Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీమద్భాగవతం Bhagavatham Telugu (భాగవతం) Part 06

శ్రీమద్భాగవతం - 51 వ భాగం



ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరయినా తన కుమారునికి నేర్పారేమోనని ఆయనకు అనుమానం కలిగి “నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీవు రాక్షసునికి జన్మించిన వాడివి. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా లేక ఎవరయినా పిల్లలు పక్కకి తీసుకెళ్ళి రహస్యంగా నీచేత చదివిస్తున్నారా?” అని అడిగాడు. “ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకు వెళ్ళి ఇలాంటివేమయినా నేర్పుతున్నారా? శ్రీమహావిష్ణువు మన జాతికంతటికీ అపకారం చేసినవాడు. అటువంటి వాడిని స్తోత్రం చేస్తావా? అలా చెయ్యకూడదు” అన్నాడు. ఇవన్నీ విని ప్రహ్లాదుడు “

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు 
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు! వినుత గుణశీల, మాటలు వేయునేల?

ఎక్కడయినా పారిజాత పుష్పములలో ఉండే తేనె త్రాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? ఎక్కడో హాయిగా ఆకాశములో ఉండే మందాకినీ నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమయిన ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ళు తాగుతుందా? ఎక్కడయినా లేత మామిడి చిగురు తాను తిని ‘కూ’ అంటూ కూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవిమల్లెలు పూసే చెట్టుమీద వాలుతుందా? పూర్నమయిన చంద్రబింబం లోంచి వచ్చే అమృతమును త్రాగడానికి అలవాటు పడిపోయిన చకోరపక్షి పొగమంచును త్రాగడానికి ఇష్టపడుతుందా? సర్వకాలముల యందు తామరపువ్వుల వంటి పాదములు కలిగిన శ్రీమన్నారాయణుని పాదములను భజించడం చేత స్రవించే భక్తి తన్మయత్వమనే మందార మకరందపానమును త్రాగి మత్తెక్కి ధ్యానమగ్నుడనై ఉండే నాకు నీవు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములయిన వాటిమీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను?” అని అడిగి వేయిమాటలెందుకు? నాకు నీవు చెప్పిన లక్షణములు రమ్మనమంటే వచ్చేవి కావు’ అని అన్నాడు.

ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి ‘మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెపుతున్నాడేమిటి? ఈమాటు తీసుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా వేయి కళ్ళతో చోస్తూ ఈ పిల్లవాడికి విద్య నేర్పండి. అన్నాడు. చండామార్కులు పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్లకి భయం వేసింది. వాళ్ళు ప్రహ్లాదునితో “నాయనా, మేము నీకు నేర్పినది ఏమిటి? నువ్వు చెప్పినది ఏమిటి? మీ నాన్నకి మామీద అనుమానం వచ్చింది. ఇపుడు మా ప్రాణములకు ముప్పు వచ్చేటట్లు ఉంది. కాబట్టి మేము ఏమి చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో. మాకు ఏమి చెప్తున్నావో అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పచెప్పు. ఇంక ఎప్పుడూ నీవు అలాంటి పలుకులు పలుకకూడదు. గురువుల మయిన మేము ఏమి చెప్పామో అది మాత్రమే పలకాలి అర్థమయిందా?” అన్నారు. అపుడు ప్రహ్లాదుడు ‘అయ్యా, చిత్తం. మీరు ఏమి చెపుతారో దానిని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను’ అని చక్కగా నేర్చుకున్నాడు. ఎక్కడనుంచి ఏది అడిగినా వెంటనే చెప్పేసి చక్కా వ్యాఖ్యానం చేసేస్తున్నాడు. ఇప్పుడు పిల్లవాడు మారాడని వారు అనుకున్నారు. ఎందుకయినా మంచిదని తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి, తండ్రి దగ్గర మాట్లాడదానికి పెద్ద తేడా ఉండదని ముందుగా అతనిని తల్లి లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళారు.

లీలావతి కుమారుని ప్రశ్నించింది ‘నాయనా, బాగా చదువుకుంటున్నావా? ఏది నీవు నేర్చుకున్నది ఒకమాట చెప్పు’ అంది. ధర్మార్థ శాస్త్రములలోంచి కొన్ని మాటలు చెప్పాడు తల్లికి. తన కుమారుడు చాల అమారిపోయినందుకు తల్లి చాలా సంతోషించింది. గురువులు కూడా సంతోషించి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. హిరణ్యకశిపుడు కుమారుని చూసి “నీ బుద్ధి మారిందా? గురువులు ఏమి చెప్తున్నారో అది తెలుసుకుంటున్నావా? గురువులు చెప్పిందే తెలుసుకుంతున్నావా? లేక సొంత బుద్ధితో ఏమయినా నర్చుకున్తున్నావా?’ అని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు 

“చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నే 
జదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ!!

గురువులు నన్ను చదివించారు. ధర్మశాస్త్రం, అర్థ శాస్త్రములను నూరిపోశారు. ఇవే కాకుండా నేను ఇంకా చాలా చదువుకున్నాను. చదువుల వలన తెలుసుకోవలసిన చదువేదో దానిని నేను తెలుసుకున్నాను అన్నాడు. అపుడు హిరణ్యకశిపుడు నువ్వు తెలుసుకున్న మొత్తం చాడువులోంచి సారభూతమై పిండి వడగడితే ఇది వింటే చాలు అన్నపద్యం ఒక్కటి నాకు చెప్పు’ అని కుమారుని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు 

తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీతొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మిస
జ్జనుడైయుండుట భద్రమంచు దలతున్ సత్యంబుదైత్యోత్తమా!!
“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం 
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!

అంటారు వ్యాసమహర్షి. ‘తండ్రీ ఈ శరీరం ఉన్నందుకు మనం ఈశ్వరుడిని తొమ్మిది రకములుగా సేవించాలి. ఇదే నును చదువుకున్న చదువుల మొత్తం సారాంశము’ అని చెప్పాడు. ఈమాటలకు హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అపుడు ఆటను అన్నాడు ‘ఒరేయ్, ఇది గురువులు చెప్పలేదు, నేను చెప్పలేదు. అలాంటి ఆలోచన నీకు ఎక్కడినుంచి వస్తోంది? నువ్వు రాక్షస జాతిలో పుట్టావు. కంటికి కనపడని శ్రీమన్నారాయణుని మీద నీకు భక్తి ఎక్కడినుండి వచ్చింది?” అని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు తండ్రీ, మీకందరికీ రాని యాలోచన నాకెందుకు వస్తోందని అడిగావు కదా! ఆయనను విడిచిపెట్టి మిగిలినవి నీవు ఎన్ని చేసినా అవి అన్నీ ఎటువంటి పనులో చెపుతాను. పుట్టు గుడ్డి వాడిని తీసుకు వెళ్ళి పున్నమి చంద్రుని దగ్గర కూర్చోబెట్టి పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూడరా అంటే ఎంత అసహ్యమో ఈశ్వరుడిని విడిచి పెట్టి సంసారం చాలా బాగుంటుంది అనుకోవడం అంత అసహ్యకరం. 

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
తే. దేవదేవుని చింతించు దినము దినము; చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు; తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి!!

కమలముల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుని అర్చించిన చేతులు ఏవయితే ఉంటాయో వాటికి చేతులని పేరు. శ్రీ మహావిష్ణువు గురించి పరవశించి పోయి స్తోత్రం చెయ్యాలి. అర్చన చేసేటప్పుడు ఒకమెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు. శేషశాయికి మొక్కని శిరము శిరము కాదు. ఆ మహానుభావుడి గురించి కీర్తనము చేయని నోరు నోరు కాదు. ఆయనకు ప్రదక్షిణలు చేయని కాళ్ళు కాళ్ళు కాదు. ఆయనను లోపల ధ్యానం చేయని మనస్సు మనస్సు కాదు. ఆయనను గురించి చెప్పని గురువు గురువు కాదు” అని ఇంకొక మాట చెప్పాడు.

కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మభస్త్రి గాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమ ధనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక
చక్రిచింత లేని జన్మంబు జన్మమే? తరళ సలిల బుద్భుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే? పాదయుగము తోడి పశువు గాక!!

ఈశ్వరుడు మహోదారుడు. ఆయన నిర్మించిన ఈ శరీరము చాలా గొప్పది. తొమ్మిది రంధ్రములు కలిగిన తోలు తిత్తియందు పడి వాయువులు ఆయన శాసనము అయ్యేంతవరకు బయటకు వెళ్ళడానికి వీలులేదు. అలా నిక్షేపించి నడిపిస్తున్న పరమాత్ముని తలుచుకోని వాడు, ఆ కన్జాక్షుని సేవించడానికి సిద్ధపడని శరీరము శరీరము కాదు. అది వట్టి తోలుతిత్తి. అందుచేత తండ్రీ చెయ్యవలసినది ఏదయినా వుంటే ఒక్క కైంకర్యము చేయడానికే మనిషి బ్రతకాలి. అటువంటి బుద్ధితో ఉండాలి అన్నాడు



శ్రీమద్భాగవతం - 52 వ భాగం



ప్రహ్లాదుడు చెప్తున్న విషయములను విని హిరణ్యకశిపుడు కోపించిన వాడై గురువుల వంక చూశాడు. మేమేమీ చెప్పలేదు మహా ప్రభో అన్నట్లు హడలిపోయి చూస్తున్నారు చండామార్కులు. “ఈ పద్యములన్నీ నీకు ఎక్కడినుంచి వచ్చాయి? శ్రీమన్నారాయణుని సేవించాలని ఎలా చెప్తున్నావు? నీకీ భక్తి ఎలా కలిగింది? వాళ్ళెవరో నాకు చెప్పు. వాళ్ళ సంగతి చూస్తాను” అన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు ‘నాన్నా నీలాంట్ వాడికి శ్రీమన్నారాయణుని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నీకు అర్థంకాదు. నీ కళ్ళను మూసుకున్నావు. అజ్ఞానంలో పడిపోయిన వారికి చెపితే తలకెక్కుతుందా! అజ్ఞానావస్థలో కోరికోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మే నీలాంటి అహంకార పూరితమయిన వ్యక్తులకి ఎవరు చెప్పారని చెపితే నీకు అర్థం అవుతుంది?” అని అన్నాడు.

ఈతని మాటలు వినేసరికి హిరణ్యకశిపునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. రాక్షసులను పిలిచి “వీడిని చంపండి. వీడిని తీసుకెళ్ళి మంచులో నిలబెట్టండి, కొన్నాళ్ళు అన్నం ఇవ్వడం మానేయండి. ఆ తరువాత వీడి నవరంధ్రములు మూసేసెయ్యండి. ఆ తరువాత నేను నా మాయను చూపెట్టి భయపెదతాను. మరుగుతున్న నూనెలో వేయండి. పర్వత శిఖరముల మీదనుండి కింద తొయ్యండి. ఏనుగులతో తొక్కించండి. సముద్రంలో పారెయ్యండి” అన్నాడు. 

