Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

మాఘ పురాణం - 3 వ భాగం Magha puranam - Part 3

మాఘ పురాణం - 19 వ భాగం

గంగాజల మహాత్మ్యము ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమహాత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి, రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేముందు శివపూజ చేసి యుద్దరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి. గనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టియు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత వున్నది. ఇంకనూ గంగాజలం గురించి చెప్పబోవునది ఏమనగా ఏనదిలో గాని, సెలయేరులో గాని, చెరువునందు గాని స్నానం చేయునపుడు ‘గంగ గంగ గంగ! అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు జల్లుకొనినచో అది గంగాజలంతో సమానమయినదగును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం గనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందెచ్చటనూ లేదు. అని గంగా జలమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను.


మాఘ పురాణం - 20 వ భాగం

బ్రాహ్మణ కన్యల విమోచనము కొంతకాలం క్రిందట మగధరాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నల్గురకు నల్గురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకొక గురుకుల విద్యార్ధి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహము చేసుకోమని బలవంతము చేయ – ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కె నిరాకరించెను. అంత నా కన్యలు కోపంతో “నీవు పిశాచివి కమ్మని” శపించగా ఆ విద్యార్దియూ “మీరుకూడా పిశాచులగుదురు గాక”యని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి. కొంత కాలమునకు ఒక సిద్ధుడాకోనేటి దగ్గరకు రాగా నా పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచరూపం తొలగి పోవును” అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నలుగురకూ యధారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము.


మాఘ పురాణం - 21 వ భాగం

విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట 
శూద్ర స్త్రీ వృత్తాంతము 
మాఘమాసమందలి నదీస్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడ పరమ పవిత్రమైనది.
ఒక మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపొయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము యౌవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరలనా గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆదృశ్యమును చూచి మండిపడుచు “నీవు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతి ముఖము సంభవించుగాక యని విశ్వామిత్రుణ్ణి, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మణి భార్యను శపించి వెళ్ళిపొయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగివుండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోని నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరేలెమ్ము. గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము. అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు.


మాఘ పురాణం - 22 వ భాగం

సులక్షణ మహారాజు వృత్తాంతము వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి నూర్గురు భార్యలు గలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజల కేయాపద వచ్చిననూ తనదిగా భావించి తన్నివారణోపాయం చేసెడివాడు. సులక్షణ మహారాజెంతటి రాజాధిరాజైననూ యెంతటి తరగని సంపత్తికలవాడైన నేమి లాభం? “అపుత్రస్యగతిర్నాస్తి” అనునటుల పుత్రసంతానం లేకపోవుటచే తనకు గతులు లేవు కదా! కాగా తన వంశం ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశం అంతరించి పోవలసినదేనా? అని దిగులు చెందుచుండెను. ఒకనాడు తాను తన రధమెక్కి నైమిశారణ్యమున గొప్ప తపశ్శాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి యిటుల పలికెను – “మునిశ్రేష్ఠులారా! నేను వంగ దేశాధీశుడను. ణా పేరు సులక్షణుడందురు. నాకు నూర్గురు భార్యలు. అయిననేమి? ఒక్క సంతానమైనను కలుగలేదు. గాన నాకు పుత్రసంతానం కలుగునట్లోనరింపుడు” అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు ముని శ్రేష్ఠులు విని జాలినొందిరి. “రాజా! నీవు సంతానహీనుడవగుటకు కారణమేమనగా – పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించియుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైననూ చేయలేదు. ఒక్క దానమైననూ ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైనా దానం చేసియున్నచో ఈ జన్మలో పుత్రసంతతి కలిగి వుండేది. గాన వెనుక కర్మఫలం వలననే నీకీ జన్మలో పుత్రసంతతి కలుగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్రసంతానం కలుగగలదు. ఇందుకు సందేహమేమియు లేదు” అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి “దీనిని నీ భార్యలహే జీవిమ్పజేయుము” అని పలికిరి. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకొని యింటికి వెళ్ళిపొయినాడు. భర్త రాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద దీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి “భోజనానంతరం సేవిమ్పుడు” అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరచి తానూ భోజనశాలకు పట్నులతో వెడలిపోయెను. నూర్గురు భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశకలిగి ఫలమంతయు నేనే భుజించేదానని తలపోసి, రహస్య మార్గమున రాజు పడకగదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమియు ఎరుగని దానివలె అందరితో కలిసి తిరుగుచుండెను.


