Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

మాఘ పురాణం - 2 వ భాగం Magha puranam - Part 2

మాఘ పురాణం - 10 వ భాగం

మృగశృంగుని వివాహము 
దిలీప మహీజునకు వశిష్ఠువారు ఇట్లు చెప్పసాగిరి –
పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతినైజము. ఆవిధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామ స్మరణయందాసక్తి గలవాడయ్యెను. 
అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువ వేసిరి. అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్ననల నొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల యానతిపై దేశాటన చేసి యనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస పలము సంపాదించియుండెను. 
కుమారుడు దేశాటన పూర్తిచేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తానూ వరించిన సుశీలను మాత్రమె వివాహం చేసుకొనెదనని తన మనో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహం చేసిరి.
సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగుని చూచి “ఆర్యా! మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొనినట్లే మా ఇద్దరినీ కూడా యీ శుభలగ్నమున పరిణయమాడుము” అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం. అది ఎట్లు జరుగును?” అని ప్రశ్నించగా – “మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడుమని ఆడబడుచులు పట్టుబట్టినారు.
మరి పురుషునకు ఒక్క భార్యయేకదా! ఇద్దరు భార్యలా?” అని మృగశృంగుడు ప్రశ్నించగా – 
ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా! దశరధునకు ముగ్గురు భార్యలు, శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు, పరమేశ్వరునకు గంగా, గౌరీ ఇద్దరు గడ! వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు.
వివాహపు వేడుకలను చూడ వచ్చిన అనేకమంది మునీశ్వరులు కూడా మృగశృంగా “అభ్యంతరము తెలుపవలదు. ఆ యిరువురి కన్యల యభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించిన నీకు జయము కలుగదు. అయిననూ ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగియున్నవి” అని పలికిరి. పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆయిరువురు కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు. 
ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా “మహర్షీ! వివాహములు ఎన్ని విధములు? వాటి వివరములు తెలియజేసి నన్ను సంత్రుప్తుని చేయుడు” అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరల ఇట్లు చెప్పసాగిరి. “రాజా! వివాహములెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను. సావదానుడై ఆలకింపుము”
1. బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు “బ్రాహ్మము” అని పేరు.
2. దైవము: యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి “దైవము” అని పేరు.
3. ఆర్షము: పెండ్లికుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయు దానిని “ఆర్షము” అని అందురు.
4. ప్రాజాపత్యము: ధర్మము కోసం దంపతులు కట్టుబడియుండుడని దీవించి చేయు వివాహమునకు ‘ప్రాజాపత్యము’ అని పేరు.
5. అసురము: డబ్బు పుచ్చుకొని కన్యను యిచ్చి వివాహం చేయడానికి ‘అసుర’ అని పేరు.
6. గాధర్వము: ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొను వివాహమును ‘గాంధర్వ’ వివాహమని పేరు.
7. రాక్షసము: వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని ‘రాక్షస’ వివాహమని పేరు.
8. పైశాచిక: మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకోను దానిని “పైశాచిక’ మని పేరు.
ఈ ఎనిమిది రకములూ వివాహ సంబంధమైన పేర్లు. గాన వాటి ధర్మములు తెలియపర్చెదను ఆలకింపుడు.
గృహస్థాశ్రమ లక్షణములు 
మంచి నడవడికతో ఇహమూ, పరమూ సాధించవలయునన్న యీ గృహస్థాశ్రమ మొక్కటియే సరియైన మార్గము.
భార్యయు, భర్తయు అనుకూలంగా నడచుకోనుత, ఉన్నంతలో తృప్తిచెందుట, దైవభక్తితో నడచుకొనుట అతిథి సత్కారములాచారించుట, మొదలగు సద్గుణములతో నడచుకొనే వాడే సరియైన గృహస్తుడనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండి కార్తికమాసమందునా, మాఘమాస మందునా నదీస్నానం చేసి, కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములాచరించుట వారికి మంచి తేజస్సు కలుగును.\
ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలయును. కార్తిక మాసమందు, మాఘ మాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలదీ దానధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. గాన ప్రతి మనుజుడూ ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును.
పతివ్రతా లక్షణములు
పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమనేక ఘనకార్యములు చేసిన కాని మంచి ఫలము పొందలేక పోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలయును గాని, అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు. అటులనే పురుషులునూ స్త్రీయొక్క అందమునే చూడక, శీలము, గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవిన్చునో ఆ విధంగానే అత్తమాలల సేవ, అతితిసేవలయందు కూడా తగు భక్తిశ్రద్ధలతో చేసినయెడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును.
భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలివ్వవలయును. పనిపాటల యందు సేవకురాలి వలె నడుచుకొనవలయును. భోజనం వద్దిన్చునప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టులో ఆవిధంగా భర్తకు భోజనం వడ్డించవలెను. శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందం కలుగజేయవలయును. రూపంలో లక్ష్మిని బోలియుండవలెను. ఓర్పు వహించుటలో భూదేవిని బోలియుండవలెను. ఈవిధంగా ఏ స్త్రీ నడచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును.
స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడ కూడదు. ఎవరినీ ముట్టుకొన రాదు. అ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. నాలుగవ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్ళు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును. ఎటువంటి సమయమునందైననూ భర్త భుజించకుండా తాను భుజించకూడదు.