తనని శూలంపెట్టి రాక్షసులు పొడిచేస్తుంటే, పర్వత శిఖరం మీదనుంచి కింద పారేస్తుంటే, సముద్రంలోకి విసిరేస్తుంటే, కిందపడేసి ఏనుగుల చేత తొక్కేస్తుంటే, రాక్షసులలో, తండ్రిలో, అందరిలో, అంతటా, శ్రీమన్నారాయణుని చూసి పొంగిపోతుంటే గుప్తరూపంలో స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ప్రహ్లాదుని పట్టుకున్తున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఏమీ జరగడం లేదు. ఈశ్వరుడిని నమ్ముకున్న వాడికి ఏమి లోటు ఉంటుంది. రాక్షసులు అలా హింసిస్తుంటే ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడి నారాయణ జపం చేస్తుంటే అంతకంతకీ తేజోవిరాజితుడు అయిపోతున్నాడు. హిరణ్యకశిపుడికి ఒక్కొక్క వార్త వస్తోంది. ప్రహ్లాదుడు ప్రకృతికి అతీతమయిన స్థితిని పొందాడు. తన వాడయిన కారణం చేత, తనయందు భక్తి కలిగిన కారణం చేత ఈశ్వరుడు ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించుకున్నాడు. హిరణ్యకశిపుడు రాత్రింబవళ్ళు దీనవదనంతో కూర్చుని ఉన్నాడు. ప్రహ్లాదుని చంపడానికి ఎన్ని ఉన్నాయో అన్నింటిని ప్రయోగించాడు. కానీ అతడు చచ్చిపోలేదు. కనీసం నీరసపడలేదు. పైగా తాను ప్రయత్నించే కొలదీ పిల్లవాడు ఎక్కువ తేజమును పొందుచున్నాడు. ఇప్పుడు గురువులు ‘బెంగ పెట్టుకోవద్దు. చావుతో సమానమయిన మందు ఒకటి మావద్ద ఉంది. వీనిని తీసుకువెళ్ళి అది వేసేస్తాము. ఈ పిల్లవాడికి వయస్సు వస్తోంది కాబట్టి చాలా గొప్పగా రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధ చేసేస్తాము. వీడు భ్రష్టుడు అయిపోతాడు. సంసరమునండు అనురక్తి కలుగుతుంది’ అని చెప్పి పిల్లవాడిని తీసుకువెళ్ళి అతనికి శాస్త్ర బోధ ప్రారంభించారు. పరమ సంతోషంగా కూర్చుని గురువులు చెప్పినది చక్కగా నేర్చుకుంటున్నాడు. 

ఒకరోజున గురువులు తమ గృహకార్యములను నిర్వర్తించుటకు లోపలికి వెళ్ళారు. వెంటనే ప్రహ్లాదుడు పిల్లలందరినీ పిలిచి “ఒరేయ్ మీరు ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు కానీ నేనుమీకొక విషయం చెప్తాను. మీరందరూ కూర్చోండి. అని మనకి ఆయుర్దాయం నూరు సంవత్సరములు. రాత్రి అయితే నిద్రపోటాము. కాబట్టి ఏభై ఏళ్ళు నిద్రలో పోతుంది. ఇరవై ఏళ్ళు శిశువుగా బాల్యంలో పోతుంది. ఇంకా మిగిలింది ముప్పది ఏళ్ళలో మన కోరికలన్నీ అక్కర్లేని వాటికన్నింటికీ తగుల్కొని అరిషడ్వార్గాలకి లొంగిపోతాయి. నా మాట వినండి. ఈ పంచ భూతములను, మూడు గుణములను, ఇరవై ఏడు తత్త్వములను నిర్మించి మాయచేత పరమాత్మ ఈశ్వర దర్శనం కాకుండా కప్పి ఉంచాడు. ఆత్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆత్మా దర్శనాభిలాషులు అవండి. నామాట నమ్మండి’ అన్నాడు. వాళ్ళు ‘ఈపాఠం చాలా గమ్మత్తుగా ఉంది. నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు. మాతోనే చదువుకున్నావు. గురువులు మాకేమి చెప్పారో నీకు కూడా అదే చెప్తున్నారు. గురువులు చెప్పని విషయములు నీకు ఎవరు చెప్తే వచ్చాయి?” అని అడిగారు. అపుడు ప్రహ్లాదుడు ‘మహానుభావుడయిన నారదుడు చెప్పాడు’ అని బదులిచ్చాడు. అపుడు వాళ్ళు ‘నారదుని నీవు ఎప్పుడు కలుసుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు?’ అని అడిగారు.

హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయిన లీలావతిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురువచ్చి ‘మహాపతివ్రత అయిన కాంతను ఎందుకు చెరపట్టి తీసుకువెళుతున్నావు” అని అడిగాడు. ఆయన ‘నాకు ఆవిడ మీద క్రోధం లేదు. ఆవిడ గర్భమునందు హిరణ్యకశిపుని తేజం ఉన్నది. వాడు తపస్సుయందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాము. ఈలోగా బిడ్డపుట్టి వాడు కూడా పెరిగి పెద్ద వాడయితే చాలా ప్రమాదం. అందుకని ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు ‘నీకేమి తెలుసు! ఆవిడ గర్భంలో మహావిష్ణు భక్తుడయిన వాడు ఉన్నాడు. వాడు జన్మచేత భక్తిజ్ఞాన వైరాగ్యములతో పుడుతున్నాడు. అటువంటి మహాపురుషుని కథ వింటే తరించిపోతాము. అందుకని లీలావతిని నా ఆశ్రమమునకు తీసుకువెడతాను’ అని తీసుకు వెళ్ళి అక్కడ వేదాంత తత్త్వమును ప్రబోధం చేశాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రమేమిటంటే విన్న లీలావతి మరిచిపోయింది. కడుపులో వున్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండడానికి కారణం తన గొప్పతనమని ప్రహ్లాదుడు చెప్పలేదు. ‘మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యములలో నారడుచు చెప్పిన బోధ మరిచిపోయింది. అందుకు కారణం గురువుల అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం, దైవ అనుగ్రహం నాయందు ఉన్నది. అందుకని అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయింది. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా’ అన్నాడు.

అపుడు పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయడం మొదలు పెట్టారు. లోపలనుంచి గురువులు బయటకు వచ్చారు. ప్రహ్లాదుడిని పట్టుకుని జరజర ఈడుస్తూ హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళి ‘అయ్యా, తులసివనంలో గంజాయి పుట్టినట్లు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు. వీడికి పాఠం చెప్పడం దేవుడెరుగు, వీడు రాక్షస బాలకులనందరిని పాడుచేసేశాడు. అందరిని నారాయణ భక్తులుగా చేసేస్తున్నాడు’ అన్నారు. ఇలా అనేసరికి హిరణ్యకశిపుడు ‘ఎవరి దిక్కు చూసూకుని ఎవరి బలం చూసుకొని నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు’ అని కుమారుని చూసి అడిగాడు.

బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్!
బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్రా!!

‘నాన్నా, నీలో బలానికి కారణమెవడో వాడే నాలో బలమునకు కూడా కారణం. బలహీనుడయిన వానిలో వున్న కొంచెం బలానికి కారణం ఎవరో లోకములను సంపాదించిన మహాబలవంతుల బలమునకు కారణమెవడో వాడు నాకు దిక్కు’ అన్నాడు. ‘ఏమిరా, వాడు దిక్కు దిక్కు అంటున్నావు కదా, వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?’ అని హిరణ్యకశిపుడు అడిగాడు. ‘నాన్నా, ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతావేమిటి? ఇదొక వెర్రి ప్రశ్న. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుం 

డెందెందు వెదకి చూసిన నందందే కలడు దానవాగ్రణి వింటే!!

జ్ఞాననేత్రంతో చూసే దంతి కనపడదు. దారువు కనపడుతుంది. ఆభరణం కనపడదు. స్వర్ణం కనపడుతుంది. పాత్ర కనపడదు. మట్టి కనపడుతుంది. జ్ఞాన నేత్రంతో చూడు. ఉన్నది నారాయణుడు ఒక్కడే. అంతటా స్వామి ఉన్నాడు. నువ్వు చూడడానికి ప్రయత్నం చెయ్యి’ అన్నాడు. ఒక ప్రక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవశ్యం వచ్చేసి పొంగిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేస్తూ

కలడంబోధి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం 
గల, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గల, డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటం
గల, దీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల నీ యా యెడన్!!

నాన్నా, ఈశ్వరుడు ఎక్కడలేడు అని అడుగు. ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు. రాత్రులందు పగలందు, ఆకాశమునందు పైన మధ్యలో సర్వభూతములయందు అగ్నియందు ఓంకారము నందు సమస్త ప్రపంచమునందు నిండి నిబిడీ కృతమై ఉన్నాడు. ఆయనలేని ప్రదేశం లేదు’ అనేసరికి హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది.




శ్రీమద్భాగవతం - 53 వ భాగం



ప్రహ్లాదుడి మాటలకు హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. అటువంటి స్థితిలో హిరణ్యకశిపుడు ఒక స్తంభము వైపు వేలు చూపించి ‘ఈ స్తంభమునందు ఉన్నడా?’ అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు ‘అనుమానమా’ అన్నాడు. ‘అయితే చూపించు’ అన్నాడు. ‘నేను చూపించడమేమిటి – నువ్వు అడుగు వస్తాడు’ అన్నాడు ప్రహ్లాదుడు.

వెంటనే హిరణ్యకశిపుడు సింహాసనం మీదనుంచి దిగి గద ఎడమచేతితో పట్టుకుని కుడి అరచేతితో స్తంభం మీద ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి ఒక భయంకరమయిన మెరపు మెరిసింది. అది ప్రళయకాలంలో మెరిసే మెరపు ఎలా ఉంటుందో అటువంటి మెరపు వచ్చింది. ఆ మెరుపు కాంతికి అక్కడ ఉన్న వాళ్ళంతా స్పృహతప్పి పడిపోయారు. ప్రళయకాలమునందు పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్ళు వస్తాయో అంట భయంకరమయిన ధ్వనులు వచ్చాయి. మహానుభావువు అపారమయిన తేజోవంతమయిన పాదములతో, పాదములకు అలంకరింపబడిన మణి మంజీరములతో, బలిష్ఠమయిన తొడలతో, గుండ్రని పిక్కలతో, అలంకరింపబడిన పట్టు పీతాంబరంతో, దానిమీద పెట్టబడిన మొలనూలుతో, మొలనూలు నుంచి వస్తున్న చిరుగంటల సవ్వడితో, పిడికిలితో పట్టుకోవడానికి వీలయిన సన్నని నడుముతో, గుండ్రంగా తిరిగి లోపలికి వెళ్ళిన నాభితో, కఠినమయిన శిలవంటి విశాలమయిన వక్షస్థలంతో, అనంతమయిన బాహువులతో, శంఖ చక్ర గదా పద్మ తోరణములను గండ్ర గొడ్డలిని పట్టుకున్న వాడై, చక్కటి పొడుచుకు వచ్చిన చుబుకముతో, గాలికి అల్లల్లాడే నవపల్లవము ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి అదురుతున్న రోషముతో కూడిన పెదవితో, ముత్యాలవంటి దంతపంక్తితో, మందరపర్వతం గుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో, నాసికా రంధ్రములతో, తూర్పుకొండ మీద ప్రకాశిస్తున్న రెండు సూర్యులా అన్న నేత్రములతో, విశాలమయిన ఫాలభాగముతో, అంతటా ఆవరించిన ఎర్రటి జుట్టుతో, నవరత్న ఖచితమయిన కిరీటంతో అటూ ఇటూ శిరస్సును కదుపుతుంటే ఆయన రోమములు ఆకాశమంతా వ్యాపించి కొడితే ఆకాశమునందు సంచరించే సిద్ధుల విమానము అన్నీ క్రింద పడిపోయాయి. ఆనాడు స్తంభంలోంచి బయటకు వచ్చి గర్జన చేసి ఘార్ణిల్లితే ఆ ధ్వనులకు సముద్రములు తిరుగుడు పడ్డాయి. భూమి కంపించి బద్దలయి పోయింది. ఎక్కడి వాళ్ళక్కడ సంభీభూతులై ప్రళయం వస్తోందని అనుకున్నారు. ఇటువంటి మూర్తిని చూసి కూడా హిరణ్యకశిపుడు దుస్సాహసం చేశాడు. కత్తి పట్టుకుని స్వామిమీద పడ్డాడు.

