శ్రీమద్భాగవతం - 31 వ భాగం

కపిల మహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. బిందు సరోవరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. కర్దమ ప్రజాపతి తన భోగోపకరణములనన్నిటిని భార్యకు ఇచ్చి వెళ్ళాడు. భర్త వెళ్ళిపోగానే ఇన్ని భోగోపకరణముల మీద దేవహూతికి వైరాగ్యం పుట్టింది. ‘నా భర్త అంతటి స్థితిని పొందాడు. నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండి పోయాను. నేను కూడా ఉద్ధరింపబడాలి’ అని అనుకుంది. అందుకని ఇప్పుడు దేవహూతి తన కొడుకు అయిన కపిల మహర్షి దగ్గరకు వెళ్ళి ‘నేను ఇంతకాలం మోహాంధకారంలో పడిపోయాను. ఈ ఇంద్రియముల సుఖములే సుఖములు అనుకొని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతున్నది. నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్త్వమును నాకు బోధచెయ్యి’ అని అడిగింది.
అప్పుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీనినే ‘కపిలగీత’ అంటారు. కపిల గీత వినిన వాళ్లకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో, ఆ సత్యము సత్యము కాదన్న వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. ‘అమ్మా, ప్రపంచంలో అనేకమయిన జీవరాసులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ. ఈ దేహములు పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్ఠములు. చెట్లకి ప్రాణం ప్రాణం ఉన్నా చెట్లకన్నా గొప్పతనము ఒకటి ఉంది. స్పర్శ జ్ఞానము కలుగుట చేత వృక్షములకంటే స్పర్శ జ్ఞానము ఉన్నది గొప్పది. స్పర్శ జ్ఞానము ఉన్నదానికంటే రస జ్ఞానము ఉన్నది గొప్పది. రుచి కూడా చెప్ప గలిగినటువంటి ప్రాణి గొప్పది. దానికంటే వాసన కూడా చెప్పగలిగిన భృంగములు గొప్పవి. వాటికంటే శబ్దమును వినగలిగిన పక్షులు గొప్పవి. శబ్దములు వినగలిగిన దానికన్నా అనేక పాదములు ఉన్న జంతువు గొప్పది. దానికన్నా ఆవు, గేదె, మేక మొదలయిన నాలుగు పాదములు కలిగి సాధుత్వము ఉన్నవి గొప్పవి. నాలుగు పాదములు ఉన్న జీవికంటే శరభము రెండు పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. రెండు పాదములు ఉన్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు.
అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేయలేరు. కాబట్టి ఆ స్వామి పరమ భక్తులయిన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు. ఆ మూర్తిని ధ్యానం చెయ్యి. ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా! పరమ సంతోషంతో నీ మనస్సును ఆయన పాదారవిందముల దగ్గర చేర్చు. స్వామి సౌందర్యమును అనుభవించడం ప్రారంభిస్తే తెనేమరిగిన సీతాకోక చిలుకలా హృదయము దానియందే రంజిల్లడం మొదలిడుతుంది. అప్పుడు మనస్సుకి భోగములవైపు వెళ్ళాలని అనిపించదు. ప్రయత్నపూర్వకంగా భక్తియోగమును అనుష్ఠానం చేయాలి. చేతకాకపోతే కనీసం శ్రవణం చేయడం మొదలు పెట్టాలి. ఎవరు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవరు ధ్యానము లోపల చేయ గలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరునియందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృతరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతున్నాడు’ అని చెప్పాడు.
ఆ మాటలను విన్న దేవహూతి ఆ భోగములనన్నిటిని తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయమునందు నిలిపి ధ్యానము చేయసాగింది. ఈశ్వర స్మరణము వలన జ్ఞానము పొంది, ఈ విషయములు వినిన తరువాత ప్రయత్న పూర్వకముగా భోగములు మనను ఉద్ధరించేవి కావని తెలుసుకుని, వాటిని త్రోసిరాజని వైరాగ్యమును పొంది, భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది, జ్ఞానమువలన మోక్షమును పొంది, శ్రీకృష్ణ భగవానుని యందు చేరి శాశ్వతమును పొందినది. ఇది జీవులందరినీ ఉద్ధరింపబడవలసిన మహోత్కృష్టమయిన్ గాథ.
చతుర్థ స్కంధము – దక్షయజ్ఞం
చతుర్ముఖ బ్రహ్మగారి శరీరంలోంచి కొంత సృష్టి జరిగిందని గతంలో చెప్పుకున్నాము. ఈశ్వరుని దేహములోంచి వచ్చిన సృష్టి కొంత ఉన్నది. అందులో పదిమంది ప్రజాపతులను ఆయన శరీరమునుండి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటన వ్రేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. నేత్రములలోంచి జన్మించినటు వంటి వాడు అత్రిమహర్షి. అత్రి మహర్షి సంతానమే ఆత్రేయస గోత్రికులు. దక్షప్రజాపతి పదిమంది ప్రజాపతులకు నాయకుడు. అటువంటి దక్షప్రజాపటికి పదహారుమంది కుమార్తెలు కలిగారు. ఈ 16మంది కుమార్తెలకు ఆయన వివాహం చేశారు. అందులోనే ‘మూర్తి’ అనబడే ఆవిడ గర్భం నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వారే బడరీలో తపస్సు చేశారు. అందుకే ఉద్ధవుడు ఉండడం, నర నారాయణులు అక్కడ తపస్సు చేయడం, ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం – ఇలాంటి వాటివలన బదరీ క్షేత్రమునకు అంత గొప్పతనం వచ్చింది. బాదరాయణుడని పిలువబడే వ్యాసుడు అక్కడ కూర్చుని తపస్సు చేశాడు. భాగవతమును రచన చేశాడు. బదరికావనంలో తిరిగాడు కాబట్టి ఆయనకు ‘బాదరాయణుడు’ అని పేరు వచ్చింది.
బ్రహ్మ బొటనవేలునుండి ఆవిర్భవించిన దక్షప్రజాపతికి కలిగిన కుమార్తెలలో సతీదేవిని రుద్రునకు ఇచ్చి వివాహం చేశారు. దక్ష కుమార్తెలలో 15మందికి సంతానం కలిగారు. కానీ శంకరునికి సతీదేవికి సంతానం కలగలేదు. శివుడు సాక్షాత్తుగా బ్రహ్మము. అటువంటి బ్రహ్మము అయినవాడికి మరల పిల్లలు, హడావుడి ఎక్కడ ఉంటుంది? అటువంటి తత్త్వము కలిగిన శంకరుడు, దక్షప్రజాపతి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉండేవారు.
ఆ సందర్భంలో ఒకానొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి దీర్ఘసత్రయాగం చేశారు. ఎవరయితే ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉండేటటువంటి యాగామునకు సత్రయాగమని పేరు. అక్కడికి బ్రహ్మగారు కూడా వెళ్ళారు. అక్కడ పరమశివుడు కూడా ఉన్నాడు. ఆ సభలోకి ఆలస్యంగా దక్ష ప్రజాపతి వచ్చాడు. ఆయన కత్తిచేత కూడా నరకబడడు. ఆయన శరీరం అంత మంత్రభూయిష్టం. ఆయనను చూసీ చూడడంతోనే అందరూ లేచినిలబడ్డారు. కానీ బ్రహ్మగారు, భర్గుడు మాత్రం లేవలేదు. బ్రహ్మగారు పెద్దవారు కనుక ఆయన లేవనవసరం లేదు. కానీ శివుడు బాహ్యమునందు దక్షప్రజాపటికి అల్లుడు. మామగారు పితృ పంచకంలో ఒకడు. దక్షుడు లోపలి వచ్చి సభలో లేవని వాళ్ళు ఎవరా ణి చూశాడు. అల్లుడు లేవకపోవడం గమనించాడు. కోపం వచ్చేసింది. క్రోధంతో సభలో వున్న వాళ్ళందరినీ చూసి శంకరుని చూపిస్తూ ‘వీడు ఎవడు’ అన్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అక్కడ వున్నవాళ్ళు లేచి ఈయన శివుడండీ అని జవాబిచ్చారు. వీనికి శివుడని పేరు ఎవరు పెట్టారు? వీనిని పట్టుకుని శివుడు అని పిలిస్తే నాకేమనిపిస్తుందో తెలుసా! యజ్ఞోపవీతం లేని వాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టు ఉంది’ అన్నాడు.
భయంకరమయిన శివనింద చేశాడు. ఈవిధంగా దక్షుడు ఇన్ని మాటలు అంటే నిజంగా మంగళం చేసేవాడు కాబట్టి ఆయన ఏమీ అనలేదు. ఆయనకు దూషణ భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం. అపుడు శంకరుడికి ఇంకా కోపం వచ్చేసింది. ఇన్ని మాటలు అన్నా నీవు పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు. కాబట్టి ఇవాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువులయందు నీకు హవిర్భాగము లేకుండుగాక’ అని శపించాడు. ఈవిధంగా దక్షుడు తన పరిధిని దాటిపోయాడు. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భ్రుగువుకు సంతోషం కలిగింది. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు.ఎక్కడలేని కోపం వచ్చింది. శంకరుని పట్టుకుని ఇంతంత మాటలు అంటాడా? నేనూ శపిస్తున్నాను దక్షుడిని. దక్షుడు ఇవాల్ని నుండి సంసారమునందు పడిపోవుగాక! కామమునకు వశుడగుగాక! అని శాపము ఇచ్చేశాడు. నందీశ్వరుడు శాపం ఇచ్చేసరికి భ్రుగువుకు కోపం వచ్చింది. ఆయన లేచి ఎవరయితే ఈ భూమండలం మీద శంకరుని వ్రతమును అవలంబిస్తారో, అటువంటి వారిని అనుసరించి ఎవరు వెడతారో వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండను నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జతలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమిమీద తిరిగెదరు గాక! అని వేదం విరుద్ధమయిన స్థితిని వారు పొందుతారు అని శాపం ఇచ్చేశాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. సతీదేవి ఎదురువచ్చింది. కానీ శంకరుడు దక్ష సభలో జరిగిన సంగతి ఏమీ ఆమెకు చెప్పలేదు. కొన్నాళ్ళయి పోయింది. ఇపుడు ‘నిరీశ్వర యాగం’ అని కోట వ్రతం మొదలుపెట్టాడు. దానికి బృహస్పతి సవనము అని పేరు పెట్టాడు. దానికి ముందుగా వాజపెయం చేశాడు. వెళ్ళకపోతే ఏమి శాపిస్తాడో అని ఆ యాగామునకు అందరూ వెడుతున్నారు. అతడు చేస్తున్న యాగం మామూలుగా చేయడం లేదు. శంకరుడి మీద కక్షతో చేస్తున్నాడు. శ్రీమహావిష్ణువు, బ్రహ్మగారు రాలేదు.

