గో మహిమ గురించి శివపార్వతుల సంభాషణ
ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు ” ఓ పార్వతీ! గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును.
ఆ గోవునందు పాదములు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృధ్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పాదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా గొప్పది.
కావున ఓ పార్వతీ ! ఈ గోమాహాత్మ్య వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు తొలగును. ప్రతి అమావాస్యనాడు పఠిస్తే మూడు నెలల మహాపాపములు తొలగును. నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము నిచ్చును. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం.
గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది” అని బోధించాడు.
శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలకుడైనాడు. ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’ అని శాస్త్ర వచనం. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందనీ శ్లోకార్థం. అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు.
ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలనీ ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. గోవును, ‘గోమాత’ అని పిలుస్తారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవనసరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి.
పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మున్నగు వాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తు జాతమును అగ్ని నుంచి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైంది. గోవుకు వేదప్రమాణమైన ప్రాముఖ్యత ఉంది. అగ్ని సంబంధమగు హోమంవలన గోవు జన్మించుటచేత గోవునకు అగ్ని హోత్రమని పేరు వచ్చింది. మన వేదాలలో ‘గో’ మహాత్మ్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాలనేకం ఉన్నాయి. గోమాతకు సకల సంపదలకు పుట్టిల్లుగా అధర్వణ వేదం కీర్తించగా, ఋగ్వేదం ‘గవా తుల్యం నోపశ్యామినృణే త్వామ్’ అని పలుకగా, నిరుపమానమైన ఔన్నత్యం ఆవుకి ఉన్నదని యజుర్వేదం ప్రశంసించింది. ఆవులో దేవతా శక్తులున్నాయని, అతీంద్రియ దర్శనశక్తి కలిగిన మన మహర్షులు దర్శించి చెప్పారు. అందుకే గోవులున్నచోట కుండలినీ శక్తి అధికంగా ఉంటుంది. గోవును సేవించడం వలన, గ్రహ దోషాలు తొలగిపోతాయని, గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకి పిండప్రదానం చేయలేని వారికి పిండప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొన్నాయి.
ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘‘నాథా! జనులు పాపము నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును, తరుణోపాయమును తెలుపమ’’ని అడగగా - శివుడు పార్వతీదేవితో ‘‘గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. పాదములందు పితృ దేవతలు, కాళ్ళయందు సమస్త పర్వతాలు, దంతములందు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జేష్ఠాదేవి, కళ్ళయందు - సూర్యచంద్రాదులు, చెవులయందు శంఖచక్రాలు, కంఠమున విష్ణుమూర్తి, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, వెన్నునందు వరుణ దేవుడు, అగ్నిదేవుడు, తోకలో చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రోమావళి యందు త్రిశంకకోటి దేవతలు నివసించెదరు. అందువల్ల గోమాతను పూజించి ఆయురారోగ్యములను, అష్టైశ్వర్యములను పొందవచ్చునని, గోవులకు ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుందని, గోమాతను నమస్కరించి ప్రదిక్షణం చేస్తే భూమండలమంతా ప్రదిక్షణం చేసినంత ఫలము కలుగుతుందని’ చెప్పాడు. భారతీయ గోజాతి అన్ని దేశాల ఆవులకన్నా సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుందని, ఆవునేతిని నిప్పుమీద వేస్తే వచ్చే ధూమం పర్యావరణాన్ని కాలుష్య రహితం చేస్తుందని యజ్ఞయాగాదులవల్ల తెలుస్తోంది. అటామిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల శక్తి ఆవు పాలల్లో ఉందని రష్యన్లు తెలిసికొన్నారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది. అన్నివిధాలా ఆవు మనకు మేలే చేస్తోంది. బ్రతికీ, మరణించీ కూడా ఉపకారమే చేస్తోంది. కనుక గోవులను సంరక్షించుకుందాం!