ఇటువంటి లక్షణములు కలిగివున్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను. 
మృకండుని జననము:
ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లియాడితిగదా యని మృగశృంగుడు మిగుల ఆనందించెను. ఆ ముగ్గురు పడతులతోను సంసారము చేయుచుండెను. అటుల కొంతకాలం జరిగినది. సుశీల యను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కన్న తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలయునని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి “మృకండు”డని నామకరణం చేశారు. మృకండుడు దినదిన ప్రవర్థమానుడై తల్లిదండ్రుల యెడ, బంధుజనుల యెడ, పెద్దలయెడ, భయభక్తులు గలిగి పెరుగుచుండెను. ఐదేళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువుయొక్క మన్ననలు పొందుచు, యుక్త వయస్సు వచ్చువరకు చదివి సకల శాస్త్రములయందు ప్రావీణ్యతను సంపాదించెను. మృకండుడు విద్యనూ పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంత కాలమునకు ‘మరుద్వతి’యను కన్యతో వివాహం చేసిరి. ఆనాటినుండీ మృకండుడు గృహస్థాశ్రమము స్వీకరించెను.
మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారలయిన తరువాత వివాహములు చేసెను. తన కుటుంబమంతయును మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరుపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునండు ఏ ఇబ్బందియు లేకుండా వుండుటే గాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత యానందించి తన వంశ వృక్షం శాఖోపశాఖలగుచున్నది గదాయని సంతోషించుచు తనకింక ఏ ఆశలూ లేనందున భగవస్సాన్నిధ్యంనకు బోవలయునని సంకల్పించి, తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసికొని, నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమునకేగెను. “విన్నావు కదా భూపాలా! మృగ శృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే గాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ట కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు.
మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటినుండి జ్యేష్టపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి, గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనకొక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలాకాలం గడిచిననూ సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు ఈవిధముగా తలపోసెను – “కాశీ మహాపుణ్యక్షేత్రము. సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే గాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేకమంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి యభీష్టములను పొందగలిగిరి. గాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళుదును.” అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను.
మార్గమధ్యమున అనేక కౄరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదమునుండి అతికష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టణమునానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండుడు పరివార సహితముగా ప్రసిద్ధి చెందినా మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందం కలిగెను. తన జన్మ తరించెనని తానూ కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను.
ఈవిధంగా కుటుంబ సమేతముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దాని కెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్టించెను. ఆవిధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినమున మృకండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడచిరి. మృకండుడు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా! అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంతకాలమునకునూ సంతానం కలుగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా! సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దానధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడిట్లు పలికెను.
“మహామునీ! మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చినారము. గాన మీ యభీష్టము నెరింగింపుడు” అని పలికెను. అంత మృకండుడు నమస్కరించి “మహాదేవా! తల్లీ అన్నపూర్ణా! ఇదె మా నమస్కృతులు. లోకరక్షకా! మీ దయవలన నాకు సలక్షణవతి, సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కానే ఎంతకాలమైననూ మాకు సంతానం కలుగనందున క్రుంగి కృశించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు గదా! కావున మాకు పుత్రసంతానం ప్రసాదించ వేడికొనుచున్నాను” అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు.
మృకండుని దీనాపములాలకించి త్రినేత్రుడిట్లు పలికెను. “మునిసత్తమా! నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమమున్నది. బ్రతికి యున్నంతవరకు వైధవ్యముతో వుండు పుత్రిక కావలయునా” లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా”” అని ప్రశ్నించిరి. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయ మయినది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు, సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించే పుత్రికకన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు” అని నుడివెను. 
“అటులనే యగుగాక” యని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రాహమున ఒక శుభముహూర్త కాలమున పుత్రుని గనెను. మృకండునకు పుత్రసంతానము కలిగెనని అనేకమంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ జేసి, మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా! పరమ పూజ్యుడును భాగవతోత్తముడును, అగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి సుపుత్రుని బడసెను.