శ్రీమద్భాగవతం - 32 వ భాగం

ఒకరోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. పైన అందరూ విమానములలో వెళ్ళిపోతున్నారు. అలా వెళుతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు. . ‘దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు. ఆహ్వానం వచ్చింది. అందుకని మనందరం వెడుతున్నాం’ అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి క్రిందికి దిగి శివుడి దగ్గరకు వచ్చి ‘స్వామీ! పుట్టింట్లో ఏదయినా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట. నాకు నా తండ్రిగారు చేస్తున్న యాగామునకు వెళ్ళాలని అనిపిస్తోంది. మనం కూడా యాగానికి వెళదాం’ అంది. తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవికేసి చూశాడు. ఆయన మనస్సులోని భావనను ఆమె పసిగట్టింది. ‘కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి. తండ్రిగారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళవచ్చు. అంది. అపుడు శంకరుడు ‘దేవీ, నీవు చెప్పినది యథార్తమే. పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు. కానీ నేను కూడా ఒక మాట చెపుతాను విను. నేను లేచి నమస్కరించ లేదని నీ తండ్రిగారు నన్నొక సభలో అవమానం చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పటికి కూడా వారు నాయందు అనుకూల్యతతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం వెడితే తలుపు తీసి అసలు పలుకరించరు. మాట్లాడరు. వాళ్ళు మనలను చాలా దారుణంగా అవమానిస్తారు. కాబట్టి బంధువయినా సరే ఆదరణ లేనప్పుడు వాడు ఎంతగొప్పవాడయినా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. కాబట్టి వెళ్ళవద్దు’ అని చెప్పాడు. అపుడు ఆవిడ ‘నాకు వెళ్ళాలని అనిపిస్తోంది’ అంది. అపుడు శివుడు ‘అయితే నీవు వెళ్ళవచ్చు’ అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు, అన్నీ తెలుసు.
వెంటనే తల్లి పుట్టింటికి బయలుదేరింది. ఆమె కాళ్ళకు ఉన్నటువంటి గజ్జెలు మ్రోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణములు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు. అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్షప్రజాపతి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. పరవారం అంతా కూర్చుని ఉన్నారు. వృషభవాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం వుంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి తన కూతురి దాక్షాయణి అని పేరుపెట్టుకుని నడిచి వస్తోంది. దక్షుడు లేవలేదు, పలకరించలేదు. తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. దీనిని మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమయిన తేజస్సుతో చూస్తోంది. ఆమె సమస్త బ్రహ్మాండములను కాల్చివేయ గల శక్తి గలది. ప్రమథగణములు చూశాయి. విచ్చుకత్తులు పైకి తీసి ఈ దక్షుడిని చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు వారించింది. దక్షుడిని తనవద్దకు పిలిచి పరమశివుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు. ఇప్పుడు చెపుతున్నాను నీకొక మాట ‘ఎవరయినా శంకరుణ్ణి నిందచేస్తే వాని నాలుక పట్టి పైకి లాగి కొండనాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అలా నీకు చేయడానికి అధికారం లేని పక్షంలో ఉత్తరక్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటకు వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానివేయాలి. నువ్వు దుర్మార్గుడివి. దుష్టాత్ముడివి. అందుకే శంకరుణ్ణి నిందచేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకముందు నేను ఎప్పుడయినా పరమ పవిత్రుడయిన శంకరునిసాన్నిధ్యంలో కూర్చుని వుంటే దాక్షాయణీ అని పిలుస్తారు. దుర్మార్గుడవయిన నీ కుమార్తెగా పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. అందుకని నేను ఈ శరీరమును వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను’ అని పద్మాసం వేసుకుని కూర్చుని ప్రాణాపానవ్యాన వాయువులను నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆపైన ఉదాన వాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకువచ్చి కనుబొమల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములు అన్నితిలోంచి అనిలము అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని యందు శరీరమును దగ్ధం చేసి బూడిదకుప్పై క్రిందపడిపోయింది. సభలో హాహాకారములు మిన్నుముట్టాయి. ప్రమథ గణములకు ఎక్కడలేని కోపం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డారు. భ్రుగుడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే హోమం చేసి అందులోంచి ‘రుభులు’ అనబడే దేవతలను సృష్టించి రుద్ర గణములను తరిమికోట్టించాడు. ఈ విషయములను నారదుడు వెళ్ళి శంకరునకు చెప్పాడు. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు. శంకరునకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఇంత శాంతమూర్తి రుద్రుడయిపోయాడు. ఒక్కసారి లేచాడు. పెద్ద వికటాట్టహాసం చేశాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండములు కదిలిపోయాయి. మెరిసిపోతున్న జటనొకదానిని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరమును చూసేటప్పటికే హడలిపోయారు అందరూ. వీరభద్రావతారం ఉద్వేగంతో ఒక్కసారి దూకి శంకరుని పాదములకి నమస్కరించి బయల్దేరాడు. బయల్దేరేముందు పరమశివుడి కి ప్రదక్షిణం చేసి ‘తండ్రీ, నాకు ఏమి ఆనతి’ అని అడిగాడు. ‘సతీదేవి శరీరమును విడిచిపెట్టింది. దక్షయజ్ఞమును ధ్వంసం చెయ్యి’ అన్నాడు శంకరుడు.
వీరభద్రుడు ఒక పెద్ద శూలం పట్టుకు బయలుదేరాడు. ఆయనతో ప్రమథ గణములన్నీ వచ్చేస్తున్నాయి. ఆ శబ్దమును యాగంలో వున్న వాళ్ళు విన్నారు. దక్షప్రజాపతి భార్య ‘ఉపద్రవం వచ్చేసింది’ అనుకుంది. వీరభద్రుడు రుద్రగణములతో కలిసి యజ్ఞమంటపములన్నిటినీ పడగొట్టేశాడు. పిమ్మట నందీశ్వరుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళాడు. ‘ఆనాడుసభలో శంకర నిండా జరుగుతుంటే కళ్ళు ఎగుర వేసిన వాడివి నీవేకదా! ఇప్పుడు దానికి తగిన శిక్ష అనుభవిస్తావు’ అని గడ్డం క్రింద ఎడమచెయ్యి వేసి పట్టుకొని ముంజికాయను బొటనవ్రేలు పెట్టి పైకెత్తేసినట్లు బొటనవేలితో రెండు కనుగుడ్లు ఉత్తరించేశాడు. అప్పుడు భ్రుగుడి కళ్ళు ఊడి క్రిందపడిపోయాయి. ‘పూష’ అనే సూర్యుడు ఉన్నాడు. ‘ఏమయ్యా, నువ్వు శంకర నింద జరుగుతుంటే పెద్దగ నోరు తెరచి నవ్వావు. ఇప్పుడు నీకు శిక్ష చూడు’ అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. రెండుదవడలు తెరిచి పళ్ళు పీకేశారు. ఆఖరున వీరభద్రుడు దక్షప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు. ఆయనను క్రిందపారేసి గుండెలమీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠమును కోసేశాడు. కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. దక్షుని శరీరం అంతా మంత్రపూతమయిపోయి వుంది. ఎలా త్రుంచాలా అని ఆలోచించాడు. ‘ ఈ దుర్మార్గుడు శివ నింద చేసినందుకు యజ్న పశువు శరీరమును ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను అని గుండెల మీద కుడి కాలు వేసి తొక్కిపట్టి తోటకూర కాదను తిప్పెసినట్లు కంఠమును తిప్పేసి ఊడబెరికి దానిని తీసుకువెళ్ళి యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిహోత్రంలో పారవేశాడు. ఆ శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది. తలలేని మొండెం ఉండిపోయింది. అక్కడ వాళ్ళని రక్షించిన వాడు లేదు. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేద దృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు. మనం ఈశ్వరుడిని ఒక్కడిగా చూడడం నేర్చుకోవాలి. లేకపోతే పాడైపోతాము. అప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా, పాపకర్మ చేశాము దానివలన ఇంత ఉపద్రవం వచ్చింది. ఏమి చేయమంటావు’ అని అడిగారు.
అపుడు బ్రహ్మగారు ‘పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? ఎందుకు ఆ యజ్ఞం? మీకు ఒక్కటే మార్గం ఉంది. మీరు ఎవరిపట్ల తప్పు చేశారో వాని దగ్గరకు వెళ్ళి కాళ్ళమీద పదిపొంది. ఎన్ని తప్పులు చేసినా ఆయన కాళ్ళమీద పడిపోతే మరల రక్షిస్తాడు’ అని సలహా చెప్పాడు. అపుడు వాళ్ళు ‘మాతో నీవు కూడా రావలసింది’ అని ప్రార్థించారు. ‘సరే పదండి’ అని బ్రహ్మగారు వీరిని తీసుకొని కైలాసం వెళ్ళారు. వీరు వెళ్లేసరికి అత్యంత ప్రశాంతచిత్తుడై ఒక రావిచెట్టు క్రింద శంకరుడు కూర్చుని ఉన్నాడు. బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు. అయ్యా, తెలియక నీపట్ల దోషం చేశారు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు. సృస్టిస్థితిలయ ఈ మూడూ నీయందు జరుగుతుంటాయి. తెలియనటువంటివారు ఈ రకంగా అపచార బుద్ధితో ప్రవర్తించారు. వీరిని క్షమించు’ అన్నారు బ్రహ్మగారు. మహానుభావుడు భోళాశంకరుడు కదా! అభయంకరుడు. ‘మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో అభయం ఇస్తున్నాను.’ యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎవరు యజ్ఞము చేయాలో అటువంటి దక్ష ప్రజాపతికి ఈవేళ ముఖం లేదు. అందుకని దక్షుని మొండెమునకు గొర్రె ముఖమును తీసుకువెళ్ళి అతికించండి. మిగిలిన యజ్ఞభాగాన్ని పూర్తిచేస్తాడు. పూష తానూ ఏదయినా తినవలసి వచ్చినపుడు యజమాని దంతములతో తింటాడు. భ్రుగునికి నేతములు ఇస్తాను. కానీ ఇకనుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భ్రుగువుకి కనపడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరు అంగవికలురు అయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును సంతోషంతో పూర్తి చేసుకోండి’ అని వరములను ఇచ్చేశాడు. దక్షప్రజాపటికి గొర్రె తలకాయ తీసుకు వెళ్ళి పెట్టారు. వెంటనే ఆయన లేచి నిలబడి పరుగెత్తుకుంటూ కైలాసమునకు వఛి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. ‘స్వామీ నీవు నన్ను దండించడాన్ని రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరూ ఇటువంటి అపరాధములు చేయకుందురు గాక! స్వామీ నన్ను మన్నించు’ అని నమస్కరించాడు. వెళ్ళి యాగమును పూర్తిచెయ్యి అన్నాడు శంకరుడు. తరువాత దక్ష ప్రజాపతి తన యజ్ఞమును పూర్తిచేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘స్వామీ నీవు యజ్ఞభర్తవి అని నమస్కరించాడు. ఎవరు దక్షయజ్ఞ ద్వంసమును చదువుతున్నారో వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామమును చెప్తూ కైవల్యమును పొందగలరు. అటుఅవంటి గొప్ప ఫలితమును దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు.

శ్రీమద్భాగవతం - 33 వ భాగం

ధ్రువోపాఖ్యానం:
భాగవతంలో ద్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయమంటే మీ మనస్సు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల జన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన వాడు మాత్రమే ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతమును వినాలి. అందునా భాగవతాంర్గతంగా వినడం అనేటటు వంటిది మరింత గొప్ప విషయం. అందునా ద్వాదశినాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ, అసురసంధ్యవేళ కానీ ద్రువచరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు.
ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమయిన సందర్భము. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపమును ఒక పురుష స్వరూపమును సృష్టి చేశారు. వారే స్వాయంభువమనువు, శతరూప. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుచున్నాడు. ఉత్తాన పాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. సునీతి ఎప్పుడూ నీతి చెపుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికయినా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజు యిన ఉత్తాన పాదుడికి సురుచియందున్న ప్రేమ సునీతియందు లేదు. సునీతియందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి వుంది. సురుచి కొడుకయిన ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చున్నాడు. అపుడు సునీతి కొడుకయిన ధ్రువుడు పరుగుపరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడమీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధ్రువుని తన తొడమీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమలేక కాదు. సురుచి ప్రక్కన ఉండడం వలన ధ్రువుని తన తొడమీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. అపుడు ఆవిడ ఒక గమ్మత్తయిన మాట అంది. “నీవు నిజంగా తండ్రి తొడమీద కూర్చునే అదృష్టం పొందిన వాడవయితే నా కడుపున పుట్టి ఉండేవాడివి. కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కదు”. కేవలం ఆభిజాత్యముతో ఈమాట అంటోంది. సురుచి మరల అంది “నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడవు అయి ఉండాలి. నా కడుపున పుట్టలేక పోయిన వాడు తండ్రి తొడమీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడయిన అధోక్షజుడయిన శ్రీమహావిష్ణువు పాదారవిన్దములను సంసేవనం చేయాలి. అపుడు ఆయన అనుగ్రహిస్తాడు.” అంది. నిజమునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం వున్నది కాబట్టి ధ్రువుడు సునీతియందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు’ అని అడిగింది. జరిగిన విషయం అంతఃపురకాంతలద్వారా తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి ‘నాయనా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా! నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది. నీ పినతల్లి కాని, నేను కాని, నీ తండ్రి కాని నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు వుంటే నీ తండ్రి మనస్సును మరల అలా మార్చగలవాడెవడో తెలుసా! అది నీఅంత నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ నీవు చేరగలుగుతావు’ అని చెప్పింది. అపుడు పిల్లవాడయిన ధ్రువుడు ‘అమ్మా అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను. శ్రీమన్నారాయణుడి గూర్చి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను’ అన్నాడు. ఇప్పుడు అక్కడికి లోకకళ్యాణము చేసే నారదమహర్షి వచ్చాడు. ‘నాయనా, నీవు ఎక్కడికి అలా వెడుతున్నావు?’ అని అడిగాడు. ‘నేను అడవికి వెళ్ళిపోతున్నాను. నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను’ అన్నాడు ధ్రువుడు. అపుడు నారదుడు నవ్వి ‘నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి? అని అడిగి ‘ఈ బుద్ధి నీకు నిలబడుగాక!’అని పరమ పావనమయిన తన చేతిని ఆ ధ్రువుని శిరస్సునందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధ్రువుని ‘నారాయణుడు కనపడితే ఏమిచేస్తావు? అని అడిగాడు. అపుడు ధ్రువుడు ‘అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరతాను’ అన్నాడు. ఏ పెద్ద పదవిని కోరతావు’ అని నారదుడు అడిగాడు. ‘ఏమో నన్ను అడగకండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి. ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను. ఆయన వస్తారు. పెద్ద పదవి కావాలని అడుగుతాను. దానిని పొంది తిరిగి వస్తాను. వెడుతున్నాను’ అన్నాడు.
అపుడు నారదుడు నవ్వి ‘నీవు పొందేదేమిటో నీకు తెలియదా! పెద్ద పదవిని పొండుతావా! అందుకు నేనొకటి చెప్తాను విను. అలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్లకి రాత్రింబవళ్ళు బొటనవ్రేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్లకి అంతంత కష్టాలు పడినవారికి శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు. నీవు నీకు నేనొక పెద్ద సూత్రం చెపుతాను. దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది. నీ కన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. నీతో సమానమయిన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి. తక్కువ విభూతి వున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకిరావాలని ఈశ్వరుని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ మూడూ గుర్తు పెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు’ అన్నాడు.
అపుడు ధ్రువుడు అన్నాడు ‘మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. కానీ నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా! నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంతమాట అంది. నా మనస్సు ఏంటో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనమనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. అందుకని శ్రీహరి కనపడతాడా, కనపడడా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను. అంతే! నేను వెళ్ళిపోతున్నాను” అన్నాడు. గురువు పట్టుదలను గుర్తించి “నాయనా నీవు యమునానది ఒడ్డున నిరంతరమూ శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు అ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచియై ఆచమనం చేసి కూర్చో. తరువాత నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడు అని పట్టు పట్టెయ్యి. పువ్వు లేదా నాలుగు ఆకులు, ప్రధానంగా తులసి తెచ్చుకో. స్వామి వారి మూర్తిని నీటిలో కానీ, పవిత్ర ప్రదేశములో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని యందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనపడతాడు. నీకు నేను ద్వాదశాక్షరీ మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని ఏడురోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు’ అని చెప్పాడు.
నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు.

