Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

హనుమాన్ జయంతి Hanuman Jayanti

హనుమాన్ జయంతి



ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో ... ఎక్కడ ఆయన నామం వినిపిస్తుందో ... అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయనను మించిన భక్తుడు లేడంటూ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు. అలాంటి హనుమంతుడి జన్మ వృత్తాంతంలోకి వెళితే ... ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువుదీరి ఉండగా, 'పుంజికస్థల'అనే అప్సరస ... బృహస్పతితో పరిహాసమాడబోయింది. ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి, భూలోకాన 'వానర స్త్రీ'గా జన్మించమని శపించాడు.

తీవ్రమైన ఆందోళనకి లోనైన ఆమె శాపవిమోచనం ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. కారణ జన్ముడైన వానరవీరుడికి జన్మను ఇచ్చిన తరువాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చునంటూ ఆయన అనుగ్రహించాడు. దాంతో 'పుంజికస్థల'భూలోకాన 'అంజనాదేవి'గా జన్మించి, కాలక్రమంలో 'కేసరి'అనే వానరుడిని వివాహమాడింది. శాపవిమోచానార్ధం తనకి వీరుడైనటువంటి పుత్రుడిని ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుడిని ప్రార్ధించింది.

ఈ నేపథ్యంలో రాక్షస సంహారం కష్టతరంగా మారడంతో, పరమేశ్వరుడి అంశతో జన్మించినవాడి వలనే అది సాధ్యమని బ్రహ్మ - విష్ణు భావించారు. అయితే పరమశివుడి వీర్య శక్తిని పార్వతీదేవి భరించలేకపోవడంతో , వాయుదేవుడి ద్వారా దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది. అలా శివాంశ సంభూతుడైన హనుమంతుడు 'వైశాఖ బహుళ దశమి' రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు.
తల్లి ఆలనాపాలనలో పెరుగుతోన్న హనుమంతుడు, ఆకాశంలోని సూర్యుడిని చూసి దానిని తినే పండుగా భావించి కోసుకురావాలనే ఉద్దేశంతో ఆకాశ మార్గాన బయలుదేరాడు. ఆయన్ని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి కింద పడిపోయిన హనుమంతుడి 'ఎడమ దవడ'కి గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు. దాంతో దేవాధి దేవతలంతా అక్కడికి చేరుకొని హనుమంతుడు చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించారు.

అలా దేవతల నుంచి వరాలు పొందిన హనుమంతుడి అల్లరి చేష్టలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దాంతో ఎవరైనా గుర్తు చేస్తే తప్ప, అతని శక్తి అతనికి తెలియకుండా ఉండేలా రుషులు శపించారు. సూర్య భగవానుని అనుగ్రహంతో సకల విద్యలను అభ్యసించిన హనుమంతుడు, రామాయణానికి ఓ నిండుదనాన్ని తీసుకు వచ్చాడు. సుగ్రీవుడిలో కదలిక తీసుకు వచ్చి అతని సైన్యాన్ని ముందుకు నడిపించడంలోనూ ... లంకలో ఉన్న సీతమ్మవారి ఆచూకీ తెలుసుకోవడంలోను ... వారధి నిర్మించడంలోను ... యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు 'సంజీవిని' పర్వతాన్ని పెకిలించి తీసుకు రావడంలోను హనుమంతుడు కీలకమైన పాత్రను పోషించాడు. అందుకే హనుమంతుడులేని రామాయణాన్ని అస్సలు ఊహించలేం.