మాఘ పురాణం - 11 వ భాగం

మార్కండేయుని వృత్తాంతము 
వశిష్ఠుడుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీవిశ్వనాథుని దర్శనం, విశ్వనాధుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి – 
మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును. శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈవిధంగా చెప్పదొడగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. “కుమారా! నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను, గురువులయెడ పెద్దలయెడ బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును” అని చెప్పిరి. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపొయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెననీ తలచి మహాఋషులందరకు ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిథి సత్కారములు జేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, అతడు మార్కండేయుని వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి “మహానుభావా! మీరట్లు వారించుటకు కారణమేమి?” అని ప్రశ్నించారు.
అంత వశిష్ఠుల వారు “ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఈతనిని “దీర్ఘాయుష్మంతుడవు కమ్ము” అని దీవించితిరి గదా! అదెటుల అగును? ఈతని ఆయుర్దాయము పదహారేండ్లే కదా! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము యీతడు ఒక్క సంవత్సరమే జీవించును” అని నుడివిరి. అంతవరకూ మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాల విచారించిరి. “చిరంజీవివై వర్ధిల్లు”మణి దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి “దీనికి మార్గాన్తరము లేదా? యని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి “మునిసత్తములారా! వినుడు. మనమందరము యీ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహదేవుని వద్దకు పోవుదము.రండి” అని పలికి తమవెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి. 
మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ “చిరంజీవిగా జీవించు నాయనా”యని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి “భయపడకు” అని మార్కండేయుని దగ్గరకు జేరదీసి “పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయును గాక”యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునులవంక జూచి ఓ మునులారా! మీరు పోయిరండు. ఈతనికి ఏ ప్రమాదమూ జరుగనేరదు.అని పలికి, వత్సా! మార్కండేయా! నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించుచుండుము. నీకేయాపదకలుగదు. గాన నీవట్లు చేయుము. 
మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాథుని సేవించి వచ్చెదను. అనుజ్ఞ నిమ్మని కోరగా మృకండుడు అతని భార్యయు కొడుకుయొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. 
కుటుంబ సహితంగా కాశీకిపోయి మృకండుడు కాశీవిశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగముగడనే యుండెను. పదహారవయేడు ప్రవేశించెను. మరణ సమయమాసన్నమైనది. యముడు తన భటులతో “మార్కండేయుని ప్రాణములు గొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానము జేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి భటులు ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధకోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునా కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించు సరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహా రౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంవారించి మార్కండేయుని రక్షించెను.
యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుననేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి గదా! అతనిని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నారము. గాని ధర్మ పాలన నిమిత్తం యముడు లేకుండుట లోటుకదా! గాన మరల యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి “యమా! నీవు నా భక్తుల దరికి రావలదుసుమా!” అని పలికి అంతర్ధానమయ్యెను.
పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి తానూ చేసిన మాఘ మాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుచుండెను.


మాఘ పురాణం - 12 వ భాగం

పుణ్యక్షేత్రములలో మాఘస్నానము 
ఈవిధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా “మహర్షీ! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయం నాకు గలదు. అది ఏమనగా మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవిండనీ వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరల యిట్లనెను.
దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము.
మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీస్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను.అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీస్నానంతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కల్గుటయే గాక మరల జన్మ అనేది కలుగదు.
ఇక త్రయంబకమను నొక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్ర గోదావరీనది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి, గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అదియునుగాక మాఘమాసంలో గోడావరియండు స్నానం చేసినయెడల సకలపాపములు తక్షణం హరించి పోవుటయే గాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే ‘పరంతప’ అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి వున్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం గలదు. ఆ క్షేత్రం బ్రహ్మ హత్యా మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము గలడు. సావధానుడవై ఆలకింపుము.
విష్ణుమూర్తి నాభికమలమున బుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా! బ్రహ్మదేవుడు నాకు అయిదు తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా నాకు ఐదు వలలున్నవి నేనే గొప్ప వాదనని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరిమధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధముచేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మ హత్యాపాతము చుట్టుకున్నది.
శివుడు భయపడి నరికిన బ్రహ్మ తలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి ‘భిక్షాందేహి’యని అనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, ఈతనికి పురుశాత్వము నశించుగాక అని శపించెను.
ఈశ్వరుడు చేయునది లేక జారి క్రిందపడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అటుల లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా? యన్నట్లు భయంకరంగా నుండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువు శివుని వద్దకు వచ్చి వానినోదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చిపోయి అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటినుండీ లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివసాన్నిధ్యము పొందగలుగుచున్నారు.