స్తంభంలోంచి బయటకు వచ్చి చంద్రహాసమును దూస్తున్న హిరణ్యకశిపుని ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞచేశాడో అలా కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను నాగుపాము ఒడిసి పట్టినట్లు తన ఎడమచేతితో హిరణ్యకశిపుని తొడ పట్టుకొని గడప దగ్గరకి తీసుకు వెళ్ళి ప్రళయకాలంలో వచ్చే ధ్వనిలాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కోర్చుని తన తొడల మీద పడేసి భయంకరమయిన కనుబోమలను వేయి ఇంద్రధనుస్సులను ఒక్కసారి విరిచినట్లు ముడివేసి ఘోరమయిన స్వరూపంతో ఇలా చూస్తుంటే మెరిసిపోతున్న దంష్ట్రలు, ఆ నోరు, కాలనాగు వేలాడుతున్నట్లు వున్న నాలుక, పెద్ద గోళ్ళు అటువంటి స్వామి తన బాహువుల నెట్టి తన గోళ్ళు చూపితుంటే ఆయన స్వరూపమును చూసి కాళ్ళుచేతులు వేలాడేసి ఆయనకు లొంగిపోతే, ఆగ్రహంతో, తన భక్తుడిని ఇన్ని కష్టములు పెట్టాదన్న క్రోధంతో మాట తప్పకుండ, ఇంట్లో కాదు బయట కాదు మధ్యన గడప మీద. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు తన తొడల మీద, అస్త్రము కాదు శస్త్రము కాదు ప్రాణము ఉన్నది కాదు ప్రాణము లేనిది కాదు గోళ్ళచేత. క్రిందకాదు పైన కాదు తొడల మీద, మనిషి కాదు జంతువూ కాదు నరసింహావతారంతో, భయంకరమయిన స్వరూపంతో, విశేషమయిన క్రౌర్యంతో ఆ గోళ్ళను పొట్టలోకి దింపి భేదించి గండ్ర గొడ్డలి పెట్టి ఉరః పంజరమును బద్దలు కొట్టి, హృదయ క్షేత్రమును చేతితో పట్టుకుని గుండె కింద నలిపి వేసి ఆ కండలు తెంపి ముక్కలు చేసి తుంపి అవతల పారేసి, నెత్తురు తీసి దోసిళ్ళతో నోట పోసుకుని ప్రేగులు తీసి మెడలో వేసుకుని ప్రళయ గర్జన చేస్తూ నృసింహావతారం నిలబడింది.

ఆయన వెళ్ళి సింహాసనం ఎక్కుతుంటే అసుర గణములు మీద పడ్డాయి. అనేకమయిన చేతులు పైకెత్తి ఆయుధములతో కొన్ని కోట్ల అసురులను ఒక్కడే మట్టుపెట్టాడు. సింహాసనం ఎక్కి పాదపీఠంమీద పాదములను వుంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు కింపురుషులు అందరూ వచ్చి స్వామిని అనేకవిధముల స్తోత్రము చేశారు. కానీ ఆయన ఘార్ణిల్లుతున్న శబ్దమునకు ఆయన చేస్తున్న ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేక పోయారు. ఎవ్వరూ దగ్గరకు వెళ్ళలేక అమ్మవారిని చేరి ‘అమ్మా, నీవు నిత్యానపాయినివి. నీవు మాత్రమే ఆ స్వామివారి స్వరూపమునకు ప్రళయ శాంతిని ఉపశాంతిని చేయగలవు. నీవు స్వామివారి దగ్గరకు వెళ్ళు’ అని కోరారు. ఆవిడా అంది ‘ఇదేదో ప్రళయకాలంలో ప్రకాశించే సూర్యబింబంలా ఉన్నది కానీ నేను సేవించే స్వామివారి ముఖ మండలంలా లేదు. నా స్వామిలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే దయారసంతో కూడిన ముఖం కాదు. ఇది భార్య దగ్గరకి వెళ్ళడానికి సాహసించే మూర్తి కాదు’ అంది.

అపుడు బ్రహ్మాదులందరూ స్తోత్రం చేశారు. అయినా ఆయన చేసిన గర్జనలు ఆగలేదు. అపుడు బ్రహ్మగారు ప్రహ్లాదుడిని పిలిచి ‘నాయనా, నరసింహుడు భక్త పరాధీనుడు. నీవు వెళ్ళు’ అన్నారు. ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర చాలా తేలికగా సాష్టాంగ పడిపోయాడు. ఇంత ధ్వని చేస్తున్న వాడు, ప్రశాంత పడిపోయి పెద్ద చిరునవ్వు నవ్వి, ‘ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వదించి తలమీద చేయివేసి రెండుచేతులతో పట్టుకు తీసుకువచ్చి తన తొడమీద కూర్చో పెట్టుకున్నాడు. నిజంగా ప్రహ్లాదుడు ఏమి అదృష్టం పొందాదండి!

ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు ‘స్వామీ నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చేయలేకపోయారు. వేదము తాను ఇక నిన్ను ఆవిష్కరించ లేనని వెనుదిరిగింది. అటువంటి నిన్ను రాక్షస వంశములో పుట్టిన బాలుడిని నేను ఏమి స్తోత్రం చేస్తాను? నిన్ను చేరడానికి. ‘నేను తపం చేశాను, యజ్ఞం చేశాను లేదా ఏదో క్రతువు చేశాను. ఈ కర్మచేశాను అంటే అలా నీవు కర్మలకి లొంగిపోయే వాడవు కావు. ఆ చేసిన కర్మల చేత హృదయ క్షేత్రమునందు శుద్ధి ఏర్పడి వైరాగ్యము ఏర్పడి ఈశ్వరుని సంతతము ధ్యాన నిష్టయందు కొలిచిన వాడెవడో అటువంటి వాడికి లొంగిపోయే స్వరూపం ఉన్నాడివి. అటువంటి స్వామివి ఇవాళ నాయందు కరుణించావు అన్నాడు. ఈ మాటలకు ప్రసన్నుడయి పోయి ఆరోజున నరసింహ స్వామి అన్నారు – ‘ప్రహ్లాదా, ఇలా నన్ను మెప్పించిన భక్తుడు లేడు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నాడు. అపుడు ప్రహ్లాదుడు ‘అందరూ నీ రూపం చూసి భయపడ్డారు. నేను నీరూపం చూసి భయపడలేదు. నాకు నీవెప్పుడూ తండ్రివే. నేను సంసారమునకు భయపడతాను, కామక్రోధములకు భయపడతాను. ‘నేను’ ‘నాది’ అనే భావనలకు భయపడతాను. నాకు వరం ఇస్తానని నన్ను మరల మభ్యపెట్టాలని చూస్తున్నావా తండ్రీ! నాకేమీ వద్దు. సంతతము నీపాదాంబుజ సేవ కటాక్షించు. నీ నామము చెప్పుకునే అదృష్టమును కటాక్షించు. నీ కథలు వినే అదృష్టమును కటాక్షించు. నాకింకేమీ వద్దు’ అన్నాడు. అపుడు స్వామి ‘అసలు నీలాంటి భక్తుడు ఎక్కడ వున్నాడురా, నిన్ను చూసి పొంగిపోతున్నాను. నీవు ఏదో ఒకటి అడగకపోతే నేను నాకు తృప్తి ఉండదు. నా తృప్తి కోసం ఏదో ఒకటి అడగవలసింది’ అన్నారు. అపుడు ప్రహ్లాదుడు ‘ఎంత కాదన్నా హిరణ్యకశిపుడు నా తండ్రి, అజ్ఞాని. తండ్రీ అతడు ఎన్ని నీచ యోనులలోకి వెడతాడో! అలా వెళ్ళకుండా నా తండ్రిని నీ దగ్గరికి చేర్చుకుంటే నా తండ్రి కాబట్టి, నాకు జన్మనిచ్చిన వాడు కాబట్టి నేను సంతోషిస్తాను’ అన్నాడు. అంటే స్వామి పెద్ద నవ్వు నవ్వి ‘ప్రహ్లాదా! నీ చరిత్రము ధన్యము. ఎంత గొప్ప వరం అడిగావు. ఏనాడు నీ తండ్రి నేను కోరలు విప్పి పళ్ళు చూపిస్తూ గోళ్ళు అతని కడుపు పైనుంచి నా నేత్రములతో చూస్తూ వుంటే, అతి దగ్గరగా మహర్షులు, మునీంద్రులు కూడా చూడని నా రూపమును తేజోహీనుడై అలా చూస్తూ ప్రాణములను వదిలాడో ఆనాడే నాకు దగ్గర అయిపోయాడు. అందుకని నీవు నీ తండ్రి గురించి బెంగ పెట్టుకోవద్దు. రాజ్యపాలన చేసి వంశమును వృద్ధిలోకి తెచ్చుకో’ అని స్వామి వారు ఆనాడు మనకందరికీ గొప్ప వరమును కటాక్షించారు. అదే మనందరం కూడా తప్పకుండా స్మరించవలసిన పద్యం.

“శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సం
చారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభా
కారము తోడ నే భయము గల్గని లోకము జెందు భూవరా!!

ఈ ప్రహ్లాదోపాఖ్యానమును ఎవరు పరమ భక్తి శ్రద్ధలతో చేతులు కైమోడ్చి ఈశ్వరుడు ఉన్నాడు అన్న పూనికతో వింటున్నారో, ఉగ్రనరసింహ మూర్తియై తన భక్తులను బాధపెట్టిన వాడి పట్ల కోపము తెచ్చుకున్న స్వామి మూర్తి వర్ణనను వింటున్నారో, మళ్ళీ భక్తుడు చేసిన స్తోత్రమునకు ప్రసన్నుడయిన మూర్తి కథను విన్నారో, అటువంటి వారికి ఇంక యమధర్మరాజు దర్శనము ఉండదు. వారికి ఇక్కడే నేను భక్తిని కర్మని వైరాగ్యమును జ్ఞానమును ఇచ్చి, జ్ఞానము చేత మోక్షమును ఇచ్చి వారందరినీ తరింపచేస్తాను అని అభయం ఇచ్చారు.


శ్రీమద్భాగవతం - 54 వ భాగం



అష్టమ స్కంధము – గజేంద్రమోక్షం 

గజేంద్రమోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. ‘గజ’ అనే అక్షరములను కొంచెం అటూ ఇటూ మారిస్తే ‘జగ’ అవుతుంది. ‘జ’ అంటే ‘జాయతే’. ‘గ’ అంటే ‘గచ్ఛతే’. ‘జాయతే’ అంటే వెళ్ళిపోవడం. ‘గచ్ఛతే’ అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని ‘జగము’ అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఉండదు. అలా ఏదయినా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈ జగము కథ ఇప్పుడు గజముగా చెప్పాలి. అదే గజేంద్రమోక్షంలో ఉన్న రహస్యం.