'త్రిపురాసుర సంహారం' సమయంలో పరమ శివుడికి శ్రీ మహా విష్ణువు తన సహాయ సహకారాలను అందించాడు. అందువల్లనే లోక కల్యాణం కోసం శ్రీ మహా విష్ణువు రామావతారం దాల్చినప్పుడు, శివుడు ... ఆంజనేయస్వామిగా అవతరించి, రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దుష్ట గ్రహాలను తరిమికొట్టి ఆయురారోగ్యాలను ప్రసాదించే హనుమంతుడిని పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఎంతో ఇష్టపడతారు.
ఇక ప్రతి ఊరిలో రామాలయం వుంటుంది ... ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులో ఉంటాడు. అందువలన ఈ హనుమజ్జయంతి రోజున ప్రతి ఊరిలో ఆయనకు ప్రదక్షిణలు చేయడం ... ఆకు పూజలు చేయించడం ... ఆయనకి ఇష్టమైన 'వడ' మాలలు వేయించడం జరుగుతుంటుంది. ఈ రోజున ఆంజనేయ స్వామి దండకం ... హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

హనుమాన్ జయంతి:


యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్

"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.

విశేషాలు:
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దిನములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.

స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.
పంచముఖ హనుమాన్:
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది.
తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి,దుష్ట ప్రభావలను పోగొట్టీ,శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు. 

హనుమాన్ జయంతి రోజున పూజ ఎలాచేయాలి?:


చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.

పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్‌ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం

హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత:


హనుమాన్ చాలీసా అంటే ఆత్మలకు భయం అని మరియు హనుమంతుడు అంటేనే ధైర్యానికి మారుపేరు అని తెలియచెప్పిన ఈ చాలీసా అత్యంత ప్రసిద్ధి చెందింది. అత్యంత శక్తివంతమైనది అని పిలువబడుతున్న ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్ర భక్తుడు గొప్ప నైష్ఠిక భక్తుడు, తులసీదాస్ రచించారు. తులసీదాస్, రచించిన రచనలలో అత్యంత ఉత్తమమైనది, ముఖ్యమైనది తులసీ రామాయణము. హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్నకు వస్తే, చాలీసాలోని శ్లోకాలకు అర్థమేమిటి, దీనియొక్క శక్తివంతమైన మహిమ ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ వ్యాసం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచెపుతుంది. దాదాపు హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలతో ముడిపడి ఉంది. 

వివిధ శ్లోకాలను దోహాలుగా కూడా పిలుస్తారు. చాలీసాలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు హనుమాన్ చాలీసా చదవటంవలన కలిగే మొత్తం ప్రయోజనాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం. హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత హనుమాన్ చాలీసాలోని ప్రారంభ దోహా "జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర " వల్లే వెయటం వలన జీవితంలో స్వాభావిక దివ్య జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞాన సహాయంతో, జీవితంలో ప్రతిష్టంభించిన అనేక సవాళ్లు, దాదాపు అసాధ్యం అనుకున్నవాటిని సాధించగలుగుతారు. మహావీర్ విక్రమార్కుడుతో మొదలయ్యే 'మూడవ దోహా' ప్రజలలో బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సహవాస ప్రభావాలనుండి బయట పడడానికి సహాయపడుతుంది. చాలీసాలోని ఏడవ మరియు ఎనిమిదవ శ్లోకాలు, శ్రీరాముడి ఆత్మతత్వాన్ని అర్థం తెలియచేస్తాయి మరియు దేవుని దివ్యసన్నిధికి చేరువ చేస్తాయి. 14వ మరియు 15వ దోహాలు ఒక వ్యక్తి కీర్తిప్రతిష్టలు పొందటానికి సహాయం చేస్తాయి. 

మీ పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం మరియు మీ సామర్త్యం పట్ల అందరి ప్రశంసలు అందుకుంటారు. 11వ ఛౌపయి చదవటం వలన పాములు మరియు విషజంతువుల భయం తొలగించడానికి సహాయం లభిస్తుంది. 16వ మరియు 17 ఛౌపయిస్ చదటం వలన జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగటానికి సహాయపడుతుంది. అది ఒక కార్యాలయంలో వద్ద ప్రమోషన్లు కావొచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించినది అయిఉండవొచ్చు. 20వ దోహా చదవటం వలన జీవితంలో అనేక సవాళ్లను అధిగమించవొచ్చు మరియు అనేక అడ్డంకులు తొలగిపోయి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. 24వ ఛౌపయి, ముఖ్యమైనది, ఢాకిణి పిశాచాలు, భూతాలు మరియు చేతబడి ప్రభావాలు పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. చాలీసాలోని ప్రతి దోహాతో ముడిపడి జీవులకు అనేక లాభాలు ఉన్నాయి. అందువలన హనుమాన్ చాలీసాకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.

