Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

షోడశోపచారములు చేయు విధానము: Sodasopacaramulu approach :

షోడశోపచారములు చేయు విధానము:
ఇక్కడ ఒక విషయము చాలా ముఖ్యముగా మనము అందరమూ గమనించాలి బాగా ఆలోచించాలి. ఎవరైనా ఒక అతిథి, ఒక బంధువు ,మనకు ప్రీతి కలిగించేవారు, లేదా మనము ఒక ఉద్యోగి అయితే మన పై అధికారి,మనకు సహాయం చేసినవారు, మనకు సహాయం చేసేవారు, గురువులు, ఎల్లవేళలా మన శ్రేయోభిలాషులు, మన ఇంటికి వస్తే, ఎలా గౌరవిస్తాము. ఎలా ఉపచారములు (సేవలు) చేస్తాము మరీ చెప్పాలంటే క్రొత్తగా వివాహము చేసుకొన్న దంపతులు, అల్లుడు క్రొత్తగా ఇంటికి వచ్చినా, లేదా క్రొత్త కోడలు క్రొత్తగా మన ఇంటికి వచ్చినా, వారికి చేయు సేవలు,ఉపచారములు ఎలా ఉంటాయో ఊహించండి.
మరి మనకు సకల శుభములను, జీవించుటకు జీవమును, జీవిత మును ప్రసాదించిన ఆ పరమేశ్వరుని పట్ల మనము ఎంత వినయంగా, ఎంత భక్తిగా, ఎంత శ్రద్దగా, త్రికరణ శుద్దిగా మసలుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఆలోచించండి? మనము చేసే ఉద్యోగము ఆయన ఇచ్చింది కాదా? మనకున్న ఈ సర్వ సంపదలు, వాహనములు, ప్రతి పూట మనము తినే తిండి ఆయన ఇచ్చినదే. చివరకు మనకు జీవాధారమై, మనము పీల్చుచూ, విడుచుచున్న గాలి ఆయనది కాదా? ఈ గాలిని మనము సృజించామా? ఈ ప్రకృతిని మనము సృష్టించామా? మనమునిత్యమూ అనుభవించే ఈ వెలుగు ఎవరిది? మరి అంతటి అంతర్యామి సర్వభూతములందు, సర్వప్రాణికోటియందు, నిండి నిమిడీ కృతమయి ఉన్న పరమేశ్వరుడు మన పూజా మందిరమునకు (మన గృహములోనికి) వచ్చి మనలను కటాక్షిస్తుంటే వారి పట్ల మనము ఎలా ప్రవర్తించాలి. ఒక్కసారి ఆలోచించండి. ఆ పరమేశ్వరుని పట్ల గౌరవము, భక్తి, ప్రేమ ఎవరి కొరకు?మనకొరకే, ఆయన కొరకు కాదు. ఆయన అభ్యున్నతికి కాదు. మన అభ్యున్నతికి, మనకు ఇంకా ఏదో కావాలని,పరమేశ్వరుడు మనకు ఇంకా ఏదో చేయాలని, చేయుచున్నామే కానీ, ఏ మాత్రము పరమేశ్వరుని అభ్యున్నతికి,పరమేశ్వరుని కొరకు మాత్రం కాదు. ఈ విషయం అందరూ హృదయంతో నిర్మొహమాటముగా ఆలోచించి మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి. 
అందుకే శ్రీ త్యాగరాజు వంటి వాగ్గేయకారులు అన్నారు “నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా... నరస్తుతి సుఖమా నిజముగ తెలుపు మనసా” అని, మనము ప్రాజ్ఞులం కావున మనము అందరమూ ఈ పాటికే విషయాన్ని అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి ఒక్కొక్క ఉపచారమునకు తగిన సమయమిచ్చి, మనము ఆ ఉపచారము లు స్వామి వారికి చేయునప్పుడు, అందులో జీవించాలి. నిజంగా స్వామి వారు వచ్చి మన పూజా మందిరంలో కూర్చునట్లు, పంచేంద్రీయాలు స్వామిపై ఉంచి, శ్రద్దా భక్తులతో, నిజంగా ఈ ఉపచార ప్రక్రియ చేసి చూడండి. మీ అనుభూతు లు, అనంతము అనిర్వచనీయము. నిజం చెప్పాలంటే, అవి వివరించడానికి ఏ భాష లేదు కేవలం భావన తప్ప ఎలాగూ వివరించలేము చూపలేము నిర్వచించలేము.