గజముగా ఎందుకు చెప్పాలి? అంటే ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికి మాత్రమే ఒక బలహీనత ఉంది. భూమినుండి చాలా తక్కువ ఎటు మాత్రమే ఎగరగలిగిన ప్రాణి ఏనుగు ఒక్కటే. ఏనుగు పైకి ఎగరలేక పోవడానికి దాని శరీరబరువే దానికి అడ్డు వస్తుంది. మనిషి ఈశ్వరుడి వైపుకి ఊర్ధ్వ గతికి ఎందుకు నడవలేడు? అతని సంసారమే అతనికి బరువై ఉంటుంది. మగ్నత పెంచుకుంటున్న కొద్దీ సంసారం బరువైపోతూ ఉంటుంది. నిజమునకు అది ఏనుగు కథా లేక మన కథా? నిజంగా మీరు ఏనుగు కథగా విన్నా కూడా గజేంద్రమోక్ష కథను వింటే విశేషమయిన శుభ ఫలితం కలుగుతుందని ఆఖరున ఫలశ్రుతిలో చెప్తారు. నిత్య పారాయణము చేయవలసినది అని నిర్ణయింపబడిన కథ గజేంద్రమోక్ష కథ. అలాంటి గజేంద్రమోక్షం జీవితంలో ఒక్కసారి విన్నా చాలు. వారికి అపారమయిన ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఫలశ్రుతిని ఎవరు గ్రంథమును రచించారో వారు చెబుతారు. గజేంద్రమోక్ష సన్నివేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఫలశ్రుతిని చెప్పారు. ఈ గజేంద్రమోక్ష కథా శ్రవణము ఒక పూజకాదు, ఒక కర్మ కాదు.

పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నాడంటే ‘ఒకానొక మన్వంతరంలో శ్రీహరి ఒక ఏనుగును ఒక మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠము నుండి కదలివచ్చి రక్షించాడు’ అని తరువాతది చెప్పబోతున్నారు. అప్పుడు పరీక్షిత్తు ‘స్వామీ, ఏమిటా కథ? అంత విచిత్రంగా చెప్పారు” అన్నాడు. అపుడు శుకబ్రహ్మ పరీక్షిత్తు ఆర్తికి సంతోషించి గజేంద్రమోక్ష కథను చెప్పడం ప్రారంభించారు.

ఒకానొకప్పుడు క్షీరసాగరం ఉన్నది. అందు త్రికూటాచలం అనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతమును మూడు శిఖరములు ఉన్నాయి. ఒక శిఖరము బంగారముతోను, మరొక శిఖరము వెండితోను, మూడవది ఇనుముతోను చేయబడ్డాయి. అందు ఎన్నో రకముల వృక్షములు, తీగలు పెరుగుతూ ఉండేవి. ఈ పరిసరములలో ఎన్నో రకములయిన జంతువులు ఉండేవి. ఏనుగులు పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉండేవి. ఆ ఏనుగులు బయటకు వస్తే అరణ్యంలో ఒక్క పులి మిగలదట. చామరీ మృగములు ఏనుగుల గుంపు చుట్టూ నిలబడి వాటి తోకలనే చామరములతో ఏనుగులకు విసిరేవి. ఆ ఏనుగులు ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి. అటువంటి ఏనుగులకు అధినాయకుడు ఒకాయన ఉండేవాడు. నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. ఆ ఏనుగు ఆ మందకు రాజు. దానికి గల భార్యల సంఖ్య పదిలక్షల కోట్లు. జీవుడు ఒక్కడే కానీ ఎన్ని శరీరములో. ఈ పరివారంతో తిరుగుతున్నాడు. సంసారంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోయాడు. చాలా దూరం తిరిగాడు. నీటికోసం చాలా చోట్ల వెతికాడు. చిట్టచివరకు ఒక సరోవరం కనపడింది. అద్భుతమైన సరోవరం - అదే సంసారం. దీని ఒడ్డున వుంది నీరు త్రాగాలి. ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయన పొంగిపోయి అబ్బ! ఈ సరోవరం ఎంత బాగుందో అనుకుని తన భార్యలతో అ నీళ్ళలోకి దిగాడు. మిగిలిన పరివారం అంతా నీళ్ళలోకి దిగింది. ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది. తానెంత మొనగాడో తన భార్యలందరికీ చూపించాలనుకున్నాడు. 

తాగడానికి వెళ్ళినవాడు నీళ్ళు తాగడం మానివేసి గట్టిగా పాదములను ఊన్చుకుని నిలబడిన వాడై విపరీతమయిన శక్తితో తొండం నిండా నీళ్ళు లాగాడు. ఆ నీటివేగంతో లోపలి చేపలు వెళ్ళిపోయాయి. మొసళ్ళు వెళ్ళిపోయాయి. ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఒకసారి భార్యల వంక చూశాడు. నీటిని తొండంలో నిలబెట్టాడు. ఇప్పుడు ఊన్చుకుని తొండమును పైకెత్తి ఆ నీళ్ళను ఆకాశం మీదకి విసిరాడు. ఇలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో వున్న చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయాయి. అందులో ఉన్న ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయాయి. మొసళ్ళు అన్నీ మకరరాశిలో పడిపోయాయి. అలా మూడు రాశులలో పడేటట్లు కొట్టాడు. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయారు. 

గజేంద్రుడు అలా చేసేసరికి దీనిని చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అందరూ సరోవరంలో దిగి నీళ్ళు తాగేస్తున్నారు, చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు. కనపడిన చిన్న మొసళ్ళను తొక్కి చంపేస్తున్నారు. పావుగంట అయేసరికి నీరు బురద అయిపోయి అంతా కల్మషం అయిపొయింది. ఇంత అల్లరి చేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారు. గ్రహణంలో సూర్యుడిని పట్టినట్లు ఆ నీటిలో ఉన్న పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగులు చాలా అల్లరి చేస్తున్నాయి. ఈ అల్లరికి ఈ నాయక ఏనుగే ప్రధాన కారణము. దీనిని పట్టుకోవాలి అనుకుని తలపైకెత్తి చూసింది. భుగ భుగమనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలను పుట్టించి నీటిని జిమ్మీ తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి ఏనుగుకాలు ఎక్కడ ఉంటుందో పట్టేసుకుంది. మొసలి నీటి అడుగునుంచి పట్టుకోవడం అంటే సంసారం ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతంగా మృత్యువు వస్తుంది. కాబట్టి మృత్యువు కాలును పట్టింది. ఇహ కదలడు. పట్టు విడిపించుకుందామని చూస్తోంది. ఇపుడు మిగిలిన కోరికలన్నింటినీ పక్కన పెట్టేసినట్లయితే ఏనుగుకి వున్న కోరిక ఒక్కటే. ఆ మొసలి పట్టు తప్పించుకుని గట్టు ఎక్కేద్దామని ఏనుగు చూస్తోంది. ఏనుగు గట్టెక్కకుండా నీళ్ళలోకి లాగేద్దామని మొసలి చూస్తోంది. ఇప్పడు గజరాజుతో కూడివున్న మిగిలిన పరివారం ఏమి చేస్తున్నారు? 

మకరితోడ బోరు మాతంగ విభుని నొక్కరుని దించి పోవ గాళ్ళు రాక 
కోరి చూచుచుండె గుంజరీ యూధంబు మగలు దగులు గారే మగువలకును!!

ఈ పద్యం ఒక్కటి రోజూ స్మరణ చేసుకుంటే చాలు. వైరాగ్యం వస్తుంది. ఆయన మాతంగ విభుడు. గొప్ప ఏనుగు. ఈయన నీళ్ళల్లో యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఒడ్డున చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాజుగారు యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చేస్తాడని గట్టుమీద వుండి చూస్తున్నారు. గజేంద్రుడు అలా ఎంతకాలం యుద్ధం చేశాడంటే వెయ్యేళ్ళు యుద్ధం చేసింది. అలా పట్టుకున్న మొసలి పట్టు తప్పుకోలేక అప్పుడు ఏనుగు అనుకుంటుంది “అయ్యో! భూమేమీద ఉంటే నాకు బలం. నిష్కారణంగా నీళ్ళలోకి ప్రవేశించాను. ఈ నీళ్ళలోకి ప్రవేశించిన తరువాత ‘నావారు’ అనుకున్న వారు వెళ్ళిపోయారు. ఒక్కడినే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడ నన్ను రక్షించే వారు ఎవరు?’ అని ఆ ఏనుగు అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇంతకూ పూర్వం అతడు చేసిన పుణ్యం పూజ వలన ఆ స్థితిలో జ్ఞాపకమునకు వచ్చింది. 
పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మ్రుతిలోకి వచ్చిన జ్ఞానము నొకదానిని ఏనుగు ప్రకటన చేస్తోంది. 

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!!

ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితి కార్తో, ఎవరు ప్రళయ కర్తో, లోకములన్నిటిని ఎవరు సృష్టించారో, ఎవరు యందు లోకములు ఉన్నాయో. లోకములు ఎవరియందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయము అయిపోతున్నాయో. ఎవరు అంతటా నిండి నిబిడీ కృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనపడుతున్నదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!’ అని స్తోత్రం చేస్తోంది. ఏనుగు చేసిన ప్రార్థనకు ముప్పది మూడుకోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. 

లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం
జీకఁటి కవ్వల నెవ్వఁడు -
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్!!

లోకములు, దీనిని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు, ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటై పోయి నీరై పోయి ముద్దయి పోయి, గాడాంధకారం కమ్మేస్తే ఈ గాడాంధకారమునకు అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు.

ఎటువంటి మహాపురుషుడయిన వాడు, తానొక్కడే వుంది అనేకులుగా కనపడుతున్న వాడెవడో అలాంటి వాడిని ఎవరూ స్తుతి చెయ్యలేరో, ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో ఎవారూ చెప్పలేదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!” దేవతలు ఎవరి మటుకు వాళ్ళు ఏనుగు తమను ప్రార్థించడం లేదని కూర్చున్నారు. దేవతలు అలా కూర్చోవడంలో ఒక రహస్యం కూడా ఉన్నది. ఇప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ. మొసలిని చంపి రక్షించాలి. అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీమహావిష్ణువు. కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు. ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఏనుగు ఇన్నీ చెప్పి చివర ఒకమాట అంది 
కలడందురు దీనులయెడ గలడందురు పరమయోగి గణముల పాలం 
గలడందు రన్ని దిశలను గలడు కలండనెడి వాడు గలడో లేడో!

ఇంతా చెప్తోంది కానీ దానికో అనుమానం. నిజంగా దీనులయిన వారు పిలిస్తే వస్తాడా? అంతటా ఉన్నాడు అని అంటారు. కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్న వాడు కలదు కలండనెడివాడు కలడో లేడో! అంది. ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు. 

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!!

నీవు తప్ప నాకిప్పుడు దిక్కులేదు. నేను దీనుడిని. నా తప్పులన్నీ క్షమించు ఈశ్వరా! వరములను ఇచ్చేవాడా నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమయిన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించింది. వైకుంఠము నుండి రావాలి.




శ్రీమద్భాగవతం - 55 వ భాగం



అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై!!