శ్రీమద్భాగవతం - 34 వ భాగం

నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలా చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు. అలా అయిదవ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొటన వేలు తీసి భూమిమీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి అలా భూమండలం అటూ ఇటూ ఒరగడం ప్రారంభమయింది. ఇలా అపారమయిన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవతలు అందరూ భూమండలమే కంపించి పోతున్నది అని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇపుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యౌవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చేయమని చెప్పి పంపిస్తారు.
ఐదేండ్ల పిల్లవాడయిన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్లకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరకు వెళ్ళి స్వామీ మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి’ అన్నారు. అపుడు పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి ‘ఎవడురా నా గురించి ఇలా తపించినవాడు. వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నాను’ అని లక్ష్మీ సహితుడై, గరుడవాహనారూఢుడై భూమండలమునకు వచ్చాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. కానీ ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ, స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి క్రిందికి క్రిందనుంచి పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అపుడు స్వామి ‘వీడు ఇలానే కూర్చుంటాడు. వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతాను అని సమస్తవేదములు ఉపనిషత్తులు వీనికి భాసించుగాక అని నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ద్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎటువంటి భాగ్యమును పొందాడో చూడండి. అందుకే ద్వాదశినాడు ధ్రువ చరిత్ర వింటే మీ అజ్ఞానం దగ్ధం అయిపోతుంది అంటారు.
ఆ శంఖం తలకి తగిలింది. అంతే! ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామీ నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మజన్మాంతరములకు నాకు కావలసింది ఏమిటో తెలుసా. ఎప్పుడూ మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరుకి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మ్రుత్యుభాయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు. అపుడు స్వామి అన్నారు ‘నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కానీ ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏమిటో తెలుసా. ధర్మమూ అగ్ని కశ్యపుడు సప్తర్షులు కాలమునక్షత్ర మండలము ఋతువులు సూర్య చంద్రాది గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగులరాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువ మండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువ మండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతూ ఉంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్టచివరి జన్మ’ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు.
అపుడు ధ్రువుడు అయ్యో, ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం’ అనుకోని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురువచ్చి స్వాగతం పలిగి అర్ఘ్యం ఇచ్చి లోపలి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తాన పాదుడు కొంచెం బాధగా వున్నాడు. నారదుడు ఉత్తనపాడుడిని ‘అంత బాధగా వున్నావేమిటి” అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ‘ఏమి చెప్పుకోను. నాకు ఇద్దరు భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే, వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసిన భయం చేత వానిని నా తొడమీద కూర్చోపెట్టుకోలేదు. సురుచి వారిని నారాయణుని గూర్చి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనస్సు గాయమును పొందింది’ అన్నాడు. అపుడు నారదుడు ‘నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా! ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు’ అని చెప్పాడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు.
ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వారములు పొంది వచ్చాడు అని కాదు ఉత్తాన పాదుడి సంతోషం. తనకొడుకు అడవులకి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి ‘చిరాయుర్దాయం కలుగుతుంది – ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు.
ఇదీ మర్యాద. అంతేకానీ అమ్మ దగ్గరకు వెళ్ళి ‘అమ్మా ఈయనను ఇన్నాళ్ళనుండి ఎలా భరిస్తున్నావమ్మా’ అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడయిన రచయిత రాసి మనదేశాన్ని నాశనం చేశాడు.
రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది.
సురుచి కుమారుడయిన ఉత్తముడు ఉత్తర దిక్కున వున్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్తా విని సురుచి అరణ్యములో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టు అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించక పోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది.
తదనంతర కాలమందు ధ్రువుడికి వివాహం జరిగింది. ‘శిశుమారుడు’ అనే ప్రజాపతికి ఒక కుమార్తె, పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమెయందు ద్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకడిపేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తరువాత వాయుదేవుని కుమార్తె అయిన ‘ఇళ’ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెయందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు. ఆయన కదలకుండా ధ్రువ పథమై ఉంటాడు. మిగిలినవి అన్నీ కదులుతుంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురుని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదలుత అని అర్థం. జ్యోతిశ్చక్రము నందు సూర్యమాన చాంద్రమానములచేత తిథులు నక్షత్రంలు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు ‘వత్సర’ – అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతము అయిపోయిన తర్వాత హద్దు కల్పము.
ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమయిన యక్షులతో విశేషమయిన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమంది యక్షులను చంపేశాడు. తదుపరి నరనారాయణాస్త్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ సమయంలో తాతగారయిన స్వాయంభువ మనువు కనపడి ఒకమాట చెప్పాడు. ‘నీవు పొందబోయే పావి ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నీవు ఇటువంటి పని చేయకూడదు. అందుకని ఇప్పటివరకు నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికయినా నా మాట విని నరనారాయణాస్త్రమును ఉపసంహారం చేసి నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికయినా నా మాట విని నరనారాయణాస్త్రమును ఉపసంహారం చేసి నువ్వు నీ ధనుస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో’ అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు.

శ్రీమద్భాగవతం - 35 వ భాగం

ధ్రువుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెపుతుంది ధ్రువోపాఖ్యానం.
కుబేరుడు వచ్చి ‘నీకు ఎంతో కోపం వచ్చిందట, కొన్ని వేలమంది యక్షులను సంహరించావట. అంతకోపంతో ఉన్నా మావాళ్ళు నీమీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాటవిని యుద్ధం మానివేశావు. నీలాంటి వానిని చూడడం నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను’ అన్నాడు. అప్పుడు ధ్రువుడు అన్నాడు ‘అపుడు నా బుద్ధిలో చిన్న వైక్లబ్యం వచ్చింది. నేను ఎంతో పాపపు పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా! నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదారవిందముల నుండి విస్మరణము లేని నామము చెపుతూ తరించి పోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకంగా నీవారము చేత కటాక్షింపబడుగాక’ అని అడిగాడు. ఇదీ వ్యక్తి కోరుకోవలసింది. కుబేరుడు సంతోషముతో ఆ వరమును ద్రువునకు అనుగ్రహించాడు. దానితో ధ్రువుడు అపారమయిన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. బదరికాశ్రమమునకు చేరి కూర్చుని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒక చిత్రవిచిత్రమయిన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. అందులోంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు. వారు నీల మేఘము వంటి శరీరము కలిగినవారి శంఖచక్రగదాపద్మములను పట్టుకుని తానూ అయిదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో ఇద్దరు నడిచి వచ్చారు. ధ్రువుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్లకి నమస్కరించి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. అపుడు వాళ్ళు “మరచిపోయావా! ఐదేండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళాలి. అందుకని స్వామి నీకోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులము. మీరు విజయం చేసి విమానం ఎక్కండి’ అన్నారు.
అపుడు ధ్రువుడు జ్ఞానియై తనే శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోకి ఎక్కాడు. అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా ఆ లోకములన్నింటి వంక చూస్తున్నాడు. ఆ విమానంలో కూర్చుని అనుకున్నాడు ‘ఓహోహో ఏమి లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది, పుణ్యములు అయిపోయిన తరువాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. అయిదు నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితినా ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధ్రువ స్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ వుంటాను. ఎంత అదృష్టవంతుడిని’ అనుకుని ఈ అదృష్టమునకు కారణము ఎవరి అని ఆలోచించాడు. ‘దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది. కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో’ అనుకున్నాడు మనసులో. అనుకునే సరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు. ‘నిన్నీ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడుపమని చెప్పారు. కిటికీలోంచి బయటకు చూడు’ అన్నారు. ధ్రువుడు బయటకు చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజోవిరాజితయై సునీత వెళ్ళిపోతున్నది. ఆవిడ శ్రీమన్నారాయణుడి లోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువ మండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారి లోనికి లీనమై పోయి పరబ్రహ్మము సాయుజ్య మోక్షమును పొందాడు.
ఇంతటి అద్భుతమయిన ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశం జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు, కీర్తిని ఇస్తుంది.
3. పృథు చరిత్ర:
ఒకానొక సమయంలో ఈ దేశమును అంగరాజు పరిపాలితూ ఉండేవాడు. ఆయన మహా ధార్మికుడు. కేవలము ధర్మానుష్టానము తప్ప ఎన్నడు అధర్మము చెయ్యని వాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ సందర్భంగా దేవతలను అందరిని పిలిచి హవిస్సులు ఇస్తున్నాడు. ఆ రోజులలో స్వాహా అంటూ ఆ దేవతలను పిలిస్తే ఆ దేవత వచ్చి ఎదురుగా కూర్చుని హవిస్సును అగ్ని ముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో దేవతలను ఆవాహన చేస్తున్నారు. ఒక్క దేవత రాలేదు! ఏ దేవతా రాకపోతే అంగరాజు ఆశ్చర్యపోయాడు. ‘ఎందుచేత ఇలా జరిగింది’ అని ఋషులను అడిగాడు.
అపుడు ఋషులు ‘వేదము స్వరప్రాకటము. మా స్వరమునందు దోషము లేదు. కానీ వారు రావడం లేదంటే వారు నీయందు అప్రసన్నులై ఉన్నారు. అందుకు నీలో ఏదో దోషం ఉంది ఉండాలి. కానీ నీ చరిత్రను పరిశీలిస్తే నీయందు ఎక్కడా దోషం కనపడడం లేదు. కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేయాలి’ అన్నారు. ఆయనలో గల దోషం గురించి విచారణ చేశారు. అంగమహారాజు అనపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకు సంతానం లేదు. అందుచేత యజ్ఞములో ఆయన ఇచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. అపుడు ఋషులు ‘నీకు ఇప్పుడు ఉత్తరక్షణం సంతానం కలగాలి. గతజన్మలో నీవు చేసిన పాపములు ప్రతిబంధకంగా ఉండడం వలన ఈ జన్మలో నీకు సంతానం కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకమును తీసివేయాలి. అందుకు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. దానికి మేము యాగం చేస్తాము. ఆ యాగము చేత శ్రీమహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానం కలుగుతుంది’ అన్నారు.
అంగమహారాజు శ్రీ మహావిష్ణువు ప్రీతికొరకు యాగం చేశాడు. యాగం పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించ చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశమును పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండం లోంచి ఆవిర్భవించాడు. ఆ పురుషుడు ‘అంగరాజా, ఈ పాయస పాత్రలో వున్న పాయసమును నీ ధర్మపత్ని చేత తినిపించు. అపుడు నీకు అనపత్య దోషం పోయి సంతానం కలుగుతుంది’ అని చెప్పాడు. పాయస పాత్ర తీసుకువెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీథ. ఆవిడ భర్తృ సంగమము చేతనే సంతానమును పొందింది. తేజస్సు అంగరాజు తేజస్సే. కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేక పోయింది? అనగా ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలుగకుండా చేసింది. ఇపుడు ఆ విఘ్నం పోయింది. కాబట్టి ఇపుడు సంతానం కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్ర శుద్ధి జరుగలేదు. క్షేత్రమునందు దోషం ఉన్నది. ఆమె మృత్యువు పుత్రిక కావటం చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ కుమారుడు వ్యగ్రస్వభావము కలిగినటువంటి వాడు జన్మించాడు. వానికి ‘వేనుడు’ అని పేరు వచ్చింది. జన్మతః వచ్చిన బుద్ధి బోధకు మారడం చాలాకష్టం. వేనుడు ప్రతిరోజూ నిష్కారణంగా వేటకు వెళ్ళి కుందేలు పిల్లల దగ్గరనుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడంలో అర్థం లేదు. అతను వేటనుండి తిరిగి వస్తున్నప్పుడు క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలను చూసేవాడు. ఆడుకుంటున్న పిల్లలను బడిత పుచ్చుకుని వారు చచ్చిపోయేవరకు కొట్టేవాడు. వాడు సంతోషంగా వెళ్ళిపోయేవాడు. ఇలాంటి పిల్లవాడిని రోజూ దగ్గర కూర్చోపెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఈయన అలా చెపుతుంటే కొడుకు కనుబొమలు ఎగురవేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు. మరల తెల్లవారున లేవడం పాపకృత్యములు చేయడం! ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. ఒకరోజు భార్య, కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు మాత్రం నిద్ర పట్టక ‘నా జీవితమునకు ఏమి సార్ధకత? నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తరువాత సింహానమును అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తరువాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా వాడయినా నన్ను ఉద్ధరించాలి. నాకు ఇంత దుష్దుడు పుట్టాడు. ఇలాంటి కొడుకు ఉన్న నాకు రాజ్యం ఉంటే ఎంత? సింహాసనం ఉంటే ఎంత? రోజూ వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది. అనుకుని విరాగియై అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురమును, భార్యను, బిడ్డను విడిచి పెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యములోకి వెళ్ళిపోయాడు. మరునాడు అంతఃపురంలో రాజు కనపడలేదు. వారు ఆయన తల్లిగారయిన సునీథతో మాట్లాడి వేనుడికి పట్టాభిషేకం చేశారు.

