Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీవేంకటేశ్వరుని నిత్యసేవలు (2) Srivenkatesvaruni nityasevalu ( 2 )

శ్రీవేంకటేశ్వరుని నిత్యసేవలు (2)
తోమాలసేవ (భోగశ్రీనివాసమూర్తికి అభిషేకం)
పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసుని దివ్యమంగళమూర్తికి అనేక పుష్పమాలికలతో, తులసిమాలలతో చేసే అలంకారమే తోమాలసేవ. సుప్రభాతం తరువాత ఉదయం 3గంటలకు ప్రారంభమవుతుంది. జియ్యంగార్ తెచ్చిన మాలలను అర్చకస్వాములు నీళ్ళుచల్లి శుద్ధిచేసి తీసుకుంటారు. భోగశ్రీనివాసమూర్తికి అభిషేకం తరువాత, శ్రీవేంకటేశ్వరుని నిజపాదాలపై ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు.
ఈ అభిషేకానికి ఆకాశగంగ జలాన్ని మాత్రమే వాడుతారు. అనంతరం మూలమూర్తికి, వక్షఃస్థల లక్ష్మికి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, ఉగ్ర శ్రీనివాసమూర్తికి, ఇలా సన్నిధిలో ఉన్న పంచబేరాలకు అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగా తీర్థాన్ని సంప్రోక్షిస్తారు.
అభిషేకానంతరం భోగశ్రీనివాసమూర్తికి వస్త్రాలంకరణ, తిలకధారణ చేసి, మిగిలిన ఉత్సవమూర్తులకు షోడశోపచారాలు సమర్పిస్తూండగా, "తిరుప్పళ్ళీ ఎళుచ్చి" అను అరువది పాశురాలను పారాయణం చేస్తారు.
తోమాలసేవ (వెంకన్నకు పుష్పాలంకారం)
జియ్యంగార్లు శ్రద్ధాభక్తులతో అందించే పూలమాలలను అర్చకస్వాములు శ్రీవారికి అలంకరిస్తారు. ఈ పుష్పాలంకరణ శ్రీవారి పాదాలతో ప్రరంభమవుతుంది. ఆపాదమస్తకం అలంకరించే ఈ పూలమాలలకు కొన్ని స్థరమైన పేర్లు ఉన్నాయి.
శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కొక్క మూరగల రెండు పుష్పమాలలను "తిరువడి దండలు" అని
శ్రీవారి కిరీటం మీదుగా రెండు భుజాల వరకు అలంకరించబడే 8మూరలకు గల పూలమాలలను "శిఖామణి" అని
శ్రీవారి భుజాలనుండి ఇరువైపులా పాదాలవరకు వ్రేలాడుతున్నట్లు అలంకరించే పొడవాటి మాలలను"సాలగ్రామమాల" అని
శ్రీవారి మెడలో రెండు పొరలుగా భుజాలమీదకి అలంకరించబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని"కంఠసరి" అని అంటారు.
శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు ఒక్కటిన్నర మూరల పుష్పమాలికలను అలంకరిస్తారు.
ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను శంఖచక్రాలకు అలంకరిస్తారు
శ్రీవారి నందకఖడ్గానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను "కఠారిసరం" అంటారు.
రెండు మోచేతులు క్రిందనుండి పాదాల వరకు హారాలుగా వ్రేలాడదీసే మూడు పుష్పమాలలము "తావళములు"అంటారు.
పుష్పాలంకరణ పూర్తి అయిన తరువాత వేదపండితులు మంత్రపుష్పాన్ని పఠిస్తారు. ధూప, దీప, నక్షత్ర, కర్పూర హారతులు ఇస్తారు. ఈ కార్యక్రమం అంతా పూర్తికావడానికి సుమారు అరగంటకు పైగా పడుతుంది.
కొలువు (దర్బార్)
బంగారు వాకిలికి ఆనుకుని లోపల ఉన్న గదిని "స్నపన మండపం" అంటారు. అక్కడే ప్రతీరోజూ శ్రీవారికి ఆస్థానం జరుగుతుంది. ఈ సేవ పూర్తిగా ఏకాంతం. ఆలయ అధికారులు, అర్చకులచే నిర్వహించబడుతుంది. ఉదయం 4-30 లకు ప్రారంభమవుతుంది.
స్వామికి షోడశోపచారాలు నిర్వహించిన తరువాత, ఆస్థానసిద్ధంతి శ్రీనివాసునికి పంచాంగ శ్రవణం చేస్తూ, తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలను వినిపిస్తారు. నిత్యాన్న ప్రసాద పధకంలో విశేషమైన విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను శ్రీవారికి వినిపిస్తారు. 
బొక్కసం (లెక్కల) గుమాస్తా, శ్రీవారికి సమర్పించబడిన ముందునాటి ఆదాయ వివరాలను ఆర్జితసేవలవల్ల, ప్రసాదాల విక్రయం వల్ల. హుండీద్వారా, కానుకలుగా వచ్చిన బంగారు, వెండి, రాగి, ఇతర లోహపాత్రలు, నగలు, వగైరాల ద్వార వచ్చిన నికర ఆదాయాన్ని పైసలతో సహా లెక్కగట్టి శ్రీనివాసునికి వివరంగా వినిపించి, భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుంటాడు.

Popular Posts

Popular Posts

Ads