Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శయన విష్ణుమూర్తి Vishnu bed

శయన విష్ణుమూర్తి
విష్ణుమూర్తి విగ్రహాల అమరికలో శయన విష్ణుమూర్తి ఒకటి. ఆ లక్ష్మీపతిని శయన, ఆసన, స్థానక, నృత్య రూపాల్లో మనం దర్శించవచ్చు. ముఖ్యంగా శయనవిగ్రహాలు, యోగం, సృష్టి, భోగం, సంహారం అని 4 విధాలుగా ఉన్నాయి. అవి వరుసగా ముక్తికి, వృద్ధికి, భుక్తికి, అభిచారికాలకు మార్గాలుగా ప్రతీక.
మోక్షం కోరేవారు యోగశయనాన్ని, పుత్రపౌత్రాభివృద్ధి కోరేవారు సృష్టిశయనాన్ని, భోగవృద్ధి కోరేవారు భోగశయనాన్ని, శత్రువుల నాశనాన్ని కోరేవారు సంహారశయనాన్ని ధ్యానించవలెనని పురాణాలు చెబుతున్నాయి. నదీతీరాలందు, సరస్సుల ప్రక్కన యోగశయన విగ్రహాలు ప్రశస్తమైనవిగా చెప్తారు. ఈ శయనవిగ్రహాల గురించి తెలుసుకొందాం. 
యోగశయనం : శ్రీమహావిష్ణువు ఎర్రతామర రేకుల వంటి నేత్రాలతో యోగనిద్రా సుఖమునందుంటుంది. 2భుజాలు కలిగి, ఒక పక్కగా పడుకున్నట్లు అర్ధశయనంలో ఉంటుంది. ఐదుపడగలు గల శేషుడు శంఖం వలె, చంద్రునివలె తెల్లగా ఉంటుంది. దీనిమీద శయనించిన విష్ణువు గౌరశ్యామ వర్ణంతోగానీ, పీతశ్యామ వర్ణంతో కాని ఉంటారు. ఈ విధమైన విష్ణుమూర్తి పూజాపీఠానికి కుడివైపు భృగువు లేక మార్కండేయుడు, ఎడమవైపున భూదేవి లేక మార్కండేయ మహర్షి ఉంటారు. మధుకైతభులు, బ్రహ్మదేవుడు, పంచాయుధాలు, నమస్కరిస్తున్న మహర్షులు ఉంటారు.
సృష్టిశయనం : తొమ్మిది పడగలు గల శేషపానుపు పై శ్రీహరి, పద్మాలవంటి నయనాలతో, రాజస భావంతో, నల్లని శరీరచ్చాయతో, ఎర్రని అరికాళ్ళతో, శాశ్వతుడై సృష్టిశయన రూపంలో ఉంటాడు. లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అప్సరసలు, మహర్షులు, రుద్రులు, ఆదిత్యులు. కిన్నరులు, మార్కండేయ, భృగు, నారద మహర్షులను, మధుకైటభులను వీరందరితో కలిగిన శయనం ఉత్తమ సృష్టి శయనమవుతుంది. 
భోగశయనం : ఈ శయన రూపంలో శ్రీమన్నారాయణుడు సకలపరివారంతో కూడినవాడై ఏడు పడగలు గల శేషుని యందు పడుకొని ఉంటాడు. ఈ స్వామి నాభి నుండి వికసించిన తామర పువ్వునందు కూర్చున్న బ్రహ్మ బంగారు రంగు కలవాడై ఉంటాడు. బ్రహ్మకు రెండు ప్రక్కల శంఖము, చక్రము, గద, ఖడ్గము, శార్ఙ్గం అను పంచాయుధాలు, పద్మము, వనమాల. కౌస్తుభం కలిపి అష్టాయుధాలు కలిగి ఉంటాడు. ఆ ఆయుధాల ముందు గరుత్మంతుడు ఉంటాడు. స్వామి కుడిచేతి ప్రక్కన లక్ష్మీదేవి, కుడిపాదం ప్రక్కన సరస్వతి, ఎడమచేతి ప్రక్కన శ్రీదేవి, ఎడమపాదం ప్రక్కన భూదేవి ఉంటారు. సూర్యచంద్రులు, తుంబురనారదులు, సప్తర్షులు, అప్సరసలు, లోకపాలకులు, అశ్వనీదేవతలుంటారు. శ్రీవారి పూజాపీఠం ప్రక్కన నారసింహ, వరాహమూర్తులుంటాయి. పాదాలవద్ద మధుకైటభులుంటారు. శ్రీవారు సస్యాశ్యామల వర్ణంతో, అర్ధశయనంతో, యోగనిద్రా రూపంతో, నాలుగు భుజాలతో, వికసించిన ముఖంతో, తామర రేకులవంటి నేత్రాలతో పూర్ణచంద్రుని వంటి ముఖముతో దర్శనమిస్తాడు. 
సంహారశయనం : శ్రీమన్నారయణమూర్తి రెండు పడగలు గల శేషుని పానుపుగా చేసుకుని గాఢనిద్ర యందు,మూసిన కన్నులతో, తామస భావాన్ని వ్యక్తం చేసే మూడు కన్నులతో. వాడిన మొగం మొదలగు సర్వాంగాలతో, నల్లని వస్త్రాలతో, 2భుజాలతో, నల్లన్ని శరీర కాంతులతో, రుద్రుడు మొదలగు దేవతల రూపంతో ఉంటాడు. 
{సప్తగిరి మాసపత్రిక నుండి సారాంశం సేకరించడమైనది.}

Popular Posts

Popular Posts

Ads