శ్రీమద్భాగవతం - 36 వ భాగం

వేనుడు రాజు అయిన తరువాత ప్రజలకు ఇటు రాజు వైపునుండి బాధ అటు క్రూరుల వైపునుండి బాధ. యజ్నయాగాడి క్రతువులు లేవు. రాజు ఈశ్వరుడు. కాబట్టి మీరు యజ్ఞం చేస్తే నాకు చెయ్యాలి. నా చిత్రపటములకే ఆరాధన చేయాలి అని వేనుడు ప్రకటించాడు. ఇపుడు భూదేవికి కోపం వచ్చింది. ‘వీళ్ళు తమ కొరకు మాత్రమే తింటున్నారు. వీళ్ళకి కృతజ్ఞత లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. కాబట్టి నేను ఓషధీశక్తిని ఉపసంహారము చేస్తున్నాను’ అంది. భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు. ఎప్పుడయితే ఓషధీశక్తి ఉపసంహారం అయిందో వెంటనే వచ్చే ఫలితం ప్రతి వాడికి దేశంలో ధర్మం అన్నమాట నీతి అన్నమాట కడుపులోకి పదార్ధం దొరికినంత సేపే ఉంటాయి. అసలు తినడానికి దొరకకపోతే భాగవతం చెపుతాను రమ్మనమంటే ఎవరయినా వస్తారా? ఎవరూ రాదు. ఎక్కడ చూసినా దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. నేరముల సంఖ్య పెరిగిపోయింది. దొంగతనములు పెరిగిపోయాయి.
ఋషులు ఈ పరిస్థితిని గమనించారు. వారు సరస్వతీ నదీ తీరంలో సమావేశం అయ్యారు. రాజ్యంలోని అప్పటి దారుణ పరిస్థితులకు కారణం ఏమిటని ఆలోచన చేశారు. మహర్షులం అందరం వెళ్ళి వేనుడితో ఒక మాట చెబుదాం. అతడు మన మాటవిని మారిపోతే సంతోషం. మారక పోతే ఇంకా ఆ రాజు ఉండకూడదు కాబట్టి మన తపశ్శక్తి చేత వానిని సంహారం చేసేద్దాం అనుకోని బయల్దేరారు. రాజుకు ఆశీర్వచనం చేసి ఒకమాట చెప్పారు. ‘రాజా, నీవు యజ్ఞయాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలి. ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో’ అని చెప్పారు. అపుడు వేనుడు ‘అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కనపడని విష్ణువుకు యజ్ఞం చెయ్యమంటున్నారా? ఇంకొకసారి నోరు విప్పితే మీ కుత్తుకలు ఎగితిపోతాయి’ అన్నాడు.
అపుడు ఋషులు ఇక అతడు మారాడు అనుకున్నారు. ‘వీనికి బోధ అనవసరం. వీనవలన మొత్తం రాజ్యం నాశనం అయిపోతోంది. వీడు ఉండడానికి వీలులేదు.’ అనుకున్నారు. అపుడు ఋషులందరూ కోపం తెచ్చుకొని హుంకారమును చేశారు. అంతే! వేనుడు చచిపోయాడు. అహంకారం ప్రబలి ప్రబలి మహాత్ముల జోలికి వెళ్ళిన వారికి చిట్టచివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. వేనుని తల్లి అయిన సునీథ గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది. తన మంత్రశక్తితో వెనుది శరీరమును కాపాడింది. అందుకని ఆశరీరమునకు అంత్యేష్టి సంస్కారమును చేయలేదు. ఋషులు కొంతకాలం చూశారు. ఇపుడు నేరముల సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. శిక్షించే నాథుడు లేదు. అప్పుడు ఋషులు అన్నారు ‘ఇప్పుడు మనం ఎలా అయినా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. రాజు మరణించి ఉన్నాడు. ఇపుడు మనం మన తపశ్శక్తితో రాజు శరీరంలోంచి రాజు సంతానమును తీసుకురావాలి’ అనుకున్నారు. తపశ్శక్తి ఉన్నవారు మూఢుల్ని మార్చలేకపోయారు. కానీ క్షేత్రములేకుండా శరీరంలోంచి సంతానమును సృష్టిస్తున్నారు కానీ వారి వాక్కుకు వాడు మాత్రం మారలేదు. ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడమీద మథనం చేశారు. అందులోంచి తపశ్శక్తితో మథనం చేస్తే పాపము పైకి రావడం మొదలు పెట్టింది. అందులోంచి బాహుకుడు అనబడే ఒక నల్లటి వాడు పొట్టి పొట్టి కాళ్ళు పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగి జుట్టుతో పుట్టుకొచ్చాడు. ‘నేను ఏమి చేయాలి’ అని ఋషులను అడిగాడు. అపుడు ఋషులు వానివంక చూసి ‘వీడు రాజ్యపాలనము చేయగలిగిన వాడు కాలేడు అనుకోని నీవేమీ చేయవద్దు అన్నారు. ఇపుడు మరల సరియైన పిల్లవాడు రావాలి అంటే ఎక్కడ మథనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈలోగా ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండలలో నివసించడం మొదలు పెట్టాడు. అతని వంశీయులకే ‘నిషాదులు’ అని పేరు వచ్చింది.
ఇపుడు ఋషులు ‘స్వామీ, ఒక కొడుకు పుట్టడమును మేము అడుగుట లేదు. లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాము కాబట్టి శ్రీమహావిష్ణువా, నీవే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటకు రా’ అని బాహువులను మథించారు. ఆశ్చర్యకరంగా బాహువుల నుండి ఒక అందమయిన పురుషుడు, ఒక అందమయిన స్త్రీ పుట్టారు. ఆ పుట్టిన వారి పాదములను చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనబడ్డాయి. ‘ఓహో మనం ప్రార్థన చేసిఅట్లు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. కాబట్టి ఇక రాజ్యమునకు ఇబ్బందిలేదు’ అనుకున్నారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరుపెట్టారు. ఆయన వెంటనే యౌవనమును సంతరించుకున్నాడు. ఆవిడకు ‘అర్చిస్సు’ అని పేరు పెట్టారు. ఆయనే పృథు మహారాజు అయ్యారు.
ఆయన విష్ణు అంశతో ఋషులు మథిస్తే పుట్టిన వాడు కనుక ఆయన రాజ్యపాలనం చేయడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకువచ్చారు. కుబేరుడు ఆయన కూర్చొనుటకు కావలసిన సింహాసనం తెచ్చాడు. వరుణుడు గొడుగు తెచ్చాడు. వాయువు చామరం, ధర్ముడు మేడలో వేసుకునేందుకు సుగంధమాల తీసుకువచ్చారు. బ్రహ్మగారు వేదమనబడే కవచమును ఇచ్చారు. సరస్వతీ దేవి మేడలో వేసుకునే హారమును, పూర్ణాంశలో ఉండే స్వామి శ్రీమహావిష్ణువు సుదర్శనమును, లక్ష్మీదేవి ఐశ్వర్యమును, పరమశివుడు దశచంద్రమనబడే కత్తిని ఇచ్చాడు. ఈ కట్టి పెట్టడానికి ఒర కావాలి. పార్వతీదేవి శతచంద్రమనబడే ఒరను ఇచ్చింది. సోముడు గుర్రమును, త్వష్ట రథమును, అగ్ని ధనుస్సును, సూర్యుడు బాణమును, సముద్రుడు శంఖమును, ఇచ్చాడు. స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులు ధారపోశారు. పృథు మహారాజు పరిపాలన చేయడం కోసం సింహాసనం మీద కూర్చోగానే వంధిమాగధులు స్తోత్రం చేశారు. అపుడు పృథువు వాళ్లకి బహుమానములను ఇచ్చి సంతోషించాడు. ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి ‘మహానుభావా ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి దిక్కు ఎవరూ లేరు. ఆకలితో అన్నమో రామచంద్రా అని అలమటించి పోతున్నాము. ఎందుకు అంటే భూమి ఓషధీ శక్తులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము పంటలు పండిద్దామన్నా పండడం లేదు. నీవు మమ్మల్ని అనుగ్రహించవలసినది’ అన్నారు.
పార్వతీ దేవి శాకాంబరి అయినట్లు వెంటనే పృథు మహారాజు తన ధనుస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. ‘అసలు ఈ భూమి పంట పండుతుందా? పండదా? నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను’ అన్నాడు. పృథు మహారాజు గారి ఆగ్రహమును చూసి భయపడి భూమి గోరూపమును పొంది పరుగెడుతోంది. ఏ దిక్కుకి పరుగెడితే ఆ దిక్కుకు ఎదురువచ్చాడు. అపుడు గోవు ప్రార్థన చేసింది. ‘స్వామీ నీవే ఒకనాడు యజ్ఞవరాహామై నీ దంష్ట్రలతో భూమిని పైకి ఎత్తావు. నీవే ఈ భూమిలోంచి అన్ని రకములైన శక్తులు కలిగే అదృష్టమును నాకు కటాక్షించావు. ప్రజలు ఎవరూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేనుడు చెయ్యవద్దని శాసించాడు. ప్రజలు మానివేశారు. యజ్ఞయాగాదులు మానడం ఎంతటి ప్రమాదకరమో భాగవతం చెపుతోంది. అందుకని నేను నా ఓషధీ శక్తులను గ్రసించాను(నమలకుండా మ్రింగివేయడం). అలా గ్రసించడం వలన ఓషధీశక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపొయింది. ఇప్పుడు లేదు. కానీ ఒక లక్షణం ఉంది. నేను గోరూపంలో తిరుగుతాను. జీర్ణమయిన శక్తి మరల పాలరూపంలో బయటకు వస్తుంది. నేను పాలరూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి. నువ్వు రాజ్య క్షేమము కోరిన వాడివి కనుక నీకోసం విడిచిపెడతాను. కానీ నీవు వచ్చి దూడగా నిలబడతానంటే కుదరదు. ఇపుడు దూడ రూపంలో ఎవరయినా రాగలరా? దూడగా ఎవరిని తీసుకు వస్తావు’ అని అడిగింది.
అపుడు పృథు మహారాజు ‘ఇప్పుడు నీవు చెప్పిన మాటకు చాలా సంతోషం. తల్లీ, నీకు నమస్కారం. నీకు దూడగా స్వాయంభువ మనువును తీసుకువస్తాను. ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించినవాడు’ అని చెప్పాడు. స్వాయంభువ మనువు పేరు వినగానే భూమాత చాలా సంతోషించింది. స్వాయంభువ మనువు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు. ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయాయి. ఈ ఓషధీశక్తిని పితకగలిగిన వాడు ఉండాలి. ఎవరు పితకాలి? పృథు మహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చున్నాడు. ఇపుడు ఓషధీశక్తులను తట్టుకోగలిగిన పాత్ర కావాలి. తన చేతిని పాత్రగా చేసి రెండవ చేతితో పాలు పితికాడు. ఆ పాలను భూమిపై చల్లాడు. వెంటనే పంటలు పండాయి. భూమి సస్యశ్యామలం అయిపొయింది. ఇపుడు ఆకలి ఎక్కువ పండేటటువంటి భూమి తక్కువ. అందుకని పృథువు తన ధనుస్సును చేతపట్టి వంచి ధనుస్సు చివరి భాగంతో కొన్ని పర్వతములను పడగొట్టి భూమిని సమానం చేశారు. అలా చేసేసరికి కొన్ని వేల ఎకరముల భూమి మరల వ్యవసాయ యోగ్యమయింది. దీని మీదకు వచ్చి నీరు నిలబడింది. విశేషమయిన పంటలు పండాయి. పృథివి మీద ఉన్నవాళ్ళు అందరూ చాల సంతోషించారు. భూమిని పృథు మహారాజు పిండితే ‘పృథివీ’ అనే పేరు వచ్చింది. అందుకే జీవితంలో పృథు మహారాజు గురించి వినినట్లయితే మన కోరికలు అన్నీ తీరిపోతాయని పెద్దలు చెపుతారు.