మాఘ పురాణం - 13 వ భాగం

శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట 
వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీపునకు మరల యిట్లు ప్రశ్నించెను.
“మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది. గాన సెలవిండ”ని ప్రార్థించగా వశిష్ఠుడు యిట్లు చెప్పసాగెను.
మున్ను పార్వతీ దేవిని శివుడును, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్మ్యం గురించి చెప్పియున్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాధి సేవితంబును, నానారత్న విభూషితంబునాగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని వున్నా సమయమున జగజ్జనని యగు పార్వతీదేవి వచ్చి, భర్త పాదములకు నకస్కరించి “స్వామీ! మీవలనననేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని. కానీ ప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలెననెడి కోరిక వున్నది. గాన ఈ ఏకాంత సమయమందాక్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాన!”నని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను.
దేవీ! నీ యభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము. సూర్యుడు మకరరాశియందు వుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే గాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందు వుండగా, ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియే గాదు, జీవనది వున్నాను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు వున్నచోట గాని తటాకమందు గాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయే గాక సమస్తపాపములు విచ్చిపోవును. రెండవరోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణుదర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మమనునది వుండదు.
దేవీ! మాఘ మాస స్నాన ఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసంనందు భాస్కరుడు మకరరాశియందు ఉండగా ఏది అందుబాటులో వున్న అనగా – నదిగానీ, చెరువుగానీ, నుయ్యి గానీ, కాలువ గానీ, లేక పాదము మునుగునంత నీరున్నచోట గానీ ప్రాతఃకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివలాయమున గాని విష్ణ్వాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింతగాదు. 
ఏ మానవునకైననూ తన శరీరంలో శక్తిలేక, నడువలేనటువంటి వాడు, గోవుపాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటియందైనను కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ వాని కష్టములు మేఘమువలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నాన మాచరించిన యెడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియును గాక మాఘమాసమంతట ప్రాతఃకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలఘోరపాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె తానూ బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీస్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తినొందుట శ్రేయస్కరం గదా! ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం గాన ఓ పార్వతీ! ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టి వాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను. సావధానురాలవై ఆలకింపుము.
నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున జపముగానీ, విష్ణుపూజ గానీ, యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టి వాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును. రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును. సలసల కాగు తైలములో పడవేయబడును. భయంకర యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువ ఝాముననే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి, తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామలకు సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీకి అయిదవతనం వర్ధిల్లి, ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములూ అనుభవించును. ఇది ముమ్మాటికీ నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో, అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క జన్మమెత్తి హీనస్థితి నొందును.
మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైనను, జవ్వనియైనను, మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది. “ పార్వతీ! దుష్టులలో స్నానం చేసినవారు బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము దొంగిలించిన వారు, గురు భార్యతో సంభోగించు వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన యెడల అట్టివారి సమస్త పాపములు నశించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును, అసత్యమాడి పొద్దు గడుపు వాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించు వాడును, సదా వ్యభిచార గృహములో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించు వాడును, రాజ ద్రోహి, గురుద్రోహియు, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వం కలవాడు, తాను గొప్ప వాడనను అహంభావంతో దైవకార్యాలను, ధర్మకార్యాలను, చెడగొట్టుచూ దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయు వాడును, ఇండ్లను తగులబెట్టువాడునూ, చెడు పనులకు ప్రేరేపించు వాడునూ, ఈవిధమైన పాప కర్మలు చేయువారలు, ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపకనే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన యెడల వారందరూ పవిత్రులగుదురు. 
“దేవీ! ఇంకనూ దాని మహాత్యంబును వివరించెదను. వినుము. తెలిసియుండియూ పాపములు చేయు వాడునూ, క్రూర కర్మలు ఆచరించు వాడునూ, సిగ్గు విడిచి తిరుగు వాడనూ, బ్రాహ్మణ దూషకుడూ, మొదలగు వారు మాఘ మాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. ఆలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏమానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటినుండి ఆఖరు పర్యంతమూ స్నానమును చేసెదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేర అర్హుడు అగును. 
శాంభవీ! పండ్రెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్ఠమైనదగుటచే ఆమాసమునందు ఆచరించే ఏ స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా వున్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లేయగును. వృద్ధులు, జబ్బుగా వున్నవారు, చలిలో చన్నీళ్ళలో స్నానం చేయలేరు. కాన అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించినయెడల ఆస్నాన ఫలం పొందగలరు. అదియునూ గాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్ని దేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచియై ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసినయెడల మంచి ఫలితము కలుగును. 
ఈవిధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైననూ అపహాస్యంగా చూచిననూ లేక అడ్డు తగిలిననూ మహాపాపములు సంప్రాప్తించును. మాఘ మాసం ప్రారంభం కాగానే వృద్ధులగు తండ్రినీ, తల్లినీ, తన భార్యనూ లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించునటుల ఏమానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆవిధంగానే బ్రాహ్మణునిగానీ, వైశ్యుని గానీ, క్షత్రియుని గానీ శూద్రుని గానీ, మాఘ మాసస్నానం చేయమని చెప్పినయెడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులూ ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి గానీ, వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి గానీ ఆక్షేపించి పరిహాసములాడు వానికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుఃక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడగును. 
నడుచుటకు ఓపిక లేని వారలు, మాఘమాసంలో కాళ్ళూ, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్ళు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి గానీ, వినుట గానీ చేసిన యెడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు, దరిద్రము, నశింప వలయునన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియును లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘ మాస స్నానము అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృ హత్య మహాపాపములు చేసిన మనుజుడైననూ మాఘమాసమంతయూ కడునిష్ఠతో నున్నఎడల రౌరవాది నరకములనుండి విముక్తుడగును.
కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని. కావున నే చెప్పిన రీతిని ఆచరించుము.


