కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.
- కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు విశానమును పొందుతారు.
- లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.
- రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).
- ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.
- ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.
- చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.
- రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకును వెళ్ళరాదు.
- కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయవలయును. దాని వలన దీర్ఘీయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.