1. ఆవాహనము :- స్వామి వారిని మనస్ఫూర్తిగా సాదరముగా గృహములోనికి ఆహ్వానించుట. అంటే ఎవరైనా వస్తే నము గుమ్మం దగ్గరకు వెళ్ళి, రండి రండి అబ్బో చాలా కాలం తర్వాత, రండి రండి అని ఆహ్వానిస్తాం కదా! అలానే అంతకంటే ఎక్కువగానే ఆహ్వానించాలి. “ఉరకెరారు వారధముల కడకు...... మీరు వచ్చుటలెల్ల మాకు శుభములు కూర్చు మహాత్మా” కదా!
“ఆవాహనం సమర్పయామి”
2. ఆసనం:- వచ్చిన అతిథికి ఏదో ఒక ఆసనం, కుర్చీ, లేదా సోఫా,లేదా మంచం యథాశక్తి చూపిస్తూ దానిని శుభ్రం చేస్తూ రండి రండి కూర్చోండి అంటామా? అనమా? అలాగే స్వామి వారికి పూజా మందిరంలో సింహాసనం చూపించి శుభ్రం చేసి సింహాసనం చూపించి (సింహాసనముపై ఆసీనులుకమ్మని కూర్చోమని వినమ్రతతో ప్రార్ధించాలి.)
“ఆసనం సమర్పయామి”.
3. పాద్యము:- స్వామి వారు రాగానే జలము అందించి స్వామీ మీపాదములు కడుగుకోండి, అని జలము అందించడం (స్వామీ, మీ పాద పద్మములు కడిగే భాగ్యము నాకు ఈ రోజుప్రసాదించావా అని వినమ్రతతో భక్తితో స్వామి వారి పాదాలను శుద్దజలములతో కడిగిన భావమును అనుభవించడం) స్వామివారి పాదముల పై శుద్ద జలమును చల్ల వలయును.
“పాదయోః పాద్యం సమర్పయామి.”
4. ఆర్ఘ్యము :- స్వామి వారు వచ్చారు, వచ్చిన వారికి కాళ్ళు చేతులు కడుగుకోవటానికి నీళ్ళు ఇచ్చి, వారి వెనకాతలే మనము ఒక మంచి తువ్వాలు (పొడి వస్త్రము) పట్టుకొని, నించుంటాము అవునా? అలాగే స్వామి వారికి కాళ్ళు చేతులు కడుగుకొన్న తర్వాత పొడి వస్త్రమును అందించుచున్నా మనే భావనతో, స్వామి వారికి వస్త్రమును తాకించడం.
‘హస్తాయోరర్ఘ్యం సమర్పయామి”
5. ఆచమనం:- ఇంటికి వచ్చిన అతిథికి లోపలకు రాగానే, ఒక గ్లాసుతో మంచి నీరు ఇస్తాము. రండి రండి నీళ్ళు తీసుకోండి. అని రాగానే ఒక గ్లాసు నీళ్ళు ఇస్తాం కదా. అలాగే స్వామి వారు ఎక్కడ ఎక్కడ తిరిగి అలిసిపోయారో, ఎప్పుడు బయలుదేరినారో, మరి ఎంత దాహంతో ఉన్నారో, అనే తపన ఆర్తి మనలో కలిగి, స్వామి వారికి ఉద్దరణితో శుద్ద జలమును అందించాలి.
“ఆచమనీయం సమర్పయామి”
6. స్నానము:- వచ్చిన అతిథికి స్నానము చేయమని నీళ్ళు బక్కెటలోనో, లేదా మరే పాత్రలోనో సిద్దం చేసి, ఆ... రండి స్నానం చేయండిని పిలుస్తామా. అలాగే స్వామి వారికి శుద్దజలము సిద్దం చేసి, స్వామి రండి మీరు ప్రయాణ బడలికతో ఎంత అలసిపోయారో, ఎంత శ్రమ చెందారో, కాస్త స్నానం చేస్తే ప్రయాణ బడలిక తీరు తుందని, స్వామి వారిని సాదరముగా ఆహ్వానించడం. స్వామి వారు స్నానము చేయుచున్నారు(స్వామి వారికి స్నానంచేయించుచున్నాను) అనే భావనతో శుద్దజలమును ఉద్దరణితో స్వామి వారిపై సంప్రోక్షించడం.
“ఔపచారిక స్నానం సమర్పయామి”
7 వస్త్రం:- వచ్చిన అతిథి బట్టలు తెచ్చుకోలేదు. హడావిడిగా బయలుదేరి వచ్చేశారు. అప్పుడు మన బట్టలను, అతిథికి ఇచ్చి, మర్యాదను ప్రదర్శిస్తాము కదా. అలాగే స్వామి వారు వచ్చారు, మన ఇంటిలో స్నానం చేశారు, మరి బట్టకావాలిగా విడిచిన బట్టలను కట్టుకోరు కదా? మంచి పొడి వస్త్రమును, స్వామి వారికి అందించి స్వామి ఈ (పొడి,మడి) వస్త్రమును ధరించి, మమ్ము ధన్యులను చేయండని అర్థిస్తూ స్వామి వారికి వస్త్రములు(పంచ, ఉత్తరీయము) అందించడం.