మాఘ పురాణం - 23 వ భాగం

సుధర్ముడు తండ్రిని చేరుట 
పాపమా బాలుని జాతకము ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ఇక ఆ పిల్లవానిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చీ ఏడ్చీ అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసిమొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసిచెట్టు పై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూ కలుగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదనచేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభి వృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి వుండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.
అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయం గల వాడయ్యెను. ప్రతి దినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ “నన్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా” అని ప్రార్థించుచు, ఒక్కొక్కప్పుడు విరక్తుడై “ఛీ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను బ్రతికెందుకు?” అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి “ ఓ బాలచంద్రా! నీవట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసినయెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును” అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆరాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.
ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీకేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారెవరైననూ లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది. గాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కరలేదు” అని ప్రార్థించెను.
“ఓయీ రాజనందనా! నీవు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరునితోడు యిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.
అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భావిటిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో అని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారి జాడ తెలియనందున విచారమనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయములో మునివెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతం తెలియజేయుసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేసెను.


మాఘ పురాణం - 24 వ భాగం

ఋక్షక యను బ్రాహ్మణ కన్య వృత్తాంతము 
పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షకయను కన్య జన్మించి దిన దినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను.
ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు బోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను.
ఆవిధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన ననేక మాఘ మాస స్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆరోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్య లోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమా”యను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సుయొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుడు” అని అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్ము” అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను. 
బ్రహ్మ దేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వము గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించు చుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం, రక్తం, పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధించుచూ దేవలోకమునకు వచ్చి మమ్మందరనూ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేయుచున్నారు. గాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించు”మణి దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘముగా నాలోచించి తిలోత్తమను పిలిచి “అమ్మాయీ! సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలననూ మరణం కలుగదని వరం ఇచ్చియున్నాను. వర గర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు గాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునటుల ప్రయత్నించుము” అని చెప్పెను.
తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచూ ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటు పోయిననటు, ఎటు తిరిగిననటులామెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుంటిరి. ఆమెను “నన్ను వరింపుము” యని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడ సాగిరి. 
ఓ రాక్షసాగ్రేసరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి యెడల ప్రేమతో నున్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. గాన నాకోరిక ఒకటున్నది. అది ఏమనగా “మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను” అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింప జేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్లయుద్ధము చేశారు. పలురకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలువిధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి “తిలోత్తమా! నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇకనుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు. దేవలోకంలో సుఖించుము” అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు.


మాఘ పురాణం - 25 వ భాగం

విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ 
పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను. కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయినవి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిపోయారేమో సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అంతట శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములూ ఇమిడివున్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వమూ, ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తమూ భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములూ సమస్తమూ కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివర ఎక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురూ వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా! ఏమి ఇది? బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయితిమి. అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకూ మూలాధారమైన శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయ కారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగములనేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు, సర్వమూ ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమూ అయి వున్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారై శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. “సమస్తమునకూ మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్త్వరజస్తమో గుణములు కలిగిఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితిని. కావున వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు. ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనునది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన ముగ్గురిలో ఎవరికీ పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తిన్చిరి. శాతమునొంది చరింపుడు. బ్రహ్మదేవా! నీవు ఎక్కడినుండి ఉద్భావిన్చావు? నా నాభికమలము నుండియే కదా! కావున నీకును, నాకును బెధమున్నడా? లేదు. అట్లే ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని. నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకూ విస్తరింపజేశాడు. ఓ సాంబశివా! నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే. ఆత్మ స్వరూపుడవు నీవే. భోళా శంకరుడవైన నీవే ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజియుంతురే! పూజింతురే! నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థ నారీశ్వరుడవు. నీవుకూడా నాతొ సమనుడవే” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసెను. కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు.


మాఘ పురాణం - 26 వ భాగం

మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.
మాఘమాసమునందు నదీస్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశీ వ్రతం చేసి ఉపాసం వున్న వారలు వైకుంఠప్రాప్తినొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతమొనరించి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి. పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మంధర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగాను, చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాల సముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విష జ్వాలలకు సమస్త లోకములూ నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులూ సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటినుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడుకొన సాగిరి. అంతట శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు. 
మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకూ వచ్చి అమృతాన్ని ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా? అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈమోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీమహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై, వనమంతా జల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరార సాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాద మొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటినుండి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొన సాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును. 
ఫలశ్రుతి: 
సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులూ క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువు ను మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియూ, పుత్రపౌత్రాభివృద్ధియు, వైకుంఠప్రాప్తి నొందగలరు. 
సర్వే జనాః సుఖినో భవన్తు!!
మాఘపురాణం సంపూర్ణం!!





మాఘ పురాణం - 1 వ భాగం Magha puranam - Part 1 click here

మాఘ పురాణం - 2 వ భాగం Magha puranam - Part 2 click here

మాఘ పురాణం - 3 వ భాగం Magha puranam - Part 3 click here

Popular Posts

Popular Posts