ఆంజనేయస్వామికి సింధూరం ఎందుకు పూస్తారు?


ఈ ఆనుమానం, సందేహం చాలామందికి వుంది. దీనికో పౌరాణిక కధ వుంది. రామాయణకాలంలో సీతమ్మవారు పాపిడిలో సింధూరం ధరించేది. ఒకసారి ఆంజనేయస్వామి అది చూసి అలా ఎందుకు ధరిస్తున్నారని సీతమ్మని అడీగారు. అందుకు సీతమ్మ నీ స్వామి, నాస్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయుష్షు పెరగాలనీ ఆయనకి అన్నీ శుభాలు జరగాలనీ పాపిడిలో సింధూరం ధరిస్తాను. ఆడవారు పాపిడిలో సింధూరం ధరిస్తే మగవారి ఆయుష్షు పెరుగుతుంది, వారికి అన్నీ శుభాలు జరుగుతాయి అని చెప్పిందట.

ఆంజనేయస్వామి రాముడికి పరమ భక్తుడు. ఆయన వూరుకుంటాడా!? వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సిధూరం పూసుకొచ్చాడు. సీతమ్మ అడిగిందట. ఒళ్ళంతా సిధూరం ఎందుకు పూసుకున్నావని. దానికి ఆయన సమాధానం, ‘అమ్మా, నువ్వు పాపిడిలో సింధూరం పెట్టుకుంటేనే స్వామి ఆయుష్షు పెరుగుతుందనీ, శుభం జరుగుతుందనీ అన్నావు కదా, మరి నేనాయన భక్తుణ్ణి, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకా ఎక్కువగా అన్నీ శుభాలే జరుగుతాయనీ, ఆయన చిరంజీవి కావాలని ఇలా పూసుకున్నాను’ అని చెప్పాడు.

ఇది వాల్మీకి రామాయణంలో కధకాదు. రామాయణాన్ని చాలామంది రచయితలు చాలాసార్లు రాశారు. తర్వాత వచ్చిన రామాయణంలో వచ్చిన కధ ఇది.

అది పురాణ కధ అనుకోండి. లౌకికంగా చూస్తే ఆంజనేయస్వామి వాయుదేవుని పుత్రుడు, సూర్యదేవుని శిష్యుడు. వారిరువురూ ఎంతో తేజస్సు కలవారు. అందుకే ఆంజనేయస్వామి అమిత తేజోమూర్తి. ఎరుపు లేక సింధూరం తేజస్సుకి చిహ్నం. ఆయన తేజస్సుకి చిహ్నంగా ఆయనను సింధూరంతో అలంకరిస్తే స్వామి చూడటానికే ఎంతో తేజోవంతుడుగా కనుల విందు చేస్తాడనీ, ఆయన తేజస్సూ, శక్తీ మనకి వెంటనే స్ఫురిస్తుందనీ అలా అలంకరిస్తారు.
ఇంకొక విషయం తెలుసా ఆంజనేయస్వామి రామ భక్తుడుకదా. శ్రీరామ పూజ ఎక్కడ జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి వుంటాడు. ఆ పూజ చూడటానికీ, ఆ నామ కీర్తన వినటానికీ. అందుకే శ్రీరామచంద్రుని పూజ చేసేటప్పుడు ఒక ఖాళీ ఆసనాన్ని వేసి వుంచాలిట. అక్కడ ఆంజనేయస్వామి ఆసీనుడై శ్రీ రామ పూజ తిలకిస్తాడని నానుడి.

Popular Posts

Popular Posts

Ads