మాఘ పురాణం - 14 వ భాగం

ఆడకుక్కకు విముక్తి కలుగుట
దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈవిధముగా చెప్పెను. అదెట్లన – 
మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి యగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశిమనాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రమైననూ సంశయం లేదు. అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరల ఇట్లు పలికెను.
“నాదా! శ్రీలక్ష్మీ నారాయణుల వ్రతము చేసినయెడల మనోవాంఛాఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రాత విధానమెట్టిదో ఎటుల ఆచరించవలెనో వివరంగా తెలియపరచు’డని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది.
అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. “మాఘ శుద్ధ దశమినాడు ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని, ఇంటివద్ద గాని, మంటపము వుంచి, ఆ మంటపమును ఆవుపేడతో అలికి పంచారంగులతో మ్రుగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి, అన్నిరకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్యమున వుంచి గంధం, కర్పూరం, అగరు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్ళు పోసి, మామిడి చిగుళ్ళను వుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి, క్రొత్త వస్త్రము నొకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మంటపపు మధ్యలో సాలగ్రామమును వుంచియొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారిచేత పంచామృత స్నానం చేయించి తులసి దళము తోను, పుష్పాలతోను పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము చెల్లించవలెను.
తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానమివ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను.
మాఘమాసస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు ఉంచి గాని, క్రొత్త గుడ్డలో మూటగట్టి గాని, దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడు గాని, లేక వినునప్పుడు గాని చేతిలో అక్షతలు వుంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై వుంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవలయును. గాన ఓ శాంభవీ! మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన యెడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను. సావధానురాలవై వినుము.
గౌతమమహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్టులు జరుపుకొనుచు ప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమముని తన శిష్యునితో గూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరముననున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి 
శ్లో!!మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే!
అగ్రతశ్శివ రూపాయ వ్రుక్షరాజాయ తే నమః!!
అని రావిచెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులయి శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈవిధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ద దశమినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి మ్రుగ్గులు, బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మంటపము మధ్యలో శ్రీహరి చిత్రపటం వుంచి పూజించినారు. ఆవిధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజావిధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావిచెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటినుండి లేచి ఉత్తర దిశవైపు మళ్ళీ మరల తూర్పు తిరిగి, ఆ వైపునుండి దక్షిణ దిశకు కడలి మరల యధాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరల బెదరించిరి. ముందు చేసినతులే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. శిష్యులు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించెను. అక్కడ నున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట, చూచినా మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం నొందిరి.
ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి? అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా! నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం గలదు. నాదేశ ప్రజలను ధర్మమార్గమున పరిపాలన చేయుచూ వున్నాను. దానధర్మములనిన నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని. గోవు, భూమి, హిరణ్య సాలగ్రామదానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానం తిలదానం చేసియున్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో వున్న అన్ని ధర్మాలను చేసియున్నాను. కాని నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు విశదపరచెదను వినుడు.
ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞంచేయాలన్న సామాన్య విషయం కాదు కదా! దానికి కావలసిన దానం వస్తుసముదాయం చాలా కావలెను. గాన ఆ మునిపుంగవుడు నావద్దకు వచ్చి అర్ధించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని. మునియు మిక్కిలి సంతసించి రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసములో మకరరాశియందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్యము చదవుటగాని, లేక వినుగా గాని చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేగాక అశ్వమేధ యాగం చేసినయెడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని లేక దాన పుణ్యములు అనగా పంచ యాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమీ ఆదివారం వచ్చినగాని, దశమీ ఆదివారం వచ్చిన గాని, ఉదయమే స్నానం చేసినాను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను విడువగలడు.
ఒకవేళ ఇతర జాతుల వారైననూ మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నాన మాచరించి దానధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును. అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాటలాడి ఇట్లంటిని. 
“అయ్యా మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును. అవన్నియు బూటకములు. వాటిని నేను యధార్ధములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. గాన నేను మాఘస్నానములు చేయుటగాని, దాన పున్యాదులు జేయుట గాని, పూజా నమస్కారములు ఆచరించుట గానీ చేయను. చలిదినములలో చన్నీళ్ళు స్నానములు చేయుట ఎంతకష్టము! ఇకనాకు ఈ నీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలము చాలు” అని ఆ మునితో అంటిని.
ణా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది ణా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు.
అంతట నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయెను. ఆవిధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచితిని. తరువాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమో గాని కుక్కగా ఏడుజన్మలూ బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్తాలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణాలు చేసితిని గాని ణా పూర్వజన్మ నాకు కలిగినది. దైవయోగమున ఎవ్వరునూ తప్పించలేరు కదా! ఇటుల కుక్క జన్మతో వుండగా మరల నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింప వేడెదను” అని రాజు పలికెను.
ఆ రాజు చెప్పిన వ్రుట్టాన్తమునకు ఆ ముని ఆశ్చర్యపడి మాఘ మాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు గతిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీవద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నియు యధార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.
నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణీ తీరమందుండిన కృష్ణా నదిలో మాఘమాసమంతయు స్నానములు, జపములు చేసి తిరిగి మరొక పున్యనడికి పోవుదామని వచ్చి యుంటిమి. మేమందరమూ ఈ వుర్క్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలోనున్న నీవు దారినిపోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా! నీశరీరము బురద మైల తగిలి వున్నది. చూచుటకు చాలా అసహ్యంగా వున్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువూ గాని, పక్షి గాని వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినవలయుననెడి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల ణా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాసమంతాయూ నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికీ నమస్కరించు చుండగా అంతలో ఆ రావిచెట్టులో నున్న ఒక తొర్రనుండి ఒక మండూకం బైటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై బడి బెక బెకమని అరచి అటు ఇటు గెంతుచుండెను. హఠాత్తుగా కప్పు రూపమును వదలి ముని వనితగా మారిపోయెను.
ఆమె నవ యౌవనవతి అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చ్సినది. అంత గౌతమ ముని అమ్మాయీ! నీవెవ్వరి దానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతం తెలియజేయుము అని ప్రశ్నించిరి. గౌతమ మునిని చూడగానే తన పూర్వ జన్మ వృత్తాంతం తెలియుటచే ఇట్లు చెప్పదొడంగెను.