శ్రీమద్భాగవతం - 37 వ భాగం

పృథు మహారాజు ఎప్పుడయితే పిండుకున్నారో దేవతలు అందరూ పరుగెత్తుకు వచ్చారు. ఇంద్రుడిని దూడగా వదిలారు. అమ్మ వాళ్లకి ‘వీర్యము’, ‘ఓజము’, ‘ఋతము’ అనబడేటటువంటి మూడింటిని విడిచిపెట్టింది.
రాక్షసులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకొని లోహ పాత్రలలో మూడు రకముల సుర పిండుకున్నారు. గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యమును మధువును పిండుకున్నారు. అందుకే పద్మము అంత సౌందర్యంగా ఉంటుంది. పితృగణములు అర్యముని దూడగా చేసి పచ్చి మట్టి పాత్రలో దవ్యమును పిండుకున్నారు. సిద్ధులు కపిల మహర్షిని దూడగా చేసి ఆకాశమనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం చేయగలుగుతుంటారు. కింపురుషులు మయుడిని దూడగా చేసి యోగమనే పాత్రలోనికి ధారణ అనే శక్తిని పిండుకున్నారు. యక్ష భూత పిశాచాది గణములు రుద్రుడిని దూడగా చేసుకుని కపాలంలోకి రక్తమును పిండుకున్నారు. పాములు తక్షకుడిని దూడగా చెసుకొఇ తమ పుట్టలనబడే పాత్రలలోకి ‘పురువులు’ ‘ఫలములు’ అనే వాటిని పిండుకున్నాయి. వృక్షములు తమ పట్టలలోనికి రసమును పిండుకున్నాయి. అందుకే మనకి అన్ని రకముల రుచులు చెట్లనుండే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి వుంది మనకు రసపోషణం చేస్తున్నాయి. అలా పృథు మహారాజు ఆనాడు ఎవ్వరూ పొందనటువంటి విజయమును సాధించి భూమండలమును అద్భుతముగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు అందరూ పరమ సంతోషంగా జీవితములను గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన నూరు అశ్వమేధ యాగములు చేయాలి అని సంకల్పించాడు. బ్రహ్మావర్తము అని స్వాయంభువ మనువు పరిపాలించిన ప్రాంతమునకు వెళ్ళి ‘సరస్వతి’ ‘తృషద్వతి’ అనబడే రెండు నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టి 99 అశ్వమేధ యాగములు చేశాడు. నూరావడి చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపంతో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వమును ఎత్తుకు పోతున్నాడు. దానిని అత్రిమహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వమును వెనక్కి తెమ్మన్నారు. పృథు మహారాజు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషి వేషధారియై ఉన్న వాడిమీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. అత్రిమహర్షి అన్నారు ‘గుర్రమును ఎత్తుకు పోతున్న వాడు ఇంద్రుడే. నువ్వు నిర్భయంగా అబానం వదిలెయ్యి అన్నాడు. బాణం వదలడానికి పృథు కుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపమును, అశ్వమును విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రమును వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి ‘విజితాశ్వుడు’ అని పేరు పెట్టారు.
మరల యజ్ఞం జరుగుతోంది. ఒకరోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లు చేశాడు. గాఢాంధకారంలో ఉండగా మరల యాగాశ్వమును అపహరించి తీసుకు వెళ్ళిపోయాడు. ఈసారి మరల అత్రి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు ఖట్వాంగము చేతితో పట్టుకుని దానిమీద ఒక పుర్రె బోర్లించి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు సాధారణంగా మాంత్రిక శక్తులను కలిగినటువంటి వాడు, కొంచెం సాధన చేసిన వాడు అయి ఉంటాడు. లేదా బ్రహ్మహత్యా పాప విముక్తి కోసం వెడుతున్న సాధు పురుషుడు కూడా అయి ఉంటాడు. కాబట్టి అతనిని వధించాలా వద్దా అని పృథువు అనుమాన పడుతున్నాడు. అపుడు అత్రి ‘నీవేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. అతడు ఇంద్రుడే. బాణం వెయవలసింది’ అని చెప్పాడు. పృథువు బాణం తీశాడు. అపుడు ఇంద్రుడు ఆ రూపమును, గుర్రమును అక్కడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపమునకు ‘పాఖండరూపము’ అని పేరు. పాఖండము అంటే పాప ఖండము. అందులోంచి పాషండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడడానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసేవారిలా కనపడతారు. కానీ వాళ్ళు వేదం విరుద్ధమయిన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. రెండుమార్లు యాగాశ్వమును అపహరించాడనే కోపంతో పృథువు యజ్ఞం పాడయిపోతే పాడై పోయిందని లేచి నిలబడి ధనుస్సు పట్టుకుని బాణమును సంధించి ఇంద్రుని మీదకి వదలడానికి సిద్ధపడ్డాడు. అపుడు ఋషులు ‘నీవు యజమానివి. నీవు ఎందుకు బాణం వదలడం? నీవు చేస్తున్న నూరవ యజ్ఞం పాడుచేశాడు కనుక మా మంత్రశక్తి చేత ఈ హోమంలో ఇంద్రుడిని పారేస్తాము’ అన్నారు.
అపుడు ఇంద్రుని మీద క్షాత్ర శక్తి, తపశ్శక్తి రెండూ కలిసిపోయాయి. అపుడు చతుర్ముఖ బ్రహ్మ గారు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆయన అన్నారు ‘మీరిద్దరూ పొరపాటు పడ్డారు మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారెయ్యడానికా! పృథూ నీకింత క్షాత్ర శక్తి వున్నది ఇంద్రుడిని బాణం వేసి సంహరించడానికా! మీరు ఇద్దరు చేసింది పొరబాటే’ అన్నారు. అదే సమయానికి ఆశ్చర్యకరంగా సభలోనికి పూర్ణాంశతో శ్రీమహావిష్ణువు వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. స్వామి గరుడవాహనం దిగి ‘పృథూ, ఇప్పటికి నీవు 99 అశ్వమేధ యాగములు చేశావు. ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. ఇలా జరిగిపోతుంటే ఈ కర్మకు అంతమేమయినా ఉందా? 99 అశ్వమేధ యాగములు చేసి నీవు ఏమి తెలుసుకున్నావు? ఏమీ తెలియలేదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి ఆయనను చంపి అవతల పారేస్తాను అంటున్నావు. అనగా నీకు దేహాత్మాభిమానము ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉండి ఉంటే నీవు బ్రహ్మజ్ఞానివి అయిపోడువు. ఇంద్రుడి మీద బాణం వేయడంలో దేహాత్మాభిమానంతో క్రిందికి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నీవు గురించావా? నీయందు జ్ఞానము కలగాలని అది జరిగింది తప్ప ఇంద్రుడు నీయందు అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ అతని చర్య పైకి దోషంగా కనపడుతోంది. ఇందుకని నీవు బాణం వెయవలసింది ఇంద్రుని మీద కాదు. నేకు బోధ చేయడం కోసం ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపం నుండి అప్పుడే పాషండులు పుట్టి పాషండ మతవ్యాప్తి చేతున్నారు. వారి మాటలను విని సంతోషపడి పోయి వేలకొద్దీ జనం పాషండులు అయిపోతున్నారు. ఇపుడు నీవు నీ బాణం పట్టుకుని ఈ పాషండ మతమును నాశనం చెయ్యి’ అని చెప్పాడు. వెంటనే పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు.
పృథు మహారాజులో ఉన్న గొప్పతనం కేవలం భూమిని గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయి.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం!
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!
ఇందులో అర్చన భక్తికి పృథు మహారాజు గొప్పవాడు. పృథు మహారాజు జీవితంలో ఈ ఘట్టములను వింటే సంతానము లేని వాళ్లకు సంతానము కలుగుతుంది. ఇప్పుడు శ్రీమహా విష్ణువు ‘పృథూ, నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నాడు. అడిగితే పృథు మహారాజు ‘స్వామీ, నన్ను మరల మోహపెడదామని అనుకుంటున్నావా! నాకెందుకు స్వామీ వరాలు. నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా! నీ పాదారవిందములను గూర్చి వర్ణన చేసి, నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెపుతుంటే అలా విని పొంగి పోయేటటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవడం వలన మరల నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెపుతుంటే విని పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకేమీ వరం అక్కర్లేదు. నీ కథలు వినగలిగినటువంటి అదృష్టమును నాకు కలిగించు’ అన్నాడు. ఇదీ పృథు మహారాజు గారి పూజా నిష్ఠ అంటే. అందుకే మనకి షోడశోపచారములు వచ్చాయి. ఇటువంటి అర్చనను చేశాడు పృథువు. అలా అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయనపట్ల విశేషమయిన ఆనందమును పొందాడు.
ఒకనాడు సత్రయాగం చేసి అందరికీ బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. ఇపుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారి తీసింది. అపారమైన భక్తి వైరాగ్యమునకు దారితీసింది. ఒకరోజు సత్రయాగం జరుగుతుండగా సనకసనందనాది మహర్షులు క్రిందికి దిగారు. మహా పురుషులయిన వారు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినపుడు నిలబడతారు. సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారిని ఉచితాసనమున కూర్చోబెట్టి ‘స్వామీ, మేము సంసారమునందు వున్న తిన్గారులము. మేము ఎలా తరిస్తాము? మేము తొందరగా తరించడానికి ఏదయినా మార్గం ఉన్నదా? మాకు కృప చేయండి’ అని ‘బాహ్యమునందు ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడిలా కనిపించవచ్చు. ఒకడు దరిద్రుడిలా కనిపించ వచ్చు. కానీ అంతరమునందు ఒకడు ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు. వేరొకడు కటిక దరిద్రుడు. ఏకారణము చేత’ అని అడిగితె సనక సనందనాదులు ‘ఎవరు మహా పురుషుడిని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో వున్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తున్నాడో అటువంటి వాడు ఈశ్వరుని దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు’ అని చెప్పారు. వాళ్లు ఇంకా ఇలా అన్నారు ‘గృహస్థాశ్రమంలో ఉంది చాలా కాలం పాపకర్మల యందు మగ్నుడై ఈశ్వరుని వైపు తిరగని వాడు జీవితం తరించదానికి చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? భగవంతుని పాదములు పట్టి నమస్కరించ గలిగియా నిపుణత కలిగిన ఒక మహాభక్తునితో సేహం పెట్టుకో. మెల్లగా భగవంతునితో అనుబంధమును పెంచుకునేలా చేస్తారు. అటువంటి వారితో కలిసి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమంగా నిష్కామ యోగమునకు దారితీసి ఉన్న ఒకే మట్టి ఇన్ని పాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునండు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో వున్న ఆకాశము అనంతాకాశంలో కలిసినట్లు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు. సుఖదుఃఖములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానముచేత ఈశ్వరునిలో కలిసిపోతావు. సాయుజ్యము కలుగుతుంది’ అన్నారు.
సనక సనందనాదుల బోధ చేత జ్ఞానమును పొందిన వాడై కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఉత్తర దిక్కుకు ప్రయాణించి ఆశ్రమ వాసం చేసి, తపస్సు చేసి, ఇంద్రియములను గెలిచి, అంత్యమునందు తన గుదస్థానమునందు ఉన్న వాయువును ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో వున్న పృథివీ తత్త్వమును బ్రహ్మాండములో వున్న పృథువికి కలిపి జలమును జలమునకు కలిపి, ఆకాశమును ఆకాశమునకు కలిపి, తనలో వున్న తేజస్సును ఊర్ధ్వ ముఖం చేసి పునరావృత్తి రహిత విష్ణు సాయుజ్యము కొరకు బ్రహ్మాండమంతా ఆవరించివున్న విష్ణుశక్తి వ్యాపకత్వమునందు కలిపి వేశాడు. ఈవిధంగా పృథు మహారాజు పునరావృత్తి రహిత మోక్షమును పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్సు వెంటనే భర్తకి తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచి పెట్టి భర్తృ ధ్యానం చేతూ భర్త ఏ లోకమునకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆలోకమునకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తియందు లీనమయింది.
ఇంత పరమ పవిత్రమయిన ఈ ఆఖ్యానమును వినినా చదివినా అత్యంత శుభాఫలితం కలుగుతుంది. సంధ్యావందనం చేయడం మానివేసిన వాడు కూడా పృథు మహారాజుగారి చరిత్ర వింటే ఆ దోషం నివారణ అయి బ్రహ్మ వర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు తనకు ఫలానా రాజ్యం కావాలని పృథు మహారాజు చరిత్ర విని యుద్ధమునకు వెడితే జగత్తునంతటిని గెలిచి సార్వభౌముడు అవుతాడు. వైశ్యుడు పృథు మహారాజు చరిత్ర వింటే అతనికి వ్యాపారంలో అనేకమయిన లాభములు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములయిన వారు పెద్దలను సేవించే తత్త్వము ఉన్నవారు పెద్దల అనుగ్రహమును పొంది వారి కుటుంబములు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియని వాడు కూడా ఇటువంటి పృథు చరిత్ర వింటే సర్వ సిద్ధులను పొంది సర్వ పాపములు నశించి శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంత్యమునందు మోక్ష స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము వాడికి ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మనమీద అనుగ్రహంతో మహాపురుషుడయిన పోతనామాత్యుడు ఆంధ్రీకరించారు.