ఎక్కడో వైకుంఠపురం లోపల వున్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు – ఆయన ధనుస్సు, కౌమోదకి అనబడే గద – అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా పిలిస్తే ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమణి దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు. 

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై!!

లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. ల్శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయానవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆజుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు.’అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి – వదలండి’ అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా!

తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దానివె
న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు, రావచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్!!

ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌమదకి, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విష్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న పిల్లవాని దగ్గరనుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు. 

వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?’ అని అడిగారు. అపుడు అమ్మవారు –‘ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు’ అంది.

అడిగెదనని కడువడి జానూ, నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్ 
వెడ వెడ సిడి ముడి తడబడ, నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!

అలా వెడుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఈ అడుగుతున్నా వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ‘నమో నారాయణా’ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.

మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవ నిధులలో ఒక నిదియైన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాగుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా అభాయపడి అవి ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మరల అందరూ వచ్చేశారు. ఒక తామర పువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖచక్రగదాపద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వ లోకమునకు వెళ్ళాడు.

ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అపుడు శుకుడు ఇలా చెప్పాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమో గుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మించెదవు గాక అని శపించారు. అగస్త్యునికి పూజ చేసి వుంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయిన వారు మీ యింటికి ఏనాడు వస్తారో ఆనాడు మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక వుండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి. మొసలి లోంచి వచ్చిన గంధర్వుని పేరు ‘హూహూ’. ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదేసమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా – హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని – మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు ‘నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు వున్న మొసలివై జన్మించెదవు గాక’ అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్రమోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు –‘ఎవరయితే ఈ గజేంద్రమోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. తోగములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమాను మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమయిన పుణ్యం. ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు వున్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. అతను శ్రీమన్నారాయణుని దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు.



శ్రీమద్భాగవతం - 56 వ భాగం



2. క్షీరసాగర మథనం:

పంచమి ఉండగా ఉన్న శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నింటికి ఐశ్వర్యమును ఇచ్చింది. దానివలన మొట్టమొదట అనుగ్రహమును పొందినవాడు దేవేంద్రుడు. మనము ఐశ్వర్యమునకు గాని, అధికారమునకు గాని, భోగాలాలసతకు గాని, వైభోగమునకు కాని, ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాము. 

ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన సురాపానం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా దుర్వాసో మహర్షి వస్తున్నారు. ఆయన మహా బ్రహ్మజ్ఞాని. శంకరాంశ సంభూతుడు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ వున్న పరివారం దేవేంద్రుడిని కుశలం అడిగి దేవేంద్రుని ఆశీర్వచనం చేశారు. దుర్వాసో మహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది.

ఆ పారిజాత పుష్పమును ఈయన కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ‘మహానుభావా, ఈ పుష్పమును స్వీకరించండి’ అని కృష్ణుడు ఇచ్చాడు. అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడినది. దీనిన్ ఈశ్వర నిర్మాల్యం అంటారు. లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. ఇంద్రుడు సురాపానం చేసి మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ పువ్వును తీసుకున్నాడు. పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకు అడ్డుకుని పక్కన పెట్టాలి. ఈశ్వర నిర్మాల్యం అయినట్లయితే తలమీద కానీ చెవిలో కానీ పెట్టుకోవచ్చు. లేదా ఎవరూ తొక్కని చోట దానిని భద్రం చేయవచ్చు. ఇంద్రుడు ఆ పువ్వును తీసుకొని ఐరావతం మీదకి విసిరాడు. ఆ ఐరావతం విశేషమయిన తేజస్సును సంతరించుకుంది. అది భగవంతుని నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది. అది దానిని స్వీకరించింది. అది తేజస్సును పొంది ఇంద్రుడిని మోయడం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అపుడు దుర్వాసో మహర్షి ఇంద్రుడిని చూసి ‘నీవు ముకుంద పాదారవిందము నుండి వచ్చిన పారిజాత పుష్పమును తిరస్కరించావు. కనుక నీవు ఉత్తర క్షణం ఐశ్వర్య భ్రష్టుడవు అయ్యెదవు గాక! స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమయినటువంటి వైకుంఠములో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యం అయిపోతుంది. ఇక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు’ అన్నారు. ఈమాట వినగానే శత్రువులు వచ్చేస్తారు. ఐశ్వర్యం పోవడానికి ఒక కారణం ఉండాలి కదా! రాక్షసులు అందరూ వచ్చేశారు. చుట్టుముట్టి పడగొట్టేశారు. ఇంద్రుని ఐశ్వర్యం పోయింది. ఇపుడు ఇపుడు ఇంద్రునికి ఐశ్వర్యం పోవడానికి కారణం తెలిసింది. అపుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అపుడు బ్రహ్మగారు ‘అప్పుడప్పుడు నీవు కండకావారంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్లావు. ఇవాళ దుర్వాసో మహర్షి జోలికి వెళ్లావు. అందువలన ఐశ్వర్యం పోయింది. ఇపుడు నీకు మరల ఐశ్వర్యం ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి. ఆయననే ధ్యానం చెయ్యాలి’ అని కన్నులు మూసుకుని ధ్యానమునందు ఉన్నవాడి ఆ పరమాత్మను ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అనగా ధ్యానమునందు ద్యోతకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు. 

ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు ‘ఇప్పుడు నీకు ఐశ్వర్యము పోయినది కదా! నీవయినా నేనయినా మరల ఐశ్వర్యము నిమ్మని శ్రీమన్నారాయణుని అడగాలి. ఆయన పాదముల మీద పువ్వును నీవు విసిరేశావు.అందుకు దుర్వాసునికి కోపం వచ్చింది. పరమాత్మకు కోపం రాదు. ఆయనా కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఉద్ధరించే వాడెవడు? పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నీవు దుర్వాసుని నన్ను అర్థించడం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు. తప్పు చేసిన వాడు తనకు ఎంత దగ్గర వాడయినా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు. శాశ్వత మిత్రుడు కాదు. మీ నడవడిని బట్టి ఆయన మిత్రత్వము కాని, శత్రుత్వము కానీ ఆవిష్కరింప బడుతుంది. ఇంద్రా! నేను కాని, దుర్వాసుడు కానీ, సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తామో తెలుసా? శ్రీమన్నారాయణుడికి మ్రొక్కి నమస్కరించినపుడే. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందడం కాదు. శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులం అవుతాం. ఆయనను ప్రార్థన చేద్దాం’ అన్నారు బ్రహ్మగారు.

ఆమాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడిని పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది.పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరం ఇచ్చేస్తాడు. దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది -హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు.తప్పు చెయ్యడం సహజం. పశ్చాత్తాప పడి మళ్ళీ ఆతప్పు చేయకుండా ఉండడం మంచి మనిషి లక్షణం. అపుడు ఇంద్రుడు తాను చేసింది తప్పు పనే అని, తనను మన్నించమని మనస్సులో అనుకుని స్వామిని ప్రార్థించాడు. అంతే! ఎక్కడికో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసిన వాళ్లకి దొరకని పరమాత్మ దర్శనం పశ్చాత్తాపం కలగగానే ఇంద్రునికి దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షం అయిపోయాడు. అలా సగుణంగా కనపడగానే అందరూ చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయనను చూడడానికి ఆయన అనుగ్రహం కావాలి. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడడానికి వీలుగా ఎదురుగుండా ఈశ్వరానుగ్రహంతోనే చూశారు. పరమాత్మ ప్రత్యక్షం అయేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు. 

శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతసించాడు. ‘నీవు ఐశ్వర్యము పోయింది కదా అని విచారిస్తున్నావు. ఐశ్వర్యమేమిటి! ఈ శరీరమునకు యౌవనము పోకుండా మృత్యువు రాకుండా ప్రళయ కాలమునందు మాత్రమే మరల లీనమఎలా వార్ధక్యం రాకుండా ఐశ్వర్యం చెడకుండా అనారోగ్యం రాకుండా నిరంతరం తేజస్సుతో కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదము ఆనకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఈయగాలిగిన అమృతమును మీకు ఇస్తాను’ అని అన్నారు. అదీ ఈశ్వరానుగ్రహం అంటే. ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలచుకొని ‘నాది తప్పే మహానుభావా’ అన్నాడు. పరమాత్మ అమృతమును ఇస్తాను అంటున్నాడు. ‘మీరు అనేక ఓషధులను తీసుకురండి. గడ్డి తీసుకురండి. పువ్వులు తీసుకురండి. ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాలసముద్రంలో వెయ్యండి. అపుడు మందర పర్వతమును తీసుకువచ్చి కవ్వంగా మెల్లగా పాలసముద్రంలోకి దించండి. దానికి వాసుకిని త్రాడుగా చుట్టండి. దేవతలు, దానవులు దానిని అటుఇటు పట్టుకోండి. ఇపుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీమాట వినరు. నాగుపాము కూడా ఎలుకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చేయండి. వారిని క్షీర సాగర మథనమునకు తీసుకు వచ్చి సాగరమును చిలకండి. అపుడు అందులోంచి అమృతం పుడుతుంది. మొదట హాలాహలం వస్తుంది. అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి. పూనికతో మరల చిలకండి. చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు. నిగ్రహించుకొనండి. నేను ఇస్తే పుచ్చుకోండి. లేకపోతే ఊరుకోండి. ఎవరికీ ఏది ఇవ్వాలో నాకు తెలుసు. అది వాడికి ఇస్తాను. 

ఇపుడు దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలా చేస్తాం అని చెప్పి వారు బయలుదేరారు. మొట్టమొదట మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాలి. ఇపుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకొక పెద్ద తవుకోలను తయారుచేసి ఇవ్వవలసినదని కోరారు. త్వష్టప్రజాపతి ఎందుకు? అని అడిగాడు. అపుడు దేవతలు ‘మేము మందర పర్వతమును కింద తవ్వేస్తాము. తరువాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాము. అలా చేయమని శ్రీమన్నారాయణుడు చెప్పాడు అని చెప్పారు. ఆయన వారు కోరిన విధంగా తవుకోలను చేసి ఇచ్చాడు. వారు దానిని తీసుకువెళ్ళి మందరపర్వతం అడుగు భాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. ఇపుడు మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో దింపాలి. అందుకని డాన్ని కొన్ని తాళ్ళు వేసి దానిని ఊపుతున్నారు. అలా ఊపి మొత్తం మీద మందరపర్వతమును అందరూ కలిసి పైకి ఎత్తారు.అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. ఈ సందర్భంలో దానికింద పడి కొందరు మరణించారు. అపుడు మిగిలిన వారందరూ ప్రక్కకు చేరి ఈ మందరపర్వతమును సముద్రము వరకు తీసుకుని వెళ్ళడానికి మనం శ్రీహరి సహాయం అడగలేదు. అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవాడు. ఆయన వస్తే ఎంత బాగుండునో’ అని అనుకున్నారు. వాళ్ళు ఈమాట అనుకునేసరికి బంగారు రంగులో ఉన్న గరుడ పక్షిమీద నుంచి శ్రీమన్నారాయణుడు క్రిందకి దిగి దేవతలను ఓదార్చి మందరపర్వతమును బంతివలె నేర్పుతో చేతితో పట్టుకుని, దానిని తీసుకుని మరల గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు పాల సముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుడిని వెనక్కు పంపించి వేశాడు. చిలికేతప్పుడు వాసుకి శరీరం ఒరిసి పోకుండా మందరపర్వతమును నునుపుగా చెక్కించారు. వాసుకిని తీసుకు వచ్చి పర్వతమునకు చుట్టారు. ఇప్పుడు మందర పర్వతమును పాలసముద్రం లోకి పెట్టారు. ఇప్పుడు అది మునిగి పోకూడదు. అపుడు దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు పట్టుకొనమని రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకొనమని చెప్పాడు. వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు. అపుడు రాక్షసులు ‘మేము తోక పట్టుకోవడం ఏమిటి? మేము తలవైపు పట్టుకుంటాము’ అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకుని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకొనమని చెప్పారు. దేవతలు మారు మాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్ళి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల పట్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేతట్లు చేస్తుంది.



