యింటికి వచ్చి వెన్న, నెయ్యి తినేశాడు. ఈ యింట్లో కుండ పట్టుకువెల్లి పక్కవాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళి పోయేవాడు. వాళ్ళు లేచి చూసుకునే సరికి వాళ్ళ కుండలు పక్క ఇంట్లో ఉండేవి. వాళ్ళూ వీళ్ళూ దెబ్బలాడుకునేవారు. ఈయన వీధిలో ఆవులకి గడ్డి పెడుతున్నట్లుగా నిలబడి వీళ్ళ దెబ్బలాటని చూసి నవ్వుకునేవాడు. ఎందుకీ లీల? ఒక్కొక్కళ్ళకి తమకి సంపద ఉన్నదనే గొప్ప అహంకారం ఉంటుంది. తమ పక్కన పేదవాడు అన్నం లేక సొమ్మసిల్లి పడిపోయినా తాను మృష్టాన్న భోజనం చేసి పేదవాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోగలడు. అటువంటి వాడు నిర్దయుడు. బీదవానికి పట్టెడు అన్నం పెట్టమని అనలేడు. అలాంటి వాడి ఐశ్వర్యమును తీసివేయడమే కుండను మరొకచోట పెట్టడం. ఆయన తలుచుకుంటే వ్యక్తుల స్థానం మార్చగలడు కదా! కాబట్టి పేదవాడిని చూసి పరిహాసం చేస్తే ‘నీ పుర్రె అక్కడ పెట్టగలను – ఆ పుర్రె ఇక్కడ పెట్టగలను. జాగ్రత్త సుమా’ అని స్వామీ మనకు ఒక పాఠమును నేర్పారు.
కృష్ణుడు ఇంకొక చోటికి వెళ్ళాడు.
ఆడంజానీ వీరల పెరు, గోడక నీసుతుడు ద్రావి యొకయించుక తా
గోడలి మూతిం జరిమిన, గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!!
ఆ ఇంట్లోకి వెళ్లి శుభ్రంగా వెన్న, నెయ్యి తినేశాడు. ఆ ఇంట్లో అత్తాకోడళ్ళు పడుకుని ఉన్నారు. వెళ్ళిపోయే ముందు ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయాడు. పొద్దుట నిద్రలేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది. నెయ్యి లేదు. కోడలు మూతివంక చూసింది. నెయ్యి ఉంది. ‘ఓసి ముచ్చా! రాత్రి నెయ్యంతా తినేశావా?’ అని కోడలిని పట్టుకుని కొట్టింది. ఈయన కిటికీలోంచి చూసి నవ్వుతున్నాడు.
అత్తకోడలికి నేర్పవలసిన గొప్ప ధర్మం ఒకటి ఉంటుంది. ఇంటికి వచ్చిన మహాత్ములను ఆదరించడం వలన ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటి ఐశ్వర్యం కోడలి వలన నిలబడాలి. వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో అత్తగారు కోడలికి నేర్పాలి. అలాకాకుండా అత్తగారు కోడలికి దుష్టచేష్టలు నేరారంటే చివరికి అది వారిద్దరి మధ్య దెబ్బలాటలకు దారితీస్తుంది. అపుడు సంసారములు చితికిపోతాయి. ధర్మమునందు పూనిక ఉండదు. కాబట్టి అత్త కోడలిని సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకును పక్కన పెట్టుకోవాలి. దానం చేయడం కొడుక్కి కూడా అలవాటయి రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహా ధర్మం. అది నేర్పారు స్వామి.
ఓయమ్మ! నీకుమారుడు, మా యిండ్లను బాలు బెరుగు మననీడమ్మా!
పోయెదమెక్కడి కైనను, మాయన్నుల సురభులాన్ మంజులవాణీ!!
చివరికి వాళ్ళు ‘అమ్మా! ఇంక నీ కొడుకు మా యింట్లో పాలు, పెరుగు బతకనివ్వడు.ఈ ఊరు విడిచి వెళ్లిపోతాము’ అన్నారు.