“వస్త్రం సమర్పయామి”
8 యజ్ఞోపవీతం:- వచ్చిన వారు మార్గమధ్యములో, ఏదైనా మైల పడి ఉండవచ్చు. అలా మైల పడ్డవారు యజ్ఞోపవీతం మార్చుకోకుండా, సంధ్యా వందనము, పూజ, ఇత్యాది కార్యములు చేయరాదు. కాబట్టి యథాశక్తి యజ్ఞోపవీతమును, మార్చుకొనవలయును. కావున స్వామి వారు మార్గమధ్య మున, ఏదైనా మైలపడి ఉంటారేమో అని యజ్ఞోపవీతమును స్వామికి అందించడము. నూతన యజ్ఞోపవీతమును, స్వామి వారికి తాకించి, వారి పాద పద్మముల చెంత ఉంచడము.
“యజ్ఞోపవీతం సమర్పయామి”
8. గంథము :- ప్రయాణ బడలిక, శరీర శ్రమ, బడలికను సేద తీర్చుట కొరకు, చేయు ఉపచారము. కాబట్టి స్వామి వారికి గంథము సమర్పిస్తాము. గంథము అంటే బజారులో అమ్మబడే గంథము, కంటే మనము స్వామి వారి కొరకు కాస్త శ్రమపడి, గంథపురాయి మీద గంథపు చెక్కను అరగదీసి, కొద్ది పాటి గంథమును స్వామి వారికి సమర్పిస్తే, స్వామి మహదానందము పొందుతారు. మనము చూస్తున్నాము, బజారులో దొరికే గంధము, వాడడం వలన మనకు దురదలు రావడం, లేదా మంట కలిగించడం, చూస్తున్నాము కదా. మరి సర్వేశ్వరుడు, పరబ్రహ్మ మైన, మన స్వామి వారికి ఆ గంథం, ఎంత బాధ కలిగిస్తుందో కదా! కాబట్టి మనము స్వయంగా, గంథపు చెక్కను అరగదీసి తయారు చేసిన, గంధము ను స్వామి వారిపై చిలుకరిస్తూ, లేదా స్వామి వారికి గంథం పూస్తూ
“గంథాన్ ధారయామి”
10. పుష్పం:-మన ఇంటికి వచ్చిన వారు, ఇల్లు దుర్గంధభరితముగా, ఆశుభ్రముగా ఉంటే, కనీసం ఇంట్లోకి వస్తారా?
కూర్చుంటారా? మంచి జలము తీసుకుంటారా? అందు కొరకు మన గృహమును, ఫల పుష్పములతో అలంకరించి,మంచి సువాసనలను గృహమంతా నిండి, వచ్చిన వారి హృదయం, ఆసుగంధ భరితముతో ఆనందించాలి. అంటే సెంటు లాంటివి ఉపయోగించి కాదు. పరమాత్మ మనకు ఇచ్చిన, సుగంధ భరితములైన పుష్పములతో, స్వామి వారికి స్వాగతం పలికి, పుష్పములు స్వామి వారి పాదముల మీద సమర్పించడం.
“నానా విధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.”
9 ధూపం:- పై విధముగనే గృహమును, పూజా గదిని, సుగంధ పరిమళాలతో నింపడం. ఎందుకంటే స్వామి వారు, మన గృహములో ఉండి మన ఉపచారములను, స్వీకరించాలంటే, మరి కొంత సేపు ఉండాలి కదా! అలా కొంత సేపు స్వామి వారు ఉండి, మన ఉపచారములు స్వీకరిస్తేనే కదా, మన కోరికలు తీరేది. కావున ధూపం అలా స్వామి వారి, ముక్కు దగ్గర చూపించి వెంటనే తీసేయాలి, అంతే కానీ ఊదుబత్తీలు అలా వెలిగించి అక్కడ ఉంచడం కాదు. లేదంటే స్వామి వారికి ఊపిరి ఆడక ఇబ్బంది పడతారు.
“ధూప మాఘ్రాపయామి”.