శ్రీమద్భాగవతం - 57 వ భాగం



పామును మందరపర్వతమునకు చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి. అది క్రిందకు జారిపోకూడదు. దేవదానవులిరువురూ చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. భుగభుగభుగమని పాలసముద్రం లేచింది. నురగలు లేచాయి. కెరటములు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమయిన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు మందరపర్వతమును గిరగిర తిప్పెస్తున్నారు. అపుడు వాసుకి ‘మీరు సరిగ్గా చిలకడం లేదు వదలండి’ అని కేకలు వేశాడు. వాళ్ళందరూ వాసుకిని వదిలేశారు. పట్టు తప్పిపోయి మందర పర్వతం జారి క్రిందపడిపోయింది. ఇపుడు అందరూ శ్రీమన్నారాయణుని వైపు చూశారు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారమును స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పయిన పెద్ద డిప్ప. ఆ దిప్పతో పాలసముద్రం అడుగుకి వెళ్ళి ఇంతమంది కదల్చలేని మందరపర్వతమును తన వీపుమీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తుండమును అటూ ఇటూ ఆడిస్తున్నాడు. తన నాలుగు కాళ్ళను కదల్చకుండా తానె ఆధారమయి, మందరపర్వతమును వీపుపై ధరించి ఉన్నాడు. ఆ కూర్మము నిజంగా ఆహారమును తినినట్లయితే ఈ బ్రహ్మాండములనన్నిటిని జీర్ణము చేసుకొనగలదు. అటువంటి వాడై ఆది కూర్మమై పాలసముద్రం క్రింద పడుకున్నాడు. ఇపుడు మందరపర్వతమును ఆదికూర్మం భరిస్తోంది. మరల మందరపర్వతమును వాసుకిని చుట్టి రాక్షసులు తలవైపు దేవతలు తోకవైపు ఉంది, మరల చిలకడం ప్రారంభించారు. భూమి అదిరిపోతోంది. సముద్రంలోంచి కెరటములు పైకి లేస్తున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆకాశంలో నిలబడిపోయి ఆ దృశ్యమును చూస్తున్నారు.

ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారు భావ సమాధిలో ఉన్నారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. సత్యలోకంలోంచి బయటకు వచ్చి ఏమిటి ఈ చప్పుడు? అన్నారు. అక్కడి వాళ్ళు స్వామీ, పాలసముద్రమును చిలుకుతున్నారు. అందులో నారాయణుడు కూడా ఉన్నాడు అన్నారు. బ్రహ్మగారు కూడా పైనుంచి క్రిందకు చూస్తున్నారు. ముందు అమృతం రాలేదు. హాలాహలం ముందు పుట్టుకు వచ్చింది. అది ఒక్కసారి పాలసముద్రం మీద నుండి పైకి లేచింది. ప్రళయకాలంలో వుండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంది. అది వెంట తరుముతుంటే దేవతలు రాక్షసులు అందరూ వాసుకిని వదిలిపెట్టి పరుగు మొదలు పెట్టారు. అన్ని లోకములలో అగ్నిహోత్రం ప్రబలి పోతున్నది. పరుగెత్తి పరుగెత్తి కైలాసపర్వతం మీద వున్న పరమశివుని అంతఃపురము దగ్గరకు వెళ్ళి అక్కడి ద్వారపాలకులు అడ్డు పెట్టగా వారిని పక్కకు తోసివేసి లోపలి ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడే నిలబడి రక్షించు అని అరుస్తున్నారు. స్వామి పరమశివుడు వీరి అరుపులు విని స్వామి ఏదో ఆపద సంభవించి ఉండవచ్చునని బయటకు వచ్చారు. వారు శంకరునితో ‘ఈశ్వరా! నీవు ఈ విశ్వమంతా నిండి నిబిడీ కృతమయిన వాడివి. నీవు తండ్రివి. మేము చెయ్యకూడని పని ఒకటి చేశాము. ఇంట్లో ఏదయినా శుభకార్యం చేతున్నప్పుడు మనకొక సంప్రదాయం ఉన్నది. ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారికి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. కానీ దేవదానవులు ఆ పని చేయలేదు. స్వామికి నమస్కరించలేదు. అందుకని స్వామి వీళ్ళకి పాఠం నేర్పాలి అనుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ‘మేము మందరపర్వతం పెట్టి సముద్రమును చిలికితే హాలాహలం జనించింది. లోకములను కాల్చేస్తోంది. దయచేసి దానిని నీవు స్వీకరించవలసినది’ అన్నారు.

మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు 
భేదమగుచు దుది నభేదమై యోప్పారు బ్రహ్మమవగ నీవ ఫాలనయన!!

నీవు భూతభవిష్యద్వర్తమానరూపములలో ఉంటావు. నీవే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు. నీవే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమయిన మూలపురుషుడవు కనుక ఈశ్వరా, ఈ హాలాహలమును నీవు పుచ్చేసుకో’ అన్నారు. వారి కోరికను విన్న పరమశివుడు వెంటనే పార్వతీ దేవి వద్దకు వెళ్ళాడు. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది. శంకరుడు ఆమెవంక చూసి
‘కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై 
యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; గాదె గీర్తి మృగాక్షీ!!

ఈ ఘట్టము వినిన వాళ్లకి కొన్ని కోట్ల జన్మల వరకు అయిదవతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళ సూత్రం గురించి వస్తుంది. ‘చూశావా పార్వతీ, నీళ్ళలోంచి వేడి పుట్టింది. పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభువు అన్నవాడు బిడ్డలకు కష్టం వస్తే ఆదుకోవాలి. అందుకని వాళ్ళను రక్షించాలని అనుకుంటున్నాను’ అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండములకు అల్లి. మాతృత్వము ఒక్కొక్కసారి భర్తృత్వమును కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వమును ఆమెలోంచి ఉద్భుదం చేస్తున్నాడు శంకరుడు. ‘మీ అన్నయ్య స్థితికారుడు. లోకముల నన్నిటిని నిలబెట్టాలి. ఇపుడు లోకములకు ఇబ్బంది వచ్చింది. మరి నేను ఆయనను సంతోష పెట్టాలి కదా! అందుకని నేను హాలాహలమును త్రాగేస్తాను. 

శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ 
రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ!!

నేను ఈ హాలాహలమును చిన్న ద్రాక్షపండును తినేసినట్లు తినేస్తాను. దానివలన నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. అది నా దివ్యమయిన లీల. నాకేమయినా అవుతుందని నీవేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేనెలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు’ అన్నాడు. అపుడు పార్వతీ దేవి ‘సరే, మీకు ఎలా ఇష్టమయితే అలా చేయండి’ అంది. 
మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!!

ఆవిడకు శంకరుడు త్రాగబోయేది విషం అని తెలుసు. విషం త్రాగితే ప్రమాదమనీ తెలుసు. త్రాగుతున్న వాడు తన భర్త అనీ తెలుసు. అయినా త్రాగమంది. ఆవిడ సర్వమంగళ. అందుకని తాగెయ్యమంది. శంకరుని జీవనమునకు హేతువు పార్వతీదేవి మెడలోని మంగళ సూత్రమని పోతనగారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే హాలాహలమునకు ఎదురువెళ్ళి దానిని చేతితో పట్టుకుని ఉండచేసి నేరేడు పండంతచేసి గభాలున నోట్లో పడేసుకుని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మ్రింగినప్పుడు కానీ వేడిచేసి ఆయన ఒంటిమీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలానే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్న వాడు హాలాహలం లాంటి కష్టము వచ్చినా కూడా అలా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకుని మ్రింగుదామనుకున్నాడు. కంఠం వరకు వెళ్ళింది.

ఉదరము లోకంబులకును సదనంబాగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం 
గుదురుకొన గంఠబిలమున బదిలంబుగ నిలిపె సూక్ష్మ ఫలరసము క్రియన్!!

మింగేస్తే అడుగున అధోలోకములు ఉన్నాయి. కాలిపోతాయని మింగలేదు. పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. కక్కితే ఊర్ధ్వలోకములు పోతాయి. పైకీ వదలలేదు, క్రిందకీ వదలలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీ దేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటినుండి ఆయనకు నీలలోహితుడు, నీలగ్రీవుడు అని పేరు వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని పేరు. ‘నీలకంఠా అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహాల భక్షణం కథ వీనిన వాళ్లకి మూడు ప్రమాదములు జరుగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. హాలాహలభక్షణం కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదములు రావు. అంతంత శక్తులు ఇటువంటి లీలలయందు ఉన్నాయి. వాటిని క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పారు. 

మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరకి వెళ్ళిపోయారు.క్షీరసాగరమథనం మొదలుపెట్టారు. అలా మథిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామదేనువుకి అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమయిన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో హవిస్సులను అర్చిస్తాము అని అన్నారు. లోక కళ్యాణార్థం హవిస్సులను ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి మీరు దీని పాలతో దేవతలకు హవిస్సులను అర్పించాలి. అపుడు దేవతలు సంతోషించి వర్షములు కురిపిస్తారు. అందరూ బాగుంటారు. అందరికీ పనికి వచ్చేవాడికి కామధేనువు ఉండాలి. అందుకని కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది. వారు దానిని పుచ్చుకున్నారు.




శ్రీమద్భాగవతం - 58 వ భాగం



మళ్ళీ పాలసముద్రమును చిలకడం మొదలుపెట్టారు. ఇపుడు అందులోంచి ఒక తెల్లటి గుఱ్ఱము ఒకటి బయటకు వచ్చింది. దానిని ఉచ్చైశ్రవము అంటారు. ఈ గుఱ్ఱమును చూడగానే ఇంద్రునికి కించిత్ మమకారం పుట్టింది. కానీ శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వమును బలిచక్రవర్తి తనకిమ్మనమని అడిగాడు. ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. ఇపుడు పాల సముద్రంలోంచి బ్రహ్మాండమయిన కల్పవృక్షం ఒకటి వచ్చింది. ఆ కల్పవృక్షమునకు పువ్వులు పూసి ఉన్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి అయిదవతనం తరగదు. దానిమీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వారికి ఫలముల రూపంలో కోర్కెలు తీర్చేస్తుంది. ఈ కల్ప వృక్షమును ముందు ఇంద్రునికి ఇచ్చారు. ఆయన దానిని తీసుకున్నాడు. తరువాత అప్సరసలు పుట్టారు. ఆ అప్సరసలు దేవకాంతలై, దేవ నర్తకీ మణులై ఉండిపోయారు. తరువాత పాల సముద్రమును ఇంకా చిలకడం మొదలు పెట్టారు. ఇప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగబోతోంది. ఆమె శుక్రవారం పంచమి నాడు పుట్టింది. 