అం11టే యశోద వారిని ‘ఇవన్నీ ఎప్పుడు చేశాడు?’ అని అడిగింది. ‘ఇవన్నీ ఈవేళ పొద్దున్న చేశాడు’ అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆవిడ ;ఈవేళ పొద్దుటినుండి మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. మీరంతా నా కొడుకును గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు అందంగా ఉంటాడని, బుజ్జి కృష్ణుడని మీరు యిన్ని చాడీలు చెపుతారా! అన్నీ అబద్ధాములే’ అలా చెప్పకూడదమ్మా’ అంది. అపుడు ‘అవును ఇప్పుడెందుకు తెలుస్తుందిలే. ఇని ఇళ్ళల్లో జరిగినవి నీ ఇంట్లో జరిగినప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు ఎం చేస్తావో మేము చూస్తాము’ అని గోపికా స్త్రీలు అక్కడనుండి నిష్క్రమించారు.
ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పనిచేసుకుంటోంది. బయట బలరాముడు, ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న ఆరు గబగబా పరుగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరకు వచ్చి ‘అమ్మా అమ్మా నువ్వు ఎన్నోమాట్లు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పావు కదా! తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడు’ అని చెప్పారు.
పిల్లలు దాక్కునే ఆట అని ఒక ఆట ఆడతారు. కృష్ణునికి అది చాలా యిష్టం. మనకి జారత్వం చోరత్వం చాలా యిష్టం. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ రెండులీలలే చేశాడు. దొంగాట ఆడేటప్పుడు ఈయన ఎక్కడో దాక్కుని ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకునే వాడు. ఈ చర్యవలన భూకాంత పొంగిపోయేది. ఈలోగా మరొకచోట దాక్కున్న వాడు కృష్ణుడు నోట్లో మట్టిపోసుకోవడం చూశాడు. గోపబాలురందరూ కలిసి కృష్ణుని చేయిపట్టుకుని లాక్కుని యశోద దగ్గరకు తీసుకువెళ్ళారు. యశోద అదృష్టమే అదృష్టం. జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్నవాళ్ళు అరుదు. యశోద దగ్గరకు పరమాత్మ వెడితే ఆవిడ అంది
మన్నేటికి భక్షించెదు? మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ
యన్నయు సఖులును జెప్పెద, రన్నా! మన్నేల? మరి పదార్థము లేదే?
పిల్లలు చెప్పిన మాటలను ఆవిడ నమ్మేసింది. ఆయన ఏమీ తక్కువ వాడు కాదు. తిన్నాడు. యీలీల యశోద అదృష్టమును ఆవిష్కరిస్తోంది. పరమాత్మ లొంగిపోయినట్లుగా కనపడిన స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప మరొకచోట లేదు. ఆయన లోకములకన్నిటికి నడవడిని నేర్పినవాడు. ప్రపంచమునకు మార్గదర్శనం చేసిన మహా పురుషుడయిన పరమాత్మని ఈవిడ మార్గదర్శనం చేస్తోంది. ‘ఏరా కృష్ణా! మన్ను తినవద్దని నీకు ఎన్నిమాట్లు చెప్పాను! మన్ను ఎందుకు తింటున్నావు? నేను యింతకు ముందు నీకు ఎన్నోమాట్లు యిలా తినవద్దని చెప్పాను కదా! నీవు యిలా ఎందుకు చేశావు?’ అని అడిగింది.
అపుడు కృష్ణుడు మాట్లాడిన తీరును పోతనగారు ఎలా దర్శనం చేశారో చూడండి
అమ్మా! మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రినో ?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము జేసి నా వచనముల్ తప్పైన దండింపవే !!