శ్రీమద్భాగవతం - 38 వ భాగం

4. పురంజనోపాఖ్యానం:
భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేతీరు చాలా గొప్పగా ఉంటుంది. తత్త్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్త్వమును మాత్రమే చెబుతాము అంటే చాలామంది అదేమిటో చాలా భయంకరంగా వుంది – ఇదంతా తమకు అందదని అంటారు. అందుకని ఋషులు బోధ చేసేటప్పుడు ఆ తత్త్వమును కథతో కలిపేస్తారు. నారదుడు ప్రాచీనబర్హి అనే మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానమును వివరించాడు. ప్రాచీన బర్హి కేవలము ఈ శరీరమే శాశ్వతము అనుకోని, తాను భూమిమీద శాశ్వతంగా ఉండి పోతాననుకొని తానూ ఎటువంటి మార్గములో సంపాదించినా తనను అడిగేవారు లేరు అనుకోని ఒక రకమయిన అజ్ఞానంలో జీవితమును గడిపేస్తుంటే చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడయిన నారదుడు ప్రాచీన బర్హికి చెప్పిన కథకే ‘పురంజనోపాఖ్యానం’ అని పేరు. పూర్వకాలంలో ‘పురంజనుడు’ అనబడే రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమయిన కోట, తాను నివసించడానికి యోగ్యమయిన రాజ్యమును అన్వేషిస్తూ బ్రహ్మాండములు అన్నిటా తిరిగాడు. కానీ ఆయనకు ఏదీ నచ్చలేదు. చిట్టచివరకు హిమవత్పర్వతపు దక్షిణ కొసను ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. ‘ఇది చాలా బాగుంది. నేను ఇందులో ప్రవేశిస్తాను’ అని అనుకున్నాడు. అపుడు అందులోనుంచి చాలా అందమయిన యౌవనము అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనుక అయిదు తలల పాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన పదకొండుమంది కాపలా కాసే భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనుక నూర్గురు చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడను చూసి పురంజనుడు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించాడు. పురంజనుడు తాను ఒక్కడినే ఉన్నానని తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన వెనక ‘అవిజ్ఞాతుడు’ అనబడే మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అనగా తెలియబడని వాడు అని అర్థం. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు. కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడు. అటువంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను ‘నీవు ఎవరు’ అని అడిగాడు. అపుడు ఆమె ‘ఏమో నాకూ తెలియదు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నేను పుట్టి బుద్ధి ఎరిగి ఇక్కడే వున్నాను. ఈ కోటలో ఉంటూ ఉంటాను. నువ్వు మంచి యౌవనంలో ఉన్నావు. నా పేరు ‘పురంజని’, నీపేరు పురంజనుడు. అందుకని నీవు ఈ కోటలోనికి రా. వస్తే మనిద్దరం మానుషమయినటువంటి భోగములను అనుభవిద్దాము. నూరు సంవత్సరములు నీవు ఇందులో ఉందువు గాని. ఈ కోటకు ఒక గమ్మత్తు ఉంది. ఈ కోటకు తూర్పు దిక్కుగా అయిదు ద్వారములు ఉంటాయి. ఈ అయిదు ద్వారముల నుండి బయటకు వెళ్ళవచ్చు. కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడినే తీసుకువెళ్ళాలి. ఆ మిత్రులకు పేర్లు ఉంటాయి. వాళ్ళతోనే బయటకు వెళ్ళాలి. అలా ఆ ద్వారంలోంచి బయటకు వెడితే ఒక భూమి చేరతావు. ఆ దేశంలో నీవు విహరించవచ్చు మరల వెనక్కి వచ్చేయవచ్చు’ అని చెప్పింది.
ఆయన చాలా సంతోషించి ఆవిడని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు. పురంజనుడు అంటే ఎవరో కాదు, మనమే. మనకథే అక్కడ చెప్పబడింది. పురంజనుడు కోటకోసం వెదుకుతున్నాడు. వెతికి వెతికి దక్షిణ దిక్కున హిమవత్ శృంగమునందు వ్రేలాడుతున్న కోటను చూశాడు. దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. అనగా ఎనాతికయినా శ్మశానములో చేరవలసినటువంటి శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. పురంజనుడు అక్కడికి వెళ్లేసరికి ఒక అందమయిన మేడ కనిపించింది. ఇక్కడ మేడగా చెప్పబడినది శరీరములో గల తల. శరీరమునకు పైన చక్కటి ఒక అందమయిన తలకాయ ఉంటుంది. దానిమీద ఉన్న వెంట్రుకలే పూలలతలు. చేతులు కాళ్ళు ఇవన్నీ అగడ్తలు. లోపల ఉన్నటువంటి ఇంద్రియములు భోగస్థానములు. లోపల రత్నములతో కూడిన వేదికగా చెప్పబడినది హృదయ స్థానము. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. దానిమీద మనం రాత్రివేళ నిద్రపోతాము. అనగా ఇంద్రియములు మనస్సు బడలిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి. అప్పుడు మనకి ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది.
పురంజని ఎదురువచ్చి తనను వివాహం చేసుకోనమన్నది. అపుడు పురంజనుడు ఆమెను నీవు ఎవరు అని ప్రశ్నించాడు. ఆవిడ నాకు తెలియదు అంది. ఆవిడ బుద్ధి. ఆవిడని అయిదు తలల పాము కాపాడుతూ ఉంటుంది. అవే పంచ ప్రాణములు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి అయిదు ప్రాణములు. ఈవిడతో పాటు 11మంది భటులు వచ్చారు. వారే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు. ఈ పదకొండింటికి ఒక్కొక్క దానికి కొన్ని వందల వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వారి వెనక వున్న భటులు. ఇంతమందితో కలిసి ఆవిడ వచ్చింది. వివాహం చేసుకోమన్నాడు చేసుకుంది. ఆవిడ ఒక మాట చెప్పింది ఈ కోటకు తూర్పు దిక్కుగా అయిదు ద్వారములు ఉన్నాయి – అందులోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నీవు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలి అని చెప్పింది.
మనం అందరమూ అనుభవించేటటువంటి సుఖములే ఈ ద్వారములు. పనులు చేయడానికి మనం అందరం ద్వారంలోంచే కదా బయటకు వెళతాము. జీవుడు కూడా వాటిలోంచే బయటకు వెళ్ళి వ్యాపకములు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కున వున్న రెండు ద్వారములే ఈ రెండు కళ్ళు. ఈ రెండు కళ్ళతో జీవుడు బయటి ప్రపంచమును చూసి దానితో సమన్వయము అవుతూ ఉంటాడు. ఒకటవ ద్వారము పేరు ‘ఖద్యోత’, రెండవ ద్వారము పేరు ‘ఆవిర్ముఖి’. అవి ఎంత చిత్రమయిన పేరులో చూడండి. ఈ రెండు ద్వారములలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకొక్క స్నేహితుడితో వెళతాడు. ఒకడు ‘ద్యుమంత్రుడు’, రెండవ వాని పేరు ‘మిత్రుడు’. ‘ద్యు’ అంటే కాంతి. మిత్రుడు అంటే సూర్యుని పేరు. మీరు ఈ కళ్ళతో లోకమును వెలుతురూ వున్నపుడు మాత్రమే చూడగలరు. అందుకని ఈ కంటితో ఈ ఇద్దరు మిత్రులను పట్టుకుని ‘విభ్రాజితము’ అనబడే దేశమునకు వెడుతూ ఉంటాడు. వెళ్ళి ఈ లోకమునంతటిని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి రెండూ రెండు ద్వారములు.
క్రిందను మరో రెండు ద్వారములు ఉన్నాయి. వాటి పేర్లు ‘నళిని’, ‘నాళిని’. ఈరెండు ద్వారముల నుండి బయలుదేరినపుడు ‘అవధూతుడు’ అనే స్నేహితుడితో వెడతాడు. ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉండరు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు. వాయువు. వాయువు అనే స్నేహితునితో ‘సౌరభము’ అనే దేశమునకు వెళతాడు. అనగా ఈ ముక్కుతో వాసనలు పీలుస్తూ ఉంటాడు. సౌరభము అంటే వాసన. ఈవిధంగా అవధూతుని సాయంతో నళిని, నాళిని గుండా సౌరభము అనే దేశమునకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. మూడవది ఒకటే ద్వారం. దీనిపేరు ‘వక్తము’ నోరు. ఈ ద్వారంలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక స్నేహితుడి భుజమ్మీద చెయ్యి వేస్తాడు. ఆయన పేరు ‘రసజ్ఞుడు’. ఒకోసారి బయటకు వెళ్ళేటప్పుడు రసజ్ఞుడితో వెళ్ళడు. ‘విపణుడు’ అనే ఆయనను పిలిచి ఆయన భుజమ్మీద చేయివేస్తాడు. ‘రసజ్ఞుని’తో వెళ్ళినప్పుడు ‘బహూదకము’ అనే దేశమునకు వెళతాడు. ‘విపణుడి’తో వెళ్ళినప్పుడు ‘అపణము’ అనే దేశమునకు వెడతాడు. రసజ్ఞుడితో వెళ్ళడం అంటే పండుకాయ అన్నం పులిగోర చక్రపొంగలి మొదలయినవి నోట్లో పెట్టుకుని రుచిని తెలుసుకొనుట. విపణుడితో వెళ్ళినపుడు ‘ఆపణం’ చేస్తాడు. ఆపణం చేయడం అంటే మాట్లాడడం. పనికిమాలినవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఈశ్వర సంబంధమయిన విషయములు తప్ప మిగిలినవి అక్కర్లేని వన్నీ మాట్లాడతాడు.
కుడిపక్కన ద్వారం ఉంది. దీనిపేరు ‘పితృహు’. ఇది కుడిపక్క చెవి. ఈ ద్వారంలోంచి ఒకే స్నేహితుడితో బయటకు వెళ్ళాలి. ఆయన పేరు ‘శృతిధరుడు’. అనగా వేదం. దీనితో వెళ్ళినపుడు పాంచాల రాజ్యమునకు వెడతాడు. అనగా వేదములో పూర్వభాగమయిన కర్మలను చేసి ఇక్కడ సుఖములను స్వర్గాది పైలోకములలో సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక క్రిందకు తోసేస్తారు. చాలాకాలమయిన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఎడమ చెవిద్వారం లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు కూడా శ్రుతిధరుడి మీదనే చేయి వేసుకుని బయటకు వస్తాడు. కానీ ఉత్తర పాంచాల రాజ్యమునకు వెళతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గ. సుఖములను కోరుకోడు. అది వేదము ఉత్తర భాగము. అందుకని ఎడమ చెవి ద్వారంలోంచి వెళ్ళినపుడు మోక్షమును కోరతాడు. ఆ తర్వాత ఉత్తరమునుండి వెళ్ళే ద్వారమునకు ‘దేవహూ’ అని పేరు. అలాగే తూర్పున తిరిగి ఈ కోటకు క్రింది భాగంలో ఒక ద్వారం ఉంది. అదే మూత్ర ద్వారం. దాని పేరు ‘దుర్మదుడు’ అక్కడ మదమును కల్పించే ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటకు వెళ్ళినపుడు దుర్మదుని భుజమ్మీద చెయ్యి వేసి సుఖమనే సామ్రాజ్యమును చేరతాడు. ఆ సామ్రాజ్యము పేరు ‘గ్రామికము’ పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖమును పొందుతున్నాడు. అందుకని గ్రామికమయిన దేశమునకు వెళతాడు.
పడమట అనగా వెనకభాగమందు ఒక ద్వారముంది. అది మలద్వారము. దాని పేరు ‘లుబ్ధకుడు’. అంటే ఉన్నదానిని బయట పెట్టని వాడు. లోపలే కూర్చుని వుంటుంది. బలవంతంగా తోస్తే బయటకు వెళుతుంది. అందుకని దానిపేరు ‘వైశసము’. అలా రెండు రకములుగా వెళుతుంది. జీవుడు నేను వెళ్ళను అని ఈ పురమును పట్టుకు కూర్చుంటాడు. ఇందులోంచి బలవంతంగా తీసేస్తారు. అంత పెచీపెట్టి తన శరీరం మీద భోగముల మీద తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాడిని తరిమి తరిమి ఇదే శరీరంలో అధోభాగమున ఉన్న అపానవాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనే భయంకరమయిన నరకంలో యాత్ర మొదలుపెడతాడు.
ఇన్ని ద్వారములు ఉన్నాయి. ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందఱో ప్రజలు ఉన్నారు. అందులో ఇద్దరు కళ్ళులేని వాళ్ళు ఉన్నారు. వారు పుట్టుకతో అంధులు. పురంజనుడు వారిద్దరి భుజముల మీద చేతులు వేసి వాళ్ళతో కలిసి వెళుతూ ఉంటాడు. ఒకాయన భుజమ్మీద చేయి వేస్తె ఆయన తీసుకువెళుతూ ఉంటాడు. కళ్ళు లేని వాడు. ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. ఆయన పేరు ‘దిశస్మృత్’. రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. వాటిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి. ఇంకొక అంధుడి మీద చెయ్యి వేసి వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు. చేతులకు కన్నములు ఉండవు. వాటిని ఏమి చెయ్యమంటే దానిని చేస్తూ ఉంటాయి. అలా తాను చేతులతో చేసిన దుష్కర్మల చేత తానె బంధింపబడుతూ ఉంటాడు. అందుకని ఇద్దరు గుడ్డివాళ్ళతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు ‘విషూచుడు’ అనబడే వాడితో అంతఃపురంలో భార్యాబిడ్డలతో ఎప్పుడూ సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒకరోజున గుర్రం ఎక్కాడు. దానికి తన పక్కన 11మంది సేనాపతులను పెట్టుకున్నాడు. ఇవి పది ఇంద్రియములు, ఒక మనస్సు. వాటికి ఒకటే కళ్ళెం. ఒకడే సారధి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి, చంపకూడని వాటిని కూడా చంపేశాడు. అనగా తాను చెయ్యవలసిన, చెయ్యకూడనివి అయిన పనులను చేశాడు. చంపకూడని వాటిని చంపడం వలన అవి అన్నీ పగబట్టి ఇనుపకొమ్ములు ధరించి కూర్చున్నాయి. అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యను చూశాడు. ‘అయ్యో నిన్ను విడిచి పెట్టి వెళ్ళిపోయాను. బాగున్నావా? అన్నాడు. ఆవిడ అలకా గృహంలో ఉంది. అనగా మరల సాత్విక బుద్ధియందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దది అయిపోతోందేమోనని అనుమానం వచ్చింది. అనగా మెల్లిమెల్లిగా బుద్ధియందు స్మృతి తప్పుతోంది. వీడికి అనుమానం రాగానే ఒకరోజున స్నానం చేసి ‘ఉజ్వలము’ అనే వస్త్రం కట్టుకుని వచ్చింది. ‘అబ్బో, మా ఆవిడకి యౌవనం తరగడం ఏమిటి’ అనుకున్నాడు. మళ్ళీ కౌగలించుకున్నాడు. ‘ఉజ్వలము’ అంటే తన బుద్ధియందు తనకు భ్రాంతి. అయినా ‘నా అంతవాడిని నేను’ అంటూ ఉంటాడు.