పచ్చటి కాంతితో, తెల్లటి వస్త్రములు కట్టుకుని ‘పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే’ అని నల్లని కన్నులతో సొగసయిన చూపులతో మాతృ వాత్సల్యంతో అందరివంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారు చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకూ దరిద్రములు అన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరు విన్నారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశితుంది. ఇది పరమయధార్థం. పుడుతూనే ఆ తల్లి యౌవనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశ స్థాపనం చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన స్తోత్రం వ్యాసభాగవతంలో లేదు. కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒకమాట చెపుతారు. ఈ స్తోత్రమును చెయ్యడానికి కొన్ని రోజులు నియమం ఉంది. అలా ఈ స్తోత్రమును తెలిసికానీ, తెలియక కానీ చేస్తే ఆ వ్యక్తి భూమండలమును శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది. పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లని జుట్టు కలిగి ఉంది. కబరీ బంధం చుట్టూ చక్కటి మల్లెపువ్వులు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు, అలంకరించుకుని వుంది. మెడనిండా హారములు వేసుకుని ఉంది. వరదముద్రపత్తి చేతితో ఐశ్వర్యమును కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తోంది. రెండు పాదములను కలిపి పద్మాసనం వేసుకుని ఉంది.

నమః కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః
కృష్ణ ప్రియాయై సతత౦ మహాలక్ష్మ్యై నమోనమః!!
పద్మ పత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః!!
సర్వస౦పత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః
హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై చ నమోనమః
కృష్ణ వక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః
చ౦ద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే!!
స౦పత్త్యధిష్ఠాతృ దేవ్యై మహాదేవ్యై నమోనమః
నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమోనమః!!
యథామాతా స్తనా౦ధానా౦ శిశూనా౦ శైశవే సదా
తథా త్వ౦ సర్వదా మాతా సర్వేషా౦ సర్వరూపతః!! 

(శ్రీదేవీ భాగవతం – 9వ స్కంధము)

పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా విన్న బిడ్డడిని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మపాలు తప్ప వేరొకటి లేదు. ఈలోకము నందు మనము సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కులేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మా! ఆనాడు బిడ్డడయినందుకు అమ్మ పాలిచ్చి బ్రతికించినట్లు సమస్త లోకములకు తల్లివయిన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యమును యిచ్చి కాపాడు’ అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. 

అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు. ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు. అనుభవైకవేద్యము. పరమాత్మ శక్తితో కూడినవాడై అనుగ్రహిస్తాడు. ప్రక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో అక్కడి వాడు తండ్రి అవుతాడు. కాబట్టి ఇపుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజూ “లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం” అని పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఇపుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి. అందుకని దేవేంద్రుడు ఒక మణిమాయ పీఠమును తెచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి పీఠం దక్కుతోంది. లక్ష్మీదేవికి మీరు ఏమి ఇస్తే అది మీకు దక్కుతుంది. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దానిమీద కూర్చుంది. ఇపుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్ళు తీసుకు రావాలి. పసుపు కుంకుమలకి లోటు లేకుండా చాలాకాలం నుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి. తరువాత దానిలోకి పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములు అవుతాయి. అటువంటి పల్లవములను భూదేవి తెచ్చి యిచ్చింది. గోవులు వచ్చి పంచద్రవ్యములను ఇచ్చాయి. వసంతుడు తేనెను తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. లోపల మంగళ స్నాన క్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రములు చెప్తూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రములు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇక్కడ మహర్షులు వేదం మంత్రములను చదువుతున్నారు. ఇప్పుడు మంగళ ధ్వనులు జరగాలి. లక్ష్మీ దేవి మంగళ స్నానానికి మేఘములు మంగళ ధ్వనులు చేశాయి. మేఘములే వేణువులను ఊదాయి. పరమ సంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానములు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు. 

అమ్మవారు స్నానం చేసిన తరువాత ఆరోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయమును ఇచ్చాడు. వస్త్రద్వయం అనగా చీరతో బాటు ఒక రవికల గుడ్డ లేక మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలిలేదా ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగు పెట్టి ఇవ్వాలి. ఇంటి యజమానికి సన్నిహితుడయిన స్నేహితుడు ఉంటాడు. ఆయనన్ ‘సుహృత్’ అంటారు. ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు. ఇక్కడ సముద్రుడు తండ్రి అయితే సముద్రములో వున్న వరుణుడే సుహృత్. అటువంటి సుహృత్ అమ్మవారు వేసుకుందుకు వైజయంతీ మాలను ఇచ్చాడు. అమ్మవారు వేసుకోవడానికి కావలసిన గాజులు హారములు నగలు వీటినన్నిటిని ఒక దంతపు పెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు. సరస్వతీ దేవి ఒక మంచి తారహారమును ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామరపువ్వును ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారు చెవులకు పెట్టుకునే కుండలములు ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీఃపూర్వకమయిన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయం చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. దిశాకాంతలందరూ ‘అమ్మా! లక్ష్మీ నీవు ఎల్ల లోకములకు ఏలిక రాణివై పరిపాలించెదవు గాక! అని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు ఆ తల్లికి తనంత తానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు. ఇపుడు దండ పట్టుకుని ఎవరి మేడలో వేయాలి అని బయలుదేరుతోంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యములు వింటే కన్నెపిల్లలకు అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తునకంతటికీ తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటి వాడు నాకు భర్త కావాలి అనుకుంది. తామర పువ్వుల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వానిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే వారు దరిద్రులయిపోయారు. వాళ్లకి అమృతం పోయింది. ఇప్పుడు సముద్రుడు మామగారు అయ్యాడు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారు అవుతాడు. మామగారు తన కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. కొడుకుకి ఎంత అమూల్యమయిన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకు అంటే ఆయన ఇపుడు పితృపంచకంలోకి వెళ్ళాడు. మామగారు అవగానే సముద్రుడు తనలో వున్న కౌస్తుభమును తీసుకువచ్చి శ్రీమన్నారాయణునికి బహూకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సము అనే పుట్టుమచ్చ మెరుస్తోంది.




శ్రీమద్భాగవతం - 59 వ భాగం



లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివలన వారికి కీడు ప్రారంభం అయిపొయింది. లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు. కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు. అమ్మవారి అనుగ్రహమును పొంది ఇంద్రుడు తరించాడు. ఇపుడు ఇంద్రునికి రాజ్యం రాబోతోంది. రాక్షసులకు రాజ్యం చేజారి పోబోతోంది. ఐశ్వర్యం పోయేముందు దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ పరమప్రసన్నంగా మాట్లాడుకోవాలి. తదనంతరము దేవతలు రాక్షసులు కలిసి ఆ మందరపర్వతమును పాలసముద్రము నందుంచి మళ్ళీ చిలకడం ప్రారంభించారు. వారికి అమృతం లభించాలి. అమృతం లభించే వరకు క్షీర సాగర మథనం నడుస్తూ ఉండాలి. చాలాసేపు చిలికిన తరువాత అందులోంచి శ్రీమహావిష్ణువు అంశ కలిగిన వాడు, పచ్చని పట్టు వస్త్రమును ధరించిన వాడు, కంబుకంఠుడు, శంఖచక్రగదా పద్మములను ధరించి ఉన్నవాడు అయిన మహాపురుషుడు క్షీరసాగర మథనం జరుగుతుండగా ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించాడు. ఆయనను ధన్వంతరి అని పిలుస్తారు. ఆయన వైద్యశాస్త్రమున కంతటికీ అధిదేవత. ధన్వంతరి అనుగ్రహం కలగడం చేత శరీరములో ఉండే రోగమును గుర్తించి ఆ రోగము నివారణ కావడానికి కావలసిన మందును వైద్యులు నిర్ణయించి ఔశాధమును ఇస్తారు. ఆ ఔషధము నందు ధన్వంతరి అనుగ్రహము ప్రకాశించడం చేత మనకు లోపల ఉన్న శారీరకమయిన రోగం నశిస్తుంది. ఆయన యాగమునందు హవిస్సును అనుభవిస్తాడు. ఆయన చేతిలో అమృత పాత్ర ఉన్నది.ధన్వంతరి స్వరూపము శ్రీమహావిష్ణువు స్వరూపమే.

ఇప్పటి వరకూ దేవతలు రాక్షసులు క్రమశిక్షణతో చిలుకుతున్నారు. వాళ్ళు దేనికోసం అయితే చిలుకుతున్నారో అటువంటి అమృతపాత్ర వారి ఎదురుగుండా కనపడింది. దేవతలతో కలిసి క్షీర సాగరమును మధించారు కాబట్టి అందులో దేవతలకు కూడా భాగం ఇవ్వవలసి ఉంటుందనే విషయమును రాక్షసులు మరచిపోయారు. ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కుని ఎవరి మటుకు వారు ముందుగా అమృతం తాగేద్దామని ఆ పాత్ర పట్టుకుని సముద్రపుటొడ్డున పరుగులు తీస్తున్నారు. వారిలో వారు బలము కలిగిన వారు ఆ పాత్ర పట్టుకుని పరుగెడుతుండగా వారియందు అమంగళకరమైన కలహం అతిశయించింది. ఐశ్వర్య భ్రష్ట్త్వమునకు ప్రధాన కారణం కలహం ఏర్పడడం. రాక్షసులు అమృత పాత్రను పట్టుకు పారిపోతుంటే దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. అపుడు పరమాత్మ మోహినీ రూపమును స్వీకరించాడు. ఇపుడు మోహినిని చూసేసరికి రాక్షసులకు స్పృహ తప్పిపోయింది. అమృత పాత్రమీద కోరిక తగ్గింది. తుచ్ఛ కామమునకు జారిపోయారు. ఇపుడు వారి కోరిక ఒకటే ‘మనం ఎవరు ఈమెతో బాగా మాట్లాడి ఈమెను వశం చేసుకోగలం’. ఇక్కడ శ్రీమహావిష్ణువు కేవల శరీర రూపం చేత రాక్షసులను మోహ పెట్టాడు. వాక్కు చేత సత్యమును చెప్తున్నాడు. ‘మీరు ఏదో పాత్ర పట్టుకు వచ్చి అందులో ఉన్నదానిని పంచమని నన్ను అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని చూస్తె నాకు ఒకమాట చెప్పాలని అనిపిస్తోంది. మీకు అర్థం అయితే బాగుపడతారు. చెప్తున్నాను వినండి’ అన్నాడు.

‘తన ధర్మపత్ని యందు అనురాగం ఉండడం ఎప్పుడూ దోషం కాదు. కానీ కనపడిన ప్రతి స్త్రీయందు అర్థములేని ఒక భావన పెంచుకోవడం చాలా ప్రమాదకరం. మీరింతమంది నన్ను ఇలా చూస్తున్నా మీతో మాట్లాడాలని తలంపు కానీ కలిగిందంటే అది మిమ్మల్ని కాల్చే కార్చిచ్చు అవవచ్చు. గుర్తుపెట్టుకోండి. నా తప్పేమీ లేదు’ అని అన్నది. మోహిని మాటలు వాళ్ళ తలకెక్కవు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు కామమునకు వశులై బలహీనమయిన మనస్సు కలవారై మోసపోవడానికి సిద్ధపడ్డారు. ‘మీరు నన్ను పెద్ద చేసి నా చేతిలో అమృత పాత్ర పెట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అని కూడా నన్ను అడగలేదు. ఇపుడు నేను ఈ పాత్రనుపట్టుకుని అంతర్ధానం అయిపోతే మీ బ్రతుకులు ఏమయిపోతాయి? మీరు ఎంతో కష్టపడ్డారు’ అంది.

