రథ సప్తమీ వ్రతకథ:
యుధిష్టిరుడు శ్రీ కృష్ణుని ఈ విధంగా అడిగెను.
"ఓ కృష్ణా! రథసప్తమినాడు చేయవలసిన విధివిధానము నాకు తెలియజేయుము అనగా .........
శ్రీ కృష్ణుడిలా జవాబిచ్చెను.
శ్లో|| అత్ర వ్రతే షష్ట్యామేక భుక్త్వం కృత్వా సప్తమ్యామరుణో దయ వేళాయాం -
శిష్టాచారాత్ సప్తార్క పర్ణాని సప్తబదరీ పత్రాణి వాశిర సినిధాయ ||
యుధిష్టిరుడు శ్రీ కృష్ణుని ఈ విధంగా అడిగెను.
"ఓ కృష్ణా! రథసప్తమినాడు చేయవలసిన విధివిధానము నాకు తెలియజేయుము అనగా .........
శ్రీ కృష్ణుడిలా జవాబిచ్చెను.
శ్లో|| అత్ర వ్రతే షష్ట్యామేక భుక్త్వం కృత్వా సప్తమ్యామరుణో దయ వేళాయాం -
శిష్టాచారాత్ సప్తార్క పర్ణాని సప్తబదరీ పత్రాణి వాశిర సినిధాయ ||
1. మాఘ శుద్ధ షష్టి రోజున స్నానం చేసికొని,దేవపూజ నిర్వర్తించి సూర్యాలయానికి వెళ్లి భగవానుణ్ణి ఆరాధించాలి.రాత్రి నిరాహారుడై నేలపైన పరుండాలి.తరువాత సప్తమినాడు ఉదయాన్నే లేచి సర్వాలంకృతమైన రథం నిర్మించి, మంటపం మధ్యనుంచి కుంకుమ గంధాక్షతలతో పూజించి, పూలహారాలతో అలంకరించి,సంపూర్ణ లక్షణమైన సూర్యవిగ్రహాన్ని రథంలో ఉంచి అర్పించాలి.నివేదన చేయాలి.రాత్రి జాగారం చేసి (నిదుర పోకుండా మేలుకొని) అష్టమినాడు ఉదయాన్నే స్నానంచేసి బ్రాహ్మణులకు కోరిన దానాలివ్వాలి.ఆ రథాన్ని, రెండు రక్త వస్త్రాలను (ఎర్రని వస్త్రాలను), రక్త వర్ణపు (ఎర్రని) ఆవునూ గురువుకు దానమివ్వాలి.ఈ వ్రతం ఆచరిస్తే భాస్కర ప్రసాదంవల్ల నీ కుమారుడు మహాతేజస్వి అవుతాడు. అపూర్వ బలపరాక్రమవంతుడై సమస్త భోగాలను అనుభవించి, నిరాటంకంగా రాజ్యం పరిపాలించి సూర్యలోకం పొంది,అక్కడ ఒక కల్ప పర్యంతం ఉండి,తరువాత చక్రవర్తిత్వం పొందుతాడు అని చెప్పాడు. ఇంకనూ ఈరోజున (రథసప్తమి రోజున) సూర్యదేవుడికి క్షీరాన్నం నివేదన (నైవేద్యం) చెయ్యాలి. ఈ ప్రసాదాన్నే ఎందుకు నివేదన చెయ్యాలనే దానికి కూడా ఒక కారణమున్నది. దక్ష యజ్ఞం జరిగినప్పుడు అల్లుడైన శివునికి పరాభవం కలిగింది. శివుడు ఉగ్రుడై మామమీదకు వీరభద్రుణ్ణి పరివారంతో సహా పంపించాడు.వీరభద్రుడి వీరవిహారంతో దేవతలందరూ దెబ్బతిన్నారు. ఆ సందర్భములోనే సూర్యుడికి పళ్లన్నీ రాలిపోయి బోసివాడయ్యాడు. కనుకనే సూర్య దేవుడికి అమూల్యమైన ప్రసాదం క్షీరాన్నం అని చెబుతారు. ఈ మాఘమాసంలోని నాలుగు ఆదివారాలు కూడా సూర్యునికి ప్రత్యేక పూజను నిర్వహించి పాలు పొంగించి క్షీరాన్నం చేసి నైవేద్యం పెడతారు.అని ఈ విధంగా చెప్పిన కృష్ణునితో యుధిష్ఠిరుడు ఈ వ్రతమును ఆచరించినచో చక్రవర్తి కాగలరని నీవు చెప్పియుంటివి. ఇంతకుముందు భూలోకములో ఎవరు ఈ వ్రతమును ఆచరించి అట్లు ఆ వ్రతఫలము యెవ్వరి కైననూ ప్రాప్తించినదా? అని పలుకగా కృష్ణుడు ఈ వ్రతమును గురించిన కథను ఈ విధముగా చెప్పసాగెను.