అమ్మా, నేను మన్ను తినడమేమిటి? నేను శిశువునా? నేను వెర్రివాడనా? వీళ్ళ మాటలు నమ్మి నన్ను మట్టి తిన్నావని అనేస్తున్నావు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ నామీద కల్పించి చెప్తున్నారు. ఆయన వేదాంతం ఎంత చెప్తున్నారో చూడండి! తన్మాత్రాలలో పృథివికి వాసన ఉంటుంది. ‘నేను నిజంగా మట్టిని తిన్న వాడనయితే పృథివిలో నుండి వాసన వస్తుంది కాబట్టి నా నోరు మట్టి వాసన రావాలి కదా! ఏదీ నా నోరు వాసన చూడు. వాసన వస్తే అప్పుడు కొట్టు’ అన్నాడు. అపుడు యశోద ‘ఏమిటి వీడు యింత తెంపరితనంగా మాట్లాడుతున్నాడు. మట్టి తినలేదంటున్నాడు. నిజం ఏమిటో యిప్పుడు పరిశీలిస్తాను’ అని కృష్ణుడిని నోరు తెరవమంది. ఏమి యశోదాదేవి అదృష్టం! ఎంతో తపస్సు చేసిన మహాపురుషులు ఎక్కడో జారిపోయి మరల జన్మములు ఎత్తారు. అంతటా నిండివున్న ఈశ్వరుని చూడలేకపోయారు. అంతటా ఈశ్వరుని చూడడం అనేది జ్ఞానము. ఏమీ చదువుకొని స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుని యందు లోకం కనపడుతోంది. లోకము ఈశ్వరుని యందు ఉన్నది. పరమాత్మ యిప్పుడు ఈ తత్త్వమును ఆవిష్కరిస్తున్నాడు. ఇది బ్రహ్మాండ దర్శనం. దీనినే ‘మృద్భక్షణమున విశ్వరూప ప్రదర్శనము’ అంటారు పోతనగారు. కృష్ణుడు నోరు తెరిచాడు. సమస్త పర్వతములతో, నదులతో, సముద్రములతో, చెట్లతో, నరులతో, లోకంతో, నంద వ్రజంతో, నందవ్రజంలో వున్నా పశువులతో, తన యింటితో, తనతో, నందుడితో కలిసి అందరూ లోపల కనపడ్డారు. ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోటిలో కనపడుతుంటే ఆవిడ తెల్లబోయింది.
కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్ నేరకయున్నదాననో యశోదాదేవి గానో పర
స్థలమో బాలకుడింత యాతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్!!
నోరు తెరిస్తే పిల్లవాని నోట్లో వున్నవి అన్నీ చూసి యశోద ‘ఇది కలా? వైష్ణవ మాయా? ఏదయినా సంకల్పమా? అసలు నేను యశోదనేనా? నేను నా యింట్లోనే ఉన్నానా? వీడు నా కొడుకేనా? వీని నోట్లో బ్రహ్మాండములు అన్నీ ఉన్నాయా? ఆలోచించి చూస్తె చాలా ఆశ్చర్యంగా ఉంది. పిల్లవాడేమిటి? నోట్లో బ్రహ్మాండములు ఏమిటి?” అని ఆశ్చర్యపోయింది. యశోద కృష్ణుని కేవలము తన కొడుకుగా భావన పెంచుకుంది. ఈ ప్రేమయే భక్తి. తెలియకుండా ప్రేమించినా ఆమె ఈశ్వరునే ప్రేమించింది. ఇటువంటి భక్తికి పర్యవసానము జ్ఞానము. ఇదే విశ్వరూప సందర్శనము.
అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకున్నారు. అమ్మ యిలా జ్ఞానంతో ఉండిపోతే నాకు అమ్మగా ఉండలేదు. కాబట్టి మరల వైష్ణవ మాయ కప్పాలి అనుకొని ఆమె జ్ఞానమును ఉపసంహారం చేశాడు. అంతే! ఆమె వైష్ణవమాయలోకి వెళ్ళిపోయింది. ఇదే పరమాత్మ అనుగ్రహం అంటే.
భాగవతం - 71 వ భాగం CLICK HERE