రాక్షసులు నిజంగా ఈమె మాటలలోని యధార్థమును గ్రహించిన వారయితే ‘తల్లీ! మేము ఈ పని చేసి ఉండకుండా ఉండవలసింది’ అని కాళ్ళమీద పడి వెంటనే వాళ్ళ మనసు మార్చుకున్నట్లయితే క్షీరసాగర మథన కథ వేరొకలా ఉంటుంది. చాలామంది క్షీరసాగర మథనంలో శ్రీమన్నారాయణుడు మోసం చేసి రాక్షసులకు అమృతమును పంచి ఇవ్వలేదు అంటారు. అది నిజం కాదు. మోహిని మాటలు వినిన తరువాత కూడా రాక్షసులు ‘అమృతమును నీవే మాకు పంచాలి’ అన్నారు. వారి మాటలు విని మోహిని వారినుంచి అమృత పాత్రను తీసుకుంది. ‘చక్కగా స్నానం చేసి ఆచమనం చేసి రండి. రాక్షసులంతా ఒకవైపు దేవతలంతా ఒకవైపు కూర్చోండి. అమృతమును పోసేస్తాను’ అంది. అలాగే కూర్చున్నారు. ఆమె దేవతలకు అమృతం పోస్తుంటే ఆమె శరీర పృష్ఠ భాగం రాక్షసులకు కనపడుతుంది. వాళ్ళు దానికి తృప్తి పడిపోయేవారు. వీళ్ళల్లో ఎవరికీ అమృతం మీద దృష్టిలేదు. ఆవిడ అంగాంగములమీదే దృష్టి ఉంది. అదే వారి పతనమునకు కారణం. వాళ్ళు అమృతమును పోగొట్టుకుంటున్నారు. తమ మరణమును వారే కొని తెచ్చుకుంటున్నారు. రాక్షసులకు ఉన్న కామ బలహీనత చేత మొత్తము జాతిని గెలిచింది. అప్పటికీ ఇప్పటికీ అంతే. కామమునకు లొంగిపోయే బలహీనతను పెంచేసుకుంటున్నాము. కనుక లోకమంతా కామమునకు నశించిపోతోంది. మోహిని దేవతలవైపు పవిత్రంగా కనపడుతుంది. రాక్షసుల వైపు మొహజనకంగా కనపడుతోంది. దీనిని రాహువు అనే రాక్షసుడు గమనించాడు. మోహిని తమను మోసం చేస్తున్నదని గ్రహించాడు. ఆయన వెళ్ళి దేవతలవైపు కూర్చున్నాడు. కానీ ప్రవృత్తి చేత రాక్షసుడు. ఆవిడ రాహువు దగ్గరకు వచ్చింది. రాహువు సూర్యచంద్రుల ప్రక్కన కూర్చున్నాడు. వాళ్ళిద్దరికీ అమృతం పోస్తున్నప్పుడు వాళ్ళు రాహువును సూచిస్తూ ‘ వాడు రాక్షసుడు. వాడికి అమృతం పోయవద్దు’ అని సైగచేశారు. శ్రీమన్నారాయణుడు దీనిని కనిపెట్టాడు. రాహువు రాక్షసుడయినా మోహినీ రూపంలోని శ్రీమహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తినుంచి లేవమని అనలేదు. ఇపుడు రాహువును అమృతమును త్రాగాడు. అతడు త్రాగిన అమృతము క్రిందికి దిగిందంటే రాక్షస శరీరము అమృతత్వమును పొందేస్తుంది. అతనికి రాక్షస ప్రవ్రుత్తి. వెంటనే సుదర్శనమును ప్రయోగించి కుత్తుక కోసేశాడు. పరమాత్మ ఏక కాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. అమృతంతో కూడినందు వల్ల తల నిర్జీవం కాలేదు. మొండెం మాత్రం క్రిందపడిపోయింది. పంక్తియందు కూర్చున్న వాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బ్రతికి వుంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం. శిరస్సు అమృతం త్రాగిందని బ్రహ్మగారు నవగ్రహములలో ఒక గ్రహ స్థానమును ఇచ్చి రాహువును అంతరిక్షమునందు నిక్షేపించారు. ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్య చంద్రులను ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు. 

తదనంతరము మోహిని వరుసగా దేవతలకు అమృతం పోసేసి రాక్షసుల వైపు తిరిగి అమృతం అయిపోయినట్లుగా కుండ తిప్పి చూపించింది. అపుడు రాక్షసులు దేవతలతో యుద్ధం మొదలు పెట్టారు. మోహినీ స్వరూపం అంతర్ధానం అయిపోయింది. ఈవిధంగా దేవతలు అమృతం పొందారు. చాలా రోజులు యుద్ధం జరిగింది. అందులో ‘నముచి’ అని ఒకడు బయల్దేరాడు. వాడు దేవేంద్రునితో బ్రహ్మాండమయిన యుద్ధం చేశాడు. దేవేంద్రుడు వాని పరాక్రమం చూసి ఆశ్చర్యపోయి ‘వీడు ఎలా చనిపోతాడు?’ అని అడిగాడు. అపుడు ‘వాడు తడిలేని పొడిలేని వస్తువుతో మాత్రమే తాను చనిపోయేలా వరం అడిగాడు. అందుకని వారిని తడి పొడి లేని వస్తువుతో కొట్టు’ అన్నారు. అపుడు ఇంద్రుడు తన వజ్రాయుధమును సముద్రపు నురుగులోకి తీసుకు వెళ్ళి అటూ ఇటూ తిప్పాడు. నురుగు తడి పదార్ధం కాదు. పొడి పదార్ధం కాదు. అలా ప్రయోగించేసరికి నముచి చచ్చిపోయాడు. దీనిని ఒక కథగా కాకుండా అంతకు మించి ఇందులో తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కష్టం వచ్చినపుడు దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుని ప్రార్థన చేయడం అనేది ఈ జాతి సొత్తు. క్షీరసాగరము అనేది ఒక పాలకుండ. అది మన హృదయమందే ఉన్నది. ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. పాలకుండ నీవై ఉంటే నీకు అశాంతి ఎందుకు ఉన్నది? అనగా పాలకుండను విడిచిపెట్టి నీవు లోకము చుట్టూ తిరుగుతున్నావు. ఏది శాంతిని ఇస్తుందో దానిని పట్టుకుంటే శాంతిని ఇస్తుంది. నీ మనస్సు శాంతిగా ఉండాలంటే శాంతికరమైన పదార్ధమును నీవు పట్టుకోవాలి. అది మనలోనే ఉన్నది. మనలో ఉన్నది పట్టుకోవడం బయట తిరగడం వలన సాధ్యం కాదు. బయటకు వెళ్ళడం కాదు. లోపలికి వెళ్ళాలి. మనకెప్పుడూ బయటకు వెళ్ళడమే తెలుసు కానీ లోపలికి వెళ్ళడం తెలియదు. అదీ గొడవ. లోపలికి వెళ్ళడానికి అసలు ప్రయత్నం చేయలేదు. అలా ప్రయత్నం చేయడమే క్షీరసాగర మథనం. పాలసముద్రంలో మందరపర్వతమును దింపడం అంటే ధ్యానంలో మన మనస్సును తీసుకు వెళ్ళి స్వామి దగ్గర పెట్టడం అన్నమాట. ధ్యానమునందు నిష్ఠ కుదరడానికి చాలా ప్రయత్నం చేయాలి. లేకపోతే మనస్సు మందరపర్వతం ఊగినట్లే ఊగుతుంది. అప్పుడు కంగారుపడిపోకూడదు. మళ్ళీ దానిని వెనకకి తీసుకురావాలి. స్వామీ! నా ధ్యానము బాగా కుదిరేటట్లు చూడు అని స్వామిని ప్రార్థన చేయాలి. మందరం తొట్రు పడితే భగవంతుడినే ప్రార్థించారు. అపుడు ఆయన ఆదికూర్మమయ్యాడు. ఆయనే ఆధారం అయాడు. అలాగే ధ్యానంలో చెదిరిన నీ మనస్సును కుదర్చడానికి స్వామి ఏదో రూపంలో సహాయం చేస్తాడు. ఇదే మందర పర్వతమును దింపి క్షీర సాగర మథనం చేయడం. అలా ధ్యానం చేయగా చేయగా ముందు ప్రశాంతత కలుగుతుంది.



శ్రీమద్భాగవతం - 60 వ భాగం



వామనావతారం :
అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారి, మళ్ళీ పోగొట్టుకొనిన సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఇపుడు ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. “మహానుభావా! మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు. కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించక పోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. అందుకని మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను’ అన్నాడు.

ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. అపుడు శుక్రాచార్యుల వారు బలి చక్రవర్తితో ‘ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని ‘విశ్వజిత్ యాగము’ అంటారు అని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగ గుండములో నుండి ఒక బంగారు రథము బయటకు వచ్చింది. దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉంది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతోంది. అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వీటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మేడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మేడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.

ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. ‘అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇపుడు తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి’ అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. అపుడు దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు ‘ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఇప్పుడు ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఈ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. కాబట్టి మనం ఆయననే ప్రార్థన చేద్దాము’ అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు. 

అపుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు ‘బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహంతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికే బలిచక్రవర్తి దూరం అవాలి. అలా దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. కాబట్టి మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి’ అని చెప్పాడు. అపుడు దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. ఇప్పటి నుంచి మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. మహాభక్తుడు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.

కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యప ప్రజాపతి గొప్ప బ్రహ్మ జ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ‘అదితీ! ఈ భార్యలేమిటి? కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉంది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నది అని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన కానీ ప్రీతి చెందాడంటే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు’ అని చెప్పి ‘పయో భక్షణము’ అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు. 

ముళ్ళపంది లేదా అడవి పండి తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది’ అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.

అపుడు స్వామి అడితిని ‘నీవు ఈపూజ ఎందుకు చేశావు?’ అని అడిగాడు. అపుడు ఆవిడ ‘స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్య భ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది’ అని అడిగింది. కాని స్వామి ‘నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను’ అని అనకుండా ‘అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ‘ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. ‘అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉంది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను’ అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆడపు ఆమె అంది ‘స్వామీ నాకు అంతకన్నా భాగ్యమా! తప్పకుండా’ అన్నది. అపుడు స్వామి ‘నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను’ అన్నాడు. ఎంత యథాపూర్వకంగా పుట్టాడో చూడండి. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. ఇపుడు అదితి గర్భం గర్భాలయం అయింది. 

గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తి అయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా జన్మించాడు. పుడుతూ శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సున్న వటువుగా బ్రహ్మచారిగా ఇంచుమించుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్య మండలము నుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రంను ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగ కర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింక చర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతలా గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీ మాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. అందుకని వటువు అన్నాడు ‘ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు. 

బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. అపుడు బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారు పళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.


భాగవతం - 61 వ భాగం  CLICK HERE

Popular Posts

Popular Posts

Ads