2. రథసప్తమీవ్రతం ఆచరిస్తే చక్రవర్తి పదవివస్తుందని నిరూపించే కథ భవిష్య పురాణంలో ఉన్నది. దీన్ని ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు తెలియజేసెను. కాంభోజ దేశమున యశోవర్తి యను చక్రవర్తి యుండెను. ఆయన వ్రుద్ధాప్యమున పరిపాకము (చేసిన పాపములయొక్క ఫలము) ఎందువలన కల్గెనో తెలుపవలసినదిఅని ఒక్కనొక బ్రాహ్మణశ్రేష్టుని అడిగెను.అట్లడిగిన రాజుతో 'ఓ రాజా! వీరువీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోభులై (పిసినారులై) యుండిరి.అందుచేత వీరిట్టి రోగములకు గురికావలసిన వారైరి. వారి రోగనివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆవిధముగా వారావ్రతము చూచినంత మాత్రమున దాని మహాత్యముచే వారి పాపములు పోవును.గాన, వ్యాధితో భాదపడువారిని గొనివచ్చి ఆవ్రత వైభవము వారికి చూపవలెను.'అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు 'అయ్యా! ఆ వ్రాత మెట్లు చేయవలెనో దాని విధి విధాన మేమో తెలుపుడని ప్రార్దించెన.' అందులకా బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అను పేరుగల వ్రతము సర్వులూ ఆచరించదగినది. ఆవ్రత ప్రభావమున సకల పాపములూ హరించి, చక్రవర్తిత్వము గల్గును. ఆవ్రత విధానము తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము.
3. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్టి దినమున గృహస్తు (యజమాని) యీ వ్రాతమాచరింతునని తలవవలెను.పవిత్ర జలములుగల నదులలోగాని, చెరువునందు గాని,నూతియందుగాని తెల్లనినువ్వులతో విధివిధానముగా స్నాన మాచరించవలెను లేదా ఇలవేలుపులకు,కులవేలుపులకు,ఇష్ టదేవతలకు మ్రొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి,పుష్పములు,ధూపములు, దీపములు, అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను.పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి,అతిథులతో సేవకులతో,బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారంగతులగు విప్రులను పిలిపించి,సూర్యభగవానుని విగ్రహాన్ని నియమము ప్రకారము పూజించి,సప్తమితిథి రోజున నిరాహారుడై, భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము 'ఓ జగన్నాథుడా! నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయించవలసినదిగా వేడుచున్నాను.అని వుచ్చరించుచూ,తన చేతిలో గల జలమును, నీటిలో విడువవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి, బ్రాహ్మణులు,తానూ గృహమున నేలపై నారాత్రి శయనించి జితేంద్రియుడై యుండి,ఉదయమున లేచి,నిత్యకృత్యము లాచరించి శుచియై యుండవలెను. ఒక దివ్యమైన సూర్యరథాన్ని దీపమాలికలతోను, చిరుగంటలతోను, సర్వోపచారాలతోను తయారుచేసి,సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని,వెండితో గాని గుర్రాలను,రథ సారధినీ, రథమునూ తయారుచేసి మధ్యాహ్నవేళ స్నానాదికములను నిర్వర్తించుకొనవలెను. వదరుబోతులను, పాషండులను, దుష్టులను,విడిచిపెట్టి ప్రాజ్ఞులు, సౌర సూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను.
4. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మాణావాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను.కుంకుమతోను,సుగంధ ద్రవ్యములతోను,పుష్పములతోను పూజించి, రథమున నున్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు.లోభియై ధనమును ఖర్చు చేయుటకు మనస్సంగీకరించనిచో వ్రతము వైఫల్యమును,దానివలన మనస్సు వికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని,రథసారధిని అందుగల సూర్యభగవానునీ, పుష్ప,ధూప,గంధ,వస్త్ర,అలంకార,భూ షనాదులు నానావిధ ఫల భక్ష్యాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను.
5. ఓ భాస్కరా! దివాకరా! ఆదిత్యా! మార్తాండ! గ్రహదిపా! అపాంనిథే! జగద్రక్షకా! భూతభావనా! భూతేశ! భాస్కరా! ఆర్త త్రాణ పరాయణా! హరా! ఆచింత్యా! విశ్వసంచారా! విభో ! హే విష్ణో ! ఆదిభూతేశా ! ఆది మధ్యాన్త రహితా! భాస్కరా! ఓ జగత్పతే! భక్తిలేకున్నను, క్రియాశున్యమయినను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము " పైవిధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్ధించవలెను. ధనహీనుడయినను, విధిప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధరకాల రంగులతో లిఖించిన బొమ్మలు,ఏడు అయిన జిల్లేడు పత్రములతో సూర్యభగవానుని శక్తికొలదీ పూర్వము చెప్పినట్లు విధివిధానముగా పూజించవలెను. పురాణ, శ్రవణ, మంగళ గీతాలతో మంగళ వాద్యాలతో ఆరాత్రి జాగరణ చేసి, పుణ్య కథలను వినవలెను.పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానము చేయుచు ప్రాతః కాలమున లేచి స్నానకృత్యమును నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి,వివిధ రత్నభూషణములతో, ధ్యానాదులతో, వస్త్రాలతో,తృప్తి పరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును. అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యధాశక్తి దానము నీయవలెను. ఈ రథమును తమ పురోహితులయిన గురుదేవులకు రక్త(ఎర్ర రంగు) వస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆవిధంగా చేసినచో యెందుకు జగత్పతి గాకుండును?కాన, సర్వయత్నములచేతనూ రథసప్తమి వ్రాత మాచరించవలెను. దానివలన భాస్కరానుగ్రహము గల్గి మహాతేజులు,బలపరాక్రమవంతులు అయి విపుల భోగములననుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసికొందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రులను బడసి చివరగా సూర్యలోకము చేరుదురు. అక్కడ ఒక కల్పకాలముండి చక్రవర్తిగా జన్మించి ఆ పదవిననుభవించును.
శ్రీ కృష్ణుడు చెప్పుచున్నాడు:
ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తనదారిని తాను పోయెను.రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్టుడుపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములన నుభవించెను. ఈవిధముగా ఆరాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి.ఈ కథను భక్తితో యెవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదలనిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథీ గుర్రాలతో గూడుకోనిన శ్రేష్ట రథమును మాఘమాస సప్తమిరోజున యెవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వము పొందగలరు.
ఇతి రథసప్తమీ వ్రత కథా సంపూర్ణం.
ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తనదారిని తాను పోయెను.రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్టుడుపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములన నుభవించెను. ఈవిధముగా ఆరాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి.ఈ కథను భక్తితో యెవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదలనిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథీ గుర్రాలతో గూడుకోనిన శ్రేష్ట రథమును మాఘమాస సప్తమిరోజున యెవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వము పొందగలరు.
ఇతి రథసప్తమీ వ్రత కథా సంపూర్ణం.