శ్రీమద్భాగవతం - 39 వ భాగం

ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’(కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. అపుడు ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు.కానీ నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. అందుకని ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని. అపుడు నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. కానీ ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు.
తరువాత కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమంది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకునే అప్పుడే వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో నాన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తమ భార్యను తలుచుకుంటూ. సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తన భార్యను తలుచుకుని ఇంద్రియములతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. అంటే ఎవ్వరికి తెలియని ఒక రహస్యమయిన పనిని చేస్తుంది. ఈయనను ఆదమరపించి నిశ్శబ్దంగా కోటలో నుండి బయటకు తోసేస్తుంది. అనగా వానికి మృత్యువు వచ్చేసింది. అన్నమాట! మంచం చుట్టూ అందరూ ఉంటారు. ఎప్పుడు పోయాడో ఎటువైపు నుంచి పోయాడో ఎవరూ చెప్పలేరు. ఈ పని జర వలన జరిగిపోతుంది. దేవగుప్తము చేసేస్తుంది. ప్రజ్వరుడు భయుడు యవనులు జర కలిసి దేవగుప్త కార్యమును నిర్వహిస్తారు. ఆఖరున పురంజయుడు బయటకు వెళ్ళి పోతున్నప్పుడు అయిదు పడగల పాము బయటకు వెళ్ళిపోయింది. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనే అయిదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడ ఈకోట శిధిలం అయిపొయింది. ఈ కోట అగ్నిహోత్రంలో పడిపోయింది. ఈ విధంగా పురంజనుడి కోట కాలిపోయింది.
ప్రాచీన బర్హి ఈ కథనంతటినీ విని మనుష్యుని జీవితం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ‘ఇపుడు ఉత్తర క్షణం ఏమి చెయ్యాలి” అని నారదుడిని అడిగాడు. అపుడు నారదుడు ‘నీవు చేయగలిగింది ఒక్కటే. భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి ఈ రెంటినీ పెంచుకో’ అని చెప్పాడు. ఇది పరమ పవిత్రమయిన ఆఖ్యానము. ఇది కథారూపంలో ఉంటుంది. కానీ గొప్ప రహస్యమును ఆవిష్కరిస్తుంది. మీరు మీ మనవలను, చిన్న పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఈ కథను చెపితే వారికి వేదాంతమునందు ప్రవేశము లభిస్తుంది. వారిలో వైరాగ్యమునకు బీజములు పాడడం ప్రారంభమవుతాయి. అంతగొప్ప ఆఖ్యానం.
పంచమ స్కంధము – ప్రియవ్రతుని చరిత్ర.
భగవత్కథ అనే దానికి అర్థం భగవంతుడిని నమ్ముకుని జీవితమును నడుపుకున్న మహా భాగవతుల చరిత్ర. భగవత్సంబధమైన కథ కనుక దీనికి భాగవతం అని పేరు వచ్చింది. భాగవతం తెలిసి వినినా తెలియక వినినా కేవలం కథా స్వరూపంగా వినపడినా జీవితమునకు ఒక గొప్ప అదృష్టమే!
స్వాయంభువ మనువుకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమయిన భక్తితత్పరుడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తిని పొందాడు. దీనికి తోడూ బంగారు పళ్ళెమునకు గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారద మహర్షి గురుత్వం లభించింది. నారద మహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానమును పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యమును పొందినవాడు స్వాయంభువ మనువు రాజ్యమును స్వీకరించమంటే స్వీకరిస్తాడా? స్వీకరించడు. ఒకరోజున తండ్రిగారు వెళ్ళి కుమారుడిని అడిగాడు. ‘నాయనా, నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. నీ తోడబుట్టిన వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగములయందు విరక్తి చెంది వున్నాను. తపస్సుకు వెళ్ళిపోతున్నాను. అందుకని నీవు వచ్చి రాజ్యమును స్వీకరించు’ అన్నాడు. ఇలా మాట్లాడడం చాలా కష్టం. కథలో చెప్పినంత తేలిక కాదు. అపుడు ప్రియవ్రతుడు ‘నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనము గురించి బాగా తెలుసు. ఈ శరీరములోనికి వచ్చినది బంధనములను పెంచుకుని అవిద్యయందు కామక్రోధములయందు అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. అందుకని నాన్నగారూ, నాకు రాజ్యం అక్కరలేదు. నేను ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటాను. భగవంతుడి గురించి తపిస్తాను అన్నాడు.
ఈమాట వినగానే చతుర్ముఖ బ్రహ్మగారు గబగబా కదిలివచ్చారు. ఎందుకని వచ్చారు అంటే ప్రజోత్పత్తి చేసి, రాజ్య పరిపాలన చేసి ధర్మమును నిర్వహించమని స్వాయంభువ మనువును బ్రహ్మగారు సృష్టించారు. ఇపుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు. అపుడు బ్రహ్మగారు ఊరుకున్నట్లయితే ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమమునందు ప్రవేశించడమనే అత్యంత ప్రమాదకరమయిన చర్య అని కాబట్టి దానియందు ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు. అపుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రమయిన చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదు. అందుకు కదిలారు బ్రహ్మగారు. ‘నాయనా ప్రియవ్రతా, సంసారములో ప్రవేశించనని నీ అంతట నీవు ఒక నిర్ణయమునకు వస్తున్నావు. నీకు, నాకు సమస్త లోకపాలురకు బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోదార్యమో ఒక ప్రమాణమేమయినా ఉన్నదా? ఇదియే ప్రమాణము అని చెప్పడానికి వేదమే ప్రమాణము అయి వుంటుంది. ఈశ్వరుడు లేదన్న వాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణము కాదు అన్న వాడిని నాస్తికుడు అంటారు. అందుకే వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. మారిపోతున్న దానిని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ప్రతిక్షణం మారిపోయే దానిని ధర్మం అని పిలుస్తారు. మారుతున్న ధర్మమును అనుష్ఠానం చేయడానికి నీవు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమయిన జ్ఞానము. అందుకని నీవు అందులోకి ప్రవేశించు. లేకపోతే నీవు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించిన వాడవు అవుతావు. అయితే గృహస్థాశ్రమం లోకి వెళ్ళకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందరూ తప్పుచేసిన వారా అనే సందేహం కలుగవచ్చు. మహాపురుషులు అయిన వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. అపుడు ఆయన అన్నాడు – మహానుభావా, మీరు వచ్చి ఈ మాట చెప్పారు. కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి రాజ్యపరిపాలన చేస్తాను అన్నాడు. ఇదీ ధర్మం అంటే! పెద్దలయిన వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికీ ఉన్నదో వాడు బాగుపడతాడు. బ్రహ్మగారు చెప్పిన వాక్యమును విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు. ఆమె విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. ఆమె పేరు బర్హిష్మతి. ఆమెయందు పదిమంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. దీనిచేత ఆయన తరించాడు. ఊర్జస్వతిని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. వారిరువురికీ దేవయాని అనబడే కుమార్తె జన్మించింది.