మాఘ పురాణం - 15 వ భాగం

పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట 
వశిష్ఠ మహాఋషి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును యిట్లు తెలియజేసెను.
“పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణప్రాంతమందలి వసంతవాడయను నామము గల పెద్ద పల్లెయుండెను. అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ, దానధర్మాలు చేయుట గానీ ఎరుగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలు ఇచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీన పరుచుకునే వాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆరోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లీ నేను ముసలి వాడను. నా గ్రామము చేరవలయునన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద ఈరాత్రి గడువనియ్యి. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతఃకాలమున మాఘ స్నానం చేసి వెళ్ళి పోదును అని బ్రతిమలాడెను. 
తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుండని పలికెను. ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమొంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించుమని చెప్పి ఆర్యా! మాఘ స్నానము చేసి వెళ్ళెదనన్నారు కదా! ఆ మాఘ స్నానమనగానేమి? దాని వలన కలుగు ఫలితమేమి? సెలవిండు. వినుటకు కుతూహలముగా ఉన్నది. అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని “అమ్మా! మాఘ మాసము గురించి చెప్పుటకు నాకు శక్యము గాదు. ఈ మాఘ మాసములో నదియందు గానీ, తటాకమందు గానీ, లేక నూతియండు గానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళంతోనూ, పూవుల తోనూ, పండ్లతోనూ, పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘ పురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినమూ విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన, దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన యెడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించి పోవును. ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైననూ అనగా ఏకాదశి రోజున గానీ, ద్వాదశి నాడు గానే, పౌర్ణమి దినమున గానీ పైప్రకారము చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను” అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను.
అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారు జామున స్నానమునకు పోవుదునని తెలియజేసెను. 
భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టి కోపము వచ్చి వంటినిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘ మాసమననేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికినీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనెదవా? చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు, ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని, భిక్షాం దేహి అని అనవలసిందే. జాగ్రత్త! వెళ్ళి పడుకో! అని భర్త కోపిగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము సేతునా? అని ఆత్రుతగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ యిద్దరూ కొంత తడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటుల పెనుగు లాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో మునగవలసి వచ్చెను. అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘ మాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకు వచ్చినాడు.
కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణు దూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమ భటులతో ఇట్లు పలికెను. 
ఓ యమ భటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకు పోవుట ఏమి? నా భర్తను యమ లోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమే కదా! అని వారి నుద్దేశించి అడుగగా “ఓయమ్మా! నీవు మాఘమాసములో ఒకదినమున స్నానము చేసితివి. అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకీ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము. అని యమభటులు పలికిరి.
ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్య ఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నాభర్త కూడా నీట మునిగినాడు కదా! శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను? అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. 
చిత్రగుప్తుడునూ వారి ఇద్దరి పాప పుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్య ఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణు దూతలతో చెప్పెను.
విష్ణు లోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యెను? అని ఆత్రుతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతసమందిరి.
రాజా! వింటివా. భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించిననూ భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా! కనుక మాఘ స్నానం నెలరోజులూ చేసినచో మరింత మోక్షదాయకం అగుననుటలో సందేహం లేదు.


మాఘ పురాణం - 16 వ భాగం

ఏకాదశీ మహాత్మ్యము 
సంవత్సరములో వచ్చు పండ్రెండు మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకం కూడా అందుబాటులో లేనియెడల నూతి దగ్గర గాని, స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరమునందున్న యగ్రహారంలో నివశించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తిపొందియున్నారు.
అతడు చిన్నతనం నుండీ గడసరి, పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండ బోవునపుడిట్లు ఆలోచించెను. అయ్యో! నేనెంతటి పాపాత్ముడనైతిని! దానం శరీరబలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినాను గదాయని పశ్చాత్తాపం నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకేవిధముగా వుండవు గదా! ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనం, బంగారం, ఎత్తుకొని పోయిరి. 
అనంతుడు నిద్రనుండి లేచి చూడగా సంపదంతా అపహరింపబడినది. అన్యాయంగా ఆర్జించిన దానం అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కెను. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగిసిపోయినాడు. “నారాయణ” అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన తాను చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను.” అని వశిష్ఠుడు తెలియజేసెను.