12.దీపo:-స్వామివారు, మనము, ఒకరినొకరు చూచుకోవాలి. ఒకరిని ఒకరు పరామర్శించుకోవాలి. అందుకు వెలుతురు కావాలి. మరి పగలే కదా వెలుతురు ఉంది కదా, అంటే, ఈ వెలుతురు ఉంది, కానీ దీపము, దీపశిఖ, జ్ఞానానికి ప్రతీకలు. మనము స్వామి వారిని, స్వామి వారు మనలను, కరచరణాదులతో (శరీరం) కాక, జ్ఞాన పరంగా, ఆత్మపరంగా, ఒకరిని,ఒకరు, పలకరించుకోవాలి, అందుకు దీపం ఉంచడం. దీపం వెలిగించి, పూజ ప్రారంభించడం. దీపము యొక్క,జ్ఞానకాంతితో, స్వామి వారిని మనము, మనలను స్వామివారు, ఉభయులు కుశలమును తెలుసుకోవడం కోసం జ్ఞాన దీపం వెలిగించడం.
“సాక్షాత్ దీపం దర్శయామి.”
13. నైవేద్యం:- వచ్చిన అతిధిని, యధాశక్తి, షడ్రషోపేత, భోజనమును ఎంతో గౌరవంగా, ఎంతో ప్రేమతో, మనము అందిస్తాము. రండి కూర్చొండి భోజనము చేయండి అని బ్రతిమాలి, బామాలి గౌరవిస్తాము. మరి తల్లి తన బిడ్డకు, అన్నం తినిపించేటప్పుడు, బిడ్డను చంకలో వేసుకుని, చందమామను చూపిస్తుంది. పిల్లలకు ఇష్టమైన బొమ్మలను,వస్తువులను, చూపిస్తుంది. ఎంత మారాము చేస్తే అంతగా బుజ్జగిస్తుంది. తల్లికి, ఓపిక ఉన్నా, లేకపోయినా,అనారోగ్యముతో ఉన్నా, అన్నీ ప్రక్కనపెట్టి, తన బిడ్డకు అన్నం పెడుతుంది. కదా! మరి మన గృహమునకు వచ్చి, పూజ మందిరంలో, సింహాసనముపై ఆసీనులై ఉన్న, మన స్వామి వారికి మనము ఎంత ఆర్తితో, ఎంత ప్రేమతో అందించాలి.స్వామి వారు మన ఆర్తి చూసి, కను రెప్ప తీసి అలా చూస్తారు. దానినే, మహా ప్రసాదముగా మనము తీసుకుంటాము,భగవంతుడు, దేవతలు తీసుకునే ఆహారం ఏది? మనము యజ్ఞము చేసి, హవిశ్శు రూపంలో, యజ్ఞగుండంలో పరమ భక్తితో, సమర్పించిన దానిని హవ్యవాహనుడు (అగ్నిదేవుడు) తీసుకెళ్ళి వారికి అందిస్తే, పరమానందంగా పరమేశ్వరుడు స్వీకరిస్తాడు.
“నైవేద్యం సంమర్పయామి.”
14. తాంబూలము:- అతిధి భోజనానంతరం, గృహస్తులంతా భోజనము చేసిన తరువాత, అందరమూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, మంచి విషయములు, ప్రస్తావించుకుంటూ, భక్తి కబుర్లు, క్షేత్ర విశేషములు, పుణ్యక్షేత్ర వివరాలు,దర్శించిన పుణ్యక్షేత్రములను మననం చేసుకుంటూ, ఒకరికి తెలిసిన విషయములు, మిగిలిన వారు అందరూ పంచుకుంటూ, తెలుసుకుంటూ, సునాతన ధర్మ విషయము, ధర్మ సందేహములు చర్చించుకుంటూ, తెలియనివి తెలుసుకుంటూ, ఉపశమనార్థమై ఉపయోగించేది తాంబూలం. మనము తమలపాకులు, వక్క, సున్నం స్వామివారికి సమర్పించడం.
“తాంబూలం సమర్పయామి”.
15. నమస్కారం :-వచ్చిన అతిధికి అందించే గౌరవ పురస్కారములు. అలాగే స్వామి వారి పాదములకు నమస్కరించడం.
“ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి”.
16. ప్రదీక్షిణం :- గృహస్తు, వచ్చిన వారే త్రిమూర్తులని, వారి వారి గొప్పదనములను కీర్తించడం. వారి వారి సాంప్రదాయ ములను, బట్టి వారి వారి విశ్వాసములను అనుసరించి, వారి యొక్క దేవతలకు సంబందించిన, అర్చనా కార్యక్రమము,దేవతా స్తుతి, ప్రార్థనలు చేసుకోవాలి. ఉదా:- విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, శివస్తుతి, గొవిందనామాలు,ఆదిత్యహృదయం, హనుమాన్ చాలీసా, ఏదైనా అష్టోత శతనామాలు, పూజ చేసుకోవచ్చు.
తర్వాత “జయమంత్రము” చెప్పాలి

Popular Posts

Popular Posts