శ్రీమద్భాగవతం - 40 వ భాగం

ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని తాను చేసిన పనులన్నింటిని ఈశ్వరానుగ్రహాలుగా భావించాడు. ఆయన ఏది చేసినా భగవంతుడిని తలుచుకుని చేశాడు. అందువలన గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు, సంసారమును వదిలిపెట్టి వెళ్ళి హిమాలయములలో కూర్చుని కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన ఒక మహాయోగి ఎంతటి తేజస్సుతో కూడిన స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు. ఇప్పుడు ఆయనకు ఒక విచిత్రమయిన కోరిక పుట్టింది. మేరుపర్వతమునకు ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నపుడు భూమికి దక్షిణం దిక్కు చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణ దిక్కుగా వుంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. ‘నేను గృహస్థాశ్రమంలో ఉంది ఈశ్వరారాధనము చేసి శ్రీమహావిష్ణువు అనుగ్రహం చేత ఇంతటి తేజస్సును పొందాను. గృహస్థాశ్రమ గొప్పతనం ఏమిటో శాశ్వతముగా లోకమునకు తెలిసేటట్లు చేయాలి. ఏడు రోజులు ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలసిపోని రథమునెక్కి అంట తేజోవంతమయిన రథం మీద, సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంట తేజస్సుతో, సూర్యుడు ఉత్తరమున వుంటే నేను దక్షిణమున ఉంటాను. సూర్యుడు దక్షిణమునకు వచ్చేసరికి నేను ఉత్తరమునకు వెళ్ళిపోతాను. అలా ఏడురోజులూ అవిశ్రాంతంగా తిరుగుతాను. చీకటి లేకుండా అపర సూర్యుడనై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉంది పూజ చేసినవాడు ఈ స్థితిని పొందగలడని నిరూపిస్తాను’ అని రథం ఎక్కాడు. అలా ఏడురోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ ఏడురోజులు బ్రహ్మాండమునందు చీకటి లేదు.
ఆయన మేరువును చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయి. ఏడుసార్లు ప్రదక్షిణంలో ఏడు జాడలలో లోతుగా పడిన చారికల లోనికి వచ్చి ఏడు సముద్రములు నిలబడ్డాయి. అవి – లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోదసముద్రము, శుద్దోదక సముద్రము, ఘృత సముద్రము. రథపు గాడికి గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటూ ఇటూ నీరుండగా మధ్యలో ద్వీపములు ఏర్పడ్డాయి. ఇలా సప్త ద్వీపములు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ద్వీపములు అన్నీ ప్రియవ్రతుడు తిరిగినపుడు ఏర్పడిన ద్వీపములు. ఆవిధంగా రథపు గాడి మధ్యలో జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు అను ఏడు ద్వీపములు ఏర్పడ్డాయి. ఈ ద్వీపముల పేర్లు వినినంత మాత్రం చేత పాపములు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. ఇంత సాధించిన తర్వాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదు. ఇక నేను ఇప్పటివరకు అనుభవించిన భోగముల వలన కలిగిన సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేనివలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. సత్యమునందు నేను లీనమయిపోతాను అని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఈవిధంగా అరణ్యములకు వెళ్ళి ఘోరమయిన తపమాచరించి తనలోవున్న తేజస్సును ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షమును పొందాడు. బ్రహ్మగారు చెప్పిన మాటలను విని వాటిని మీరు ఆచరించగలిగితే గృహస్థాశ్రమమునందు మీరు సాధించలేనిది ఏదీ ఉండదు.
ప్రియవ్రతుని పెద్దకొడుకు ఆగ్నీధ్రుదు. అతడు రాజ్యమునకు ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకు కూడా వివాహం కావలసి ఉంది. అందుకని యోగ్యమయిన భార్యను పొందడం కోసమని హిమవత్పర్వత ప్రాంతంలో కూర్చుని బ్రహ్మగారి గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఈయన యోగ్యతాయోగ్యతలను పసిగట్టి ఒక అప్సరసను పంపించాడు. ఆమె పేరు ‘పూర్వచిత్తి’. పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట. పూర్వచిత్తి ఉన్నచోట మోక్షం ఉండదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి మీరే ఉదాహరణ. సుఖములే జ్ఞాపకం ఉంది వానియందే పూనిక ఉన్నట్లయితే మనసు ఈశ్వరుడు వైపుకి తిరగక పోయినట్లయితే ఆ సుఖములు సుఖములు కావనే భావన కలగక పోయినట్లయితే మీరు పూర్వచిత్తికి లొంగుతున్నట్లు భావించుకోవాలి. దానివలన ఫలితం తెలుసుకోవాలంటే ఆగ్నీధ్రుడి చరిత్ర వినాలి.
ఆగ్నీధ్రుదు ఒక కన్యకామణి కొరకు బ్రహ్మగారిని గురించి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మగారు వచ్చి చెప్పేవరకు వేచి వుండాలి. కానీ ఈయనకు సుఖము అన్నడ అక్కడ కనపడితే చాలు అక్కడ మనసు లగ్నమవుతుంది. ఆయనకు అదొక అలవాటు. కాబట్టి ఆయన పూర్వచిత్తి గజ్జెల చప్పుడు విన్నాడు. కళ్ళు విప్పి చూసి ఆమె అంగాంగ వర్ణన చేశాడు. ఆమెతో మభ్యపెట్టే మాటలు మాట్లాడాడు. ఫలితంగా పూర్వచిత్తి లొంగింది. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా గడపగా ఆయనకీ నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భ్రద్రాశ్వువు, కేతుమానుడు అనే తొమ్మండుగురు కుమారులు జన్మించారు. వారు తొమ్మండుగురు అతి బలిష్ఠమయిన శరీరం ఉన్నవారు. పూర్వచిత్తి చాలాకాలం ఆగ్నీధ్రుడితో సంసారం చేసి ఆఖరుకి తన లోకం వెళ్ళిపోతానని చెప్పి ఈయనను విడిచిపెట్టి తన లోకం వెళ్ళిపోయింది. తరువాత ఆగ్నీధ్రుదు పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడికి వెళ్ళిపోవడం కోసం అనేక యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. చివరకు ఆమె వున్న లోకమును పొందాడు.
ఇపుడు ప్రియవ్రతునికి ఆగ్నీద్రుడికి ఉన్న తేడాను ఒకసారి గమనించండి. ప్రియవ్రతుడు తానూ చేస్తున్న పని గురించి ప్రశ్న వేసుకుని భార్యను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళాడు. ఆగ్నీధ్రుడు పూర్వచిత్తి వున్న లోకమును పొందాడు. ప్రియవ్రతుడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యమును పొందాడు.
ఆగ్నీధ్రుడి పెద్ద కుమారుడు నాభి. ఆయన మేరుదేవి అనబడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి సంతానమును పొందాలి అనుకున్నాడు. ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువులను చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే తపస్సు చేసి కొడుకును పొందాడు ఆగ్నీధ్రుదు. యజ్ఞము చేసి కొడుకును పొందాడు నాభి. నాభి పరిపాలించాడు కాబట్టి ఈయనకు వచ్చిన రాజ్యమును ‘అజనాభము’ అని పిలిచారు. ఈయన చేసిన యజ్ఞమునకు సంతసించి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్భంలో అక్కడ ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అక్కడ యజ్ఞం చేస్తున్న వాళ్ళని ఋత్విక్కులు అంటారు. శ్రీమన్నారాయణ దర్శనం కలుగగానే వారందరూ లేచి నిలబడ్డారు. నాభి కూడా లేచి నిలబడి ‘స్వామీ, నీవు పరాత్పరుడవు. నేను నిన్ను ఒక కోరికతో ఆరాధన చేసి యజ్ఞం చేశారు. నీవు ప్రత్యక్షం అయినపుడు నిన్ను మోక్షం అడగడం మానివేసి ఒక కొడుకును ప్రసాదించమని అడగడం ఒక ధనికుడిని దోసెడు ఊకను దానం చేయమని అడగడంతో సమానం. అయినా నేను అదే అడుగుతాను’ అన్నాడు. గృహస్థాశ్రమం పట్ల నాభికి వున్న గౌరవం అటువంటిది. తను ఒక కొడుకును కంటే తప్ప పితృఋణం నుండి తాను విముక్తుడు కాదు. కానీ ఆ కొడుకు తనను ఉద్ధరించే కొడుకు కావాలి. అటువంటి కొడుకును పొందాలనుకున్నాడు.
శ్రీమహావిష్ణువు ‘అల్పాయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా లేక దీర్ఘాయుర్దాయం ఉన్న మహాపాపి కావాలా’ అని అడిగాడు. అపుడు నాభి ఒక తెలివైన పని చేశాడు. నాభి అన్నాడు ‘ఈశ్వరా, నాయందు వున్న భక్తిని నీవే ప్రచోదనం చేసి నాకు దర్శనం ఇచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టి నిన్నొక కోరిక కోరుతున్నాను. నీలాంటి కొడుకును నాకు ఒకడిని ప్రసాదించవలసినది అని కోరాడు. అపుడు శ్రీమహావిష్ణువు ‘నీవు ఇటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో, ఈ ఋత్విక్కులు నీవు అలా అడుగుతున్నప్పుడు తథాస్తు అనినందుకు లొంగాలో – ఏమయినా నేను నీకు లొంగవలసిందే. కానీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ముందు నాభి తేనె ఆహారంలోంచి నాభిలోనికి వెళతాను. నాభి జీర్ణం చేసుకున్న తరువాత నాభి వీర్యకణములను ఆశ్రయిస్తాను. నాభి తేజస్సుగా నాభిలోంచి నాభి బార్య అయిన మేరుదేవి లోకి వెళతాను. మీరు తథాస్తు అన్నందుకు పది నెలలపాటు గర్భస్థమునందు అంధకారంలో పడివుంటాను. నాభి కుమారుడనని అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకి వస్తాను’ అన్నాడు. భక్తితో కొలిచిన వారికి ఈశ్వరుడు ఎందుకు లొంగడు!
ఈమాట వినిన తరువాత నాభి చాలా సంతోషించాడు. మేరుదేవి గర్భమును ధరించింది. ‘నల్లనివాడు’ నేను పుడతాను అని వరం ఇస్తే తెల్లగా వచ్చాడు. అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చేయడానికి వచ్చాడన్నమాట! అన్ని రంగులు తెలుపులోంచి పైకి వచ్చి మరల తెలుపులోకి వెళ్ళిపోతాయి. అనగా సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతోందో చెప్పే మహాజ్ఞానిగా రాబోతున్నాడు. దానివలన తనను కొడుకుగా కావాలని అడిగినందుకు పైన వంశం అంతా తరించిపోవాలి. జ్ఞాని పుట్టుకచేతనే కదా ఏడుతరాలు తరిస్తాయి! అందుకని ఇపుడు తెల్లటివాడిగా వచ్చాడు. ఈ పిల్లవాడిని చూసి మురిసిపోయి నాభి కొడుక్కి ‘ఋషభుడు’ అని పేరు పెట్టుకున్నాడు.
ఋషభుడు బాహ్యపూజ చేసేవాడు కాదు. అంతరమునందు విశేషమయిన యోగమును అనుసంధానం చేస్తూ ఉండేవాడు. ఋషభుడు బాహ్యకర్మలు చేయడం లేదని ఇంద్రునికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేశాడు. ‘మన రాజ్యంలో వర్షం పడడం లేదు. క్షామం వచ్చేటట్లు ఉంది’ అని తండ్రి వెళ్ళి కుమారుని వద్ద బాధపడ్డాడు. అపుడు ఋషభుడు ఒకనవ్వు నవ్వి తన యోగబలంతో మేఘములను సృష్టించి తన రాజ్యం ఎంత వరకు ఉన్నదో అంతవరకూ వర్శములను కురిపించాడు. దానిచేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలమై పోయి నాభి పరమసంతోష పడేటట్లుగా ఈ ఋషభుడు ప్రవర్తించాడు. పరమ సంతోషమును పొంది ఋషభుడికి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకునేటందుకు నాభి ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మమునందు కలిసిపోయాడు
భాగవతం - 41 వ భాగం CLICK HERE