మాఘ పురాణం - 17 వ భాగం

భీముడు ఏకాదశీ వ్రతము చేయుట 
పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు. భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా? ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదా! భోజనం చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ‘ఓయీ పురోహితుడా! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరు గదా! దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను.
“అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటెను ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. గనుక అన్ని జాతుల వారును ఏకాదశీవ్రతం చేయవచ్చును” అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు పలికెను.
“సరే నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. గనుక ఆకలి తీరులాగున ఏకాదశీ వ్రత ఫలము దక్కులాగున నాకు వివరింపుము అని భీముడు పలికెను.
భీమసేనుని పలుకులకు ధౌమ్యుదు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశీ వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏకార్యము చేసిననూ కష్టములు కనిపించవు. గాన నీవు దీక్షబూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశీ అనగా మాఘశుద్ధ ఏకాదశీ మహా శ్రేష్ఠమయినది. దానికి మించిన పర్వదినం మరియొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశీ రోజు పుష్యమీ నక్షత్రముతో కూడినదై యుండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియు లేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువది నాల్గు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశీ మహా పర్వదినము గాన ఆ దినము ఏకాదశీ వ్రతం ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. ‘నియమము’ తప్పకూడదు. అని ధౌమ్యుడు భీమునకు వివరించెను.
ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసముండెను. అందులకే మాఘ శుద్ధ ఏకాదశి “భీమ ఏకాదశి” అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు, అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును. గాన మహా శివరాత్రి మహాత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళుడవై ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి.
శివరాత్రి మహాత్మ్యము 
ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశీ అనగా శివ చతుర్దశి. దీనినే ‘శివరాత్రి’యని అందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమయిన దినము. ఇది మాఘమాసామునందు వచ్చు అమావాస్యకు ముందురోజు దానినే “మహాశివరాత్రి”యని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణ పక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలో గాని, తటాకమందుగాని, లేక నూతివద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళీ బిల్వ పత్రములతో పూజించవలయును. అటుల పూజించి శివప్రసాడం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ వుండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన యెడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననూ అవన్నియు వెంటనే హరించుకు పోయి, కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివ రాత్రి కంటే మించినది మరియొకటి లేదు. గనుక మాఘమాసం కృష్ణ పక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. గాన శివరాత్రి దినమున ప్రతివారూ అనగా జాతి బేధములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రత మాచరించి జాగరణ చేయవలయును.
“మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు, క్రూర మృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయెడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు.
ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతులేమియు కంటపడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించనందున పొద్దు గుంకి పోయిననూ అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలిఎక్కువగుచు మంచు కురుస్తున్ననూ కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టుక్రింద వున్నా శివలింగము మీద పడినవి. ఆరోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడుట తిండిలేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.
జరామరణము లకు హెచ్చు తగ్గులు గాని, శిశువృద్ధులు గాని లేవు. పూర్వ జన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే.
మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుపోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను.
శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది తుంబుర నారద గణాలతో కొలువుతీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించెను. 
అంతట యముడు మహేశా! చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నారాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు. దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసియున్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆరాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వ పత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. గనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా” అని యముడు విన్నవించుకున్నాడు.
యమధర్మరాజా! ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో నున్న యీ బోయవాడు కూడా పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కవలసినదే గనుక ఈ బోయవాడు పాపాత్ముడయినను, ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన ణా సాయుజ్యం ప్రాప్తమయినది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేసినది లేడి చంద్రశేఖరుని వద్దనుండి వెడలిపోయెను


మాఘ పురాణం - 18 వ భాగం

దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట 
దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించిన ఆడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి వున్నారు.
దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని యాశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని. మాఘమాసం యొక్క మహాత్మ్యమును విని ఉండలేదు. గాన మాఘమాసముయొక్క విశిష్టతను గురించి మాఘ స్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను” అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి యీ విధంగా వివరించిరి.
“భూపాలా! భరత ఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరారంభమగును. గనుక అటువంటి నదులయందు స్నానం చేసి దాన పుణ్యము లాచరించినయెడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు. అందునూ మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే గాక జన్మరాహిత్యం కలుగును. గనుక ఏ మానవుడైననూ మాఘమాసములో నదీస్నానం తప్పకుండా చేయవలెను. అటుల చేయని యెడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు.
మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా మాఘ స్నానంబు చేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైననూ ముక్తి నొందగలడు. అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఈవిధముగా చెప్పుచున్నాను. 
పూర్వకాలమున గంగా నదీతీరమున ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి దానం సంపాదించి అపర కుబేరుని వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు గలడు. అతడును గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొలదీ ఉన్నవాడు.
మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే ఇద్దరన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టమొచ్చినటుల పాడుచేయుచుండిరి. ఇద్దరూ చెరొక ఉంపుడుకత్తెను చేరదీసి కులభ్రష్టులు అయి ఉండిరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్దపులి నోటబడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురగలు గ్రక్కుచూ చనిపోయినాడు. ఆవిధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపొయినారు. 
యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. అప్పుడా చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు.
“అయ్యా, మేమిద్దరమూ ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒకేవిధంగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమేల? నాకు స్వర్గమేల? ప్రాప్తించును!” అని అడిగెను. ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయీ, వైశ్యపుత్రా! నీవు నీ మిత్రుని మిత్రుని కలుసుకొనుటకు ప్రతీదినము గంగానది దాటి ఆవలి గట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాలు జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును. గాన విప్రుని చూచుటవలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియును గాక, ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది గనుక నీ పాపములు నశించునందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను. అని చిత్రగుప్తుడు వివరించెను. “ఆహా! ఏమి నా భాగ్యం! గంగాజలము నామీద పడినంత మాత్రముననే నా కింతటి మోక్షం కలిగినదా” అని వైశ్య కుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.


మాఘ పురాణం - 19 వ భాగం click here


మాఘ పురాణం - 1 వ భాగం Magha puranam - Part 1 click here

మాఘ పురాణం - 2 వ భాగం Magha puranam - Part 2 click here

మాఘ పురాణం - 3 వ భాగం Magha puranam - Part 3 click here


Popular Posts

Popular Posts